Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం

-నీళ్లు, నిధులు, నియామకాల్లో సంపూర్ణ న్యాయం దిశగా పరుగు
-ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ సరైన మార్గంలో పయనిస్తున్నది
-కుట్రలు ఛేదిస్తూ.. దేశంలోనే అగ్రస్థానం
-విపక్షాల విషప్రచారాన్ని తిప్పికొట్టాలి
-ప్రాణహిత చేవెళ్ల సామర్థ్యం 10 రెట్లు పెంచినం.. దీనిపైనా దుష్ప్రచారం
-అప్పులుకాదు.. పునరుత్పాదక పనులకు పెట్టుబడులు
-తెలంగాణ వికాస సమితి సదస్సులో మంత్రి కేటీఆర్

దశాబ్దంన్నరపాటు అనేక ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సరైనమార్గంలో వెళుతున్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ఉద్యమ ఆకాంక్షల మేరకే ప్రభుత్వం పనిచేస్తూ ప్రజాసంక్షేమం దిశగా వేగంగా దూసుకుపోతున్నదని చెప్పారు. రాష్ట్రంలో తొలిప్రభుత్వం ఏర్పడిన వారంరోజుల్లోనే.. ఏడుమండలాల్ని ఆంధ్రలో విలీనంచేస్తూ కుట్రలకు తెరలేపారని కేటీఆర్ ఆరోపించారు. ఈ కుట్రలను ఎప్పటికప్పుడు ఛేదించుకుంటూ అభివృద్ధిపథాన తెలంగాణ అగ్రభాగంలో నిలిచిందన్నారు. శుక్రవారం తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో బేగంపేటలోని ఓ హోటల్లో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి పునాది అయిన నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు అంశాల్లో సీఎం కేసీఆర్ అసాధారణ పరిపాలన వల్లనే సంపూర్ణ న్యాయం దిశగా ముందుకు వెళుతున్నామని చెప్పారు.

తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేయాలన్న లక్ష్యంతో ప్రాజెక్టుల నిర్మాణం, రీడిజైనింగ్ చేపట్టామని, మరోవైపు మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు మంచినీరు అందించే పనులు దాదాపు పూర్తికావొచ్చాయ న్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళుతుంటే, ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులువేసి ప్రాజెక్టులకు, నియామకాల ప్రక్రియకు అడ్డంకులు సృష్టించాయని విమర్శించారు. చివరికి తెలంగాణ ఆడబిడ్డలకు అందివ్వాల్సిన బతుకమ్మ చీరెల పంపిణీని సైతం అడ్డుకున్నదని ఈ సందర్భంగా మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో ఆధిపత్య భావజాలం కలిగిన పాలకపక్షాలతో ప్రజలు పోరాడి సొంత రాష్ర్టాన్ని సాధించుకుంటే, ఇప్పుడు ప్రతిపక్షాల సంకుచిత మనస్తత్వంతో పోరాడాల్సి వస్తున్నదని అన్నారు. ప్రతిపక్షాలను ప్రజాకోర్టులో ఎండగట్టేందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. అభివృద్ధి యజ్ఞానికి అడ్డుపడుతున్న ప్రతిపక్షాల అసలు రూపాన్ని ప్రజల ముందుంచడంలో మేధోవర్గం అండగా నిలువాలని కోరారు. తెలంగాణ అభివృద్ధిపై విపక్షాలు చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొట్టాలని, వాటి కుట్రలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

సామర్థ్యం పెంచిన విషయం గుర్తించరా!
ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం 16 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదిస్తే.. తాము దాన్ని పదిరెట్లు.. 160 టీఎంసీలకు పెంచినందువల్లనే అంచనా వ్యయం పెరిగిందని మంత్రి కేటీఆర్ వివరించారు. కాంట్రాక్లర్లకు డబ్బులు దోచిపెట్టేందుకు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట ప్రజల సొమ్మును కాంగ్రెస్ కొల్లగొట్టిన విషయాన్ని కూడా చర్చకు పెట్టాలని సూచించారు. తెలంగాణ బంగారు భవిత కోసం చేపట్టిన ప్రాజెక్టులకు పెద్దఎత్తున నిధులు ఖర్చుచేస్తుంటే.. అప్పులు చేస్తున్నదంటూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ నిధులు పునరుత్పాదకత కలిగిన పనులకు పెట్టుబడులని చెప్పారు.

కుటుంబపాలన అంటూ టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్.. అవినీతికి, బంధుప్రీతికి, కుటుంబ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమని విమర్శించారు. ఇప్పటికే ప్రజల్లోకి టీఆర్‌ఎస్ చొచ్చుకుపోయిందని, ప్రజలంతా కేసీఆర్ నాయకత్వానికి జైకొట్టేందుకు మరోసారి సిద్ధంగా ఉన్నారన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టంచేశారు. ఈ సదస్సులో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ అయాచితం శ్రీధర్, దేశపతి శ్రీనివాస్, వేణుగోపాలస్వామి, నర్సింహారెడ్డి, మండలిలో విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అన్ని జిల్లాల తెలంగాణ వికాస సమితి ఈసీ సభ్యులుసహా తెలంగాణ మేధోవర్గం హాజరైంది. తెలంగాణలో అభివృద్ధి యజ్ఞానికి అడ్డంపడుతున్న ప్రతిపక్షాల అసలు రూపాన్ని ప్రజల ముందుంచడంలో మేధోవర్గం అండగా నిలువాలి. అభివృద్ధిపై విపక్షాలు చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొట్టాలి. వాటి కుట్రలను ఎండగట్టాలి.
-మంత్రి కే తారకరామారావు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.