Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

12 తీర్మానాలు ఏకగ్రీవం

-వివిధ అంశాలపై పార్టీ వైఖరి స్పష్టీకరణ.. -పలు వివరణలు ఇచ్చిన సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ ప్లీనరీలో మొత్తం 12 తీర్మానాలను ఆమోదించారు. వివిధ అంశాలపై పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు ఈ తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఇతర సీనియర్ నేతలు వాటిని బలపరుస్తూ ప్రసంగాలు చేశారు. కొన్ని తీర్మానాలపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ మాట్లాడారు. వివరణలు ఇస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అన్ని తీర్మానాలను ప్రతినిధులు హర్షధ్వానాల మధ్య ఏకగ్రీవంగా ఆమోదించారు.

KTR 001

1వ తీర్మానం.. స్టీరింగ్ కమిటీ సభ్యుడు, గ్రేటర్ హైదరాబాద్ పరిశీలకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాగత నిర్మాణం మీద తొలి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావంనుంచి ఇప్పటివరకు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ప్రభుత్వం, పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందన్నారు. పునర్ నిర్మాణంలోనూ అండగా ఉండి దుష్పచారాన్ని తిప్పికొట్టాలని కోరారు.ఈ తీర్మానాన్ని పార్టీ రాష్ట్ర నాయకులు దేవీప్రసాద్ బలపర్చారు. పార్టీని కేడర్ బేస్‌డ్ పార్టీగా తీర్చిదిద్దాలని, కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. సీఎం కేసీఆర్ స్పందిస్తూ నాగార్జున సాగర్‌లో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పార్టీ శ్రేణులు తెలంగాణలోని అన్ని అంశాలపై పట్టు సాధించాలని సూచించారు. దేశంలోనే కార్యకర్తల బలం కలిగిన పార్టీగా టీఆర్‌ఎస్ గుర్తింపు పొందాలన్నారు.

2వ తీర్మానం.. పట్టణాభివృద్ధి- విశ్వనగరంగా హైదరాబాద్ పేరిట రెండో తీర్మానాన్ని మాజీ ఎమ్మెల్సీ, బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మునిసిపల్ శాఖను తన వద్దే పెట్టుకున్నారని, ఫ్లె ఓవర్లు, స్కైవేలతో పాటు విశాలమైన, రద్దీ ఇబ్బంది లేని ట్రాఫిక్ సమస్య ఉండని హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు బేగ్ ఈ తీర్మానాన్ని బలపరుస్తూ ముఖ్యమంత్రి అండగా తెలంగావాదులంతా నిలవాలని కోరారు. తీర్మానంపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ రాష్ట్రంలోని మునిసిపాలిటీలు అగ్లీగా, అనాగరికంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులైన ప్రబుద్ధుల వల్ల హైదరాబాద్ నగరం పేరు చెడిపోయిందని, హుస్సేన్ సాగర్‌ను మురికి కూపంగా మారిందని అన్నారు. ఇవాళ దాన్ని బాగుచేద్దామంటే కూడా విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయితే ఎవరినీ లెక్క చేసేది లేదు… హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పూర్తిచేసి తీరుతామన్నారు.

Harish Rao addressing in Party plenary

3వ తీర్మానం.. తెలంగాణ ప్రజాసంక్షేమం తీర్మానాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రవేశపెట్టారు. తెలంగాణ సర్కారు సంక్షేమానికి పెద్దపీట వేసిందని అన్నారు. చంద్రబాబు హయాంలో అప్పటికే పింఛన్ పొందే వారు ఎవరో ఒకరు చచ్చిపోతేనే కొత్తవారికి ఇచ్చేవారన్నారు. వైఎస్ ఇచ్చిన రెండు వందల రూపాయలు సరిపోయేవి కావన్నారు. సీఎం కేసీఆర్ పింఛన్లను ఐదు రేట్లు పెంచారని ప్రశంసించారు. రాష్ట్రంలో 37 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని ఇవాళ సగటున ఒక్కో మండలానికి 10వేల మంది పింఛన్లు పొందుతున్నారని చెప్పారు. మాదిగ, మాదిగ ఉపకులాల కోసం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేశారని, హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నారని, సబ్సిడీ బియ్యం ఆరు కేజీలకు పెంచి అందిస్తున్నారని అన్నారు.ఈ తీర్మానాన్ని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ బలపర్చారు. షాదీ ముబారక్ పథకం తెచ్చి సీఎం కేసీఆర్ పేద మైనార్టీ వర్గాల్లో ఎనలేని ఆనందాన్ని కలిగించారని ఆయన ప్రశంసించారు. ముస్లింలకు రిజర్వేషన్ అంశంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ ఫలాలు కూడా అందించాలని కోరారు.

