Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఉచితంగా ఇండ్లు

ఐడీహెచ్ కాలనీవాసులకు నిర్మిస్తున్న తరహాలో నగరంలోని పేదలకు ఉచితంగా ఇండ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. హైదరాబాద్‌లో నిరుపేదలుండే ప్రాంతాల్లో ఎవరెక్కడ ఉంటే అక్కడే వాళ్లకు పట్టాలిచ్చి, క్రమబద్ధీకరిస్తామని, స్థలం సరిపోకపోతే ప్రభుత్వమే వందశాతం డబ్బు పెట్టి.. అపార్టుమెంట్లు కట్టి పేదలకు ఫ్లాట్లు ఇస్తుందని ప్రకటించారు. పదివేల కోట్ల రూపాయలు.. అంతకు మించి ఖర్చయినా సరే.. మురికివాడలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

KCR-in-Maheshwaram-Public-Meet01

– హైదరాబాద్‌లో పేదలకు ఉన్నచోటే పట్టాలు.. క్రమబద్ధీకరణ – స్థలం చాలకుంటె అపార్ట్‌మెంట్లు కట్టి.. ఫ్లాటిస్తం : సీఎం కేసీఆర్ – బాబును నమ్మితే సున్నం పెడతడు – మాట మార్చడంలో ఆయనకు నోబెల్ ఇవ్వొచ్చు – కాంగ్రెస్, టీడీపీ వల్లే విద్యుత్ కష్టాలన్న సీఎం -టీఆర్‌ఎస్‌లో చేరిన తలసాని, తీగల, గంగాధర్‌గౌడ్ -మహేశ్వరంలో భారీ బహిరంగ సభ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలన్నీ సిద్ధంగా ఉన్నాయని,మలక్‌పేట రేస్‌కోర్సును, చెంచల్‌గూడ జైలును కూడా నగరం వెలుపలికి తరలిస్తామని, అక్కడ పేద విద్యార్థుల కోసం స్కూళ్లు నిర్మిస్తామని తెలి పారు. చారిత్రక నిర్మాణాలను ధ్వంసం చేయకుండానే అద్భుతమైన అభివృద్ధి సాధించిన టర్కీలోని ఇస్తాంబుల్ నగరం తరహాలో హైదరాబాద్ పాతబస్తీని అభివృద్ధి చేస్తామని చెప్పారు.

హైదరాబాద్ నగర టీడీపీ మాజీ అధ్యక్షుడు, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం టీడీపీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, నిజామాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ బుధవారం సాయంత్రం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గంలోని టీకేఆర్ కళాశాల గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు.

హైదరాబాద్‌లో పేదలపై త్వరలో సర్వే… సమైక్య రాష్ట్రంల ఈ నగరం ఎట్ల అభివృద్ధి జరగాలో అట్ల జరగలె. నిరుపేదలు ఇంకా నిరుపేదలుగనె ఉన్నరు. నగరంలో 1700 మురికివాడలున్నయి. 17-20 లక్షల జనాభా ఆ వాడలల్లనె నివాసముంటున్నరు. ఇలా కాకుండా జంట నగరాల చరిత్రల కనీవినీ ఎరుగని రీతిలో నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలన్నీ సిద్ధంగ ఉన్నయి అని కేసీఆర్ తెలిపారు. స్థానిక ఎన్టీఆర్‌నగర్‌లో అత్యంత పేదలు ఉన్నారని, వారికి ఇండ్లపట్టాలు ఇవ్వాలని, క్రమబద్ధీకరించాలని తీగల చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. కచ్చితంగ నేనే స్వయంగా వచ్చి వాళ్లకు పట్టాలిస్త. ఆ స్థలాల్ని రెగ్యులరైజ్ చేస్తం.

ఇదొక్కటే కాదు. హైదరాబాద్‌ల నిరుపేదలుండె స్థలాలల్ల, ఎవరెక్కడ ఉంటె అక్కడే వాళ్లకు పట్టాలిచ్చి, క్రమబద్ధీకరిస్తం. స్థలం సరిపోకపోతే ప్రభుత్వమే వందశాతం డబ్బులు పెట్టుకొని అక్కడ అపార్టుమెంట్లు కట్టి, ఫ్లాట్లు ఇస్తం. రేషన్‌కార్డులు, పింఛన్ల పంపిణీ అయిపోంగనె హైదరాబాద్‌ల పేదలపై సర్వే నిర్వహిస్తం అని ప్రకటించారు.

