-అనారోగ్యంతో మృతిచెందిన దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి
-స్వగ్రామం చిట్టాపూర్‌లో అంత్యక్రియలు పూర్తి
-ఉద్యమనేతకు అశ్రునివాళి అర్పించిన సీఎం కేసీఆర్
-భౌతికకాయం వద్ద కన్నీరు పెట్టుకున్న ముఖ్యమంత్రి
-టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు ఇతర ప్రముఖుల ఘన నివాళి
-పాడెమోసిన మంత్రి హరీశ్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
-వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు

విద్యార్థి దశలోనే అభ్యుదయాన్ని కాంక్షించిన విప్లవకారుడు ఇక లేడు. సమాజ మార్పుకోసం అక్షరాలను ఆయుధాలు చేసిన పాత్రికేయుడు.. సెలవన్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి.. తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీలో అడుగుపెట్టి.. అవిశ్రాంతంగా నినదించిన నిఖార్సయిన ఉద్యమకారుడు.. విశ్రమించాడు.

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే, శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి (57) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఇటీవల కాలుకు శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన, ఆ తర్వాత ఇన్ఫెక్షన్ కారణంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ దవాఖానలో 15 రోజులుగా చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. గురువారం సాయంత్రం ఆయన స్వగ్రామం చిట్టాపూర్‌లో భౌతికకాయానికి అంత్యక్రియలు జరిగాయి. సీఎం కే చంద్రశేఖర్‌రావు, రాష్ట్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సోలిపేట భౌతిక కాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.
కన్నీరుమున్నీరైన చిట్టాపూర్
రామలింగారెడ్డి పార్థివదేహాన్ని గురువారం ఉదయం చిట్టాపూర్‌కు తరలించారు. లింగన్నా.. అని ఆప్యాయంగా పిలుచుకొనే సోలిపేట ఇకలేరన్న వార్త తెలుసుకున్న దుబ్బాక నియోజకవర్గ ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చిట్టాపూర్ చేరుకొని ఆయన భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. మధ్యాహ్నం 2.45కి చిట్టాపూర్ గ్రామానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. రామలింగారెడ్డి భౌతికకాయానికి పూలు చల్లి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కలిసి పనిచేసిన రోజులను గుర్తుకు తెచ్చుకొని..కన్నీటిపర్యంతమయ్యారు. పది నిమిషాల పాటు ఉన్న సీఎం.. సోలిపేట కుటుంబసభ్యులను ఓదార్చారు. వారికి అండగా ఉంటానని భరోసానిచ్చారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి తదితరులు రామలింగారెడ్డి పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. సాయంత్రం 3 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర రెండు కిలోమీటర్ల మేర రెండుగంటలపాటు కొనసాగింది. అంతిమయాత్రలో పెద్దసంఖ్యలో జనం పాల్గొన్నారు. లింగన్న జోహార్, లింగన్న అమర్హ్రే అంటూ నినాదాలు చేశారు. చితికి రామలింగారెడ్డి కుమారుడు సతీశ్‌రెడ్డి నిప్పంటించారు.
పాడె మోసిన మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

రామలింగారెడ్డి పాడెమోసి మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తమ ఆత్మీయతను చాటుకున్నారు. ఉదయమే చిట్టాపూర్ వచ్చిన హరీశ్‌రావు.. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డితో కలిసి అంత్యక్రియలకు ఏర్పాట్లుచేశారు.
ప్రముఖుల నివాళి
రామలింగారెడ్డి భౌతికకాయం వద్ద పలువురు మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ పార్టీల నాయకులు నివాళులర్పించారు. మంత్రులు ఈటల రాజేందర్, పువ్వాడ అజయ్‌కుమార్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మదన్‌రెడ్డి, జోగు రామన్న, క్రాంతికిరణ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, ఫారూఖ్‌హుస్సేన్, రఘోత్తంరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీను, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, సాహిత్య అకాడమీచైర్మన్ నందిని సిధారెడ్డి, మాజీమంత్రి సునీతాలక్ష్మారెడ్డి, మాజీఎమ్మెల్యే వేముల వీరేశం నివాళులర్పించారు.