4వ తీర్మానం.. తెలంగాణ సంస్కృతిక పునరుజ్జీవనంపై తీర్మానాన్ని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం తెలంగాణ ప్రజలు పోరాటాలు చేశారన్నారు. తెలంగాణ వారికి తెలుగు రాదన్నారని, ఇక్కడి మననీయులను, పోరాట యోధులను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంక్‌బండ్‌పై ఆంధ్రుల విగ్రహాలు పెట్టడంతోపాటు నగరం నడిబొడ్డున ఉన్న పార్కుకి కాసుబ్రహ్మానందరెడ్డి పేరు పెట్టారని విమర్శించారు. తీర్మానాన్ని రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నాగేంద్రగౌడ్ బలపరిచారు. తెలంగాణ బిడ్డ పీవీ నర్శింహారావును కేంద్రం విస్మరిస్తే కేసీఆర్ జయంతి ఉత్సవాలు జరిపి గౌరవించార న్నారు.

5వ తీర్మానం.. వ్యవసాయం-నీటిపారుదల-మిషన్ కాకతీయపై తీర్మానాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించారు. ఎన్నికల మేనిఫెస్టో చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రోజుకి కనీసం 10 గంటలకుపైగా నీటిపారుదల అంశాలపైనే ఆలోచనలు చేస్తారని చెప్పారు. భావితరాలకు తాగునీటి కష్టాలు ఉండకూడదనేది కేసీఆర్ లక్ష్యమని అన్నారు. తెలంగాణకు పనికి రాని ఇక్కడి ప్రజల నోట్లో దుమ్ముకొట్టే దమ్ముగూడెం ప్రాజెక్టును రద్దు చేస్తామన్నారు. చంద్రబాబు పాలమూరును దత్తత తీసుకున్నానని చెబుతూ దత్తత పేరుకే అర్ధం లేకుండా చేస్తే వలసలతో సతమతమవుతున్న ఆ జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు. అలాగే ఫ్లోరైడ్ సమస్యతో సతమతమవుతున్న నల్లొండ జిల్లా ప్రజలకు విముక్తి కల్పించేందుకు త్వరలోనే నక్కలగండి ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి, భీమా, కోయల్‌సాగర్ ప్రాజెక్టులను , మధ్య తర హా ప్రాజెక్టులైన కోమ రం భీమ్, నీల్వాయి, జల్లవాగులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టుకు రీ ఇంజినీరింగ్ చేస్తున్నామని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సరైన పద్దతిలో అమలు చేస్తామని చెప్పారు.

KCR in Party plenary meeting (11) కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు హక్కుగా ఉన్న 265 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు మిషన్ కాకతీయ చేపట్టామని చెప్పారు. గత ప్రభుత్వాలు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతల కోసం పనులు చేపట్టేవి. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా, ఎమ్మెల్యే ఏ పార్టీ అయితే ఏంటి? అక్కడున్నదీ తెలంగాణ బిడ్డలే కదా అంటూ అన్ని నియోజకవర్గలకు నిధులు ఇస్తున్నారని అన్నారు. మిషన్ కాకతీయనురాష్ట్ర గవర్నర్, నీతి అయోగ్ ప్రతినిధులు, హైకోర్టు న్యాయమూర్తి వంటి పెద్దలంతా ప్రశంసిస్తున్నారని అన్నారు. ఈ తీర్మానాన్ని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివసారెడ్డి బలపరుస్తూ పేదల సంక్షేమంతో పాటు, రైతుల సంక్షేమం ముఖ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ చెప్తారని అన్నారు. నా రాజకీయ జీవితంలో వేసవి కాలంలో విద్యుత్ కోతలు లేని సంవత్సరాన్ని మొదటిసారి చూస్తున్నానని అన్నారు.

