Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వడిగా అడుగులు

-ఫెడరల్ ఫ్రంట్ దిశగా.. ఢిల్లీ కేంద్రంగా..
-వివిధ పార్టీల నేతలతో సీఎం కేసీఆర్ వరుస సమావేశాలు
-మేధావులతో కొనసాగుతున్న చర్చోపచర్చలు
-కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఆవశ్యకతపై వివరణ
-2019లో కీలక శక్తిగా ఉంటామని విశ్వాసం
-రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం వద్దంటున్న కేసీఆర్
-ప్రాంతీయ పార్టీల ఐక్యతకు విశేష కృషి
-దేశవ్యాప్తంగా ఫ్రంట్ ప్రయత్నాలపై ఆసక్తి

దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా చేస్తున్న ప్రయత్నాలను ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ముమ్మరం చేశారు. భావసారూప్యంగల ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఆదివారం నుంచి తన ఫెడరల్ యాత్ర ప్రారంభించిన కేసీఆర్ ఇప్పటికే ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు. తాజాగా హస్తినలో మకాంవేసి.. పలువురు సీనియర్ నేతలు, వివిధరంగాలకు చెందిన విశ్రాంత ఉద్యోగులు, మేధావులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లో కీలక పార్టీల నేతలైన మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, అఖిలేశ్‌యాదవ్‌లతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఢిల్లీ సహా పలువురు ఉత్తర భారత రాష్ర్టాల పార్టీల నేతలనూ కలుసుకోనున్నారు. తదుపరి ఇతర రాష్ర్టాల పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. కేసీఆర్ ప్రతిపాదనలకు పలువురు నేతలు సానుకూలంగా స్పందిస్తున్న నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్‌పై సర్వత్రా చర్చ నడుస్తున్నది. దేశవ్యాప్తంగా ఒక నిశ్శబ్ద విప్లవంలా ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు విస్తరిస్తున్నాయి.

ప్రత్యామ్నాయానికి వడివడిగా అడుగులు
గత మార్చిలోనే ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ప్రారంభించిన కేసీఆర్ వెనువెంటనే వివిధ రాష్ర్టాల్లోని కీలక నేతలైన దేవెగౌడ, మమతా బెనర్జీ, స్టాలిన్, అఖిలేశ్‌యాదవ్, హేమంత్ సోరెన్, కుమారస్వామితో చర్చించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటువల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ప్రభావం రోజురోజుకూ తగ్గుతున్న నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు ఐక్యంగా ఉంటే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ముఖ్య భూమిక పోషించవచ్చని విశ్వాసం వ్యక్తంచేశారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనాన్ని అడ్డుకోవాలని, అందుకు అందరం ఏకం కావాలని నిర్ణయించిన కేసీఆర్.. జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టే యత్నాలు మొదలుపెట్టారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాస్త విరామం ఇచ్చారు. కొత్త రాష్ట్రంలో రెండుసార్లు ఒంటిచేత్తో టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తెచ్చిన కేసీఆర్.. ప్రస్తుతం ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్న కేసీఆర్ ఏకంగా నెలరోజులపాటు విమానాన్ని అద్దెకు తీసుకొని రాష్ట్రాల పర్యటనకు బయలుదేరారు.

ప్రాంతీయ పార్టీల ఐక్యతే లక్ష్యం
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకమైన ప్రాంతీయ పార్టీల నేతలను ఒప్పించే పనిలో కేసీఆర్ నిమగ్నమయ్యారు. దేశంలో గుణాత్మక మార్పుకోసం కృషిచేస్తున్న కేసీఆర్‌కు అండగా నిలిచేందుకు ప్రాంతీయ పార్టీలు సైతం సై అంటున్నాయి. ఫ్రంట్‌లో భాగమయ్యేందుకు ఆయా పార్టీల నేతలు సుముఖత వ్యక్తంచేస్తున్నారు. దీంతో భావసారుప్యం కలిగిన ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలనే సీఎం లక్ష్యం దిగ్విజయంగా కొనసాగుతున్నది. తాజాగా యాత్రలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో చర్చలు ఫలప్రదమయ్యాయి. కేసీఆర్‌తో చర్చల సందర్భంగా ఇరువురునేతలు ఫ్రంట్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తంచేశారు.

