Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఉజ్వల భారత్ నిర్మిద్దాం

-పదహారు ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించండి
-ఈ దేశ రాజకీయ గమనాన్ని మార్చివేస్తా
-ఓటు వేసేముందు ఆగంకావొద్దు.. ఆలోచించండి: సీఎం కేసీఆర్
-దేశంలో అద్భుతమైన సంపద.. వనరులు ఉన్నయి
-వాటిని వాడే తెలివిలేని దద్దమ్మల పాలనలో దేశం
-ఈ సన్నాసుల పాలనవల్ల దేశం దెబ్బతింటున్నది
-దేశంలో గుణాత్మకమైన రాజకీయ మార్పురావాలి
-ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలదే ఢిల్లీ పీఠం
-తెలంగాణలో అనేక విషయాల్లో గుణాత్మక మార్పు
-కాళేశ్వరంతో 200 కిలోమీటర్ల సజీవ గోదావరి
-బొగ్గుగని కార్మికుల ఇన్‌కం ట్యాక్స్‌తోటే కేంద్రం నడుస్తదా?
-వారికి ఆదాయం పన్ను మాఫీ చేయమంటే మోదీ చేయలే
-సింగరేణి కార్మికులను పట్టించుకున్నది మేమే
-రెవెన్యూ ఉద్యోగుల విషయంలో నాపై దుష్ప్రచారం
-మా ప్రభుత్వం ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదు
-పెద్దపల్లి నియోజకవర్గ ఎన్నికల ప్రచారసభలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

దేశంలో అద్భుతమైన సంపద ఉన్నదని, భగవంతుడు ఇచ్చిన వనరులున్నాయని, కానీ వాటిని వాడే తెలివిలేని దద్దమ్మలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నందువల్లే పరిస్థితి ఇలా ఉన్నదని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. దేశంలో సాగు, తాగునీటి కష్టాలున్నది నీళ్లులేక కాదని, వాటిని వాడుకోలేని చేతకానితనంవల్లేనన్నారు. వీటిపై చర్చిద్దామంటే కాంగ్రెస్, బీజేపీ ముందుకు రావటం లేదని విమర్శించారు. దేశం అన్నిరంగాల్లో ముందుకుపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సీఎం చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్నది భారతదేశంలోనేనని పేర్కొన్నారు. అవకాశాలు లేక కాదు.. పనిచేసే మనుషులు లేకకాదు, యువశక్తి లేకకాదు.. ఖనిజ సంపద లేకకాదు, నీళ్లు లేకకాదు. అన్నీ ఉండి ఈ సన్నాసుల పరిపాలనవల్ల దేశం దెబ్బతింటున్నది అని నిప్పులు చెరిగారు. అందుకే ఈ దేశంలో ప్రబలమైన గుణాత్మకమైన రాజకీయ మార్పురావాలన్నారు. రాబోయే ఎన్నికల తర్వాత దేశాన్ని ప్రాంతీయ పార్టీలే పరిపాలించబోతున్నాయని స్పష్టంచేసిన సీఎం.. రాష్ట్రంలో పదహారు ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే దేశ రాజకీయ గమనాన్ని మార్చివేస్తానని చెప్పారు. ఉజ్వల భారతదేశాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల ప్రచారసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికల్లో చాలామంది చాలా మాటలు చెప్తారని, కానీ ప్రజలు ఆగమాగం కావద్దని చెప్పారు. అందరు చెప్పేవన్నీ శాంతంగా విని, వాస్తవాలు ఏమిటో ఆలోచన చేయాలని, చర్చ పెట్టాలని సూచించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడకముందు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవో, ఇప్పుడెలా ఉన్నాయో గమనించాలని కోరారు. వ్యవసాయం, పెన్షన్లు, కరంటు, ఇలా అనేక విషయాల్లో తెలంగాణలో గుణాత్మక మార్పు కనిపిస్తున్నదని చెప్పారు. ఒకనాడు 24 లక్షల మోటర్లు తెలంగాణలో ఉంటే.. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ధర్నాలు, లాఠీచార్జీలు ఉండేవని, కరంటు కోతలు.. పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, కాలిపోయే మోటర్లు ఉండేవని గుర్తుచేశారు. కొద్ది టైం లోపలనే అన్నీ బాగుచేసుకున్నామని చెప్పారు. దేశంలో 29 రాష్ర్టాల్లో రైతులకు 24 గంటలపాటు ఉచిత కరంటు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. మరి, ఇంతకుముందు ప్రభుత్వాలు లేకుండెనా? కేసీఆర్ కంటే ముందు సీఎంలు లేకుండెనా? నాకన్న ఎత్తుగ, దొడ్డుగ ఉండిరి. మరి వాళ్లు ఎందుకు కరంటు ఇయ్యలేకపోయిండ్రు? కారణం ఏందంటే వాళ్లకు మనసు లేదు అని సీఎం వివరించారు. ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

