Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నాయకుడిగా టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావును ఎన్నుకున్నామని టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు చెప్పారు. టీఆర్‌ఎస్ శాసనసభాపక్షం (టీఆర్‌ఎస్‌ఎల్‌పీ), టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ (టీఆర్‌ఎస్‌పీపీ) సంయుక్త సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా కేసీఆర్‌ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారని ఆయన తెలిపారు. -ఏకగ్రీవంగా ఎన్నుకున్న టీఆర్‌ఎస్ ఎల్పీ, పీపీ సమావేశం -నేడు గవర్నర్ వద్దకు టీఆర్‌ఎస్ ప్రతినిధి బందం -రాజకీయ అవినీతి లేని పాలన అందిద్దామన్న కేసీఆర్ -నేడు ఉదయం 10.30 గంటలకు గవర్నర్‌ను కలువనున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం

TRS Party

స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య కేసీఆర్ పేరును శాసనసభాపక్ష నేత అభ్యర్థిత్వానికి ప్రతిపాదించగా, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, కోవాలక్ష్మి శ్రీనివాస్‌గౌడ్ బలపరిచారని చెప్పారు. ఈ ప్రతిపాదనకు సభ్యులంతా ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని వివరించారు. శాసనసభాపక్ష నేత ఎన్నికపై ఆదివారం గవర్నర్ అపాయింట్‌మెంట్ తీసుకుని రాతపూర్వకంగా, ఎమ్మెల్యేల మద్దతు సంతకాలతో కూడిన మెమోరాండాన్ని అందిస్తామని తెలిపారు. శనివారం తెలంగాణభవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం అనంతరం కేశవరావు విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలు చేశామని చెప్పారు. నిరాడంబరత, నిజాయతీతో అందరినీ కలుపుకుని అభివద్ధికి అంకితం కావాలని సమావేశంలో నిర్ణయించామని అన్నారు. ఈ సమావేశంలో 11 మంది ఎమ్మెల్యేలు కూడా తమ తమ అభిప్రాయాలు తెలిపారని చెప్పారు.

ఈ సందర్భంగా పార్టీ తీర్మానాలను ఆయన విలేకరులకు వివరించారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న బీజేపీకి, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాబోతున్న చంద్రబాబుకు అభినందనలు తెలుపుతూ తీర్మానం ఆమోదించామని చెప్పారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంతో కేంద్రం ఆయా విషయాల్లో పట్టువిడుపులతో ఉండాలని కోరుతూ మరో తీర్మానం చేశారు. గత శాసనసభలో టీఆర్‌ఎస్ పక్ష నేతగా ఈటెల రాజేందర్ చేసిన సేవలను టీఆర్‌ఎస్ పార్టీ గుర్తిస్తోందని పేర్కొంటూ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. పార్టీ, ప్రభుత్వ బాధ్యతలు చూసే వారందరూ కూడా కలిసి తెలంగాణ పునర్‌నిర్మాణంలో, అభివృద్ధిలో భాగం కావాలని తీర్మానించారు. ఎంపీల తరపున పార్లమెంట్‌లోని లోక్‌సభ, రాజ్యసభ పక్ష నేతలను ఎంపిక చేసే బాధ్యతను కేసీఆర్‌కే ఇస్తూ తీర్మానాన్ని ఆమోదించారు.

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగానే..:ఈటెల ప్రజ ఆశలను, ఆశయాలను తీర్చడమే లక్ష్యంగా తమ కార్యక్రమాలు ఉంటాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతను కేసీఆర్‌కు అప్పగించామని, తమ మొదటి ప్రాధాన్యత వ్యవసాయమని ఆయన చెప్పారు.తర్వాత ప్రాధాన్యత ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడమని తెలిపారు. అన్నట్లుగానే వ్యవసాయ రుణాల మాఫీని చేసి చూపుతామన్నారు. హైదరాబాద్‌ను దేశంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని, ఐటీఐఆర్‌తోపాటు మిగతా పరిశ్రమలను కూడా రప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. మూడు తరాల వారు ఆకలి కేకలు లేని సుసంపన్నమైన తెలంగాణ రాష్ట్రం కోసం కలలు కన్నారని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి రాజకీయ అవినీతి లేకుండా పాలన సాగుతుందని అన్నారు. ఎంత కమిట్‌మెంట్‌తో 13 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేశామో అంతే కమిట్‌మెంట్‌తో తెలంగాణ పునర్‌నిర్మాణంలో పాలుపంచుకుంటామన్నారు.

టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఒక్కొక్క రోజు 10-12 సభల్లో పాల్గొంటూ ప్రజలను చైతన్య పరిచిన కేసీఆర్ కృషిని శ్లాఘిస్తూ టీఆర్‌స్‌ఎల్‌పీ, పార్లమెంటరీ పార్టీ తీర్మానం చేశాయని తెలిపారు. ఉద్యమంలో యువతపై పెట్టిన కేసులను మొదటి క్యాబినెట్ మీటింగ్‌లోనే ఎత్తివేయాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిజాయతీ, నిబద్ధతతో ఉండాలని సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. ప్రజలు వేసే దండలకు, డప్పుచప్పుళ్లకు, ఊరేగింపులకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎంపీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు రాజయ్య, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, పొలిట్‌బ్యూరోసభ్యుడు రామచంద్రుడు పాల్గొన్నారు.

నేడు గవర్నర్‌ను కలువనున్న టీఆర్‌ఎస్ నేతలు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బందం గవర్నర్‌ను ఆదివారం కలిసి తమ నేత ఎన్నిక, టీఆర్‌ఎస్‌కు వచ్చిన మెజార్టీ వివరాలతోకూడిన ఒక మెమోరాండాన్ని అందించనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 60 మంది ఎమ్మెల్యేల మెజార్టీ అవసరం ఉన్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ సొంతంగానే 63 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో శనివారం కేసీఆర్‌ను టీఆర్‌ఎస్‌ఎల్‌పీ నేతగా ఎన్నుకున్నారు. ఈ మేరకు గవర్నర్‌ను కలిసి మెమోరాండం అందించిన తరువాత ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన కేసీఆర్‌ను ఆహ్వానించనున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.