మోకాల్లోతు నీళ్లు.. ఇది హైటెక్కా?: చంద్రబాబు హైదరాబాద్‌ని నేనే నిర్మించినంటడు. మరి కులీకుతుబ్‌షా ఈ మాట విని ఆత్మహత్య చేసుకోవాల్నా? ఏమన్నంటె హైటెక్ సిటీ అంటరు. హైటెక్కో, లోటెక్కో నాకు తెల్వదుగానీ ఒక్క గట్టి వాన వస్తె సీఎం ఇంటిముందు, గవర్నర్‌ఉండె రాజ్‌భవన్‌ముందు, అసెంబ్లీ ముందు మోకాల్లోతు నీళ్లు నిలబడతయి. ఇదేం హైటెక్? ఇట్లగాదు. రూ.10వేల కోట్లుకాదు.. ఎంత ఖర్చయినాసరే.. హైదరాబాద్‌ను మురికివాడలులేని నగరంగా తయారుచేసి చూపిస్తం.నేను బయట ఎక్కువ ఒర్లుతలేను.చదువుతలేను. లోపల నా పని నేను చేసుకుంటున్న.

తలసాని ఒకరోజు నా దగ్గరికి వచ్చి ఐడీహెచ్ కాలనీవాసుల ఇబ్బంది గురించి చెప్పినరు. వెంటనే స్వయంగావెళ్లి పరిశీలించిన. ఇప్పుడు అక్కడ దేశంలో ఎక్కడాలేనివిధంగా ఫ్లాట్లు నిర్మిస్తున్నం. సాధారణంగా 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లు ఇస్తరు. కానీ 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు పడకలు, ఒక హాలు ఉండె ఫ్లాట్లను నిర్మిస్తున్నం. దానిని మోడల్ కాలనీగా తీర్చిదిద్ది, హైదరాబాద్ అంతా ఇదేవిధంగ ఉచితంగా పేదలకు ఇండ్లు ఇస్తం అని చెప్పారు.

ఇస్తాంబుల్‌కు త్వరలో బృందం: హైదరాబాద్ చరిత్రల ఎన్నడూ చూడని అభివృద్ధిని చేసి చూపిస్త అని సీఎం పునరుద్ఘాటించారు. టర్కీలోని ఇస్తాంబుల్ నగరం చాలా గొప్పది. అక్కడ చారిత్రక నిర్మాణాలను ధ్వంసం చేయకుండ గొప్పగ అభివృద్ధి చేసిండ్రు. అక్కడికి అధికారుల బృందంతో పాటు జంట నగరాల ఎమ్మెల్యేలను కూడా పంపుతున్నం. అదేరీతిన ఓల్డ్ సిటీని అభివృద్ధి చేస్తం. చంచల్‌గూడ జైలును అక్కడినుంచి ఎత్తేసి, అక్కడ పేదపిల్లలకోసం విద్యాలయాలను నిర్మిస్తం. 170 ఎకరాల్ల ఉన్న రేస్ కోర్సును ఊరు బయట పెడ్తం. జూదగాళ్లు ఎక్కడికైన పోయి ఆడుకుంటరు. అక్కడ కూడా పాత నగరవాసులకోసం విద్యాలయాలను నిర్మిస్తం. ఇంకా ఎన్నో విప్లవాత్మక మార్పులు చేస్తం. ప్రజలే కేంద్రబిందువుగా అభివృద్ధి కార్యక్రమాలు రూపుదిద్దుకుంటున్నయి. త్వరలో మీముందుకొస్తయి అని సీఎం వెల్లడించారు.

అభివృద్ధి దృష్ట్యా కఠిన నిర్ణయాలు తప్పవు: కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరించాలని అనుకున్నం. వ్యవహరిస్తం కూడా. టీఆర్‌ఎస్ జూదం ఆడొద్దంటుంది. పేకాట క్లబ్‌లను మూసేయించింది. ఇది తప్పా? పేకాట క్లబ్‌లను మూసేయాల్నా? వద్దా? ఇది కూడా ఆంధ్రోళ్లకు బాధ కలిగించింది. ఎందుకంటే వాళ్లవే ఎక్కువ క్లబ్‌లు ఉన్నయి కాబట్టి. హైదరాబాద్‌ను ఇష్టమున్నట్లు కుళ్లబొడిచిండ్రు. నియంత్రణ, పద్ధతి లేదు. సమైక్య పాలనలో దుర్మార్గంగ వ్యవహరించిండ్రు. అందుకే పట్టణాలుగానీ, గ్రామాలనుగానీ అభివృద్ధి చేయాలనే దృష్ట్యా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నం అని కేసీఆర్ వివరించారు.

