Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

త్వరలో డిజిటల్‌ సర్వే

-వ్యవసాయ భూములకు పక్కాగా కో ఆర్డినేట్స్‌
-అక్షాంశ.. రేఖాంశాలతో నక్షాలు
-భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
-ఆఫీసుల చుట్టూ తిరుగుడు ఇక బంద్‌
-సర్వేకోసం వెంటనే టెండర్లు పిలవాలి
-ధరణి పోర్టల్‌ 100% విజయవంతం
-ఓర్వలేక కొందరి తప్పుడు ప్రచారం
-రెవెన్యూలో ఫలించిన సంస్కరణలు
-పనివిధానంలో సమూల మార్పులు
-అధికారుల పనిపై త్వరలో జాబ్‌చార్ట్‌
-రెవెన్యూశాఖ పేరు కూడా మారాలి
-ధరణిపై సమీక్షలో సీఎం కేసీఆర్‌

రాష్ట్రంలో త్వరలో డిజిటల్‌ సర్వే నిర్వహించి, వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్‌ (అక్షాంశ, రేఖాంశాలు) ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సర్వే కోసం వెంటనే టెండర్లు పిలువాలని ఆదేశించారు. దీంతో రాష్ట్రంలోని సాగు భూముల వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తి పారదర్శకంగా జరుగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో శ్రమించి, ప్రవేశపెట్టి, అమలుచేస్తున్న ధరణి పోర్టల్‌ వంద శాతం విజయవంతం అయినట్టు సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా రెవెన్యూశాఖ పనివిధానంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ అధికారులు భవిష్యత్తులో నిర్వహించాల్సిన విధులపై ‘జాబ్‌చార్టు’ రూపొందించనున్నట్లు వెల్లడించారు. రెవెన్యూ సంస్కరణలు, ధరణి పోర్టల్‌ పనితీరుపై సీఎం కేసీఆర్‌ గురువారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలను ప్రకటించారు.

అమాయక రైతులకు ధరణితో న్యాయం
ధరణి పోర్టల్‌తో రెవెన్యూశాఖలో అవినీతి అంతమైందని, నోరులేని, అమాయక రైతులకు న్యాయం జరిగిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘ఒకరి భూమిని ఇంకొకరి పేరు మీద రాసే అరాచకం ఆగింది. జుట్టుకు జుట్టుకు ముడేసి పంచాయతీ పెట్టే దుష్ట సంప్రదాయం ఆగింది. డాక్యుమెంట్లు గోల్‌మాల్‌ చేసి, రెవెన్యూ కోర్టుల పేరిట జరిగే దుర్మార్గం పోయింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా, చరిత్రలో ఎన్నడూ జరుగని విధంగా ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మూడేండ్లు కసరత్తు చేసి, కొత్త చట్టం తెచ్చింది’ అని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పారదర్శకంగా, అవినీతికి ఏమాత్రం అవకాశం లేకుండా జరిగిపోతున్నాయని చెప్పారు. ఎలాంటి గందరగోళం, అస్తవ్యస్తం లేకుండా భూముల అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతున్నదన్నారు. బయోమెట్రిక్‌, ఆధార్‌ ఆధారంగా అమ్మేవారు, కొనేవారు వస్తేనే భూముల రిజిస్ట్రేషన్‌ జరుగుతున్నదని, ధరణిలో నమోదైన భూములను మాత్రమే అమ్మే, కొనే వీలున్నదని గుర్తుచేశారు. ఆ భూములు మాత్రమే వారసత్వం, గిఫ్ట్‌ డీడ్‌ ద్వారా మరొకరికి సంక్రమించే అవకాశం ఉన్నదన్నారు.

ప్రభుత్వం అనుసరిస్తున్న పకడ్బందీ వ్యూహం వల్ల ఎవరూ ధరణిలో మార్పులు చేసే అవకాశం లేదని, చివరికి సీసీఎల్‌ఏ, సీఎస్‌ కూడా రికార్డులను మార్చలేరని స్పష్టంచేశారు. అంతా వ్యవస్థానుగతంగా (సిస్టవ్‌ు డ్రివెన్‌), మానవ ప్రమేయం (హ్యూమన్‌ ఇంటర్ఫేస్‌) లేకుండా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతున్నదని తెలిపారు. రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంత సజావుగా సాగడం కొంతమందికి మింగుడు పడడం లేదని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ధరణి పోర్టల్‌ మీద చిలువలు, పలువలు ప్రచారం చేస్తున్నారు. అసంబద్ధ విషయాలు మాట్లాడుతున్నారు. లేని సమస్యలు సృష్టించి, పైరవీలు చేసి అక్రమంగా సంపాదించుకునేవారు ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వారే అపోహలు సృష్టించి, గందరగోళపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు. వాటిని నమ్మి ప్రజలు తికమకపడొద్దని కోరారు. కొన్ని పత్రికలు కావాలని తప్పుడు వార్తలు, అసంబద్ధ కథనాలు ప్రచురిస్తున్నాయన్న సీఎం.. వాటిపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు స్పందించి సంపూర్ణ వివరాలు అందించాలని, సందేహాలను నివృత్తి చేయాలని ఆదేశించారు.