ఫెడరల్ ఫ్రంట్‌పై పూర్తి స్పష్టతతో కేసీఆర్
మొదటి నుంచి ఫెడరల్ ఫ్రంట్ విషయంలో సీఎం కేసీఆర్ పూర్తి స్పష్టతతో ఉన్నారు. ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి తన ఆలోచనలను పంచుకుంటున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తయినప్పటికీ దేశం అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి చెందలేదని, దీనికి కాంగ్రెస్, బీజేపీ పాలనే కారణమని సీఎం కేసీఆర్ చెప్తున్నారు. మనతోపాటే స్వాతంత్య్రం వచ్చిన పలు దేశాలు సరైన విధానాలు అనుసరించి అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని, మన దేశం మాత్రం ఇంకా పేదరికంలోనే ఉన్నదని వివరిస్తున్నారు. ఉమ్మడి జాబితా పేరుతో కేంద్రం ముఖ్యమైన అధికారాలను చేతిలో పెట్టుకొని రాష్ట్రాలపై పెత్తనం చేస్తున్నదని, దానివల్లే రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగడం లేదని కేసీఆర్ తేల్చిచెప్తున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకే సమాఖ్య స్ఫూర్తితో పాలన అనే నినాదాన్ని తీసుకొచ్చానని, ఇది సాధ్యపడాలంటే జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీల వల్ల కాదని, అందుకే ప్రాంతీయ పార్టీలు ఏకమై దీన్ని సాధించుకోవాలని వివరిస్తున్నారు. గుణాత్మకమైన మార్పు వస్తేనే దేశం అభివృద్ధి దిశలో ముందుకుపోతుందని, దీన్ని సాకారం చేసుకునేందుకు ప్రాంతీయ పార్టీలు పొత్తు కలువాలని కోరుతున్నారు. వీటితోపాటు తెలంగాణలో అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలను కూడా ప్రస్తావిస్తున్నారు. దేశవ్యాప్తంగా వీటిని అమలుచేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. నీటి కొరతను, విద్యుత్ కొరతను పూర్తిగా అధిగమించవచ్చని, నిధుల కోసం కేంద్రం వైపు చేయి చాచాల్సిన అవసరం ఉండదని సీఎం కేసీఆర్ చెప్తున్నారు.

మేధావులతో సీఎం కేసీఆర్ సమాలోచనలు
ఫెడరల్ ఫ్రంట్‌లో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయాలన్న లక్ష్యంతో రాజకీయేతర ప్రముఖులతో కూడా సీఎం కేసీఆర్ ఢిల్లీలో సమాలోచనలు జరుపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసి రిటైర్ అయిన సుదీర్ఘ అనుభవం గల అధికారులు, సీనియర్ జడ్జీలు, ఆర్థికరంగ నిపుణులు, సీనియర్ జర్నలిస్టులతో చర్చిస్తున్నారు. జాతీయ రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకత, భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసే ప్రణాళిక తదితర విషయాల గురించి కూలంకషంగా చర్చిస్తున్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వ అవసరం ఉందని, దానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరుతున్నారు. ఇక తెలంగాణ ఎంపీలు కేశవరావు, జితేందర్‌రెడ్డి, కవిత, వినోద్‌కుమార్ తదితరులు కేసీఆర్ వెన్నంటే ఉండి ఫ్రంట్ ఏర్పాటు సన్నాహాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.

నేడు ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ
-విభజన చట్టంలోని హామీలపై చర్చ
-రక్షణభూముల అప్పగింత సహా వివిధ అంశాలు ప్రస్తావించే అవకాశం
రెండోసారి తెలంగాణ పాలనాపగ్గాలు స్వీకరించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రధాని నరేంద్రమోదీని లోక్‌కల్యాణ్‌మార్గ్‌లోని ఆయన నివాసంలో సాయంత్రం నాలుగు గంటలకు మర్యాదపూర్వకంగా కలువనున్నారు. ఫెడరల్‌ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న కేసీఆర్.. మోదీని కలిసి విభజన హామీలపై చర్చించనున్నారు. ముఖ్యంగా హైకోర్టు విభజనకు వీలైనంత త్వరగా గెజిట్ విడుదలయ్యేలా చూడాలని కోరనున్నారు. అలాగే షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన, ఏపీ రాజధాని అమరావతికి తరలివెళ్లినందున హైదరాబాద్‌లో వారికి కేటాయించిన సచివాలయంలోని భవనాలతోపాటు, ఆయా హెచ్‌వోడీల కార్యాలయ భవనాలను తిరిగి అప్పగించాలని విజ్ఞప్తిచేయనున్నారు. రిజర్వేషన్ల పెంపు, తదితర అంశాలపై కూడా ప్రధానితో చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణకు నూతన సచివాలయ నిర్మాణం, రాజీవ్ రహదారి విస్తరణకు రక్షణశాఖ భూములు అప్పగించే అంశాలనూ ప్రధాని వద్ద ప్రస్తావించనున్నారని తెలిసింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.