Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఉత్తమ జర్నలిస్టు, అత్యుత్తమ నాయకుడు

సమకాలీన సామాజిక పరిస్థితుల ప్రభావాలు మనుషులపై ఎంతటి ప్రభావాన్ని వేస్తాయి, వ్యక్తులను ఎలా తీర్చిదిద్దుతాయి అనేదానికి రామలింగారెడ్డి చక్కటి ఉదాహరణ. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎనభయవ దశకంలో ఉవ్వెత్తున సాగిన రైతాంగ ఉద్యమాల ప్రభావం రామలింగారెడ్డిపై గణనీయంగా ఉన్నది. విద్యార్థి దశనుంచే ఆయన ఉద్యమంలో భాగస్వామి అయ్యాడు. దుబ్బాక జూనియర్‌ కళాశాల ఎన్నికల్లో విద్యార్థిసంఘం నేతగా ఎన్నికయ్యాడు. ఆ చైతన్యంతోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సామాజిక సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేశాడు. మెదక్‌ జిల్లా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మూఢ నమ్మకాల నిర్మూలనకు, ముఖ్యంగా గోసంగి దురాచారానికి వ్యతిరేకంగా ఊరూరా ప్రజలను చైతన్యపరిచి పోరాటాలు నిర్మించాడు. అలాగే సారా అమ్మకాలకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రజలను, యువతను కూడగట్టి పోరాటాలు చేశాడు.

తన సొంత గ్రామం చిట్టాపూర్‌ మొదలు పరిసర గ్రామాలే కాదు, జిల్లా వ్యాప్తంగా భగత్‌సింగ్‌ యువజన సంఘాలు నిర్మాణం చేసి యువతను చైతన్యపరిచాడు. ఓ జర్నలిస్టుగా తన చుట్టూరా సామాజిక ఘటనలను వెలుగులోకి తెస్తూ, వాటి సామాజిక ప్రభావాలను బాహ్య ప్రపంచానికి తెలియజేయటానికి ఆయన ఆహర్నిశలు పాటుపడ్డాడు. ఆ క్రమంలో ఆయన తీవ్ర నిర్బంధాలను ఎదుర్కో వాల్సిన పరిస్థితి ఏర్పడింది. జర్నలిస్టుగా ఉండి ఉద్యమకారులకు సహాయ సహకారాలు అందిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులు రామలింగారెడ్డిని అనేక విధాలుగా వేధించారు, బెదిరించారు. ఒకానొక దశలో కాల్చివేస్తామని కూడా పోలీసులు ప్రకటించే దుస్థితి వచ్చింది. దాంతో రామలింగారెడ్డి ఓ జర్నలిస్టుగా ఉండి కూడా హైదరాబాద్‌లాంటి చోట్ల తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ క్రమంలోనే రామలింగారెడ్డిపై కక్షపెంచుకున్న పోలీసులు రాష్ట్రంలోనే మొట్ట మొదటిదిగా ‘టాడా’ కేసు నమోదు చేసిన నిర్బంధ చీకటి కాలమది. పోలీసుల వైపు నుంచి ఎన్ని విధాలుగా వేధింపులు ఎదురైనా మొక్కవోని దీక్షతో ఆయన నిత్య నిర్బంధాలను ఎదుర్కొంటూ ప్రజాపక్షపాతాన్ని వీడలేదు. జైలు నిర్బంధాలకు వెరువలేదు.