తెలివిలేని దద్దమ్మలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నరు దేశంలో అద్భుతమైన సంపద ఉన్నది. భగవంతుడు ఇచ్చిన వనరులున్నయి. వాటిని వాడే తెలివిలేని దద్దమ్మలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నరు. నేను ఒక జిమ్మేదారీ మనిషిగా, దేశంలో ముఖ్యమంత్రిగా, అవగాహన ఉన్న వ్యక్తిగా, అర్థం చేసుకున్న వ్యక్తిగా మాట్లాడుతున్న. రెండు ప్రశ్నలు అడిగితే రాహుల్‌గాంధీగానీ, నరేంద్రమోదీగానీ ఎవడూ సమాధానం చెప్పడు. ఏం? బీమారా? సమాధానం తెల్వదా? అమాయకులా? దేశంలో నీళ్లులేక సాగు, తాగునీళ్లకు కటకట ఉన్నదా? నీళ్లు ఉండికూడా మీ చేతకానితనంవల్ల ఉన్నదా? కమాన్ డిస్కస్ అంటే వాళ్లు మాట్లాడరు. మూడున్నర లక్షల మెగావాట్ల కరంటు దేశంలో అందుబాటులో ఉంటే మనం ఎంత వాడుతున్నం? ఎందుకు వాడుతలేం? మీరు అవలంబించే తప్పుడు పవర్‌పాలసీలు కాదా? దీనికి సమాధానం చెప్పరు. కేసీఆర్ జాతకం చూసుకుంటడు.. సంకల గోక్కుంటడు.. గిదా దేశ ప్రధాని మాట్లాడేది? ఎవడు యాడగోక్కుంటేంది.. ఎవడు యాడ పంటేంది.. యాడ తింటేంది? ఇవేనా ప్రధానమంత్రులు, దేశాన్ని నడిపిస్తమనే సిపాయిలు మాట్లాడేది? దేశాన్ని నడిపేటోళ్లు ఏం మాట్లాడాలి? దేశంలో పేదరికం ఏంది? వ్యవసాయం ఏంది? రైతులేంది? కార్మికులేంది? వాళ్ల బాధలేంది? అవి ఎట్లా పరిష్కారం చెయ్యాలి? వీటిమీద మెదడు రంగరించాలె. కానీ.. నువ్వెంత.. నేనెంత.. బస్తీమే సవాల్.. అని వ్యక్తిగత నిందారోపణలు చేసుకుంటున్నరు.

రాహుల్, మోదీ కొట్లాట వెనుక కిటుకు
ఇవాళ రాహుల్‌గాంధీ, నరేంద్రమోదీ మాట్లాడేవి మీరు వింటా ఉన్నరు. వాళ్ల నోళ్లకు మొక్కాలి. వాళ్లిద్దరు ఒకరి మీద ఒకరు చెప్పుకొనుడు.. నువ్వు ఆ చోర్ అంటే.. నువ్వు ఈ చోర్ అని కొట్లాడతా ఉన్నరు. దాని వెనుక ఒక కిటుకు ఉన్నది. మనం ఆగం కావాలని! దయచేసి మీరు శాంతంగా ఆలోచించాలి. ఇన్నేండ్లు దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్, బీజేపీలే కదా! మరి దేశాన్ని ఎవడో పాలించినట్టు, దానికి జిమ్మేదారీ వేరేవాడన్నట్టు.. వీళ్లు వీళ్లే తూ కిత్తా.. మై కిత్తా అనుకోవాలి.. మనం బఫూన్‌గాళ్లలాగా ఇద్దర్ల ఎవరికో ఒకరికి ఓటు గుద్దాలి. మళ్లా ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి, ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి.. ఎవడో ఒకడు అధికారంలోకి రావాలి. అంతేనా? మోదీని దించుతం.. రాహుల్‌ను ఎక్కిస్తాం. దేశానికి ఏం వస్తది? ఏం మార్తది? దీన్‌దయాళ్, శ్యాంప్రసాద్‌ముఖర్జీ పేర్లుపోయి.. మళ్లా ఈ గాంధీ.. ఆ గాంధీ అని వస్తయి. అంతకుమించి ప్రజలకు ఏం రాదు. ఇంతకన్న ప్రజలకు ఏమన్నా వస్తే చూపించాలి.

