Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఉపాధినిచ్చేలా ఎదగాలి

-పారిశ్రామికవేత్తులుగా దళిత, గిరిజన యువత మారాలి
-విద్య, ఉపాధి అవకాశాలతోనే దళిత, గిరిజనోద్ధరణ
-సీఎం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఇస్తున్న ఆత్మవిశ్వాసం గొప్పది
-ఎస్సీ, ఎస్టీ విధానాలపై సమీక్షలో మంత్రి కేటీఆర్‌
-‘విద్య అంటే డాక్టర్‌, ఇంజినీర్‌ కావడమే కాదు.. చిన్నప్పటి నుంచి పారిశ్రామికవేత్తలను చేసే విధంగా మన విద్యావిధానం ఉండాలి. మన గురుకులాల్లో ఎమర్జింగ్‌ టెక్నాలజీని విద్యార్థులకు అందించాలి. దీనివల్ల ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కోడింగ్‌ స్కూళ్లు ప్రారంభించడం శుభ పరిణామం.
– మంత్రి కేటీఆర్‌

అణగారిన వర్గాలు అభివృద్ధిలోకి రావాలంటే వారికి విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలన్నది తన నమ్మకమని పురపాలన, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. కుల వ్యవస్థ నిర్మూలనకు ఆయా కులాలవారీగా స్థితిగతులను మార్చడమే మార్గమని దళిత్‌ ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ మిలింద్‌కాంబ్లే ఇటీవల చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. దళిత, గిరిజన యువతను పారిశ్రామికరంగం వైపు ప్రోత్సహించేందుకు అమలుచేస్తున్న కార్యక్రమాలు, మరింత పురోగతికి అనుసరించాల్సిన విధానాలపై ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ కార్యాలయం లో జరిగిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ పథకం ఇస్తున్న ఆత్మవిశ్వాసం ఎంతో గొప్పగా ఉన్నదని, దీని ద్వారా ఇస్తున్న సబ్సిడీకన్నా.. వారికిచ్చే నమ్మకం మరింత గొప్పదని చెప్పారు. నిరాశ, నిస్పృహల్లో ఉండొద్దని సీఎం కేసీఆర్‌ నిత్యం చెప్తుంటారని, మన బిడ్డలను వాటి నుంచి బయటపడేయాలని అన్నారు. రుణాలు ఇవ్వడమే కాకుండా వ్యాపారంలో మెళకువలు నేర్పడం, నెలకొల్పిన పరిశ్రమలను విజయవంతంగా నడిపించేలా చేయడం మన ముందున్న లక్ష్యమన్నారు. ఎస్సీ, ఎస్టీ శాఖల అధికారులు ఈ వ్యూ హంతో కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. దళిత, గిరిజన వర్గాల నుంచి సాధ్యమైనంత ఎక్కువమంది యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని అన్నారు.

ఉపాధి ఇచ్చేవారుగా ఎస్సీ, ఎస్టీలు ఎదగాలి
దళిత, గిరిజన వర్గాల్లోని దాదాపు 36వేల మందిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆర్థికంగానే కాకుండా పదిమందికి ఉపాధి ఇచ్చే విధంగా ఎస్సీ, ఎస్టీలు ఎదగాలన్నది కేసీఆర్‌ లక్ష్యమని చెప్పారు. దళిత, గిరిజన యువత దేశంలోనే గొప్పగా ఉండేలా.. వారి అభ్యున్నతి కోసం నిపుణుల అభిప్రాయాలు, సలహాలు తీసుకుని ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు పలు పథకాలున్నాయని, అవి సరిగ్గా అమలు జరిగే ప్రణాళిక కావాలని, దీనికి అధికారులు ముఖ్యపాత్ర పోషించాలని అన్నారు. ఈ మూడేండ్లలో మంచి ప్రణాళికలు రూపొందించి అమలుచేయాలని సూచించారు. ప్రత్యేక విధానం కంటే.. సమిష్టి విధానంలోనే ఆ ప్రణాళిక ఉండాలన్నారు. టీప్రైడ్‌, టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ద్వారా ఈ వర్గాల యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చాలని చెప్పారు. వారికిచ్చిన పరిశ్రమల రాయితీలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, ఎక్కడ దుర్వినియోగం అవుతున్నాయో చూడాలని సూచించారు. జిల్లా పరిశ్రమల కార్పొరేషన్‌ను నోడల్‌ ఏజెన్సీగా పెట్టి 33 జిల్లాల్లో మేళాలు నిర్వహించాలని, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన పెండింగ్‌ సబ్సిడీ మొత్తాన్ని వెంటనే ఇస్తామని చెప్పారు. కాంట్రాక్టర్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమం ద్వారా ఎంతమంది ఎస్సీ, ఎస్టీలు కాంట్రాక్టర్లు అవుతున్నారో చూడాలని కోరారు.తాము ఆర్థికంగా ఎదగడమే కాకుండా పది మందికి ఉపాధినిచ్చేలా ఎస్సీ, ఎస్టీలు ఎదగాలన్నది సీఎం కేసీఆర్‌ లక్ష్యం. దళిత, గిరిజన యువత దేశంలోనే గొప్పగా ఉండేలా.. వారి అభ్యున్నతి కోసం నిపుణుల అభిప్రాయాలు, సలహాలు తీసుకుని ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నాం.