ఇక్కడున్నోళ్లందరూ మా బిడ్డలే…: ఏదైనా చెప్పేందుకు ధైర్యం, సాహసం కావాలి. నేను చెబుతున్నా. నాలుగేండ్లలో హైదరాబాద్‌లోనే కాదు.. తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్‌తో నీళ్లిస్తం. అట్ల నీళ్లు అందియ్యకపోతే వచ్చే ఎన్నికలల్ల ఓట్లే అడగం. రాత్రింబవళ్లు అందరం మీ సహాయ సహకారాలతో కష్టపడుతం. దాన్ని సాధించితీరుతం అని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రజలకు చాలా కలలున్నయి. కొత్తగవచ్చిన రాష్ట్రం. ఎక్కడా, ఎవరి రేషన్‌కార్డులు లాక్కోరు. అర్హులైన వారికి వందశాతం రేషన్‌కార్డులుంటయి. హైదరాబాద్‌లో నివసించే ఎవరైనా తెలంగాణ బిడ్డలే.

గుజరాతీయులు, కర్ణాటక నుంచి వచ్చినవారు, మలయాళీయులు, ఆంధ్ర నుంచి వచ్చిన మిత్రులు.. అందరూ మా బిడ్డలే. మీరు చంద్రబాబు మాటలు పట్టుకొని, ఆయన్ని నమ్మితె.. అన్నం కాదు సున్నం పెడతడు అన్నారు. ఈ రాష్ట్రంల పెట్టుబడులు పెట్టెటోళ్లకు రెడ్ కార్పెట్ వేస్తం. సినీ పరిశ్రమల మీద కూడా ఏవో అభాండాలు సృష్టిస్తున్నరు. ఇంకా వేల ఎకరాలు కావాలన్నా ఇస్తం. హాలీవుడ్ వాళ్లు కూడా ఇక్కడికొచ్చి షూటింగ్ తీసుకునేట్లు స్టూడియోలను అభివృద్ధి చేస్తం. ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు అని సీఎం భరోసా ఇచ్చారు.

నిజాయితీ ఉంటే మీ రాష్ట్రంల రుణమాఫీ చెయ్ చంద్రబాబుకు నిజాయితీ ఉంటే ఇచ్చిన మాట ప్రకారం ఏపీలో రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేసి చూపించాలని కేసీఆర్ సవాలు విసిరారు. మేం రుణమాఫీ అన్నం. చేసి తీరినం (వీ హావ్ డన్ ఇట్). చాలామంది డ్వాక్రా మహిళల రుణాలు కూడా మాఫీ చేయాలని చెప్పిండ్రు. కానీ నేను అది సాధ్యం కాదు.. వద్దన్న. ఇచ్చినమాట ప్రకారం రుణమాఫీ చేసినం. మరి నీ (చంద్రబాబు) రాష్ట్రంల ఏం చెప్పినవు? రైతుల అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తమన్నవు.

ముందైతే ఓట్లు గుద్దండి.. తర్వాత చూసుకుందామన్నవు. రైతు రుణమాఫీలు, డ్వాక్రా రుణాలు మొత్తం లక్షా54వేల కోట్లు.. సాధ్యంకాదని చాలామంది చెప్పినరు. కానీ మీరు బచ్చాగాండ్లు. మీకేం తెలుసు? నేను ముఖ్యమంత్రిగ చేసిన. ఆర్థికవేత్తను అన్నవు. మరి రూ.1.54 లక్షల కోట్లల్ల కనీసం 1.54 లక్షల పైసలన్న రుణమాఫీ చేసినవా చంద్రబాబు? లక్ష రూపాయలైన చేసినవా? కాలయాపన చేస్తున్నవు. నిజంగ నీకు నిజాయితీ ఉంటె.. చంద్రబాబూ నీవు రైతులకు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీ అమలు చేసి చూపించు అని చంద్రబాబుకు కేసీఆర్ సవాలు చేశారు.

