
-ప్రదానం చేసిన కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ -ఈ అవార్డు.. బాధ్యతను మరింత పెంచిందన్న ఎంపీ -కవితకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్ అభినందన -రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతా -కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదా ఇవ్వాలి -నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత డిమాండ్ -ఢిల్లీలో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు స్వీకరణ
గత ఐదు బడ్జెట్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని నిజామాబాద్ ఎంపీ కవిత అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆదాయం పన్నుతో వచ్చే నిధులే తప్ప, తెలంగాణలో ఏ పథకానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా మంజూరుచేయలేదని ఆరోపించారు. 2014లో తెలంగాణ ఏర్పడితే, ఏనా డూ రాష్ట్రపతి ప్రసంగంలో కనీసం శుభాకాంక్షలు తెలుపలేదన్నారు. రాష్ట్ర హక్కులను సాధించుకోవడానికి కేంద్రంపై రాజీలేనిపోరాటం చేస్తామని స్పష్టంచేశారు. ఫేం ఇండి యా- ఏషియాపోస్ట్ మ్యాగజైన్ ఉత్తమ పార్లమెంటేరియన్ (శ్రేష్ఠ్ సంసద్) అవార్డును ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర మధ్య, సూక్ష్మతరహా పరిశ్రమల సహాయమంత్రి గిరిరాజ్‌సింగ్ చేతులమీదుగా ఎంపీ కవిత అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ప్రజల దీవెనలతోనే ఈ అవార్డు దక్కిందని, మరింత ఉత్సాహంగా సేవచేస్తానని చెప్పారు.
కేంద్రం చేసిన చిన్న పనులను రాష్ట్రపతి ప్రసంగంలో పెద్దవిగా చేసి చూపిం చారన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణకు సంబంధించిన అంశాలు ఏమీ లేవని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదేండ్లలో కేంద్రం రైతులకు, మహిళలకు ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదని, ఎన్నికలకు ముందు బడ్జెట్లో ఏవైనా ప్రకటించినా, అమలుచేసేలోపే ఎన్నికలు పూర్తవుతాయన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల బిల్లుపై నాన్చివేత ధోరణి సరికాదన్నారు. ఓడిన ప్రతిపార్టీ ఈవీఎంలపై మాట్లాడటం తగదన్నారు.130 కోట్లమంది ప్రజలున్న దేశంలో సాంకేతిక పరిజ్ఞానం అవసరమన్నారు. ఈవీఎంలు ట్యాప్ చేశారంటూ ప్రజల్లో అపనమ్మకం కల్పిస్తున్నారని, లండన్‌లో సైతం ఈవీఎంలపై ప్రెస్‌మీట్ పెట్టి దేశపరువు తీయవద్దని కోరారు.

బడ్జెట్‌పై పార్టీలో చర్చించి స్పందన రాష్ట్రపతి ప్రసంగం, కేంద్ర బడ్జెట్‌పై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ సూచించారని ఎంపీ కవిత చెప్పారు. కేంద్రం.. కాళేశ్వరానికి జాతీయహోదా ఇవ్వడం లేదని, బైసన్‌పోలో భూముల అప్పగింతను నాన్చుతున్నారని అసహనం వ్యక్తంచేశారు. ఈ విషయాలపై ప్రధానమంత్రిని కలిస్తే..సానుకూలంగా స్పందించారని, ఒకసారి సీఎం కేసీఆర్‌తో కూడా మాట్లాడుతానని చెప్పారని వివరించారు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న ఎంపీ కవితను లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్ అభినందించారు. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్పీకర్‌ను కలిసి అవార్డు గురించి తెలిపారు.

విజ్ఞాన్‌భవన్‌లో జై తెలంగాణ అవార్డు ప్రదానం కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి రాష్ట్రం నుంచి తెలంగాణవాదులు, టీఆర్ఎస్, జాగృతి నాయకులు, ఎంపీ కవిత అభిమానులు ఢిల్లీకి భారీగా తరలివెళ్లారు. ఎంపీ కవిత అవార్డు అందుకుంటుండగా జై తెలంగాణ నినాదాలతో విజ్ఞాన్‌భవన్ మార్మోగింది. అనంతరం ఎంపీ కవితను పూలబొకేలతో అభినందించారు. కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, స్త్రీ, శిశుసంక్షేమశాఖ రీజినల్ కోఆర్డినేటర్లు సుశీలారెడ్డి, మూల విజయారెడ్డి ఢిల్లీకి వెళ్లినవారిలో ఉన్నారు.
ఎంపీ కవితకు అభినందనల వెల్లువ అవార్డు అందుకున్న ఎంపీ కవితను ఢిల్లీలో పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అభినందించారు. టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి, ఎంపీలు జోగినిపల్లి సంతోష్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అభినందించిన వారిలో ఉన్నారు. టీఆర్ఎస్ ఎన్నారై విభాగం కోఆర్డినేటర్ మహేశ్ బిగాల, ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, అనిల్ కూర్మాచలం, చాడ సృజన్‌రెడ్డి, బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీశ్ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం 36 దేశాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై విభాగాన్ని 50 దేశాలకు విస్తరిస్తామని మహేశ్‌బిగాల తెలిపారు. గల్ఫ్‌లో తెలంగాణ కార్మికుల ఇబ్బందులు తీర్చడంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ కవితల సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.
సర్వే సాగిందిలా.. లోక్‌సభలోని 545 మంది ఎంపీల పనితీరుపై ఫేం ఇండియా- ఏషియా పోస్ట్ మ్యాగజైన్ సర్వే నిర్వహించింది. 25 మందిని ఉత్తమ ఎంపీలుగా ఎంపికచేశారు. ప్రజాదరణ, కార్యశీలత, సామాజిక సేవాదృక్పథం, లోక్‌సభకు హాజరు, లోక్‌సభ నిర్వహణలో పాత్ర, నియమ, నిబంధనలు పాటించడం, ప్రశ్నలు అడుగడం తదితర అంశాల ఆధారంగా ఎంపీలను అవార్డుకు ఎంపికచేశారు. సర్వే నిర్వహించిన అత్యధిక విభాగాల్లో ఎంపీ కవితకు 90 శాతానికిపైగా పాయింట్లు వచ్చాయి. తెలంగాణ ఉద్యమంలో ఎంపీ కవిత క్రియాశీల పాత్ర పోషించారని సర్వే రిపోర్టులో పేర్కొన్నారు. 1833