Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఉద్యోగ తెలంగాణ

-కొత్తగా 85వేల ఉద్యోగాలు -నిరుద్యోగ యువతకు సీఎం కేసీఆర్ తీపికబురు -ఆశించినదానికంటే మిన్నగా 1,12,536 ఉద్యోగాల భర్తీ -యాసంగి నుంచి రైతులకు 24గంటల కరెంటు -బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు -డిసెంబర్ చివరికి అన్ని గ్రామాలకు భగీరథ నీరు -81 సంవత్సరాల తర్వాత మళ్లీ భూసర్వే -శ్రీరాంసాగర్‌కు పూర్వవైభవం -స్వాతంత్య్ర వేడుకలలో ముఖ్యమంత్రి వెల్లడి -దశాబ్దాల కరెంటు దుఃఖం దూరం చేశాం -వచ్చే ఏడాది ఎకరానికి 8వేల పెట్టుబడి ఇస్తాం -కేసీఆర్ కిట్‌తో 42 వేలమందికి ప్రయోజనం -లక్ష కోట్ల పెట్టుబడులు సాధించాం -96 లక్షల మె.ట. పంటతో నూతన చరిత్ర -సమానత్వం-సామాజికన్యాయం మా ప్రాతిపదిక -గ్రామీణ మానవ వనరులను గుర్తించి ప్రోత్సహించాం -ప్రతీపశక్తుల కుట్రలు సాగవు -మా దీక్షను భంగపరుచలేరు

స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీపికబురు చెప్పారు. ఇప్పటి వరకు చేపట్టిన 27,660 నియామకాలకు తోడుగా మరో 84,876 ఉద్యోగాల ని యామక ప్రక్రియను సత్వరమే చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. వచ్చే యాసంగి నుంచి వ్యవసాయానికి 24గంటల కరెంటును అందించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. డిసెంబర్‌నాటికి ఇంటింటికీ శుద్ధి చేసిన నీరు అందించే మిషన్ భగీరథను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బతుకమ్మ పండుగ కానుకగా రాష్ట్రవ్యాప్తంగా తెల్లరేషన్ కార్డు కలిగిన 93 లక్షల మంది మహిళలకు చీరలను అందించే పథకం ప్రవేశపెడుతున్నామని చెప్పా రు.

ఆర్థిక లక్ష్యాలను సాధించడమే కర్తవ్యంగా భావించే యాంత్రిక ధోరణికి స్వస్తి చెప్పి.. సమానత్వం -సామాజికన్యాయం ప్రాతిపదికన సంక్షేమం-అభివృద్ధి రథచక్రాలుగా పరిపాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. కొత్తరాష్ర్టాలు త్వరగా కుదురుకోవనే ఆనవాయితీని అధిగమించి అభివృద్ధిపథంలో దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలిచామని పేర్కొన్నారు. గ్రామీణ మానవ వనరులను గుర్తించి, గ్రామీణార్థిక వ్యవస్థను పటిష్ఠంచేస్తూ గాంధీ మహాత్ముడు చెప్పిన గ్రామస్వరాజ్య సాధనకు కృషిచేస్తున్నామని అన్నారు. తెలంగాణ రైతులు అనుభవించిన దశాబ్దాల కరెంటు గోసను, విత్తనాలు, ఎరువుల కొరత వెతలను దూరం చేశామని తెలిపారు. తెలంగాణ రైతన్నకు ఇకపై చేయిచాచే దుస్థితి ఉండకూడదనే లక్ష్యంతో ఎకరానికి రూ.8 వేల పెట్టుబడి సమకూర్చబోతున్నామని చెప్పారు. ఉమ్మడిరాష్ట్రంలో విధ్వంసానికి గురైన చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ కాకతీయ, 9 గంటల కరెంటు తదితర చర్యలతో తెలంగాణ రైతాంగం ఈ సంవత్సరం 96 లక్షల మెట్రిక్ టన్నుల పంటలు పండించి నూతన చరిత్ర లిఖించిందని పేర్కొన్నారు. గర్భిణులు పనుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు అత్యంత మానవీయ కోణంలో చేపట్టిన కేసీఆర్ కిట్ పథకం వల్ల ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలు పెరిగాయని తెలిపారు. రాష్ర్టాభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలకు తీవ్ర విఘాతం కలిగించేందుకు ప్రతీపశక్తులు ఎన్నికుట్రలు చేస్తున్నా ప్రజల ఆశీర్వాద బలంతో వాటన్నింటిని ఛేదించి ముందడుగు వేస్తామని సీఎం స్పష్టం చేశారు. గోల్కోండ కోటలో మంగళవారం జరిగిన స్వాతంత్య్రదిన వేడుకలలో సీఎం కేసీఆర్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే..

తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ఒక లక్ష మందికి నూతనంగా ఉద్యోగాలు లభిస్తాయని ఉద్యమ సమయంలో భావించాం.ఈ పవిత్ర స్వాతంత్య్ర దినోత్సవ వేళ తెలంగాణ నిరుద్యోగ యువతకు ఒక శుభవార్తను తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు చేపట్టిన 27,660 నియామకాలకు తోడుగా మరో 84,876 ఉద్యోగాల నియామక ప్రక్రియను సత్వరమే చేపట్ట బోతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. – ముఖ్యమంత్రి కేసీఆర్

శ్రామిక జనుల సౌభాగ్యంకోసం, కలజనుల సంక్షేమంకోసం మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నాం. దీనికి విఘాతం కలిగించాలని ప్రతీపశక్తులు ఎన్ని కుట్రలు చేస్తున్నా ప్రజల ఆశీర్వాదంతో వాటిని ఛేదిస్తూ ముందడుగు వేయగలుగుతున్నాం.తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికోసం నిరంతరం పాటుపడే మా ఏకాగ్రతను కుటిల ప్రయత్నాలతో మరల్చజాలరని మరోసారి స్పష్టం చేస్తున్నాను. ప్రజల అండదండలే మాకు తిరుగులేని ఆత్మబలం. అట్టడుగువర్గాలదాకా అభివృద్ధి ఫలాలను అందించే బంగారు తెలంగాణను సాకారం చేసే మా ప్రయత్నం కొనసాగుతుందని ప్రకటిస్తున్నాను. – ముఖ్యమంత్రి కేసీఆర్

లక్ష్యసాధనదిశగా పయనిస్తున్నాం భారత జాతీయోద్యమం స్ఫూర్తితో, అహింసామార్గంలో.. శాంతియుత పంథాలో పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. ఏ ఆశయ సాఫల్యం కోసం స్వరాష్ర్టాన్ని కోరుకున్నామో ఆ లక్ష్యసాధన దిశగా రాష్ట్రం పురోగమిస్తున్నందుకు హర్షం ప్రకటిస్తున్నాను. తెలంగాణ వైభవానికి ప్రతీకగా గోల్కొండ కోటలో మూడేండ్లకింద మొదటిసారి త్రివర్ణపతాకాన్ని ఎగురవేసి రాష్ట్రప్రగతికి పథనిర్దేశం చేసుకున్నాం. ఆనాడు ప్రకటించుకున్న ప్రణాళికల వెలుగులోనే అద్భుత విజయాలు సాధిస్తూ ముందడుగు వేస్తున్నాం. కొత్తగా ఏర్పడిన రాష్ర్టాలు అంత తొందరగా కుదురుకోవు. కానీ ఈ పరిస్థితిని మన రాష్ట్రం సమర్థంగా అధిగమించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 21.7శాతం ఆదాయ వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. ఇది మనందరికీ గర్వకారణం. రాష్ట్ర ప్రగతికి శుభసూచకం.

పేదలకు జీవనభద్రత కల్పిస్తున్నాం కేవలం ఆర్థిక లక్ష్యాలను సాధించడమే కర్తవ్యంగా భావించే యాంత్రిక ధోరణిని ప్రభుత్వం విడనాడింది. సమానత్వం, సామాజికన్యాయం అనే ఉదాత్త లక్ష్యాలను సాధించే ప్రణాళికలు రూపొందించింది. అభివృద్ధి, సంక్షేమం అనే రెండుచక్రాల మీద పరిపాలన సాగుతున్నది. ప్రజలకు కనీస జీవన భద్రతను కల్పించేందుకు సంక్షేమరంగానికి బడ్జెట్‌లో సింహభాగాన్ని వెచ్చిస్తున్నాం. నిరుపేదలకు, నిస్సహాయులైన లక్షల మందికి ఆసరా పెన్షన్లను అందిస్తున్నాం. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు, బీడీకార్మికులతోపాటు ఇటీవలనే ఒంటరి మహిళలకు కూడా జీవనభృతిని కల్పిస్తున్నాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఇచ్చే మొత్తాన్ని రూ.75 వేలకు పెంచాం.