పంచాయితీ ఎందుకని నేను అనుకుంటే తెలంగాణ రాకపోవు
నా భరతం పడతా అని ఒకడు.. నీ కథ గురించి విప్పుతా అని ఒకడు! బెదిరించుడు. బ్లాక్‌మెయిల్ చేసుడు. నేనెందుకు వీళ్లతోటి పంచాయితీ పెట్టుకోవాలి? కానీ పంచాయితీ పెట్టుకోవాలి. ఆనాడు 2001ల నేను కూడా ఎందుకు ఈ పంచాయితీ అనుకుంటే.. తెలంగాణ రాష్ట్రం రాకపోవు. ఎవడో ఒకడు నోరు తెరవాలి కాబట్టి నేను తెరిచిన. గులాబీ జెండా ఎగరేసిన. మీరంతా జమైండ్రు. గుద్దుడు గుద్దితే తెలంగాణ వచ్చింది. అట్లనే దేశం కూడా మారాలి.. మారాలి.. మారాలి. అందుకే ఈ దేశంలో ప్రబలమైన గుణాత్మకమైన రాజకీయ మార్పురావాలి. ఇవాళ గోదావరిఖని ప్రాంతం.. పెద్దపల్లి నియోజకవర్గం రాజకీయంగా చాలా చైతన్యవంతమైన ప్రాంతం. మీరు అన్ని విషయాలు గమనించగల్గుతారు. నేను నిన్నమొన్న మాట్లాడింది కూడా పేపర్ల చదివిండ్రు. టీవీలల్ల చూసిండ్రు. నేనేదో ఊరికే మాట్లాడతలేను. మొన్న అసెంబ్లీ ఎన్నికలల్ల మీరు ఆశీర్వదించి మంచి మెజార్టీ ఇచ్చిండ్రు. వచ్చే ఐదేండ్ల దాకా అధికారంలో ఉండే అవకాశం ఇచ్చిండ్రు. నేను కూడా ఇప్పుడు తియ్యగ, పుల్లగ రెండు ముచ్చట్లు చెప్పొచ్చు. కానీ చెప్పను. గోదావరిఖని.. పెద్దసంఖ్యలో కార్మికులు, కార్మికసంఘాల నాయకులు, అనేక సంఘాలు ఉన్న ప్రాంతం. దేశంలో గుణాత్మక మార్పు రావాలన్న ఆలోచన మీరు చెయ్యాలి.

దేశంలో తెలంగాణ ఒక్కటే
దేశంలో అవసరానికి మించిన కరంటు ఉన్నా.. దానిలో సగం కూడా వాడే తెలివిలేదు. సగం దేశం చీకట్లో ఉంటది. ఉత్తర భారతదేశానికి పోతే రోజూ కరంటు కోతలు. రైతులకు కోతలు పెడతరు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ రైతులకు 24 గంటల కరంటు ఇయ్యరు. దేశంలో రైతులకు 24 గంటల కరంటు ఇస్తున్నది తెలంగాణ ఒక్కటే. దానికి కారణాలున్నయి. ప్రేమతోటి మనం ఇచ్చుకుంటున్నం.

ఈ రెండు పార్టీలపై జనం విముఖత
ఉన్న వనరులు, వసతులు అవసరాలకు వాడలేనివాళ్లు, విఫలమైనవాళ్లు.. మళ్ల వాళ్లకువాళ్లే పరస్పరం నిందారోపణలు చేస్కోని మనల్ని గోల్‌మాల్ తిప్పితే.. మనం గోల్ తిరుగుదామా? అవసరంలేదు. ప్రజలు విముఖం చెందినరు. వీళ్ల సభలకు మంది వస్తలేరు. ఇష్టం లేకపోతే సభలకు వస్తరా? కాళ్లు మొక్కినారారు. దండం పెట్టినారారు. మనం చూడలేదా.. చూస్తలేమా? ఇయ్యాల రాహుల్‌గాంధీ సభలు మూడు, నాలుగు జరిగితే జనం 3-4 వేలకు మించిలేరు. నరేంద్రమోదీ వచ్చినరు.. కానీ స్టేడియంలో మంది లేరు. ఎందుకు వస్తలేరు? అది కూడా వీళ్లు గమనించరు. ప్రజలు విముఖత చెందినారనే మాట గమనిస్తలేరు. దయచేసి ఒక మాయలోకి, మోసంలోకి పోకండి.