ఈ తీర్మానంపై కేసీఆర్ స్పందిస్తూ టీఆర్‌ఎస్ పార్టీ పుట్టగానే సీఎం చంద్రబాబు హెలికాప్టర్‌లో వెళ్లి దేవాదుల ప్రాజెక్టు అంటూ పునాది రాయి వేశారని గుర్తు చేశారు. తెలంగాణలో 5 లక్షల ఎకరాలకు నీరు అని ప్రచారం చేసుకున్నారని, వారి హడావుడి చూస్తే మా సిద్దిపేట కోమటిరెడ్డి చెరువు ఇగ నిండుడే అలస్యం అన్నట్టు ఉండేదని అన్నారు. ఇవాళ స్వరాష్ట్రంలో ఆరు నూరైనా కృష్ణా-గోదావరిలో మన వాటా సాధిస్తామని చెప్పారు. కొంత మంది ప్రాణహిత-చేవెళ్లపై అనేక కూతలుకూస్తున్నారని, కొద్ది రోజుల్లో మొత్తం కథ తేలిపోతుందని స్పష్టం చేశారు. లెండి, లోయర్ పెన్‌గంగ నక్కలగండి చేపడతామని చెప్పారు.

6వ తీర్మానం.. తెలంగాణ విద్యుత్ రంగంపై తీర్మానాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రతిపాదించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణలో కరెంట్ ఉండదని సీమాంధ్ర పాలకులు భయపెట్టారని ఆయన గుర్తు చేశారు. కానీ తెలంగాణ అంటే కరెంట్.. కరెంట్ అంటే కేసీఆర్ అని మన సీఎం నిరూపించారని ప్రశంసించారు. తెలుగు సరిగా మాట్లాడడం రాని కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని చెప్పిండ్రు. కానీ తెలంగాణ వస్తే మూడేళ్లలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చుదిద్దుతానని కేసీఆర్ చెప్పారు. అయితే మూడేండ్లు కాదు..ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారు అని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. గతంలో ఎండాకాలం సెలవులకు ఊళ్లకు పోదామనుకుంటే అక్కడివారు రావద్దురా! ఇక్కడ కరెంట్ ఉండడం లేదు. మేమే పట్నం వస్తున్నం అనేవాళ్లు. ఇవాళ ఊరు వస్తున్నం అంటే సంతోషపడుతున్నారని మంత్రి చెప్పారు. కరెంట్ కోతలతో తెలంగాణ తల్లడిల్లాలని కోరుకున్న ప్రతిపక్షాల కళ్లు బైర్లు కమ్మేలా వెలుగునిచ్చిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో త్వరలోనే నేదునూరు, శంకర్‌పల్లి కు గ్యాస్ కేటాయింపులు సాధించుకుంటామని మంత్రి జగదీశ్ చెప్పారు. ఈ తీర్మానాన్ని బలపరిచిన ఢిల్లీలోని ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి మళ్లీ ఓట్లు అడిగే సమయానికి తెలంగాణ రాష్ట్రం అదనపు విద్యుత్‌తో కళకళలాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ జగదీష్‌రెడ్డి అంటే కరెంట్‌రెడ్డి అంటున్నరు. కరెంట్ కోతలు లేకుండా చూడడం కోసం 24 గంటల పాటు నాతోపాటు పని చెస్తున్నరు అని ప్రశంసించడంతో సభ చప్పట్లతో మారుమోగిపోయింది.

KCR in Party plenary meeting (9)

7వ తీర్మానం.. తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రవేశపెట్టారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రోడ్డు రవాణా వ్యవస్థను తీర్చిదిద్దుతామని మంత్రి చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక పథకాలు, కార్యక్రమాలపై విపక్షాలు అవాకులు, చెవాకులు పేలుతున్నాయని, ఎంత అరచి గీపెట్టినా రాష్ట్ర అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరని అన్నారు. హైదరాబాద్ నగరంలో స్కైవేల నిర్మాణంతో రూపురేఖలు మారిపోతాయన్నారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యే గొంగిడి సునీత బలపరిచారు. మౌలికసదుపాయల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు హర్షిస్తున్నారన్నారు.