ఒకవైపు కరెంటు ఫ్యూజులు తీసేసి.. మరోవైపు తొత్తులతో తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు మాట మార్చే వ్యక్తుల్లో దేశంలోనే చంద్రబాబుకు నోబెల్ బహుమతి ఇవ్వచ్చని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణకు కరెంటు కష్టాలొచ్చినయని సీఎం పునరుద్ఘాటించారు. ఈరోజు కాంగ్రెస్, టీడీపీ నాయకులు అడ్డదిడ్డంగ మాట్లాడుతున్నరు. ఈరోజు కరెంటు కష్టాలకు బాధ్యలెవరు? మేం గోసి కూడ సర్దుకోలేదు. మా పనే మొదలుకాలె. పది సంవత్సరాల కాంగ్రెస్, తొమ్మిదేండ్ల చంద్రబాబు పాలనలో నిర్లక్ష్యం కారణంగనె ఈ కష్టాలొచ్చినయి. చంద్రబాబు కరెంటు ఫ్యూజు పీకేస్తడు. ఇక్కడ ఆయన తొత్తులు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తరు అని మండిపడ్డారు.

విద్యుత్ కష్టాలుంటాయని ముందే చెప్పిన.. నాకు నిజాయితీ ఉంది. ఎన్నికలల్ల 107 సభలల్ల నేను పాల్గొంటె, అందుల 87సభల్లో తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలుంటయని చెప్పిన. మూడేండ్లు కష్టపడాలి, ఎన్నికల తర్వాత నన్ను అపార్థం చేసుకోవద్దని చెప్పిన. కరెంటు అంటె షాపుల దొరికె వస్తువు కాదు. లైన్లు వేయాలన్న సంవత్సరాలు పడుతుంది. ఒక సంవత్సరం 2వేల మెగావాట్లు, రెండో ఏడాది ఇంకా కొంచెం, మూడేండ్లు నిండిన తర్వాత రాష్ట్రం కనురెప్ప కొట్టేంత సమయం కూడా కరెంటు పోదని హామీ ఇస్తున్న. ఇప్పటికే 14వేల మెగావాట్ల విద్యుత్‌కోసం ఒప్పందాలు చేసుకున్నం.

మూడేండ్ల తర్వాత 24 గంటల కరెంటు ఇవ్వడమే కాదు.. సర్‌ప్లస్ స్టేట్‌గా కూడా ఉంటం అని చెప్పారు. ఈ విషయాలన్నీ టీడీపీ నేతలకు తెలుసని కేసీఆర్ అన్నారు. వాళ్లకివన్నీ తెలుసు. కేసీఆర్ ఎంత జగమొండో. ఏదైనా పట్టుకుంటె వదలడనే విషయం తెలుసు. అందుకే భవిష్యత్తు అంధకారంల ఉండి, ముందంతా చీకటి ఉండటంతో.. ఇప్పుడేదో గోల్‌మాల్‌చేసి గందరగోళం సృష్టించాలనుకుంటున్నరు. వాటిని ఎదుర్కొనే సత్తా మాకుంది. ఒక్క చంద్రబాబుకాదు..లక్ష మంది చంద్రబాబులొచ్చినా, కోట్లాది మంది ఆయన తొత్తులు వచ్చినా తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిపథాన తీస్కపోతం. ప్రపంచం ముందు రాష్ర్టాన్ని నిలబెడతం అని కేసీఆర్ విస్పష్టంగా ప్రకటించారు.

ఇది రాజకీయం కోసం కాదు మీరు (పార్టీలో చేరినవారిని ఉద్దేశించి) పార్టీలో చేరిన నిర్ణయాన్ని అభినందిస్తున్న. నేను దీనిని చిల్లర రాజకీయంగా చూస్తలేను. గతంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఇతర మిత్రులు చేరినపుడు ఇదే చెప్పిన. మళ్లా అదే చెబుతున్న. ఇదంతా రాజకీయంకోసం కాదు. తెలంగాణ కొత్త రాష్ట్రం. గెలిచి నిలబడాలని, ప్రజలను బాగుపర్చాలని వారు టీఆర్‌ఎస్‌లో చేరినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ప్రజలు మీకు బ్రహ్మరథం పడతరు అని కేసీఆర్ అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.