సింగరేణి కార్మికులను పట్టించుకున్నది మేమే
సింగరేణి కార్మికులకు గతంలో ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమాలు చేసినం. డిపెండెంట్ ఉద్యోగమో.. ఏదో ఒక పేరు పెట్టి 6742 మందికి ఉద్యోగాలిచ్చినం. మిగిలినవారికి కూడా ఇప్పించే బాధ్యత నాది. మీరు చిన్నబుచ్చుకునే అవసరం లేదు. కచ్చితంగా మీ కోరిక నెరవేరుస్తం. ఎవరైతే ఉద్యోగం వద్దంటున్నరో వారికి రూ.25 లక్షలు ఇస్తున్నం. చనిపోతే రూ.20 లక్షలు ఇస్తున్నం. ఇదే కొప్పుల ఈశ్వర్ నా సోదరుడు.. జైలుకుపోయిన విషయం మీ అందరికీ తెలుసు. ఆనాడు లక్ష, రెండు లక్షల రూపాయలు ఇయ్యిమంటే ఇయ్యలే. లాఠీచార్జి చేసినరు. కొప్పుల ఈశ్వర్‌లాంటి కార్మిక నాయకుడిని తీస్కపోయి నెల రోజులు జైల్ల పెట్టినరు. అవన్నీ చూసినందునే ఇయ్యాల ఆ బాధలు ఉండొద్దని ప్రయత్నాలు చేస్తున్నం. మీ ఇండ్లకు ఉచిత కరంటు ఇప్పించినం. ఏసీ ప్రొవిజన్ పెట్టించినం. ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షల వడ్డీలేని రుణం ఇప్పించినం. ఇవన్నీ కేసీఆర్ ఇప్పించిండని మీ అందరికీ తెలుసు. ఇంకా సమస్యలున్నయి. వాటిని తప్పకుండా పరిష్కారం చేస్త.

దేశానికే దిక్సూచిగా తెలంగాణ
మంచిర్యాల, చెన్నూరు, ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాలకు తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ పూర్తిచేసి రెండులక్షల ఎకరాలకు నీళ్లు పారిస్తం. సస్యశ్యామలమైన తెలంగాణ.. కార్మికులు, రైతులు, అన్ని మతాలు, కులాల ప్రజలు సంతోషంగా ఉండే తెలంగాణ కోసం నేను కష్టపడుతున్న సంగతి మీ కండ్లముందున్నది. టీఆర్‌ఎస్ రాకముందు తెలంగాణ ఎట్ల ఉందో.. వచ్చిన తర్వాత తెలంగాణ ఎట్ల ఉన్నదో మీకు తెలుసు. దయచేసి ఆలోచన చేయండి.. చర్చ చేయండి. ఈ దేశాన్ని బాగుచేయడం కోసం తెలంగాణ ప్రజల ప్రతినిధిగా ఏదైతే ఎజెండా ఎత్తుకున్నమో.. మీ బిడ్డగా ఈ దేశానికే ఒక దిక్సూచిగా ముందుకుపోతున్న విషయాన్ని మీరు గమనిస్తున్నరు. మీరందరూ సహకరించాలి. ఎక్కడిదీ తెలంగాణ? ఎట్లాంటి తెలంగాణ? అని పదేపదే అవమానపరిచినా.. తెలంగాణ ఇయ్యాల అనేక విషయాల్లో రోల్‌మోడల్‌గా మారింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్‌రూం ఇండ్లు, మన 24 గంటల కరంటు, మనమిచ్చే సంక్షేమం, మనమిచ్చే కేసీఆర్ కిట్లు ఏ రాష్ట్రంలో లేవు. మీరు పేపర్లల్ల చూస్తున్నరు. అనేక రాష్ర్టాలవాళ్లు వచ్చి చూసి నేర్చుకొని పోతున్నరు. విదేశాలవాళ్లు వచ్చి ప్రశంసిస్తున్నరు. ఇంకా పెరుగాలి. దీనికే మనకు సంతృప్తి కాదు.