కాటారం యువకుడికి భరోసా
-4కోట్ల రుణం మంజూరుకు కేటీఆర్‌ హామీ
కాటారం: రాష్ట్రంలో యువతను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహిస్తున్న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తాజాగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన యువకుడికి అండగా నిలిచారు. కాటారం మండలం దామెరకుంటలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (రిచా స్పైసీ)తో స్వయం ఉపాధి పొందుతున్న రవికాంత్‌ బుధవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశాడు. తన పరిశ్రమ అభివృద్ధికి రుణం ఇప్పించాలని కోరగా అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా రూ.4 కోట్ల రుణాన్ని త్వరలోనే అందిస్తామని ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. మంత్రిని కలిసిన వారిలో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, భూపాలపల్లి జిల్లా టీఆర్‌ఎస్‌ నాయకుడు జక్కు రాకేశ్‌ ఉన్నారు.

నంబర్‌ వన్‌గా ఉండేందుకు కృషి
పలురంగాల్లో పురోగతితో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉండేలా కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. వీధి వ్యాపారులకు ఇచ్చే రుణాల్లో రాష్ట్రం దేశంలో రెండోస్థానంలో ఉన్నదన్నారు. దళిత, గిరిజన యువకులకు ఉపాధి కల్పించేందుకు పెట్టుబడి అవకాశాలు కల్పించడంలోనూ అంతే ఆదర్శంగా ఉండాలన్నారు. గురుకులాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ ద్వారా వస్తున్న ఫలితాలు చాలా గొప్పవని, పిల్లల్లో కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతున్నదని చెప్పారు. ‘విద్య అంటే డాక్టర్‌, ఇంజినీర్‌ కావడమే కాదు.. చిన్నప్పటి నుంచి పారిశ్రామికవేత్తలను చేసేలా మన విద్యావిధానం ఉండాలి’ అని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.

కమిషన్‌ను అభినందించిన కేటీఆర్‌
తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ గొప్పగా పనిచేస్తున్నదంటూ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, సభ్యులను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ఉద్యమం నుంచి వచ్చిన నాయకుల పనితీరుకు ఈ కమిషనే నిదర్శనమన్నారు. 7883 గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించడం, ఎస్సీ, ఎస్టీల ఫిర్యాదుల్లో 92% కేసులను పరిష్కరించడం చిన్న విషయం కాదన్నారు.

సమాజం పట్ల బాధ్యతతో ఉంటే ఫలితాలు ఇలా
సమాజం పట్ల బాధ్యత ఉన్న నాయకులు మంచి స్థానాల్లో ఉంటే గొప్పగా పనిచేస్తారనడానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ పనితీరు నిదర్శనమని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మహిళా, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ తెలంగాణలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు కనీస వసతులు ఉండేవికాదని, తమ కమిషన్‌కు దేశంలోనే ఏ కమిషన్‌కు లేనివిధంగా అన్ని హంగులతో కూడిన కార్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు.

సబ్సిడీ చెక్కుల అందజేత
పరిశ్రమలు, వ్యాపార సంస్థలను స్థాపించేందుకు 2000 మందికి అవసరమైన రూ.100కోట్ల సబ్సిడీని పరిశ్రమలశాఖ తరఫున విడుదల చేశారు. అందులో రూ.12 కోట్లకు సంబంధించి 10మంది లబ్ధిదారులకు మంత్రులు కేటీఆర్‌, కొప్పుల, సత్యవతి చెక్కులను అందజేశారు. నేషనల్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ ఫైనాన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఇచ్చే రుణాలకు సంబంధించి తెలంగాణ ఎస్‌ఎస్‌సీకి రూ.100 కోట్ల బ్యాంకు గ్యారం టీ పత్రాలను మంత్రులు అందించారు. ఐటీడీఏల్లో ప్రి-ఇంక్యుబేషన్‌, రి-ఇంక్యుబేషన్‌ కేంద్రాల ఏర్పాటు కు ట్రైకార్‌, వీహబ్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. కార్యక్రమంలో విప్‌ బాల్కసుమన్‌ పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.