Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వైద్యానికి మహర్దశ

తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగానికి మహర్దశ పట్టనుంది. రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యంగా సర్కారు దవాఖానాల్లో కార్పొరేట్ సదుపాయాలు, యంత్ర పరికరాలు సమకూర్చాలని, సౌకర్యాలు మెరుగుపరచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. సచివాలయంలో బుధవారం వైద్యారోగ్యంపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దాదాపు ఏడుగంటలపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి, కొత్త ఆస్పత్రుల ఏర్పాటు, ఉద్యోగ ఖాళీల భర్తీపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

KCR review on Health department01

ప్రభుత్వాస్పత్రులకు కార్పొరేట్ హంగులు -ఖాళీలను గుర్తించి భర్తీ చేయాలని ఆదేశం, -డాక్టర్లు సమయపాలన పాటించకపోతే కఠినచర్యలు -సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం

-ఒకే గొడుకు కిందకు వైద్య విభాగాలు -గ్రామస్థాయి నుంచి వైద్యసేవల మెరుగుదల – ఉస్మానియా ఆస్పత్రికి 24 అంతస్తులతో ట్విన్ టవర్స్, పడకలు 2,500కు పెంపు – నిలోఫర్‌కు పాత భవనం స్థానంలో నూతన భవనం – గాంధీ ఆస్పత్రిలో 1600 నుంచి 2000 పడకలకు పెంపు -నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆస్పత్రులు – ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ దవాఖానలు – రెవెన్యూ జిల్లాల తరహాలో హెల్త్ డిస్ట్రిక్ట్‌లు, హెల్త్ డిస్ట్రిక్ట్‌లో 100 పడకల ఆస్పత్రి -నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల దవాఖానలు – రోగుల సహాయకుల కోసం ప్రత్యేక డార్మెటరీలు – వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ అభివృద్ధి రాష్ట్ర వైద్యారోగ్యాన్ని పూర్తిగా సంస్కరించాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సంస్కరణలు చేపట్టాలన్నారు. ఇందుకుగాను కొత్త వైద్యవిధానాన్ని ప్రవేశపెట్టాలని అభిప్రాయపడ్డారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకుగాను ఆరోగ్య జిల్లాలు (హెల్త్ డిస్ట్రిక్ట్స్) ఏర్పాటుచేయాలని, ఇందుకు ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. తమిళనాడులో ప్రభుత్వాస్పత్రులు బాగా పనిచేస్తాయని, అదే తరహాలో రాష్ట్రంలో ఆస్పత్రులు పనిచేసేందుకు వైద్య విధానాన్ని రూపొందించాలని చెప్పారు.

వైద్యశాఖ విభాగాలన్నీ ఒకే గొడుగు కిందకు: రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, వాటి పట్ల ప్రజల్లో నమ్మకం కలిగించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్య శాఖలు వివిధ విభాగాల కింద పనిచేస్తున్నాయని, డాక్టర్లు కూడా చాలా విభాగాలలో విడిపోయారని అన్నారు. వైద్య శాఖలను, వైద్యులను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని చెప్పారు. ప్రాథమిక వైద్యశాలలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల ఏర్పాటు, నిర్వహణలో ఆచరణాత్మక విధానం రావాలన్నారు.

ప్రస్తుతం వైద్య విధాన పరిషత్ స్వయం నిర్ణాయక సంస్థగా ఉందని, దీనిని కూడా ప్రభుత్వ గొడుగు కిందకు తీసుకురావాలని సీఎం సూచించారు. అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, వైద్య విధాన పరిషత్‌ను కలిపి నిర్వహించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని సూచించినట్లు సమాచారం. అందుకు కావాల్సిన నిధులు, పరికరాలు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. 104, 108 సేవలు కూడా ప్రభుత్వ వైద్యంతో కలిసే ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లు సమయపాలన పాటించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమయపాలన పాటించని వైద్యుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.

ప్రజలకు వైద్యం అందాలిలా… రాష్ట్రంలో క్షేత్రస్థాయి నుంచి హైదరాబాద్‌లోని బోధనాసుపత్రుల వరకు ప్రజలకు మెరుగైన వైద్యం అందేందుకు అవసరమైన వ్యవస్థలు, ప్రస్తుతమున్న వాటి అభివృద్ధిపై ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. -20-25వేల జనాభాకు లేదా 25 నుంచి 30 గ్రామాలకు ఒక పీహెచ్‌సీ -ప్రతి నియోజకవర్గంలో వంద గ్రామాలకు ఒక ఏరియా ఆస్పత్రి. -ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 30 పడకల ఆస్పత్రిగా, ఏరియా ఆస్పత్రులను 100 పడకల ఆస్పత్రులుగా అభివృద్ధి చేయాలి. -ప్రతి జిల్లా కేంద్రంలో వెయ్యి పడకలతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేసి, అన్నిరకాల వైద్య సేవలు అందించాలి. -56 చోట్ల 600 కోట్లతో 100 పడకల ఆస్పత్రులు నిర్వహించాలని నిర్ణయం హైదరాబాద్‌లో ఆస్పత్రుల బలోపేతం చేద్దాం

హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యాన్ని మెరుగుపరచడంతో పాటు వాటిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధానంగా ఉస్మానియా ఆస్పత్రికి సంబంధించి కొత్త భవన నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించాలని సూచించారు. పాత భవనంలో వైద్య సేవలను కొనసాగిస్తూనే కొత్తగా రెండు టవర్లలో 12 అంతస్తుల చొప్పున 24 అంతస్తుల్లో భవనాన్ని నిర్మించాలని చెప్పారు. ఆస్పత్రిని 1,100 నుంచి 2,500 పడకల సామర్థ్యానికి పెంచాలన్నారు. -గాంధీ ఆస్పత్రిని 1600 పడకల నుంచి 2వేల పడకల సామర్థ్యానికి పెంచాలి. -నీలోఫర్ ఆస్పత్రిలో కొత్త భవనాన్ని వినియోగించుకోవడంతో పాటు అదనంగా 500 పడకల సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలి. పాత భవనం స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించాలి. -నిమ్స్‌లోనూ అదనంగా 500 పడకల సామర్థ్యంతో వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి. -వరంగల్ ఎంజీఎంను వెయ్యి పడకల నుంచి 2 వేల పడకలకు సామర్థ్యాన్ని పెంచి, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి. -నిజామాబాద్, ఆదిలాబాద్ రిమ్స్‌ల్లో 500 పడకల నుంచి వెయ్యి పడకలకు సామర్థ్యం పెంపు. వీటన్నింటికి సంబంధించి ప్రతిపాదనలను రూపొందించి, ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇంజినీర్లను నియమిద్దాం.. ప్రస్తుతం బోధనాసుపత్రులతో పాటు అనేక ప్రభుత్వాస్పత్రుల్లో కోట్ల రూపాయల విలువైన పరికాలు ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. అయితే వాటి నిర్వహణ సరిగాలేదనే అంశం సమీక్షలో చర్చకొచ్చింది. చాలాచోట్ల పరికరాలను వినియోగించకపోవడం, మరమ్మతులు చేయించకపోవడంతో వృథాగా పడి ఉన్న విషయం సీఎం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో పరికరాల నిర్వహణ కోసం కచ్చితంగా ప్రతి ప్రధాన ఆస్పత్రికి ఒక బయో ఇంజినీర్‌ను నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రధాన ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ సరిగాలేదని ముఖ్యమంత్రి ఎత్తిచూపారు. పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా ఉండేందుకు పర్యవేక్షకులు (అడ్మినిస్ట్రేటర్స్) నియమించుకోవాలని చెప్పారు. సూపర్‌వైజర్లతో పాటు వీరు కూడా ఆస్పత్రుల పరిసరాలు, వార్డులు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకునేందుకు దోహదపడతారని చెప్పారు.

గ్రామీణ సేవలపై అధ్యయనం చేయండి… గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. దీనిపై వైద్యాధికారులు అధ్యయనం చేసి, కార్యాచరణ రూపొందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు వైద్యులు ఎందుకు ముందుకు రావడంలేదో పరిశీలించి, వారికున్న సమస్యలను తెలుసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకాలిచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ఆస్పత్రుల్లో రోగుల సహాయకుల కోసం ప్రత్యేక డార్మెటరీలు, బాత్‌రూములు, ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ప్రభుత్వ వైద్యశాలలను మెరుగుపరిచే విషయంలో కేంద్రం సహాయాన్ని కూడా తీసుకోవాలని సూచించారు.

ఖాళీలన్నింటినీ భర్తీ చేయండి రాష్ట్రంలోని వైద్య రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వైద్యులతో పాటు ఇతర సిబ్బంది పోస్టులను కూడా వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన ఫైళ్లను వెంటనే రూపొందించి పంపాలని చెప్పారు.

రెండు అంశాలపై తీవ్ర అసంతృప్తి… బోధనాసుపత్రుల నిర్వహణ సరిగాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆస్పత్రుల పనితీరు ఏమాత్రం బాగాలేదని, వెంటనే లోపాలను సరిదిద్దుకోవాలని సంబంధిత అధికారికి సూచించినట్లు తెలిసింది. అదేవిధంగా వైద్యారోగ్య మౌలిక వసతుల కల్పన సంస్థ (హెచ్‌ఎంఐడీసీ) పనితీరుపైనా సీఎం తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా అందులో అవినీతిని ఆయన ప్రస్తావించినట్లుగా తెలిసింది. అసలు ఆ సంస్థ వ్యవహారాలను ఇతర విభాగాలకు ఇస్తే బాగుంటుందని కూడా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఈ సమీక్షా సమావేశంలో వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ సీ లకా్ష్మరెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ, వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చంద, కుటుంబసంక్షేమ శాఖ కమిషనర్ బుద్ధప్రకాశ్, వైద్యవిద్య సంచాలకులు పుట్ట శ్రీనివాస్, వైద్య విధాన పరిషత్ వీణాకుమారి, ఇతర వైద్య శాఖాధికారులు పాల్గొన్నారు

సీఎం కేసీఆర్ నిర్ణయంపై హర్షం… ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని సీఎం ఆదేశించడంపట్ల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్ బీ రమేష్, తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (వైద్యారోగ్య శాఖ విభాగం) అధ్యక్షుడు జూపల్లి రాజేందర్ సీఎంకు కృతజ్ఙతలు తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.