Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వద్దు, రద్దుల కాంగ్రెస్.. మనకొద్దు

-చంద్రబాబు పాలనలో ఎన్‌కౌంటర్లు, రైతు ఆత్మహత్యలు
-వైఎస్సార్ తెలంగాణ ద్రోహి.. కాంగ్రెస్‌ను నమ్ముకొంటే మళ్లీ చీకట్లే
-కేసీఆర్‌కు అండగా నిలువండి.. ప్రగతి పరుగుపెడుతుంది
-మల్యాల ప్రజా ఆశీర్వాదసభలో మంత్రి హరీశ్‌రావు

రద్దుల కాంగ్రెస్ మనకొద్దు. చంద్రబాబు తెలంగాణలో ఎన్‌కౌంటర్లు చేశారు. రైతుల ఆత్మహత్యలతో తెలంగాణ రక్తసిక్తమయింది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరంట్ వంటి పథకాలను తెచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌దే. పేదల సంక్షేమానికి అహర్నిశలు పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలువండి. ప్రగతి పరుగులు పెడుతుంది అని మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పదేండ్ల హయాంలో ఐదు లక్షల ఎకరాలకు నీరిస్తే.. కేసీఆర్ సారథ్యంలో నాలుగున్నరేండ్లలోనే 25 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చామని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రుద్రంగి మండలంలోని సూరమ్మ చెరువుకు చేరిన గోదావరి జలాలను కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, వేములవాడ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబుతో కలిసి ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం రుద్రంగిలో నిర్వహించిన రోడ్‌షోలో, చందుర్తి మండలం మల్యాలలో నిర్వహించిన ప్రజాఆశీర్వాదసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, సాగునీటి ప్రాజెక్టులు లేక బీళ్లుగామారిన మెట్ట ప్రాంతానికి ఎత్తిపోతల పథకాలు రావాలన్న దివంగత చెన్నమనేని రాజేశ్వర్‌రావు కల కేసీఆర్ నాయకత్వంలో నేడు సాకారమైందని హర్షం వ్యక్తంచేశారు. 60 ఏండ్లుగా కాంగ్రెస్, టీడీపీలకు ఓట్లే వేసి చేతులకు నొప్పి వచ్చింది కానీ ఎలాంటి అభివృద్ధి మాత్రం జరుగలేదని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులను నమ్ముకొంటే మళ్లీ చీకటేనని ఎద్దేవాచేశారు. గత పాలకులు పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులన్నీ శరవేగంగా పూర్తవుతున్నాయన్నారు. కొబ్బరికాయలు మనకు కొట్టి.. నీళ్లు ఆంధ్రాకు తీసుకెళ్లిన వైఎస్సార్ తెలంగాణ ద్రోహి అని వ్యాఖ్యానించారు. ఓటు కోసం వస్తున్న టీడీపీ, కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు.

రైతుబంధు పథకాలను రద్దు చేస్తారంట
దేశంలో ఎక్కడా లేనివిధంగా కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధులాంటి వివిధ పథకాలను రద్దుచేస్తామని చెప్తున్న రద్దుల కాంగ్రెస్ మనకొద్దని, గ్రామాల్లోకి రాకుండా తరిమికొట్టాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. బతుకమ్మ చీరెలను కూడా అడ్డుకొన్నది కాంగ్రెస్సే అని మండిపడ్డారు. నాలుగుసార్లు ఓడిపోయాం, ఒకసారి అవకాశమివ్వండని మొసలి కన్నీరు పెట్టుకొంటూ వస్తున్న వాళ్లను నమ్మి మోసపోవద్దని సూచించారు.

పనులు చేయని కాంగ్రెస్‌కు ఓటేయవద్దు: ఎంపీ వినోద్
కొట్లాడి తెలంగాణ సాధించుకుని అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న క్రమంలో మాయాకూటమికి అధికారమిస్తే తెలంగాణ మళ్లీ చీకటి రాజ్యమవుతుందని ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ హెచ్చరించారు. ప్రాజెక్టులను, ప్రగతిని అడ్డుకొనేందుకు కుట్రలు పన్నుతున్న చంద్రబాబు, రాహుల్‌గాంధీతో చీకటి ఒప్పందం చేసుకొన్నారని ఆరోపించారు. సమావేశంలో వేములవాడ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు, మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎంపీపీ తిప్పని శ్రీనివాస్, జడ్పీటీసీ అంబటి గంగాధర్, సెస్ డైరెక్టర్లు అల్లాడి రమేశ్, తిరుపతి, డప్పుల అశోక్, టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు మరాఠి మల్లిక్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వట్టెంల కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

బిర్యానీ తిన్నట్లుంది
కథలాపూర్: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలికోట శివారులో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు, ఎంపీ వినోద్‌కుమార్ సూరమ్మ రిజర్వాయర్ పరిసరాలను పరిశీలించారు. రైతుల ముఖాల్లో చిరునవ్వు.. నీటితో నిండిన చెరువును చూసి బిర్యా ని తిన్నట్లుందని మంత్రి హరీశ్ సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ను స్థానిక నాయకులు, రైతులు శాలువాతో ఘనం గా సత్కరించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.