Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఉద్యోగాల భర్తీపై ఆందోళన వద్దు

-1.12 లక్షల పోస్టులు ఏడాదిలోగా పూర్తిచేస్తాం -ప్రభుత్వరంగంతో పాటు ప్రైవేటు రంగంలోనూ భారీగా ఉద్యోగాల కల్పన -సిటీ సెంట్రల్ లైబ్రరీ అభివృద్ధికి రూ.ఐదు కోట్లు -డిజిటల్ లైబ్రరీ, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు -మోడల్ మార్కెట్లు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం -రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ హామీ హైదరాబాద్‌లో సుడిగాలి పర్యటన

ఏడాదిలోగా 1.12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు. 1.12 లక్షల ఉద్యోగాలు భర్తీచేసినప్పటికీ అవసరాలు తీరవని, ప్రైవేటు ఉద్యోగాలు సైతం భారీగా వచ్చేలా కొత్త పరిశ్రమలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే విద్యార్థుల సౌకర్యార్థం సిటీ సెంట్రల్ లైబ్రరీని సమగ్రంగా అభివృద్ధిచేస్తామని ప్రకటించారు. స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తిమేరకు మంగళవారం మంత్రి కేటీఆర్ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని సనత్‌నగర్, అంబర్‌పేట్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లోని పలుప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. అశోక్‌నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద విద్యార్థులు, యువతను ఉద్దేశించి ప్రసంగించారు.

గతంలో ఏపీపీఎస్సీలో జరిగిన అనేక అవకతవకలను దృష్టిలో పెట్టుకొని, అలాంటి అక్రమాలకు తావులేకుండా చూసే ఉద్దేశంతో దళితబిడ్డ, మేధావి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నేతృత్వంలోని టీఎస్‌పీఎస్సీకి ఉద్యోగాల భర్తీ బాధ్యత అప్పగించినట్టు పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్ వంటి మారుమూల గిరిజన ప్రాంతాల్లో స్థానికులకు కూడా ఉద్యోగాలు దక్కాలనే మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 31 జిల్లాలవారీగా ఉద్యోగాలను భర్తీచేయాలని నిర్ణయిస్తే, కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి అడ్డుకొన్నారని విమర్శించారు. ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌లో కోర్టు కేసుల వల్ల జాప్యం జరుగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధులవుతున్నవారికి సిటీ సెంట్రల్ లైబ్రరీలో మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు చెప్పారు. గ్రంథాలయంలో టాయిలెట్లు, ఆడిటోరియం నిర్మాణంసహా ఇతర సౌకర్యాలు సమకూర్చేందుకు రూ.ఐదు కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ నిధులను ఎలా వెచ్చించాలో గ్రంథాలయ పాలకమండలి నిర్ణయిస్తుందని, తానే వచ్చి ఆయా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తానని పేర్కొన్నారు.

ఆ రోజు తనతోపాటు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి కూడా వస్తారని, ఉద్యోగాల భర్తీపై అన్ని విషయాలూ ఆయనే స్వయంగా వివరిస్తారని, ఉద్యోగాల క్యాలెండర్ ఇయర్‌ను ప్రకటిస్తామని వెల్లడించారు. గ్రంథాలయంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. అత్యాధునిక డిజిటల్ లైబ్రరీని కూడా ఏర్పాటుచేస్తామని చెప్పారు. రూ.ఐదు కోట్లు సరిపోకపోతే మరిన్ని నిధులు కేటాయిస్తామని స్పష్టంచేశారు. అందరమూ కలిసి పోరాడి సాధించుకున్న రాష్ట్రమని, ఇది అందరమూ కలిసి తెచ్చుకున్న ప్రభుత్వం అని పేర్కొంటూ అంతా కలిసి అభివృద్ధిచేసుకొందామని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అంతకుముందు మంత్రి బన్సీలాల్‌పేట్‌లో కొత్తగా అత్యాధునిక హంగులతో నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్‌హాలును సందర్శించి, అందులోని సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. ఇటువంటి హాళ్లు నగరంలో మరిన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

గ్రేటర్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో కనీసం రెండు చొప్పున మల్టీపర్పస్ ఫంక్షన్‌హాళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే రూ.30.32 కోట్లతో 16 ప్రాంతాల్లో ఫంక్షన్‌హాళ్ల నిర్మాణం చేపట్టినట్టు వెల్లడించారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద గల భీమామైదానంబస్తీని సందర్శించి అక్కడ స్టిల్ట్ ప్లస్ రెండు అంతస్తులతో కమ్యూనిటీహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కింద పార్కింగ్ సౌకర్యం, మొదటి అంతస్తులో వంటలు, భోజనాలు, పై అంతస్తులో ఫంక్షన్లు నిర్వహించుకొనేలా భవనాన్ని డిజైన్‌చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం చిక్కడపల్లి మార్కెట్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్ అక్కడ శిథిలావస్థలో ఉన్న దుకాణాల స్థానంలో అత్యాధునికంగా జీ ప్లస్ 5 అంతస్తులతో మార్కెట్‌ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల వ్యర్థాల కారణంగా హుస్సేన్‌సాగర్ పరిసర బస్తీవాసులు ఇబ్బంది పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే చెప్పటంతో వ్యర్థాలు నాలాలో కలువకుండా నేరుగా మూసీకి వెళ్లేలా పైప్‌లైన్ ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. నాలాకు ఇరువైపులా రీటెయినింగ్ వాల్స్ నిర్మించాలని సూచించారు. దోమలగూడ పాత మున్సిపల్ కాంప్లెక్స్ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ ఐదు అంతస్తులతో అత్యాధునిక సర్కిల్ కార్యాలయాన్ని నిర్మించనున్నట్టు ప్రకటించారు. ప్రతిపాదనలు సిద్ధమైతే నిధులు మంజూరుచేసి పదిరోజుల్లో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. నెహ్రూనగర్‌లో మోడ్రన్ కమ్యూనిటీహాలును నిర్మించనున్నట్టు ప్రకటించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.