– ప్రత్యేక హైకోర్టుకు ప్రభుత్వం కృషి – ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

తెలంగాణ ఉద్యమ చరిత్రలో న్యాయవాదుల పోరాటం మరువలేనిదని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. లక్డీకాపూల్‌లోని సాయిసరోవర్ హోటల్‌లో గురువారం సాయంత్రం న్యాయవాదుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి కేటీఆర్‌తోపాటు ఎక్సైజ్, క్రీడలు, యువజనశాఖ మంత్రి టీ పద్మారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత న్యాయవాది శ్రీరంగారావు మొదటి సభ్యత్వం అందించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఉస్మానియా విద్యార్థులపై లాఠీచార్జి, ఇందిరాపార్కు వద్ద జరిగిన పోరాటంలో, రైల్‌రోకో కార్యక్రమంలో న్యాయవాదుల పాత్ర శ్లాఘనీయమన్నారు. డిల్లీలో తెలంగాణ గళం వినిపించేందుకు విద్యార్థులు, యువతకు తీసిపోకుండా పార్లమెంట్ ఎదుట పోరాడటం మరిచిపోలేనిదన్నారు.
గతంలో ప్రభుత్వం ప్రకటించిన విధంగా న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. హెల్త్ కార్డులు కూడా అందజేస్తామన్నారు. మంత్రి పద్మారావు మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమానికి ప్రభుత్వం నుంచి రూ.100 కోట్లు మంజూరు చేస్తే తమ మంత్రి వర్గం తరపున ఉడతా భక్తిగా రూ.10 కోట్లు అందజేస్తాన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు, న్యాయవాదులు అనిల్‌కుమార్, శ్రీరంగారావు, కొంతం గోవర్ధన్ రెడ్డి, ఎన్ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు శుక్రవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు పార్టీ సమావేశాల్లో మంత్రి పాల్గొంటారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలు దేరి 9:30 గంటలకు మెట్‌పల్లి చేరుకుంటారు. అక్కడ మనోహర్ గార్డెన్‌లో మధ్యాహ్నం 11:30 గంటలకు జరిగే పార్టీ కార్యకర్తల సమావేశానికి హజరవుతారు. మధ్యాహ్నం 12:30 గంటలకు కోరుట్లలో జరిగే కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో 2గంటలకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.