Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఉద్యమకారులను గెలిపించండి

-పట్టభద్రులకు సీఎం కేసీఆర్ పిలుపు -బీజేపీకి ఓటేస్తే మోర్లో వేసినట్టే – భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్ గెలుస్తుందన్న సర్వేలు – చంద్రబాబు బుల్డోజ్‌పై కేంద్రం ప్రేక్షకపాత్ర – కోతల్లేని కరెంటే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం – మూడు రోజుల్లో దామరచర్ల పవర్ ప్లాంట్ పనులు – శ్రీరామనవమినాడు భద్రాద్రి ప్లాంట్‌కు శంకుస్థాపన – టీడీపీ ఎమ్మెల్యేలు వాళ్ల గొంతు వాళ్లే నొక్కుకున్నారు – మీడియాతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

CM-KCR-press-meet-on-MLC-Elections

విజ్ఞులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచక్షణతో ఓటు వేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. చాలా కష్టపడి రాష్ర్టాన్ని తెచ్చుకున్నాం.. ఊహించని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోతున్నాం.. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే… మండలిలోనూ టీఆర్‌ఎస్ బలం పెరిగి, మరిన్ని బిల్లులు సులువుగా పాస్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేస్తే అవి మోర్లో వేసినట్లేనని, ఆ పార్టీ అభ్యర్థులు గెలిచి వచ్చి శాసనమండలిలో చేసేదేమీ లేదని చెప్పారు. తెలంగాణభవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన సోమవారం సాయంత్రం టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్నటివరకు వచ్చిన సర్వేల్లో రెండు పట్టభద్రుల స్థానాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని తేలిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన కొద్ది సమయంలోనే ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. గత ఏడాది ఇదే సమయంలో రాష్ట్రంలో విపరీతమైన కరెంటు కోతలు ఉండేవని కేసీఆర్ గుర్తు చేశారు.

కానీ ఈ సంవత్సరం ఇప్పటివరకు భగవంతుడి దయవల్ల రాష్ట్రంలో కోతలు లేకుండానే సరఫరా చేస్తున్నామన్నారు. ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం పని చేస్తున్నదనేందుకు ఇదే ఉదాహరణ అని అన్నారు. ఇకముందు కూడా 99.9% కోతలు లేకుండానే సర్వశక్తులు ఒడ్డి కరెంటు ఇస్తామన్నారు. మార్చి 24-25 నుంచి ఏప్రిల్ 30 వరకు పంటలు కోతకు వస్తున్నందున ఒకటీ, రెండు రోజుల పాటు చిన్న అంతరాయం ఉండొచ్చన్నారు. చివరకు ఆ మేర కోతలు లేకుండా… దేవుడు ఎంత శక్తి ఇస్తే అంత దాకా కరెంటు సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు.

రూ.79వేల కోట్లతో విద్యుత్ ప్రాజెక్టులు: రాష్ట్రంలో ప్రస్తుతం 4300 మెగావాట్ల విద్యుత్ ఉందని, రానున్న నాలుగు సంవత్సరాల్లో 24వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుందని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం రూ.79వేల కోట్లతో ప్రాజెక్టులు చేపడుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా దామరచర్లలోని యూనిట్లలో రెండు, మూడు రోజుల్లో పనులు మొదలవుతాయని తెలిపారు. అదేవిధంగా శ్రీరామనవమికి భద్రాచలం వెళుతున్నందున అదేరోజు మణుగూరు పవర్ ప్లాంటు పనులకు శంకుస్థాపన చేస్తామని పేర్కొన్నారు. గతంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు అన్యాయానికి గురయ్యాయని, వాటిని పూర్తిగా రీడిజైన్ చేసుకొని, దుబారా లేకుండా తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు వచ్చేలా వాటిని చేపడతామన్నారు.

రూ.15వేల కోట్లతో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని చెప్పిన సీఎం.. వాటిల్లో ఇప్పటికే కొన్ని పూర్తికాగా, మరికొన్ని టెండర్లు పూర్తయ్యాయని చెప్పారు. రెండున్నర-మూడు నెలల్లో అద్దాల్లా ఉండే రోడ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. గత ప్రభుత్వంలో కంటే పింఛన్లను ఐదు రెట్లు పెంచి ఇస్తున్నామని, అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఎవరైనా అర్హులు మిగిలిన ఉంటే.. ఎంపీలు, ఎమ్మెల్యేలు వారికి పింఛన్లు అందేలా చూడాలన్నారు.