నిరుద్యోగ యువతకు శుభవార్త తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ఒక లక్ష మందికి నూతనంగా ఉద్యోగాలు లభిస్తాయని ఉద్యమ సమయంలో భావించాం. ఈ పవిత్ర స్వాతంత్య్ర దినోత్సవ వేళ తెలంగాణ నిరుద్యోగ యువతకు ఒక శుభవార్తను తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు చేపట్టిన 27,660 నియామకాలతోపాటు, మరో 84,876 ఉద్యోగాల నియామక ప్రక్రియను సత్వరమే చేపట్టబోతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. దీంతో తెలంగాణలో ఆశించినదాని కన్నా ఎక్కువగా 1,12,536 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తున్నది. వచ్చే సంవత్సరం ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి కూడా ఈ సంవత్సరమే ప్రక్రియ ప్రారంభించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నదని తెలియజేస్తున్నాను.

డిసెంబర్ నాటికే భగీరథ నీళ్లు రాష్ట్ర ప్రజల దాహార్తిని శాశ్వతంగా పరిష్కరించే అపురూపమైన మిషన్ భగీరథ పథకం లక్ష్యాన్ని ముద్దాడే దిశగా సాగుతున్నది. ఈ ఏడాది డిసెంబర్ నాటికే అన్ని గ్రామాలకు శుద్ధి చేసిన నదీజలాలు అందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గ్రామాలలో అంతర్గత పైప్‌లైన్లు, నీటిట్యాంకుల నిర్మాణం, ఇండ్లలో నల్లాల బిగింపు పనులు కొనసాగుతున్నాయి.

కేజీ టు పీజీ కింద కార్పొరేట్‌ను మించిన విద్య కేజీ టు పీజీ ఉచిత విద్యావిధానంలో భాగంగా పెద్దఎత్తున గురుకుల పాఠశాలలను నెలకొల్పుతున్నాం. గడిచిన 58 ఏండ్ల చరిత్రలో 259 రెసిడెన్షియల్ పాఠశాలలను అరకొర వసతులతో ఏర్పాటు చేస్తే, కేవలం మూడేండ్ల వ్యవధిలో కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నే వసతులతో 522 గురుకులాలను మనం ప్రారంభించుకున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలకు సరితూగే నాణ్యమైన విద్య , సమతుల పౌష్టిక విలువలు కలిగిన మంచి ఆహారం, దుస్తులు, పుస్తకాలు, ఆట వస్తువులు అందిస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తూ ఒక్కో విద్యార్థి మీద ప్రతి సంవత్సరం రూ.లక్షా 25వేలు వెచ్చిస్తున్నాం.

చిరుద్యోగులకు సముచిత వేతనాలు తక్కువ వేతనాలతో, అర్ధాకలితోఅలమటిస్తున్న చిరుద్యోగుల వేతనాలను ప్రభుత్వం సముచితంగా పెంచింది. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను శ్రమదోపిడీనుంచి విముక్తం చేయాలన్న ప్రభుత్వ ఉదాత్త ఆశయానికి కొన్ని ప్రతీపశక్తులు సంకుచితత్వంతో అడ్డు తగులుతున్నాయి. అయినా వెనుకడుగు వేయకుండా, పట్టుదలతో ఉద్యోగుల జీతభత్యాలను ప్రభుత్వం పెంచింది.

సర్కారు దవాఖానల్లో పెరిగిన ప్రసవాలు గర్భం దాల్చిన స్త్రీలు ఇల్లు గడువడం కోసం పనులకు పోవాల్సిరావటం బాధాకరం. ఈ పరిస్థితిని ప్రభుత్వం మానవతాదృక్పథంతో ఆలోచించి కేసీఆర్ కిట్ అనే మంచి పథకాన్ని ప్రవేశపెట్టింది. రెండున్నర నెలల్లోనే 42 వేలమంది ప్రయోజనం అందుకున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. పేదప్రజలకు వైద్యాన్ని అందించే ప్రభుత్వ దవాఖానల మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధపెట్టి సదుపాయాలను మెరుగుపరిచింది. ఇటీవల గాంధీ హాస్పిటల్‌ను సందర్శించిన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అక్కడ అమలవుతున్న పారిశుద్ధ్యం, మెరుగైన వైద్యం గురించి ప్రశంసించారు.

