– హైదరాబాద్‌లో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటుచేస్తాం -ఐలమ్మ స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మించుకుందాం: మంత్రి హరీశ్‌రావు – అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణను నిర్మించుకుందాం – జాతి గర్వించేలా హైదరాబాద్‌లో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు – వర్ధంతి సభలో భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు – ఊరూరా వీరనారికి ఘన నివాళి

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మించుకుందామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ 29వ వర్ధంతిని పురస్కరించుకొని మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆమె విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత హరీశ్‌రావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలోని పాలకు తెలంగాణ మహనీయులను గౌరవించలేదని, కనీస గుర్తింపు కూడా ఇవ్వకుండా వివక్ష చూపాయని మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంత మహనీయులైన దాశరథి, కాళోజీ, నవాబ్ జంగ్ జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ మహిళ ఉక్కు మహిళని కొనియాడారు. ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రం సాధించుకున్నామని చెప్పారు. తెలంగాణ పోరాటయోధులను గౌరవించుకునే సంస్కృతి, సంప్రదాయం మనదన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి, జయంతి వేడుకలను ఏటా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో జాతి గర్వించేలా చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్, సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.
ఐలమ్మ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి భూమి కోసం, భుక్తి కోసం, పరాయి పాలన విముక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వర్ధంతి సభలో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లావ్యాప్తంగా పలు సంఘాలు, సంస్థలు, వివిధ పార్టీలు సభలు నిర్వహించాయి. ఐలమ్మ స్వగ్రామమైన పాలకుర్తిలో ఐలమ్మ స్తూపం వద్ద సీపీఎం నాయకులతోపాటు ఐలమ్మ వారసుడు, మాజీ సర్పంచ్ చిట్యాల రామచంద్రం నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా బోర్గాం( పీ)లో చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ ఆధ్వర్యంలో వర్ధంతి సభ నిర్వహించారు.
ఇందూరులోని గౌతంనగర్‌లో రజక సంఘం ఆధ్వర్యంలో, కామారెడ్డి కర్షక్ బీఈడీ కళాశాలలో తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు గఫూర్ శిక్షక్ ఆధ్వర్యంలో, బోధన్‌లో రజక సేవా సంఘం ఆధ్వర్యంలో, బీర్కూర్‌లో ఎంపీపీ మల్లెల మీనా ఆధ్వర్యంలో, భీమ్‌గల్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో, మోర్తాడ్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యం లో వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలోని పరిగి, దోమ, కుల్కచర్ల, మేడ్చల్, ఘట్కేసర్, కీసర, తాండూరు మండలాల్లో రజక సంఘాల ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐలమ్మ విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై, జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని నిర్వహించారు. ఖమ్మంలోని టీటీడీసీలో తెలంగాణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి సభలో జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, టీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య పాల్గొన్నా రు. మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా వివిధ పార్టీలు, ప్రజా, కుల సంఘాలు, విద్యాసంస్థల ఆధ్వర్యంలో, పాలమూరు విశ్వవిద్యాలయంలో ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. నల్లగొండ జిల్లావ్యాప్తంగా రజక, బీసీ సంఘాలు, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చండూరులో రజక సంఘం ఆధ్వర్యంలో పేదలకు బియ్యం, రోగులకు పండ్లు పంపిణీ చేశారు.