శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకాన్ని ఏడాది వ్యవధిలో పూర్తి చేయాలని నిర్ణయించామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం నాటి ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, గంగుల ప్రతాప్, జి.కిషన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెబుతూ ‘ఈ ప్రాజెక్టు పనులను తొలుత 18 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించాం. ప్రస్తుత అంచనాల ప్రకారం ఏడాది వ్యవధిలోనే పనులు పూర్తవుతాయి.అప్పుడు రెండు పంటలూ వేసుకోవచ్చు. ప్రాణహిత వరద కాల్వల ద్వారా ఈ ప్రాజెక్టుకు నీటిని మళ్లించుకోవచ్చు. రోజుకో టీఎంసీ నీటిని వినియోగించుకోవచ్చు. ఆధునికీకరణకు కూడా రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నాం. గోదావరి నీటి విషయం ఎలా ఉన్నా కాళేశ్వరం నుంచి కూడా నీటిని మళ్లించుకోవచ్చు.

మూసీ ఆధునికీకరణకు రూ.65 కోట్లు సీఎం ఇటీవల సూర్యాపేట పర్యటన సందర్భంగా మూసీ ప్రాజెక్టు గురించి పలువురు ప్రజాప్రతినిధులు ప్రస్తావించటంలో రూ. 65 కోట్లతో ఆధునికీకరణకు ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి హరీశ్ చెప్పారు. ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరి కిషోర్ అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు.
రైతులకు భారీగా నష్టపరిహారం భూసేకరణకు ముందుకొచ్చిన రైతులకు కాంగ్రెస్ హయాంతో పోలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా నష్ట పరిహారం చెల్లిస్తుందని మంత్రి హరీశ్ చెప్పారు. ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఎకరాకు రూ.ఆరు నుంచి రూ. పది లక్షల వరకు చెల్లిస్తుందన్నారు.
పరిశీలనలో బోధకాల బాధితులకు ‘ఆసరా’: లక్ష్మారెడ్డి ఖమ్మం జిల్లాలోనే 2,886 బోధకాలు వ్యాధి కేసులున్నాయని, అవి కూడా పాతవని ఎమ్మెల్యేలు డాక్టర్ జె.గీతారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, కిషన్‌రెడ్డి, సున్నం రాజయ్య అడిగిన ప్రశ్నలకు మంత్రి లక్ష్మారెడ్డి సమాధానమిచ్చారు. కేంద్రం దేశంలోని 250 జిల్లాల్లో బోధకాలు నివారించాలని ఎంపిక చేసిందని, తెలంగాణలోని ఆరు జిల్లాలు ఆ జాబితాలో ఉన్నాయన్నారు. ఖమ్మం జిల్లాను మునుపటి ప్రభుత్వం గుర్తించలేదని, తామే గుర్తించి ఆ జిల్లాను చేర్చాల్సిందిగా కోరామన్నారు. వారికి ఆసరా పింఛను ఇవ్వాలన్న అంశం పరిశీలనలో ఉందన్నారు.
ఏ ధ్రువపత్రమైనా సరిపోతుంది: ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ షాదీముబారక్ పథకం లబ్ధిదారులు పుట్టిన తేదీ ధ్రువపత్రం లేదా ఓటరు ఐటీ కార్డు ఇలా ఏదో ఒక ధ్రువపత్రాన్ని అనుమతించే అంశాన్ని సీఎంతో చర్చించి త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఎమ్మెల్యేలు షకీల్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జాఫర్ హుస్సేన్ మిరాజ్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. గతంలో రూ.51 వేలు ఇచ్చే వారమని, ఆ మొత్తాన్ని రూ.75,116కు పెంచామన్నారు.
సాధ్యమైనంత త్వరగా సెస్సు విడుదల వసూలు చేసిన రిజిస్ట్రేషన్ ఛార్జీలో 1.5 శాతాన్ని పంచాయతీలకు పంపుతున్నాం. సాధ్యమైనంత త్వరగా ఆ మొత్తాన్ని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అడిగిన ప్రశ్నకు మంత్రి మహమూద్ అలీ చెప్పారు.