నేరాల సంఖ్య తగ్గింది పోలీస్ వ్యవస్థను పటిష్టపరుచడంతో శాంతిభద్రతలు ఎంతో మెరుగుపడ్డాయి. నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. పేకాట, గుడుంబా మహమ్మారులను దాదాపు తరిమికొట్టగలిగాం. మహిళలపై వేధింపులను అరికట్టడంలో షీ-టీమ్‌లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ప్రజల కోరిక మేరకు జిల్లాల్లో షీ-టీమ్‌ల సంఖ్యను పెంచుతున్నాం. మన రాష్ర్టాన్ని ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ర్టాల్లోకూడా షీ-టీమ్‌లు ఏర్పాటవుతున్నాయి. మాదకద్రవ్యాలవంటి సామాజిక రుగ్మతలను ఆదిలోనే అంతం చేసేందుకు ప్రభుత్వం రాజీలేని వైఖరిని అవలంబిస్తున్నది.

పాలనా సంస్కరణలతో సత్ఫలితాలు పరిపాలనా సౌలభ్యంకోసం ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేసింది. వీటితోపాటు 25 డివిజన్లను, 125 మండలాలను ఏర్పాటు చేసింది. ఈ భారీ సంస్కరణల వల్ల పరిపాలన సౌలభ్యం పెరిగింది. కొత్త జిల్లాలలో కలెక్టరేట్లు, పోలీస్ కార్యాలయాల నిర్మాణం జరుగుతున్నది. పేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించే డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం ఊపందుకొన్నది. తెలంగాణ నేలను పచ్చదనంతో నింపాలనే ఆశయంతో చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ప్రజలందరి భాగస్వామ్యంతో విజయవంతమవుతున్నది.

కరెంటు దుఃఖం నుంచి రైతుకు విముక్తి విద్యుత్‌రంగంలో తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన అభివృద్ధిని సాధించింది. ఒక్క నిమిషం కూడా కోత విధించకుండా, నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నది. వ్యవసాయరంగానికి 9 గంటలు పగటిపూట నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నది. వచ్చే యాసంగి నుంచి రాష్ట్రంలోని రైతులందరికీ 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించడానికి కృషి జరుగుతున్నది. దశాబ్దాల తరబడి కరెంటుకోసం తెలంగాణ రైతులు అనుభవించిన దుస్థితి నుంచి, దుఃఖంనుంచి ప్రభుత్వం విముక్తి కలిగించింది. ఈ పరిణామం తెలంగాణ రైతాంగంలో నూతనోత్సాహాన్ని, ఆశావహ దృక్పథాన్ని కలిగించింది. నిరంతర విద్యుత్ సరఫరాతో పారిశ్రామిక ఉత్పత్తి పెరిగింది. పరిశ్రమలు మూడు షిప్టులు నడువడంవల్ల కార్మికులకు ఎక్కువ పని దొరుకుతున్నది.

