Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

టీఎస్ ఆర్టీసీపై సీఎం వరాల జల్లు

-తక్షణం 500 బస్సులకు రూ.150 కోట్లు -అద్దె బస్సులపై వ్యాట్ తగ్గింపునకు సానుకూలత -హైదరాబాద్‌కు మరో ఈడీ, ఇద్దరు ఆర్‌ఎంలు -బస్సుల రంగు, లోగోల మార్పునకు ఆదేశం -రవాణా, ఆర్టీసీ అధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయాలు

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. ఆర్టీసీకి వెయ్యి కొత్త బస్సులను సమకూర్చాలని నిర్ణయించడంతోపాటు తక్షణమే 5 వందల బస్సుల కొనుగోలుకు రూ. 150 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారు. అద్దె బస్సులపై ప్రస్తుతం ఉన్న 14.5 వ్యాట్ శాతాన్ని తగ్గించే ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా హైదరాబాద్‌లో మరో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌తోపాటు ఇద్దరు ఆర్‌ఎంలను నియమించేందుకు అంగీకరించారు. ఆర్టీసీలో తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్న డ్రైవర్, కండక్టర్లకు తగు శిక్షణ ఇచ్చి పర్మినెంట్ చేసే విషయంలోనూ సీఎం సానుకూలంగా స్పందించారు.

CM KCR _ TSRTCరవాణావ్యవస్థ పనితీరుపై గురువారం ముఖ్యమంత్రి అధికార నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.150 కోట్లతో కలిపి ఇప్పటి వరకూ ఆర్టీసీకీ రూ.400 కోట్లు ఇచ్చినట్టు తెలిపారు. ఇప్పటికే 350 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించగా మరో 650 బస్సులను సమకూర్చాలని ఆదేశించారు.

ఇందులో గ్రామీణ ప్రాంతాలకు 4 వందలు, ఇతర ప్రాంతాల కు వంద ఎక్స్‌ప్రెస్, 50 ఇంద్ర, గరుడ వోల్వో బస్సులు కొనుగోలుచేయాలని సమీక్షలో నిర్ణయించారు. వీటితోపాటు వంద అద్దె బస్సులను కూడా అనుమతించాలని, వీటన్నింటినీ మూడు నెలల్లో రోడ్లపైకి తేవాలని నిర్ణయించారు. మార్చి తర్వాత మరో వేయి బస్సులను కొనుగోలు చేసేందుకు సమీక్షలో సీఎం అంగీకరించారు.

బస్సులకు అందమైన రంగులతో కొత్త శోభ.. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా ఆర్టీసీ బస్సులకు రంగులు వేయాలని అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి సుమారు వేయి రంగులు, జాతీయ, అంతర్జాతీయ బస్సుల మోడల్స్‌ను ముఖ్యమంత్రి పరిశీలించి సూచనలిచ్చారు. హైదరాబాద్ నగరంలో నిర్వహణా సామర్థ్యం పెంచేందుకు ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌తోపాటు, ఇద్దరు రీజియన్ మేనేజర్ల పోస్టులు మంజూరు చేశారు. ఆర్టీసీని లాభాల బాటకు తెచ్చేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.

అక్రమంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. డిపోలవారీగా పరిస్థితిని అధ్యయనం చేయాలన్నారు. రవాణాశాఖ కమిషనర్, జేటీసీ, డీటీసీలు, ఆర్టీసీ అధికారులు సంయుక్తంగా సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. సమన్వయపరచాల్సిన బాధ్యతను రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డికి అప్పగించారు. మూడవ సారి జరిగే సమీక్షా సమావేశంలో ఆర్టీసీ అధికారులతో సమావేశమవుతానని సీఎం చెప్పారు. ఆర్టీసీ ఎండీ, జేఎండీ, ఈడీలు, ఆర్‌ఎంలు, డిపోమేనేజర్లు, డీటీసీ, జాయింట్ కమిషనర్లు, ఆర్‌టీవోలు, ఎంవీఐలతో తాను నేరుగా మాట్లాడి ఆర్టీసీనీ లాభాల బాట పట్టించే అంశంమీద చర్చిస్తానని చెప్పారు.

ఓఆర్ పెంచుకోండి.. ప్రతి రోజు 10 వేల బస్సులను తిప్పుతూ 90 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్న తెలంగాణ ఆర్టీసీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. కేఎంపీఎల్, ఆక్యుపెన్సీ నిష్పత్తిని పెంచుకోవాలని సూచించారు. ప్రయాణికులను ఆర్టీసీ బస్సులనే ఆదరించేలా ప్రోత్సహించాలని, అందుకోసం లక్కీడీప్ వంటివి చేపట్టాలని సూచించారు. తాను రవాణాశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో అనేక సంస్కరణలు సత్ఫలితాలిచ్చాయని సీఎం గుర్తు చేశారు. ముంబాయి, గుజరాత్, సూరత్, భీవండి, తిరుపతి బస్సులను పునరుద్ధరించాలని సూచించారు.

రవాణాశాఖ ఆదాయం రూ.658 కోట్లు.. మొదటి త్రైమాసికం సందర్భంగా వచ్చిన ఆదాయంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు రవాణాశాఖ అధికారులు నివేదిక అందచేశారు. జూన్ 2, 2014 నుంచి సెప్టెంబర్ నెల చివరి వరకు రూ.568 కోట్లు ఆదాయం వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ. రెండు వేల 2 వందల కోట్ల రూపాయల టార్గెట్‌ను చేరుకోవాలనిసీఎం రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రి పీ మహేందర్‌రెడ్డి, ఎంపీలు బీ వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైల శేఖర్‌రెడ్డి, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా, కమిషనర్ జగదీశ్, ఆర్టీసీ ఎండీ పూర్ణచందర్‌రావు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రమణారావు, రవాణాశాఖ జేటీసీ వెంకటేశ్వర్లు, ఈడీలు రవీందర్, గ్రేటర్ హైదరాబాద్ ఈడీ జయరావు తదితరులు పాల్గొన్నారు.

టీఎంయూ హర్షం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తీసుకున్న నిర్ణయాల పట్ల తెలంగాణ మజ్దూర్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది. యూనియన్ నేతలు తిరుపతి, అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి ముఖ్యమంత్రికి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.