8వ తీర్మానం.. తెలంగాణ తాగునీటి వ్యవస్థ-పారిశ్రామిక రంగంపై తీర్మానాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు.విద్యాహక్కు, సమాచార హక్కు మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం అందరికీ తాగునీటి హక్కును కల్పిస్తుందని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి వచ్చే నాలుగేళ్లలో ఇంటింటికీ రక్షిత నీరు అందించే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. గత పాలన దుర్మార్గంగా సాగిందని అందుకు నల్లగొండ జిల్లాలో రెండు లక్షల మంది ఫ్లోరోసిస్ బాధితులు ఉండడమే నిదర్శనమని అన్నారు. వాటర్ గ్రిడ్‌కు పదివేల కోట్లు ఖర్చుచేయడాన్ని విమర్శిస్తున్న వారు వారి పాలనలో అది ఎందుకు చేయలేదు ? గుడ్డి గుర్రాల పళ్లు తోమారా ? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వాటర్‌గ్రిడ్‌ను ప్రశంసించడమే కాకుండా ఇతర రాష్ర్టాలకు రోల్ మోడల్‌గా ఉందని అభినందించిందని తెలిపారు. ఈనెల 27న హడ్కో సంస్థ ఈ పథకాన్ని మెచ్చి ఒక అవార్డును ఇస్తుందని ప్రకటించారు. ఉద్యమ కాలంలో తెలంగాణ వస్తే ఐటీ పరిశ్రమ తరలిపోతుందని ప్రచారాలు చేశారని, అయితే ప్రభుత్వం తెచ్చిన అత్యుత్తమ ఐటీ, పారిశ్రామిక విధానాల వల్ల రూ.57వేల కోట్ల మేరకు ఉన్న ఐటీ ఎగుమతులు మూడింతలు పెరిగాయని చెప్పారు. ఐటీలో హైదరాబాద్ నగరం నెంబర్ వన్‌గా ముందుకు దూసుకుపోతున్నదని ఫైబర్ ఆప్టికల్ వ్యవస్థతో ఇంటింటికి ఇంటర్నెట్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ తీర్మానాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు బలపరిచారు. టీఎస్-ఐపాస్‌ను అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు మెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. దళిత, గిరిజన వర్గాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఈ తీర్మానంపై స్పందించిన కేసీఆర్ వాటర్ గ్రిడ్ పథకం అమలుకు పార్టీ శ్రేణులే కథానాయకులు కావాలని పిలుపునిచ్చారు. పైప్‌లైన్ ఏర్పాట్లకు ఆటంకాలు ఏర్పడకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు.

9వ తీర్మానం.. వర్తమాన రాజకీయాలు-టీఆర్‌ఎస్‌ను మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుట్రలను చేధించి గమ్యాన్ని ముద్దాడే వరకు ఉద్యమ వీరుల్లా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆంధ్రా పార్టీల ఏలుబడిలో కొందరు ఇంకా కుట్రలు చేస్తూనే ఉన్నారని హెచ్చరించారు. దివాలాకోరు రాజకీయపార్టీలను చెండాడుతూ ముందుకు సాగుదామన్నారు. ఈ తీర్మానాన్ని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి బలపరిచారు. తెలంగాణ వ్యతిరేకశక్తులు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌లలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాలగర్భంలోకలిసిపోయారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక్క పైసాకు కొరకాకుండా ఎక్కడ దాక్కున్నాడో తెలియదని ఎద్దేవా చేశారు.

10వ తీర్మానం.. తెలంగాణకు హరితహారంపై పదవ తీర్మానాన్ని మహబూబాబాద్, ఎంపీ సీతారాం నాయక్ ప్రవేశపెట్టారు. అడవులు అంతరించడం వల్ల అనేక అనర్థాలు తలెత్తుతున్నాయని అన్నారు. హరితహారం కింద ప్రతి యేటా 40కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. మొక్కలను అందుబాటులోకి తేవడానికి 3,500 నర్సరీలను ఏర్పాటు చేశామని, తెలంగాణ వ్యాప్తంగా వచ్చే మూడేండ్లలో 12 వేల గ్రామాల్లో 240 కోట్ల మొక్కలను నాటుతామని తెలిపారు. ఈ తీర్మానాన్ని కరీంనగర్ జిల్లాపరిషత్ ఛైర్మన్ తుల ఉమ బలపరిచారు. హరితహారం కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహించాలని కోరారు.

11వ తీర్మానం.. కేంద్రం విభజన హామీలు నెరవేర్చాలని కోరుతూ 11వ తీర్మానాన్ని లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్ష నేత జితేందర్‌రెడ్డి ప్రవేశపెట్టారు. కేంద్రం ఇచ్చిన వాగ్ధానాలతో పాటు ఇతర ఇబ్బందులను పరిష్కరించడానికి కేంద్రంతో పోరాడుతామన్నారు. ఈ తీర్మానాన్ని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ బలపరిచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ వల్ల దేశంలోనే రికార్డు స్థాయిలో దామరచెర్ల విద్యుత్ ప్రాజెక్ట్ కేవలం రెండున్నర నెలల్లోనే పర్యావరణ అనుమతులు సాధించగలిగామన్నారు.