గ్రామీణ మానవ వనరులను గుర్తించాం గ్రామీణ ప్రాంతాల్లో తరతరాలుగా సంక్రమించిన నైపుణ్యంతో సేవలందించే కులవృత్తిదారులు మన రాష్ర్టానికి లభించిన అపార మానవ సంపదగా తెలంగాణ పభుత్వం గుర్తిస్తున్నది. నగరాల్లో, పరిశ్రమల్లో, కంప్యూటర్ల ముందు పనిచేసేవారు మాత్రమే మానవ వనరులనే అసమగ్రవైఖరి వల్ల సమాజాన్ని అర్థం చేసుకోవడంలో గత పాలకులు వైఫల్యం చెందారు. ఇందుకు భిన్నంగా గ్రామీణ మానవ వనరులను గుర్తించడంలో సరికొత్త విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్నది. గొర్రెల పెంపకంలో గొప్ప ప్రావీణ్యం కలిగిన గొల్ల, కురుమలకు గొర్రెలు పంపిణీచేయడం ద్వారా రాష్ట్రంలో పెద్దఎత్తున గొర్రెలు పెంచే పథకాన్ని చేపట్టాం. ఇందుకోసం రూ.5 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. 4 లక్షల దరఖాస్తులు వస్తాయని వేసిన అంచనాకు మించి 7 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే 12 లక్షల గొర్రెలను 57 వేల కుటుంబాలకు అందించాం. రాబోయే రోజులో ్లమాంసం ఎగుమతి చేసేస్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకుంటుంది. ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా నీటి వనరులన్నింటిలోనూ చేపల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. చేపల పెంపకాన్ని ఒక పరిశ్రమ స్థాయికి చేర్చేందుకు సమగ్ర చర్యలను తీసుకుంటున్నది. చేనేతలను, పవర్‌లూంలను ఆదుకునేందుకు సమగ్ర చేనేత విధానాన్ని రూపొందించి అమలుచేస్తున్నాం. నూలుతో పాటు అద్దకానికి అవసరమైన రసాయనాలను 50 శాతం సబ్సిడీతోఅందిస్తున్నాం. చేనేత కార్మికులు నేసిన వస్ర్తాలను ప్రభుత్వమే కొంటున్నది. పవర్‌లూమ్ కార్మికులకు ప్రతినెల రూ.15 వేలకు తగ్గకుండా వేతనం ఇచ్చేవిధంగా యాజమాన్యాలను ఒప్పించాం. అన్ని ప్రభుత్వ శాఖల వస్ర్తాల కొనుగోలు ఆర్డర్లను చేనేత, మరమగ్గాల సొసైటీలకే ఇవ్వాలని నిర్ణయించాం.

సాగునీటితో గ్రామ స్వరాజ్య సాధన పల్లె సీమలే దేశానికి పట్టుగొమ్మలని మహాత్మాగాంధీ అనేకసార్లు చెప్పారు. గ్రామ స్వరాజ్య భావనను ప్రతిపాదించారు. స్వావలంబనతో, స్వయంసమృద్ధితో విలసిల్లిన తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన వివక్ష, విద్రోహ పూరితవిధానాలతో పూర్తిగా ఛిన్నాభిన్నమైంది. శ్రమించే తత్వం, వృత్తినైపుణ్యం కలిగిన తెలంగాణ ప్రజానీకం అన్నమో రామచంద్రా అంటూ దూరదేశాలకు వలసపోవాల్సిన దుర్గతి వచ్చింది. కూలిన బతుకులను నిలబెట్టేందుకు, గ్రామీణార్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం కట్టింది. తెలంగాణకు జీవనరేఖలుగా ఉన్న గొలుసుకటు ్టచెరువులను పునరుద్ధరించేందుకు మిషన్ కాకతీయ పథకాన్ని అమలుచేస్తున్నాం. 46,500 చెరువుల్లో ఇప్పటికే 20 వేల చెరువులను పునరుద్ధరించాం. చెరువుల్లో నీటినిల్వ పెరుగడం, విద్యుత్ సరఫరా మెరుగుకావడంతో ఈ సంవత్సరం చరిత్రలో ఎన్నడూ లేనంతగా దాదాపు 96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతాంగం నూతన చరిత్రను లిఖించింది. ప్రభుత్వం తగిన సహకారం అందిస్తే తెలంగాణ రైతులు మట్టిలో బంగారం పండిస్తారనడానికి ఇది తిరుగులేని సాక్ష్యం.

శ్రీరాంసాగర్‌కు పునర్జీవం ఇటీవలే ప్రభుత్వం శ్రీరాంసాగర్ పునర్జీవ పథకానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఒత్తిడి వల్ల గోదావరి మీద నిర్మించిన ఈ ఏకైక ప్రాజెక్టుపై దశాబ్దాల పాటు కొనసాగిన నిర్లక్ష్యం, వివక్ష వల్ల సాగర్ కాలువలు శిథిలమైనాయి. చివరికి ప్రాజెక్ట్ ఉండీ లేనట్టయింది. శ్రీరాంసాగర్ ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కాళేశ్వరం నుంచి గోదావరిని వరదకాలువ ద్వారా తెచ్చి శ్రీరాంసాగర్‌కు పూర్వవైభవం కల్పిస్తున్నాం. అతి తక్కువ సమయంలో, అతి తక్కువ ముంపుతో, అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఈ పథకం సర్వత్రా ప్రజల అభినందనలను, హర్షామోదాలను పొందుతున్నది. నదీజలాల్లో మన రాష్ట్రవాటాను పూర్తిగా వినియోగించుకునేందుకు కాళేశ్వరం, పాలమూరు, సీతారామ వంటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది.