ప్రతి భూమికి కో ఆర్డినేట్స్‌ ఇస్తాం
‘ప్రభుత్వం జరిపిన సమగ్ర భూరికార్డుల ప్రక్షాళన, కొత్త పాస్‌పుస్తకాలు, ధరణి పోర్టల్‌ తదితర సంస్కరణ వల్ల వ్యవసాయ భూములకు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. మిగిలిన కొద్దిపాటి సమస్యలు త్వరలో జరిపే డిజిటల్‌ సర్వేతో పరిష్కారం అవుతాయి’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. తాను ఇంతకుముందే అసెంబ్లీలో ప్రకటించినట్టు త్వరలోనే రాష్ర్టవ్యాప్తంగా డిజిటల్‌ సర్వే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రతి భూమికి కో ఆర్డినేట్స్‌ ఇస్తామన్నారు. వాటిని ఎవరూ మార్చలేరని, గందరగోళానికి, తారుమారు చేయడానికి ఆస్కారం ఉండదని చెప్పారు. ‘నిజానికి ఇప్పటికే డిజిటల్‌ సర్వే ప్రారంభం కావాల్సింది. కరోనా వల్ల ఆగింది. అతి త్వరలోనే సర్వే ప్రారంభమవుతుంది. సర్వే పూర్తయితే అన్ని విషయాలపై స్పష్టత వస్తుంది. రైతుల భూముల మధ్య, అటవీ-ప్రభుత్వ భూముల మధ్య, అటవీ-ప్రైవేటు భూముల మధ్య హద్దుల పంచాయతీ కూడా పరిష్కారం అవుతుంది. పోడు భూముల సమస్య కూడా పరిష్కారం అవుతుంది. 3-4 నెలల్లో మొత్తం సమస్యలు కొలిక్కి వస్తాయి. కో ఆర్డినేట్స్‌ మారవు కాబట్టి భవిష్యత్తులో కూడా హద్దుల పంచాయతీకి అవకాశం ఉండదు’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. భూ రికార్డులు సక్రమంగా ఉన్న దేశాల్లో జీడీపీ 3-4 శాతం వృద్ధి సాధించిందని పేర్కొన్నారు. తెలంగాణలో కూడా అలాంటి విప్లవాత్మక మార్పునకు ప్రభుత్వం సిద్ధపడిందని చెప్పారు. ఈ సమావేశంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శులు స్మితా సబర్వాల్‌, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూలో జాబ్‌ చార్ట్‌
మారిన పరిస్థితుల్లో రెవెన్యూ స్వరూపం కూడా మారిందని, రెవెన్యూ శాఖ విధులు, బాధ్యతల్లో మార్పులు వచ్చాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. గతంలో భూమి శిస్తు వసూలు చేసినప్పుడు రెవెన్యూ అనే పదం, శాఖ వచ్చాయని, ఇప్పుడు రెవెన్యూ వసూలు చేయకపోగా, ప్రభుత్వమే రైతుబంధు ద్వారా ఎకరానికి ఏటా రూ.10వేల సాయం అందిస్తున్నదని గుర్తుచేశారు. కాబట్టి రెవెన్యూ అనే పేరు కూడా ఇప్పుడు సరిపోదని, పేరు మారే అవకాశం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ధరణి పోర్టల్‌, డిజిటల్‌ సర్వే తదితర కారణాల వల్ల భూ రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు కూడా సులభంగా, అధికారుల ప్రమేయం లేకుండానే జరిగిపోతాయని చెప్పారు. సేద్యం చేసి పంటలు పండించాల్సిన రైతులు తాసిల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రయాస ఉండదన్నారు. ధరణి ప్రధాన లక్ష్యం కూడా ఇదేనని వెల్లడించారు. కాబట్టి రెవెన్యూ శాఖ విధుల్లో మార్పులు అనివార్యమని, ఎవరు.. ఏ పని చేయాలనే విషయంలో ప్రభుత్వం త్వరలోనే జాబ్‌ చార్టు రూపొందిస్తుందని ప్రకటించారు. ఆర్‌ఐ ఏం చేయాలి? తాసిల్దార్‌ ఏం చేయాలి? ఆర్డీవో ఏం చేయాలి? అనే విషయాల్లో స్పష్టత ఇస్తామన్నారు. రెవెన్యూ అధికారులను పనిచేయగలిగే, పని అవసరం ఉండే చోట ప్రభుత్వం వాడుకుంటుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ‘ఏమైనా సమస్యలు, సందేహాలుంటే రైతులు ఇకపై కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలి. కలెక్టర్లు ఆ దరఖాస్తులను స్వీకరించి, పరిశీలించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని పరిష్కరించాలి’ అని స్పష్టం చేశారు.

డిజిటల్‌ సర్వే పూర్తయితే అన్ని విషయాలపై స్పష్టత వస్తుంది. రైతుల భూముల మధ్య, అటవీ-ప్రభుత్వ భూముల మధ్య, అటవీ-ప్రైవేటు, పోడు భూముల మధ్య హద్దుల పంచాయితీ కూడా పరిష్కారం అవుతుంది. 3-4 నెలల్లో అన్నీ కొలిక్కి వస్తాయి.
-కో ఆర్డినేట్స్‌ మారవు కాబట్టి భవిష్యత్తులో హద్దుల పంచాయితీకి అవకాశం ఉండదు.

– సమీక్షలో సీఎం కేసీఆర్‌

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.