నేను విద్యార్థిగా ఉన్న రోజులనుంచి, జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించే కాలానికి ఆయన మాలాంటి యువతరం జర్నలిస్టులందరికీ ఓ రోల్‌మోడల్‌. నిజాయితీతో కూడిన సాదాసీదా జీవన విధానం, ప్రజలతో కలిసిమెలిసి ఉండటం, ప్రజల సమస్యలను వెలుగులోకి తేవటంలో కొత్త తరం జర్నలిస్టులందరికీ ఆయన ఆదర్శం. తెలంగాణ రాష్ట్రసాధన మలిదశ ఉద్యమం ప్రారంభ రోజులనుంచీ, ముఖ్యంగా 2004నుంచీ నాతో రామలింగారెడ్డి నిత్య సంబంధాల్లో ఉంటూ మార్గదర్శకుడిగా వ్యవహరించారు. ఒక జర్నలిస్టుగా తాను వృత్తి జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను, జర్నలిస్టులందరి సమస్యలుగానే కాకుండా, సామాజిక సమస్యలుగా అర్థం చేయించారు. వాటి పరిష్కారానికి రాజీలేని పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని ఆయన ఎప్పుడూ చెప్పేవాడు. దేశానికి కండ్లూ, చెవులుగా ఉన్న జర్నలిస్టులకే ఉద్యోగ భద్రతలేని దుస్థితి, గ్రామీణ ప్రాంత విలేకరులకు జీతభత్యాలు లేకపోవటం అన్నది తీవ్రమైన లోతైన సమస్య అని చెప్పేవాడు. ఈ సమస్యలను పరిష్కరించుకోవటానికి జర్నలిస్టులు రాజీలేని పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నాడు.

రామలింగారెడ్డి ఒక సామాజిక స్పృహ ఉన్న జర్నలిస్టుగానే గాక, ఒక మనిషిగా ప్రతి సమస్యపై స్పందించేవాడు. చాలా సందర్భాల్లో తానున్న స్థితిని కూడా పక్కన పెట్టి మాట్లాడాడు, రాశాడు. ప్రధానంగా ప్రజల పోరా డే హక్కులను హరించటం అంటే జీవించే స్వేచ్ఛను హరించట మే అని భావించాడు. ఆ చైతన్య నేపథ్యంలోంచే ప్రజా ఉద్యమాలపై సాగుతున్న నిర్బంధకాండను, ఆదివాసీ ఉద్యమాలపై గ్రీన్‌ హంట్‌ పేరిట సాగిస్తున్న అణిచివేత చర్యలను తీవ్రంగా ఖండిస్తూ వ్యాసాలు రాశాడు. వరవరరావు లాంటి కవి, రచయిత, సామాజిక వ్యాఖ్యాతను తప్పుడు కేసులతో జైలుపాలు చేయటాన్ని తీవ్రంగా ఖండించాడు. ఒక్కో సారి ఆయన స్పందనలు అన్ని పరిధిలను దాటి ఉండేవి. ప్రజాప్రతినిధిగా, ఎమ్యెల్యేగా ఉండికూడా ఎలాంటి శషబిషలు లేకుండా తనదైన ప్రాపంచిక హక్కుల దృక్పథంతో మాట్లాడుతున్న ప్పుడు, రాస్తున్నప్పుడు మనం ఉన్న స్థితిలో అది ఇబ్బంది ఏమో అని అన్నప్పుడు, నిజాలు చెప్పటానికి భయాలు ఎందుకని అనేవాడు. ఆ చైతన్యం, నిబద్ధతతోనే చివరిక్షణం వరకూ నిలిచాడు. పది పదిహేను రోజుల క్రితం మెదక్‌ జిల్లాలో ఓ జర్నలిస్టు అకాలమరణం చెందితే అతని కుటుంబాన్ని జర్నలిస్టు సం ఘంగా వెళ్లి ఓదార్చాలని, ఆర్థికంగా ఆదుకోవాలని పట్టుపట్టాడు. నిబంధనల ప్రకారం జర్నలిస్టు కుటుంబ సభ్యులు ప్రెస్‌ అకాడమీకి, ప్రభుత్వానికి వినతి చేసుకుంటే, సహా యం అందేట్లు చూస్తామని నేను అంటే, అంత మాత్రానికి జర్నలిస్టు సంఘాలెందుకని నిష్టూరపోయా డు. ప్రజలపట్ల నిబద్ధ్దత ఉన్నప్పుడు ఏ నిబంధనలు అడ్డుకావని, కాకూడదని వాదించాడు. జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించటానికి జర్నలిస్టు నేతలంతా తరలిపోయేదాకా వెంటపడ్డాడు.