ఇక 200 కిలోమీటర్ల సజీవ గోదావరి
గతంలో మంచిర్యాల జిల్లా చేయమంటే చేయలేదు. చాలా ఏండ్లు ఏడ్చిండ్రు. ఇయ్యాల మంచిర్యాల, పెద్దపల్లి.. రెండు జిల్లాలు చేసుకున్నం. ఈ జిల్లాలోనే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నం. మేడిగడ్డ బరాజ్ ఇక్కడే కడుతున్నం. ఎంపీ కేశవరావు, ఖమ్మం ఎంపీ శ్రీనివాస్‌రెడ్డితో హెలికాప్టర్‌లో వస్తున్నపుడు.. ఈ గోదావరి ఏదైతే చూస్తున్నమో.. వచ్చే ఏడాది ఇట్ల ఉండదు. నీటితోటి కళకళలాడుతుంటది అని చెప్పిన. 200 కిలోమీటర్ల గోదావరి బ్రహ్మాండంగా.. సజీవంగా ఉండే దృశ్యం గోదావరిఖనికాడనే చూస్తం. అనేక సమస్యలు పరిష్కారం చేసుకున్నం, సంక్షేమ పంథాలో ముందుకుపోతున్నం.

సుఖసంతోషాల తెలంగాణ ఆవిష్కారం
కడుపు కట్టుకొని అవినీతిరహితంగా పనిచేస్తున్నందున.. రాబోయే ఐదేండ్లలో తెలంగాణ పెట్టబోయే ఖర్చు రూ.10 లక్షల కోట్లు. మన ఆర్థికాభివృద్ధి బాగా పెరుగుతున్నందున ఈ ఐదేండ్లు.. వచ్చే ఐదేండ్లు.. పదేండ్లు కలిపితే తెలంగాణ చేయబోయే ఖర్చు రూ.30 లక్షల కోట్లు. సుదూరంలోనే బంగారు తెలంగాణ మన కండ్లముందు కనిపిస్తున్నది. 1.25 కోట్ల ఎకరాల్లో పంటలు పండే తెలంగాణ త్వరలోనే సాకారం కాబోతున్నది. ఈ సంవత్సరమే 70% అయితది. పాలమూరు కూడా పూర్తిచేస్తే రెండేండ్లలో ఆ పని కూడా సాకారం అయిపోతది. అటు సుజల తెలంగాణ.. మంచినీళ్లకు, సాగునీళ్లకు బాధలేని తెలంగాణ.. సర్వమతాల ప్రజలు సంతోషంగా కలిసి ఉండే తెలంగాణ ఆవిష్కారం అయితుంది. పిల్లలను చదివించే ప్రయత్నం చేస్తున్నం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ఒక విద్యార్థి మీద రూ.1.20 లక్షలు ఖర్చు చేసి.. రెసిడెన్షియల్ స్కూళ్లలో బ్రహ్మాండమైన ఇంగ్లిష్ మీడియం విద్య అందించి పిల్లలను తయారుచేస్తున్నం. అవన్నీ మీ కండ్లముందున్నయి.

రామగుండంలో మెడికల్ కాలేజీ
మీకు కొన్ని కోరికలున్నయి. గోదావరిఖనిలో పాత ఎమ్మెల్యే, ఇప్పుడు గెలిచిన చందర్.. రామగుండంలో మెడికల్ కాలేజీ కావాలని ప్రతిసారీ నన్ను కోరుతున్నరు. కచ్చితంగా మెడికల్ కాలేజీ ఏర్పాటుచేయిస్త. చెన్నూరులో రెవిన్యూ డివిజన్ కావాలని కోరారు.. మా యువ టైగర్ సుమన్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నందున వందశాతం చెన్నూరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటుచేయిస్త. క్యాతన్‌పల్లి, నర్సాపూర్, నస్పూర్, మంచిర్యాల అంతా కలిపి కార్పొరేషన్ కావాలని కోరుతున్నరు. దానికోసం కూడా తప్పకుండా ప్రతిపాదన చేసి, మంజూరుచేస్తం.

