-ఇకపై ప్రతి గ్రామానికీ ఈఎన్టీ వైద్యబృందాలు -చెవి, ముక్కు, గొంతు సమస్యలకు చికిత్స -ఆ తర్వాత రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రక్తపరీక్షలు -తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తాం -ఎన్నికల ప్రచారసభల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు -కత్తి ఆంధ్రా వాడిదే.. పొడిచేది తెలంగాణోడు -చంద్రబాబును.. కాంగ్రెస్ భుజాలమీద తెచ్చింది -తెచ్చినోన్ని ఓటుతో దంచితే సాపైతది.. -తెలంగాణకు బాబు రూపంలో పొంచి ఉన్న ప్రమాదం -పాలమూరును వలసల జిల్లాగా మార్చాడు -నల్లగొండలో ఫ్లోరైడ్ రక్కసి ఉంది.. ఆ సమస్య ఎందుకు పరిష్కారం కాలేదో జానారెడ్డి, ఉత్తమ్ చెప్పాలి -మోదీకి హిందూ, ముస్లిం అనే బీమారీ ఉంది: కేసీఆర్ -వదల బొమ్మాళీ వదల.. అంటున్నడు బాబు ఎలా వదలగొట్టాలో ప్రజలే ఆలోచించాలి -మనకు చంద్రబాబు పెత్తనం అవసరమా? -రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ ప్రగతిపథంలో దూసుకుపోతుంటే కూటమి పేరుతో చంద్రబాబును కాంగ్రెస్‌పార్టీ భుజాలమీద మోసుకువచ్చిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ధ్వజమెత్తారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి చేతగాక చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్నారని నిప్పులు చెరిగారు. ఆంధ్రావాడి కత్తితో పొడిచేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, తెలంగాణను అమరావతికి తొత్తుగా మార్చాలని చూస్తున్నారని విమర్శించారు. వలస బాబు పెత్తనం వద్దేవద్దని అన్నారు. చంద్రబాబు రూపంలో తెలంగాణకు ప్రమాదం పొంచి ఉందని, దీనిపై ప్రజలందరూ సీరియస్‌గా ఆలోచన చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. వచ్చిన చంద్రబాబును, తీసుకువచ్చిన కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. తెచ్చినోన్ని దంచుతే మొత్తం సాపైతది. దంచుమంటే కొట్టమని చెప్తలేను.. ఓటుతోని దంచాలె. చైతన్యం చూపిచ్చి, బిడ్డా ఈ రాజకీయం చెల్లదని చెప్పాలె. 13-14 స్థానాలు పోటీ చేస్తున్నడు. ఇంత సిగ్గులేనితనమా? ఇది న్యాయమా? ఇది తెలంగాణ ఆత్మగౌరవమా? మన గౌరవం ఉంటదా? నవ్వేటోని ముందర జారిపడతమా? దయచేసి ప్రజలు ఆలోచన చేయాలె అని కోరారు.
బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల, దేవరకొండ, నకిరేకల్, భువనగిరి, మెదక్‌లో ఏర్పాటుచేసిన ఆశీర్వాదసభల్లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. చంద్రబాబు పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రి. మిమ్మల్ని వదల బొమ్మాళీ.. వదల అంటున్నడు. వదిలి పెట్టడట. మరి ఎలా వదలగొట్టాలో మీరే నిర్ణయం చేయాలి. నేనైతే నావంతుగా ఒకసారి తరిమికొట్టాను. ఇప్పుడు తరిమికొట్టే బాధ్యత మీదే అని కేసీఆర్ చెప్పారు. అడుగడుగునా తెలంగాణ ప్రయోజనాలకు అడ్డుపడే చంద్రబాబు ఇప్పుడు మన ఇంటికి వచ్చి మనల్ని కొట్టిపోయేందుకు చూస్తున్నాడని, మీ వేలితో మిమ్మల్ని పొడిచేయాలనే ఆలోచనతో టీడీపీ అభ్యర్థులను పోటీకి దించారని అన్నారు. పాలమూరు జిల్లాను తొమ్మిదేండ్లు దత్తత తీసుకున్న చంద్రబాబు వలసల జిల్లాగా మార్చారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పాలమూరులో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. మనకు నీళ్లు రానివ్వకుండా అడ్డుకున్నోడికి ఇప్పుడు మన ఓట్లు కావాలా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలని కేంద్రానికి చంద్రబాబు 30 లేఖలు రాసిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేశారు. అలాంటి చంద్రబాబు తెలంగాణకు అవసరమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీల వైఖరిని తూర్పారబట్టిన సీఎం.. తెలంగాణలో ఉడుముల్లా జొచ్చి దోచుకోవాలని చూస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్, బీజేపీ రెండూ తోడుదొంగలేనని కేసీఆర్ విమర్శించారు. ప్రధాని మోదీకి హిందూ ముస్లిం తేడా అనే బీమారీ ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రాలపై కేంద్రం ఆధిపత్యం తగ్గాలని, రాష్ట్రాల అధికారాలు పెరుగాలని అన్నారు. ఈ ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయాల్లో జోక్యం చేసుకుంటానని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించి కర్రపెత్తనం చేస్తున్నదన్న సీఎం.. ప్రాంతీయపార్టీల పెత్తనం పెరుగాల్సి ఉందని చెప్పారు. కేంద్రంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వం రావాలన్నారు. దేవరకొండ ప్రాంతం ఫ్లోరైడ్ రక్కసితో ఇబ్బంది పడిందన్న సీఎం.. నల్గొండలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి ఉన్నప్పటికీ ఈ సమస్య పరిష్కారానికి ప్రాజెక్టులు కట్టలేదని విమర్శించారు. కంటివెలుగు కార్యక్రమం విజయవంతం అయినట్టే రాబోయే ప్రభుత్వంలో చెవి, ముక్కు, గొంతు సమస్యలను నివారించేందుకు ఈఎన్టీ వైద్యులు ప్రతి ఇంటికీ వచ్చి ఉచిత వైద్యం అందిస్తారని చెప్పారు. తదుపరి రాష్ట్ర ప్రజలందరికీ రక్తపరీక్షలు నిర్వహించి.. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామని సీఎం ప్రకటించారు. దేశం గర్వించదగ్గ పథకాలు అమలుచేస్తున్నామన్న సీఎం.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.