మన హక్కులను బుల్డోజ్ చేస్తున్న చంద్రబాబు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఎత్తున తెలంగాణకు అవరోధాలు కల్పిస్తున్నారని సీఎం అన్నారు. అణగారిన వర్గాలు అధికంగా ఉన్న, వలసల జిల్లా మహబూబ్‌నగర్ జిల్లాకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా పది లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రయత్నిస్తున్నామని..ఈ మేరకు ట్రిబ్యునల్ ముందు కూడా వాదన వినిపిస్తున్నామని చెప్పారు. కానీ ఏపీ సీఎం మనకు చెప్పకుండా పట్టిసీమపై ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణాజలాలను మళ్లిస్తున్నారని అన్నారు. ఇందుకు వాస్తవంగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రను సంప్రదించాలని ఆ మేరకు ఎగువ రాష్ర్టాలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుందన్నారు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా మన హక్కులను బుల్డోజ్ చేస్తూ చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. కృష్ణా నదిపై తెలంగాణకు అన్యాయం చేస్తున్న వైనంపై వచ్చిన కథనాలను పట్టభద్రులు కచ్చితంగా చదవాలని సీఎం కోరారు.

కేంద్రానిదీ ప్రేక్షకపాత్రే… ఏపీ సీఎం రావాల్సిన కరెంటు ఇవ్వకుండా ఎగ్గొడుతుంటే దానిపై మనం ఫిర్యాదు చేసినా కేంద్రం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నదని కేసీఆర్ అన్నారు. చంద్రబాబు ఎన్డీయేలో భాగస్వామి కావడంతో కథలు చెబుతూ, నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. మన ఫిర్యాదుతో రెగ్యులేట్ చేసి, మనకు రావాల్సిన కరెంటును ఇప్పించాల్సి ఉండగా కేంద్రం తన బాధ్యతను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు కేంద్రం తెలంగాణకు రావాల్సిన కరెంటును ఇప్పించకుండా నిర్లక్ష్యం వహిస్తుంటే… మరోవైపు ఇక్కడ బీజేపీ నాయకులు అడ్డం పొడవు మాట్లాడుతున్నారని సీఎం విమర్శించారు.

మరి ఇలాంటి వారికి పట్టభద్రుల ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కర్కశంగా ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపినందుకు ఓటేయాలా? అని నిలదీశారు హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టు జడ్జి, ప్రధాన మంత్రి, సంబంధిత కేంద్ర మంత్రిని అందరినీ కలిసి, విజ్ఙప్తి చేశాం…కానీ ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న బీజేపీ నాయకులు దీనిపై ఎందుకు మాట్లాడటంలేదు… అందుకోసం ఆ పార్టీకి ఓటేయాల్నా? అని ప్రశ్నించారు. తెలంగాణకు అవరోధం కల్పిస్తున్నవే… ఈ టీడీపీ, బీజేపీ పార్టీలు అని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు.

తెలంగాణ గౌరవాన్ని కాపాడండి.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి టీఆర్‌ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న దేవీప్రసాద్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని.. టీఎన్జీవో అధ్యక్షుడిగా విశేష సేవలు అందించారని సీఎం అన్నారు. తెలంగాణ ఉద్యమానికి అపార సేవలు అందించిన ఆయన్ని గెలిపించి… తెలంగాణ గౌరవాన్ని కాపాడాలని కోరారు. అదేవిధంగా వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంచి సామాజిక కార్యకర్త, ఉద్యమకారుడని చెప్పారు. సామాజిక స్పృహ ఉన్న ఆయన్ని కూడా ఈ మూడు జిల్లాల ప్రజలు గెలిపించాలని కోరారు. ఇద్దరు అభ్యర్థులను మొదటి ప్రాధాన్యతా ఓట్లతో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తే… ప్రభుత్వం ఇంకా మంచిగా పనిచేసే ఆస్కారం కల్పించినట్లవుతుందన్నారు.

వాళ్ల గొంతులు వాళ్లే నొక్కుకున్నారు.. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి కలవనున్నారనే విషయాన్ని మీడియా ప్రస్తావించగా… ఎవరి గొంతు ఎవరు నొక్కుతున్నారు? బల్లలెక్కి జాతీయ గీతాన్ని అవమానించింది వాళ్లే. వాళ్ల గొంతు వాళ్లే నొక్కుకున్నరు అని వ్యాఖ్యానించారు.

వారి సస్పెన్షన్‌ను పునరాలోచించే అంశం శాసనసభ స్పీకర్, సభ మొత్తం తీసుకునే నిర్ణయమని… తాను ఒక్కడిని కాదని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్‌రెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఆర్‌ఎస్ స్టీరింగ్ కమిటీ కన్వీనర్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.