ప్రతి జిల్లాలో ప్రజాదర్బార్
పోడు భూములు, రైతుల పట్టాభూములు, ఇతర సమస్యలు కావచ్చు.. చాలా ఉన్నయి. పోయిన టర్మ్‌లో ప్లానింగ్‌కే చాలా సమయం పోయింది. ఈసారి ఫీల్డ్ మీదకు ప్రత్యక్షంగా రాదలచుకున్న. ఒక్కో జిల్లాలో 2-3 రోజులు ఉండి, రోజుకు 2-3 గంటలు ప్రజాదర్బార్ పెట్టి, అన్నివర్గాల ప్రజలను స్వయంగా కలిసి, అన్ని సమస్యల్ని పరిష్కారంచేద్దాం. ఆ ట్రిప్పు లో గోదావరిఖనికి కూడా వస్త. ఇట్ల బర్‌మ్రనివచ్చి.. బుర్రుమనిపోవుడు కాకుండా ఇక్కడనే ఉండి అన్ని అభిప్రాయాలు పంచుకుంట. మీ సమస్యల పరిష్కారంలో భాగస్వామిని అవుత.

ప్రభుత్వం ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదు
భూముల పట్టాల విషయంలో, మ్యుటేషన్ల విషయంలో ఎవరికీ రూపాయి కూడా లంచం ఇవ్వకండి. జూన్- జూలై వరకు ఓపిక పట్టుకోండి. కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్నాం. కొందరు దుర్మార్గులు నేను రెవెన్యూ ఉద్యోగులకు వ్యతిరేకంగా పోతున్నానని దుష్ప్రచారం చేస్తున్నరు. అది తప్పు. ఆ విధమైన పద్ధతి ఈ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం ప్రజలపక్షాన, రైతులపక్షాన ఉంటది కానీ ఎవరికీ వ్యతిరేకంగా ఉండదు. ఎవరికీ నష్టం రానీయను. బేసిక్‌గ నేను ఎవరికీ నష్టంచేసే వ్యక్తినికాను. ఆ విష యం మీకూ తెలుసు. బోర్లకుంట వెంకటేశ్వర్లు విద్యాధికుడు. వినయ విధేయత ఉన్నవాడు. పెద్దపల్లి ఎంపీగా ఒక నేతకాని సమాజానికి గుర్తింపు రావాలని చెప్పి ఉద్యోగిగా రిటైర్‌మెంట్ తీస్కొని ప్రజాసేవ కోసం ముందుకొచ్చారు. వాళ్లకు ఎప్పుడూ గుర్తింపురాలేదు. ఆయన ప్రజాసేవలోకి రావాలని ప్రేమతోటి నేను టికెట్ ఇచ్చాను. కాబట్టి ఆ సోదరుడిని పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించి, మన గౌరవాన్ని పెంపొందించాలని కోరుతున్న.

మోదీ పాలనలో దేశానికి ఏం జరిగింది?
మోదీ ప్రధాని అయి ఐదేండ్లయ్యింది. ఏం జరిగింది మరీ ఈ దేశానికి? ఒక్కపనైందా? దళితులకా? గిరిజనులకా? ఎవరికి అయ్యింది? బొగ్గుగని కార్మికుల జీతాలల్ల ఇన్‌కం ట్యాక్స్ మాఫీచేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాదు.. నేను స్వయంగా ఢిల్లీకి వెళ్లి అర్ధగంట చెప్పిన మోదీకి. బొగ్గుగనుల్లో పనిచేసే కార్మికులు మిలిటరీ వాళ్లకంటే ఏం తక్కువ కాదు.. దినదినగండం నూరేండ్ల ఆయుష్షు లెక్క ఉంటది వాళ్ల జీవితం. వారి జీతాలల్ల కట్‌చేసే ఇన్‌కం ట్యాక్స్‌తోనే మీ కేంద్ర ప్రభుత్వం నడుస్తదా? వాళ్లకు ఇన్‌కం ట్యాక్స్ మాఫీ చెయ్యాలి అని చెప్పిన. కానీ చెయ్యలేదు. చెయ్యరు. ఎందుకంటే చెయ్యకుంటే చెయ్యాలని అడిగేవాళ్లు లేరని! ఎన్నికలల్ల కాంగ్రెస్‌కో.. బీజేపీకో ఎవడికో ఒకడికి ఓటు గుద్దుతరులే అన్న అహంకారం.