ఉమ్మడి మెదక్‌ జిల్లా దుబ్బాక నియోజక వర్గంలోని చిట్టాపూర్‌ గ్రామంలో సాధారణ రైతుకుటుంబంలో రామకృష్ణారెడ్డి, మాణిక్యమ్మ దంపతులకు జన్మించిన రామలింగారెడ్డి, తనదైన నిఖార్సయిన నీతివంతమైన జీవితంతో అంచెలంచెలుగా ఎదిగాడు. స్థానిక గ్రామీణ ప్రాంత విలేకరిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన రామలింగారెడ్డి జిల్లా స్థాయి జర్నలిస్టు నేతగా ఎదిగారు. ఆ తర్వాత కాలంలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించి జిల్లావ్యాప్తంగా తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి నిర్విరామంగా కృషి చేశాడు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావంతో పార్టీలో సామాన్య కార్యకర్తగా మొదలై తనదైన కార్యాచరణతో నాయకత్వం అభిమానాన్ని, విశ్వాసాన్ని చూరగొన్నాడు. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ చొరవతో ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశాడు. సాధారణ జర్నలిస్టు జీవితం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన స్థాయిదాకా ఎదిగిన క్రమంలో ఎక్కడా నీతి, నిజాయితీలను వదులుకోలేదు. ఆస్తులు కూడబెట్టుకోలేదు. అధికార దర్పాలు దరిచేరనివ్వలేదు.నిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రజల్లో ఒకనిగా నిరాడంబర జీవితాన్ని గడిపాడు.

సాధారణంగా చాలా మంది ఎన్ని ఉదాత్తమైన సిద్ధాంతాలు, విలువల గురించి చెప్పినా, తమ దాకా, తమ కుటుంబం దాకా వచ్చే సరికి కొంత వెనుకబడి ఉంటారు. తమ కుటుంబాల్లో ఆ విలువలను పాదుకొల్పటంలో విఫలమవుతారు. కానీ రామలింగారెడ్డి ఏ విలువల కోసం, కుల, మత రహిత సమ సమాజం కోసం పరితపించాడో ఆ విలువలను తమ కుటుంబంలోకి ఆహ్వానించాడు. తాను కూడా ప్రజాకవి కాళోజీ పెండ్లి పెద్దగా ఆదర్శ వివాహం చేసుకున్నాడు. కుల మతాలకతీతంగా మానవ సంబంధాలను అభివృద్ధి చేసి ఆచరణలో చూపాడు. తాను ఏ స్థితిలో ఉన్నా, ఏ వేదిక మీద ఉన్నా.. మానవీయ విలువల నూతన సమాజం కోసం కలలు కనటం మానలేదు. ఆ కలల సాకారం కోసం తనదైన కార్యాచరణను, ఉద్యమ భాగస్వామ్యాన్ని వీడలేదు.

జర్నలిస్టుగా గ్రామీణ సమస్యలను వెలుగులోకి తేవటంలో, వాటి పరిష్కారానికి చేసే కృషిలో ఆయన చూపిన తెగువ, పట్టుదల నేటి తరానికి ఆదర్శం. అలాగే వర్తమాన రాజకీయాల్లో కూడా రామలింగారెడ్డి అందరికీ అనేక విధాలుగా ఆదర్శప్రాయుడు. పదవుల వేటలో పరుగులు తీయకుండా ప్రజా సేవలో నిమగ్నం కావటంలో రామలింగారెడ్డి నేటి యవతరానికి మార్గదర్శి. మరెంతో కాలం ప్రజాసేవలో నిమగ్నమై ఉండాల్సిన రామలింగారెడ్డి అకాల మృతి ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రజలకు, దుబ్బాక నియోజక వర్గ ప్రజలకు తీరని లోటు. ప్రజ స్వామిక, హక్కుల ఉద్యమాలకు పెద్దదెబ్బ. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.

(వ్యాసకర్త:చంటి క్రాంతి కిరణ్ ఆందోల్‌ ఎమ్మెల్యే)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.