సమగ్ర వ్యవసాయ సంస్కరణలు ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ సంస్కరణలను అమలుచేస్తున్నది. తెలంగాణ ఏర్పడిన వెంటనే రూ.17వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది. గతంలో విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించకపోవడం వల్ల రైతులు ఎన్నో బాధలు పడ్డారు. మా ప్రభుత్వం కొరత లేకుండా సకాలంలో ఎరువులు, విత్తనాలను అందిస్తున్నది. కల్తీ విత్తనాలతో నష్టపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. పంట నిల్వ చేసుకునేందుకు 4లక్షల టన్నుల గోదాముల సామర్థ్యాన్ని 22.5 లక్షల టన్నులకు పెంచింది.

సమగ్ర భూసర్వేతో కొత్త చరిత్ర సమగ్ర భూసర్వేతో తెలంగాణ రాష్ట్రం కొత్త చరిత్రను సృష్టించబోతున్నది. 1936లో నిజాం కాలంలో మాత్రమే భూసర్వే జరిగింది. మళ్లీ 81 సంవత్సరాల తర్వాత ఇన్నాళ్లకు తెలంగాణ ప్రభుత్వం భూసర్వేను నిర్వహిస్తున్నది. రాబోయే కొద్ది నెలల సమయంలో మొదలయ్యే ఈ భూ-సర్వే విజయవంతం కావడానికి రాష్ట్రంలోని రైతులే సారథ్యం వహించాలి. ఇది ఎవరి పనిగానో భావించి ప్రేక్షకపాత్ర వహించకుండా స్వచ్ఛందంగా ముందుకువచ్చి రైతు సంఘాలు సర్వేను విజయవంతం చేయాలని పవిత్ర స్వాతంత్య్ర దినోత్సవ శుభసందర్భాన పిలుపునిస్తున్నాను. సర్వే పూర్తయిన వెంటనే భూరికార్డులన్నీ పూర్తిగా సరిచేసి, కొత్త పాసుపుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇకపై భూసమస్యల పరిష్కారంకోసం రైతులు నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుటూ ్టతిరగాల్సిన దుస్థితి తప్పుతుంది.

బతుకమ్మ పండుగ నుంచి చీరల పథకం వచ్చే బతుకమ్మపండుగ నుంచి రాష్ట్రవ్యాప్తంగా తెల్లరేషన్ కార్డు కలిగిన 93 లక్షల మంది మహిళలకు పండుగ కానుకగా చీరలను అందించే పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా పండుగ సందర్భంగా కులమతాలకు అతీతంగా పేదలందరికీ పండుగ బట్టలను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఈ పథకంకోసం చేనేత, పవర్‌లూమ్‌ల ద్వారా ఉత్పత్తి అయిన చీరలనే కొనుగోలు చేస్తున్నాం. తద్వారా చేనేత, పవర్‌లూమ్‌ల ఉపాధికి పూర్తి హామీ ఏర్పడుతుంది. సిరిసిల్లలో అప్పరెల్ పార్క్ నిర్మాణాలకు కొద్దిరోజుల్లో శ్రీకారం చుట్టబోతున్నాం.

వృత్తిదారులకు చేయూత గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యప్రదమైన నవీన క్షౌరశాలలను ఏర్పాటు చేసుకునేందుకు నాయీబ్రాహ్మణులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. రజక సోదరులు బట్టలు పరిశుభ్రం చేసేందుకు అధునాతన యంత్రాలను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికీ స్థిరజీవనంలేని సంచార కులాలు, భిక్షాటన వృత్తిగా కలిగిన కులాలు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో రూ.వెయ్యికోట్ల బడ్జెట్‌తో అత్యంత వెనుకబడినవర్గాల (ఎంబీసీ) కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం పథకాల రూపకల్పన జరుగుతున్నది. విశ్వకర్మలుగా పిలువబడే అవుసుల, కమ్మరి, కంచరి, వడ్రంగి, శిల్పకారులకు, బట్టలు కుట్టి జీవించే మేర కులస్థులకు, కల్లుగీతతో జీవించే గౌడ కులస్థులకు, కుమ్మరిపని తదితర కులవృత్తుల వారందరికీ అవసరమైన ఆర్థిక సహకారం, పరికరాల పంపిణీ చేయడానికి నిర్దిష్ట పథకాలను పభుత్వం రూపొందిస్తున్నది.