12వ తీర్మానం.. బలహీనవర్గాల గహనిర్మాణం, గోదావరి పుష్కరాల అంశంపై 12వ తీర్మానాన్ని దేవాదాయవాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. వీలైనంత త్వరలోనే లబ్థిదారులను గుర్తించి గృహనిర్మాణాలకు శ్రీకారం చుడుతామని తెలిపారు. గోదావరి పుష్కరాలను కుంభమేళను తలపించే రీతిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ తీర్మానాన్ని పెద్దపల్లి ఎంపీ బాల్కాసుమన్ బలపరిచారు. ఆంధ్రాపాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురైన పుష్కరాలను ఈ సారి బ్రహ్మాండంగా జరుపుకుందామని అన్నారు.

సవరణ తీర్మానం.. చివరగా తెలంగాణ రాష్ట్ర సమితి లో వివిధ స్థాయిలలోని కార్యవర్గాలను నియమించుకునే అధికారాన్ని పార్టీ అధ్యక్షులకు కట్టబెడుతూ ప్లీనరీలో సవరణ తీర్మానం చేశారు. పార్టీ నియమావళిలో 9వ నిబంధనను సవరిస్తూ ప్రతిపాదించిన తీర్మానానికి ప్లీనరీ ఆమోదం తెలిపింది. టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికల అధికారి పర్యాదకృష్ణమూర్తి సవరణ తీర్మానాన్ని ప్రతిపాదించారు. టీఆర్‌ఎస్ కార్యాలయ కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి బలపరిచారు.

స్వీటీ పైలట్‌గా ఎదగాలి: సీఎం మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన స్వీటీ శుక్రవారం ప్లీనరీ వేదికపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలుసుకుంది. ఈ సందర్భంగా తాను పైలట్ కావాలన్న ఆకాంక్షను ముఖ్యమంత్రి వద్ద వ్యక్తం చేసింది. ఆ విషయాన్ని సభలో సీఎం కేసీఆర్ వెల్లడించారు. 2001లో చిన్న అమ్మాయిగా తనను కలుసుకున్న స్వీటీ పద్నాలుగేళ్ల తర్వాత పైలట్ అవుతానన్న ఆశతో ఉంది. తెలంగాణ బిడ్డ స్వీటీ పైలట్ కావాలి, ఆమె పైలట్ అయ్యి తెలంగాణ గగనతలంపై విమానాన్ని నడపాలి, మనంఅందరం ఆమెకు ఆశీర్వాదం అందిద్దామని ముఖ్యమంత్రి అన్నారు.

ప్లీనరీ సైడ్‌లైట్స్ -ఉదయం 11:20 గంటలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేదికపై ఆశీనులయ్యారు. -మధ్యాహ్నం 12:00లకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్లీనరీ వేదికపైకి చేరుకొని సభికులకు అభివాదం చేశారు. -12:01లకు సీఎం కేసీఆర్ చేతికి డిప్యూటీ సీఎం మహముద్ అలీ దట్టీ కట్టారు. -12:02లకు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. -12:05లకు టీఆర్‌ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. -12:10లకు డమరుకం మోగించి ప్లీనరీని కేసీఆర్ ప్రారంభించారు. -12:15లకు టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు తొలిపలుకు ప్రసంగం చేశారు. -12:30లకు టీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన నాయిని నర్సింహారెడ్డి ప్రసంగించారు. అధ్యక్ష పదవికి ఒకే ఒక్క నామినేషన్ వచ్చినట్లు తెలిపారు. అనంతరం టీఆర్‌ఎస్‌కు ఎనిమిదోసారి అధ్యక్షునిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. -12:36లకు టీఆర్‌ఎస్ అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన కేసీఆర్‌కు వివిధస్థాయి ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు -12:40లకు కేసీఆర్‌పై ప్లీనరీకి విచ్చేసిన కార్యకర్తలు పూలవర్షం కురింపించారు. -12:43లకు టీఆర్‌ఎస్ కేసీఆర్ అధ్యక్షోపన్యాసం ప్రారంభించారు. -01:05లకు కేసీఆర్ ప్రసంగం ముగింపు, భోజన విరామం -2:48లకు తిరిగి సభ ప్రారంభం. తీర్మానాలు ప్రవేశపెట్టారు. -6:30లకు కేసీఆర్ ప్రసంగంతో సభ ముగింపు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.