ప్రాంతీయ పార్టీలదే ఢిల్లీ పీఠం
సంపూర్ణంగా ఢిల్లీ నుంచి నాకు సమాచారం ఉంది. రాజకీయ మిత్రులు, విశ్లేషకులు, పత్రికా విలేకరులు అనేకమంది బీజేపీ, కాంగ్రెస్‌కు డైరెక్ట్ మెజార్టీ వస్తలేదని చెప్తున్నరు. రేపు కేంద్రాన్ని పాలించబోయేది, శాసించబోయేది కచ్చితంగా ప్రాంతీయ పార్టీల కూటమే. నేను కూడా దేశంలో చాలామందితో మాట్లాడుతున్న. కాబట్టే మన పదహారు మంది టీఆర్‌ఎస్ ఎంపీలను గెలిపియ్యమని కోరుతున్న. మీరు పదహారు మంది ఎంపీలను గెలిపించండి.. దీవించండి.. ఈ దేశ రాజకీయ గతిని, గమనాన్ని, దశ దిశ మార్చేందుకు భగవంతుడు నాకు ఎంత శక్తి ఇచ్చిండో అంత శక్తి, మేథస్సును రంగరించి ఈ దేశం బాగుకోసం కొట్లాడుత. ఒక ఉజ్వల భారతదేశాన్ని నిర్మిద్దాం. ఎక్కడో ప్రారంభం కావాలి.. ఎవరో మొదలుపెట్టాలి.. ఎవరో నడుం కట్టాలి. దానికి ధైర్యంకావాలి. కాబట్టి నేను పిలుపునిచ్చిన.. చాలామందితో మాట్లాడిన. చాలామంది కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నరు. అందుకే దయచేసి దీవించమని కోరుతున్న. మీ దీవెనతోటి ముందుకు పోదాం.

తెలివితక్కువ పన్నువిధానం
దేశంలో ట్యాక్సేషన్ విధానం బాగాలేదు కాబట్టి వ్యాపారస్థులు ఇన్‌కం ట్యాక్స్ ఎగబెడుతున్నరు. తెలివితక్కువ విధానం ఉంది కాబట్టి.. 30% కట్టమంటున్నం కాబట్టి వాళ్లు ఎగబెడుతున్నరు. దాంతోటి నల్లధనం పేరుకుపోతున్నది. తెలివైన దేశాలు ఆ నల్లధనం మార్కెట్‌లోకి తెస్తయి. మన దేశంలోనూ వాలంటరీ డిస్‌క్లోజర్ స్కీం అని, ఆమ్నెస్టీ అని చాలాసార్లు ఇస్తరు. కానీ డబ్బులురావు. కారణం ఏందంటే.. ఎప్పుడైతే వాలంటరీ డిస్‌క్లోజర్, ఆమ్నెస్టీ ఇస్తున్నరో.. 70% కట్టు, డిక్లేర్ చెయ్యి అంటున్నరు. 30% పన్ను కట్టకుండనే వాడు దొంగతనం చేసే. అట్లాంటోడు 70% కడుతడా? ఇండోనేషియా అనే దేశంల స్కీం పెట్టి, 4% కట్టమన్నరు. రూ.24 లక్షల కోట్లు వాళ్ల మార్కెట్‌లోకి వచ్చినయి. గంత చిన్నదేశానికే అంత డబ్బు వస్తే.. ఇటువంటి స్కీంను మనం కరెక్ట్‌గా అమలుచేస్తే ఎన్ని లక్షలకోట్లు వస్తయి? రిజర్వ్‌బ్యాంక్ దగ్గర 13, 14 లక్షల కోట్లు మూలుగుతున్నయి. ఉండాలి.. రెండు, మూడు లక్షల కోట్లుండాలి. కానీ పదిలక్షల కోట్లు వేస్ట్‌గా పడి ఉన్నయి. నవరత్న కంపెనీల దగ్గర ఇంకో రూ.10-15 లక్షల కోట్లు మూలుగుతున్నయి. వాటిని వాడే తెలివిలేదు. మొత్తంగా రూ.20-25 లక్షల కోట్లు వృథాగా పడి ఉన్నయి. వాటిని వాడం.. వాటిమీద చర్చపెట్టం! ఈ దేశం అన్నిరంగాల్లో ముందుకుపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నయి. అత్యధికంగా యువకులు ఉన్న దేశం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది భారతదేశమే. అవకాశాలు లేకకాదు.. పనిచేసే మనుషులు లేకకాదు, యువశక్తి లేకకాదు.. ఖనిజ సంపద లేకకాదు, నీళ్లు లేకకాదు. అన్నీ ఉండి ఈ సన్నాసుల పరిపాలన వల్ల దేశం దెబ్బ తింటున్నది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.