-ఎక్కడికక్కడ ప్రజల భాగస్వామ్యం

రాష్ట్రంలో మిషన్ కాకతీయ ఉద్యమంలా సాగుతున్నది. వివిధ జిల్లాల్లో ప్రజాప్రతినిధులు ప్రజలు ఉప్పెనలా కదిలి చెరువులు బాగు చేసుకుంటున్నారు. శుక్రవారం మెదక్ జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లిలో రూ. 25.70 లక్షలతో చేపట్టిన ఊర చెరువు మరమ్మతు పనులను రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం పచ్చని పొలాలతో కళకళలాడాలన్న సంకల్పంతో మిషన్ కాకతీయ మొదలు పెట్టారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. మంత్రి హరీశ్ రావుతోపాటు ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డి , ఎంపీపీ పద్మా శ్రీరాములు, సర్పంచ్ బాలమణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా నర్మెట మండలంలోని తరిగొప్పుల గ్రామంలోని పెద్దచెరువు పూడికతీత పనుల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పాల్గొన్నారు. చెరువుల పునరుద్ధరణతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు బొడకుంటి వెంకటేశ్వర్లు, నాగపురి రాజలింగం, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ భూక్యా పద్మ, ఆర్డీవో వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ నర్సయ్య, ఎంపీడీవో రమాదేవి, నాయకులు పాల్గొన్నారు.అదే జిల్లా శాయంపేట మండలంలోని నేరేడుపల్లి, కాట్రపల్లి, కొప్పుల, పెద్దకోడెపాక, తహార్‌పూర్ గ్రామాల్లో జరిగిన చెరువుల పునరుద్ధరణ పనుల్లో శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పాల్గొన్నారు.
అధికారులు చెరువుల పనుల్లో నాణ్యతపై రాజీపడొద్దని స్పష్టం చేశారు. చెరువు పనుల్లో నాణ్యత పరిశీలించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాలు రానున్నాయని, తానుకూడా ప్రతి చెరువు పనులను రెండుసార్లు స్వయంగా తనిఖీ చేస్తానని చెప్పారు. నాణ్యతపై ఫిర్యాదు వస్తే క్వాలిటీ అధికారులతో విచారణ చేయించి చర్యలు తీసుకుంటానని స్పీకర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐబీ డీఈ ప్రసాద్, జడ్పీటీసీ రమాదేవి, ఎంపీటీసీలు బగ్గి రమేశ్, బుట్టి రమేశ్, తడ్క శ్రీలత, సర్పంచ్‌లు కుమారస్వామి, జనగాని మంజుల సత్యం, ఇమ్మడిశెట్టి రవీందర్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గుర్రం రవీందర్, మాజీ అధ్యక్షుడు పోలెపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లాలో – జోరుగా.. నల్లగొండ జిల్లాలో మిషన్ కాకతీయ పనులు ఊపందుకున్నాయి. ఆలేరు నియోజక వర్గం గుండాల మండలంలోని సీతారామపురం ఊర చెరువు మరమ్మతు పనులను ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహేందర్‌రెడ్డి ప్రారంభించగా మర్రిపడగ గ్రామంలో ఊర చెరువు, పాచిల్ల చెరువు పనులను స్థానిక నేతలు ప్రారంభించారు. తుంగతుర్తి నియోజకవర్గం నూతన్‌కల్ మండలంలోని తాళ్లసింగారం గ్రామ చెరువు, తుంగతుర్తి మండల కేంద్రంలోని సంగెం చెరువు పునరుద్ధరణ పనులను పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్ ప్రారంభించారు. పెద్దవూర మండలం తిమ్మాయిపాలెం, చింతలపాలెం చెరువు పనులను స్థానిక ప్రజాప్రతినిదులు ప్రారంభించగా సూర్యాపేట మండలం రామారం, చివ్వెంల మండలంలోని బండమీది చందుపట్ల గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు చెరువు మరమ్మతు పనుల్లో పాల్గొన్నారు.
మునుగోడు నియోజక వర్గం మర్రిగూడెం మండలంలోని నామపురం , భీమనపల్లి, చండూరు మండలంలోని తేరటుపల్లి, దోనిపాముల గ్రామాల్లో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. హుజూర్‌నగర్ పట్టణం, పోతినేని కుంట మండల పరిధిలోని అమరవరం, గోపాలపురం, లింగగిరి, ఊర చెరువులను టీఆర్‌ఎస్ నియోజక వర్గ ఇన్‌చార్జి కాసోజు శంకరమ్మ ప్రారంభించారు. నల్లగొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామ చెరువును స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు.