Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఉద్యమంలా జలం-జీవం

-ఆరు నెలలపాటు ఇంకుడు గుంతల ఏర్పాటు -300 గజాలు దాటిన ఇండ్లకు తప్పనిసరి -ఏర్పాటుచేయకుంటే అపరాధ రుసుం -వర్షపునీటి సంరక్షణకు అంతా కృషిచేయాలి -3100కోట్లతో శివార్లలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ -గేటెడ్ కమ్యూనిటీల్లో సీవరేజ్ ప్లాంట్ తప్పనిసరి -లేకుంటే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వరు -డస్ట్‌బిన్లు ఇస్తే.. పప్పులు పోసుకుంటున్నారు -చల్తాహై అనే ధోరణి అందరిలో మారాలి -మన నగరం భావనతోనే విశ్వనగరం సాకారం -పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారక రామారావు -రెండో మన నగరం కార్యక్రమం విజయవంతం

భూగర్భ జలాలు అడుగంటి నీటి సమస్య తలెత్తకుండా హైదరాబాద్ నగరంలో జలం-జీవం పేరుతో పెద్ద ఎత్తున ఇంకుడు గుంతలు ఏర్పాటుచేయనున్నట్టు ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారక రామారావు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు (శనివారం) నుంచి వచ్చే ఆరునెలలపాటు ఉద్యమంలా నిర్వహిస్తామని చెప్పారు. నిబంధనల ప్రకారం 300 గజాలు దాటిన ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. లేనిపక్షంలో బాధ్యులైన ఇండ్ల యజమానులు, అధికారులకు అపరాధ రుసుం విధించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే వాటిని పరిష్కరించేందుకు ఉద్దేశించిన మన నగరం కార్యక్రమాన్ని శనివారం చందానగర్‌లోని విశ్వనాథ్ ఫంక్షన్ హాలులో నిర్వహించారు. ఇటువంటి సమావేశాల్లో మొదటి సమావేశాన్ని గత నెల కుత్బుల్లాపూర్‌లో ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రెండో కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ సంఘాలు, ప్రజాసంఘాలు, పురప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్.. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీచేశారు. ప్రజలు, కాలనీ సంఘాలు, ప్రజాప్రతినిధుల సూచనలు-సలహాలను ఓపికగా విన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్రలోని లాతూర్‌లో గత వేసవిలో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటడంతో కేంద్రం పోలీసు పహారాలో రైళ్లతో నీటిని సరఫరా చేసిందని గుర్తుచేశారు. భవిష్యత్తులో ఇతర నగరాలు కూడా దీన్ని చూసి జాగ్రత్తపడాల్సిన అసవరం ఉందని అన్నారు. ఇంటింటికీ నీటి సరఫరా చేస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఎటువంటి నీటి సమస్య ఎదురుకాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటుచేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కేటీఆర్ నొక్కి చెప్పారు. అందుకే ముందు జాగ్రత్తగా జలం-జీవం పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నామని ప్రకటించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిననాడు.. 70 ఏండ్ల క్రితం పట్టణ జనాభా కేవలం 15% కాగా, ఇప్పుడది 30శాతానికి చేరిందని, తెలంగాణలో అత్యధికంగా 42% ఉందని మంత్రి వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఫ్లోటింగ్ జనాభాతోకలిపి 1.25కోట్ల జనాభా ఉందన్నారు. మన నగరానికి కూడా నీటి సమస్య వచ్చే అవకాశం లేకపోలేదన్నారు. నీటి సమస్య ఏదో ఒక ప్రాంతానిదికాదని, ప్రపంచవ్యాప్తంగా ఉందని పేర్కొంటూ అమెరికాలోని కాలిఫోర్నియాలో సైతం ఇటీవల నీటి సమస్య తలెత్తిన విషయాన్ని గుర్తుచేశారు.

ఇండ్లకు ఇంకుడు గుంతలు తప్పనిసరి నిబంధనలు, చట్టాలు ఎన్ని ఉన్నా ప్రజల భాగస్వామ్యం లేకపోతే అవి నిరుపయోగమేనని మంత్రి కేటీఆర్ చెప్పారు. 300 గజాలకు మించిన స్థలంలో నిర్మించిన ఇండ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటుచేయాలనే నిబంధన 2000 సంవత్సరం నుంచి ఉందని, అయినా అమలుకు నోచుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నిబంధన వచ్చిన తరువాత వేల సంఖ్యలో భవనాలు వచ్చినా ఇంకుడు గుంతలు వందల సంఖ్యలో కూడా లేవన్నారు. జలం-జీవం పేరుతో నిబంధనల మేరకు అన్ని ఇండ్లకూ ఇంకుడు గుంతలు ఏర్పాటుచేస్తామని చెప్పారు.

ఆరునెలల్లో నిర్మించకుంటే అపరాధ రుసుం జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు సంయుక్తంగా వచ్చే ఆరు నెలలపాటు నిర్దేశిత అన్ని ఇండ్లలో ఇంకుడు గుంతల ఏర్పాటు కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆరునెలల్లో ఏర్పాటుచేయని పక్షంలో స్థానిక ఇంటి యజమానితోపాటు అక్కడి బాధ్యుడైన అధికారికి జరిమానా విధిస్తామని స్పష్టంచేశారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తిచేసుకొని, విక్రయించి వెళ్లిపోయిన బిల్డర్లు సైతం తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించితీరాలని, లేనిపక్షంలో తదుపరి అనుమతుల సందర్భంగా వారినుంచి అపరాధరుసుం వసూలుచేయాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే నగరాన్ని 400 భాగాలుగా చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. జలం-జీవంపేరుతో చేపట్టే ఈ ఇంకుడు గుంతల ఉద్యమాన్ని ప్రజల భాగస్వామ్యంతో అంతటా అమలుచేయాలని కోరారు. దీనిపై ప్రజలను చైతన్యం చేసేందుకు జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. బెంగళూరులో ఓ వ్యక్తి ప్రభుత్వ నీటి సరఫరా విభాగంనుంచి నీటి కనెక్షన్ లేకుండానే వర్షపునీటిని పొదుపుచేసుకుంటూ వాటితో జీవనం సాగిస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఆ స్థాయిలో కాకున్నా కనీసం వర్షపు నీటిని సంరక్షించేందుకు తమవంతుగా కృషిచేయాలని సూచించారు.

3100కోట్లతో శివార్లలో డ్రైనేజీ వ్యవస్థ గతంలో ప్రతి వేసవిలో వాటర్‌బోర్డు కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ధర్నాలు జరిగేవని, ఇప్పుడా పరిస్థితులు పూర్తిగా మార్చి మంచినీటి సరఫరా విషయంలో గొప్ప విజయం నమోదుచేసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. విద్యుత్ కోతలు, జనరేటర్ల వాడకానికి పూర్తిగా స్వస్తి పలికామన్నారు. గ్రేటర్‌లో విలీనమైన శివారు మున్సిపాలిటీల్లో రూ.2000 కోట్ల హడ్కో రుణంతో ఇంటింటికీ మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొంటూ వచ్చే సంవత్సరకాలంలో రూ.3100కోట్లతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను కూడా ఏర్పాటుచేస్తామని మంత్రి ప్రకటించారు.

చల్తాహై అనే ధోరణి మారాలి ప్రజల అలవాట్లలో మార్పు రావాల్సి ఉందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తడి, పొడి చెత్తను విడివిడిగా వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటింటికీ రెండు చొప్పున సుమారు 45లక్షల చెత్తబుట్టలను పంపిణీచేస్తే చాలామంది వాటిని బియ్యం, పప్పు పోసుకునేందుకు ఉపయోగిస్తున్నారని చెప్పారు.

గేటెడ్ కమ్యూనిటీలకు సీవరేజ్ ప్లాంటు తప్పనిసరి ఒకే గేటెడ్ కమ్యూనిటీలో, లేక ఒకే అపార్ట్‌మెంటులో 100 యూనిట్లకు మించి ఉంటే అందులో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంటు ఏర్పాటుచేయాలనే నిబంధన ఉందని, అదిలేకుండా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీచేసే వీలులేదని మంత్రి చెప్పారు. ఇదికూడా సరిగా అమలుకు నోచుకోవడంలేదన్నారు. డ్రైనేజీ నీటిని ట్రీట్‌మెంట్ చేయకుండా చెరువుల్లో కలుపడంవల్ల గుర్రపుడెక్క సమస్య ఉత్పన్నమవుతున్నదన్నారు. ఏది చేసినా చల్తాహై అనే ధోరణినుంచి బయటపడాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తిచేశారు.

ఇది నా పని కాదు.. నేనెందుకు చేయాలి? చెత్త ఎత్తేవారు వేరే ఉన్నప్పుడు నాకేమవసరం? అనే పద్ధతి మార్చుకొని బాధ్యతగల పౌరులుగా వ్యవహరించాలని సూచించారు. గతంలో కుటుంబంతో తాను నిర్వహించిన సింగపూర్ పర్యటన సందర్భంగా చాక్లెట్ తిని కవర్లు ఎక్కడపడితే అక్కడ వేయరాదని, వేస్తే మొదటిసారి జరిమానా, రెండోసారి జైలు శిక్ష విధిస్తారని తన కూతురికి చెప్పానని, దీంతో తన కూతురు ఇప్పటికీ చెత్తను నిర్దేశిత ప్రదేశంలోనే వేస్తున్నదని తెలిపారు. అలవాట్లను మార్చుకోవడంవల్ల మంచి ఫలితాలుంటాయన్నారు. విశ్వనగరం మన కల అని పేర్కొంటూ.. రోడ్లు, డ్రైనేజీ, దోమలు, వీధికుక్కలు, నాలాలు, మౌలిక వసతులు తదితర అనేక సమస్యలను అధిగమించాల్సిన అవసరముందని కేటీఆర్ చెప్పారు. ఇవన్నీ మన నగరం అనే భావన లేకుండా సాధ్యంకావన్నారు. నగరవ్యాప్తంగా వేల సంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి సేఫ్‌సిటీగా మార్చామని చెప్పారు. ప్రగతినగర్ కాలనీలో చెట్లు అద్భుతంగా ఉన్నాయని పేర్కొం టూ స్థానిక ప్రజల కృషిఫలితంగానే అక్కడ పచ్చదనం సాధ్యమైందని ప్రశంసించారు.

ప్రజల సహకారంతోనే జీరో వేస్ట్ మన చెత్తను మనం వేరు చేయకపోతే వచ్చే దుష్పరిణామాలకు ఎవరిని నిందిద్దాం? అని కేటీఆర్ ప్రశ్నించారు. నాలాల వెంబడి ఉండేవారు చాలావరకు వ్యర్థాలను నాలాల్లోనే గుమ్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజలు మారకపోతే ఎన్ని కోట్లు ఖర్చుచేసినా ప్రయోజనం ఉండదన్నారు. చెత్తను విడదీయడంవల్ల అనేక ప్రయోజనాలున్నాయని, తడి చెత్తతో కంపోస్ట్, పొడి చెత్తతో విద్యుత్ ఉత్పత్తికి వీలుంటుందని చెప్పారు. ప్రజలు, కాలనీ సంఘాలు ముందుకొస్తే జీరో వేస్ట్ సాధ్యమవుతుందని చెప్పారు. కాలనీ పార్కుల నిర్వహణ స్థానికులకు అప్పగిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యను లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రోడ్లను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. దశలవారీగా ఎస్‌ఆర్‌డీపీని పూర్తిచేస్తామని చెప్పారు.

అన్ని సమస్యలూ డబ్బుతో పరిష్కారం అయ్యేవికావని, దీనికి ప్రజల సహకారం ఎంతో అవసరమని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. సమావేశం సందర్భంగా అందరికీ మాట్లాడే అవకాశం రాదనే ఉద్దేశంతో జనహిత పేరుతో కౌంటర్లు ఏర్పాటుచేశామని తెలిపారు. ఎవరైనా తమ సమస్యలు, చెప్పాల్సిన విషయాలను లిఖితపూర్వకంగా అక్కడ అందజేయాలని సూచించారు. వారికి రసీదు ఇస్తారని, వారి విజ్ఞప్తిపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, అధికారులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.