లక్ష కోట్ల పెట్టుబడులు సాధించాం నేడు రాష్ట్రం సులభతర వాణిజ్యవిధానంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. టీఎస్ ఐపాస్ ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించగలిగింది. అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు కార్యాలయాలను ఏర్పాటుచేస్తున్నాయి. ఇప్పటివరకు రూ.1,01,720 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 4,118 నూతన పరిశ్రమలు అనుమతులు పొందాయి. 2 లక్షల 90 వేలమందికి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు తెలంగాణ వేదిక కావడం మనందరికీ గర్వకారణం. నవంబర్ 28 నుంచి 30వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరిగే ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, అమెరికా ప్రభుత్వ సలహాదారు ఇవాంకా ట్రంప్ హాజరవుతున్నారు. ఈ సదస్సును విజయవంతం చేసి తెలంగాణ కీర్తిని దశదిశలా వ్యాపింపచేయడానికి ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లను చేస్తున్నది.

మా దీక్షను భంగపరుచలేరు తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి, ప్రజాహిత కార్యాక్రమాలకు తీవ్ర విఘాతం కలిగించాలని ప్రతీపశక్తులు ఎన్ని కుట్రలు చేస్తున్నా.. ప్రజల ఆశీర్వాదబలంతో వాటన్నింటినీ ఛేదిస్తూ ముందడుగు వేయగలుగుతున్నాం. తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధికోసం నిరంతరం పాటుపడే మా ఏకాగ్రతను, మా దృష్టిని కుటిల ప్రయత్నాలతో మరల్చలేరని మరోసారి స్పష్టం చేస్తున్నాను. శ్రామికజనుల సౌభాగ్యం కోసం, సకలజనుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతుందని తెలియజేస్తున్నాను. ప్రజల అండదండలే మాకు తిరుగులేని ఆత్మబలాన్ని అందిస్తున్నాయి. మాలో అంకితభావాన్ని పెంపొందిస్తున్నాయి.అట్టడుగువర్గాలదాకా అభివృద్ధి ఫలాలను అందించే దిశగా బంగారు తెలంగాణను సాకారం చేసే మా ప్రయత్నంలో కలిసివస్తున్నవారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

రైతులు చేయిచాపే స్థితి ఉండవద్దు రైతు కష్టాలను తీర్చేందుకు వచ్చే సంవత్సరం నుంచి ఆదర్శవంతమైన పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతున్నది. పంటవేసే సమయంలో పెట్టుబడి కోసం రైతులు అప్పులకు చేయిచాచే పరిస్థితి ఇక ఉండొద్దని ప్రభుత్వం నిశ్చయించింది. అప్పు చేసి పంటవేస్తే ప్రకృతి అనుకూలించక పంటనష్టం జరిగి అటు రుణభారం, ఇటు పంటనష్టం రెండూ కలిపి రైతును ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించి రైతాంగాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వమే పంటకు అవసరమైన పెట్టుబడిని అందించాలని నిర్ణయించింది. సంవత్సరంలో రెండుపంటల కోసం ఎకరానికి 8వేల చొప్పున రాష్ట్రంలోని ప్రతి రైతుకు వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వమే పెట్టుబడిని సమకూరుస్తుంది. రైతులకు పెట్టుబడి పథకం యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. రైతులను సంఘటితపరచి వారి ప్రయోజనాలు వారే రక్షించుకునే విధంగా రైతు సంఘాలను, సమాఖ్యలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. పంటకు డిమాండ్ రావడం కోసం రాష్ర్టాన్ని పంటల కాలనీలుగా విభజిస్తున్నది. దీనివల్ల రైతులంతా ఒకే పంటవేసి నష్టపోయే పరిస్థితి ఉత్పన్నం కాదు. మార్కెటింగ్ సమస్య తలెత్తదు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయనటువంటి ఈ గొప్ప ప్రణాళికలో రైతులు నిబద్ధతతో భాగస్వాములు కావాలి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.