Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వలస ప్రజల ఉసురు తప్పదు

– నోటికాడి బుక్క లాగేస్తవా? – చంద్రబాబు మీద హరీశ్ నిప్పులు – మా నీళ్లు మా ఇష్టం.. ప్రాజెక్టు ఆపేదిలేదని స్పష్టీకరణ – త్వరలోనే టెండర్లు పిలుస్తామని వెల్లడి – సీడబ్ల్యూసీకి వివరణ పంపిస్తున్నామన్న మంత్రి

Harish-Rao-press-meet

పాలమూరు పథకానికి అడ్డుపడి లక్షల మంది ప్రజల నోటికాడి బుక్క ఎత్తగొట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నాడని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. పథకాన్ని ఆపాలంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడం మీద ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం సృష్టిస్తున్న అడ్డంకులపై ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, ప్రభాకర్, గణేష్‌గుప్తాతో కలిసి మంత్రి హరీశ్‌రావు గురువారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. వినాశకాలే విపరీత బుద్ధి… అందుకే చంద్రబాబు పాలమూరు పథకాన్ని ఆపాలనుకుంటున్నడు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కండ్లు అంటడు. చేతల్లో మాత్రం రివర్స్ గేర్. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకుంటే పాపం తగులుతుంది. 16 లక్షల మంది వలసపోయిన జిల్లా ఇది. 14 ఏండ్ల వారినుంచి 70 ఏండ్ల ముసలివారి దాకా ఎప్పుడూ ఎక్కడ పని దొరుకుతుందా అని అలమటించే జిల్లా. ఆ కష్టాలు పోవాలని, జిల్లాకు సాగు, తాగునీరు అందించి ఆకలి తీర్చాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రయత్నిస్తుంటే, ఆ ప్రాజెక్టుకు అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడు అని హరీశ్‌రావు అన్నారు. తినే అన్నంలో మట్టిపోసే చంద్రబాబు లాంటి వారికి, ఏనాటికైనా ప్రజలు బుద్ధిచెబుతారన్నారు.

సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేశారు.. పాలమూరు ప్రాజెక్టు ఆపాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కి ఫిర్యాదు చేశారని హరీశ్‌రావు చెప్పారు. ఏపీ చేసిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలంటూ ఇటీవలే సీడబ్ల్యూసీ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ వచ్చిందన్నారు. సాగునీటి రంగ నిపుణులు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు తదితరులు ఇందుకు సవివరమైన నివేదిక ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారని త్వరలోనే, సీడబ్ల్యూసీకి వివరణ పంపిస్తామని మంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ర్టానికి కేటాయించిన 299 టీఎంసీల నీటిని ఎప్పుడైనా, ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చంటూ ఇటీవలే కృష్ణా వాటర్ బోర్డు తెలియజేసింది. మా నీళ్లు మా ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకునే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. అని ఆయన స్పష్టం చేశారు. రెండు రాష్ర్టాల మధ్య వైరుద్ధ్యం ఎందుకనే ఉద్ధేశంతో తాము పట్టిసీమపై ఫిర్యాదు చేయలేదని, అయినా ఎవరి అనుమతులు తీసుకుని పట్టిసీమను ప్రారంభించారని మంత్రి ప్రశ్నించారు.

నువ్వు మనిషివేనా? పాలమూరు ప్రాజెక్టు ఏదో కొత్తది అన్నట్లు చంద్రబాబు ఆరోపించడాన్ని హరీశ్ తీవ్రంగా తప్పుపట్టారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే ఈ ప్రాజెక్టు సర్వేకు ఆమోదం పొంది కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంలో 8-8-13న జీఓ నెంబర్ 72 ద్వారా ఆమోదం పొందిందని వివరించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఇచ్చిన జీవో పంపిస్తామని చదివి వాస్తవాలు తెలుసుకోవాలని సలహా ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవో చెల్లదనడం దారుణమన్నారు. నువ్వు ఒక్కడివి బాగుంటే చాలా? పక్క రాష్ట్రం వాళ్లు పచ్చగా ఉంటే చూడలేవా? అని నిలదీశారు. పాలమూరు ప్రజల నోట్లో మట్టి కొట్టి నోటి కాడి బుక్కను ఎత్తగొట్టే వాళ్లు మనుషులేనా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నువ్వు మనిషివేనా? ఇంత నీచంగా కూడా ఆలోచన చేస్తారా? మరుగుజ్జు మనస్తత్వం కలిగిన చంద్రబాబును ఇంకా ఏమనాలో కూడా పదాలు రావట్లేదు అన్నారు.

ఒక్క పంటను ఓర్చుకోవా? ఏపీలో మూడో పంట కోసం పట్టిసీమ కట్టుకుంటున్న చంద్రబాబు తెలంగాణ వాళ్లు ఇక్కడ కేవలం ఒక్కపంట కోసం అందునా పాలమూరు లాంటి వలసల జిల్లాకు నీరందిస్తుంటే చూడలేకపోతున్నాడని అన్నారు. ఆఫ్రికా లాంటి దేశాల్లో కూడా ఒక దేశం కష్టంలో ఉంటే మిగిలినవి ఆదుకుంటాయని, మొన్న నేపాల్‌లో భూకంపం సంభవిస్తే భారత్‌తో పాటు అన్ని దేశాలు సహాయం చేశాయని అంటూ విశాఖపట్నంలో హుదూద్ తుఫాను సంక్షోభ సమయంలో తెలంగాణ ఆదుకున్నదని గుర్తు చేశారు. బదులుగా చంద్రబాబు ఫ్లోరైడ్ బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రాజెక్టు కట్టుకుంటే అడ్డం పడుతున్నాడని అన్నారు.

ప్రాజెక్టు ఆగబోదు.. వచ్చే నెలలో టెండర్లు.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎవ్వరూ అడ్డుకోలేరని, వచ్చే నెలలోనే టెండర్లు ఆహ్వానిస్తున్నామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. కొద్ది రోజుల్లోనే ల్యాండ్ పర్చేజ్ పాలసీని కూడా నిర్ణయిస్తామని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, కోయల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు తదితర ప్రాజెక్టులతో పాటు పాలమూరుని కూడా పూర్తి చేస్తామని వివరించారు.

ఆంధ్రులే బాబును తరిమికొడతారు… చంద్రబాబు మొదటినుంచి తెలంగాణకు వ్యతిరేకమేనని హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి రాజధాని పేరు చెప్పి హైదరాబాద్‌లో ఉంటూ సెక్షన్ 8 అంటూ చంద్రబాబు కుట్రలు చేశాడని ఇపుడు హైదరాబాద్‌కు నీరందించే పాలమూరు పథకం ఆపాలంటూ కేంద్రానికి లేఖ రాశాడని అన్నారు. హైదరాబాద్‌కు నీళ్లు రాకపోతే నువ్వు, నీ కుటుంబం హెరిటేజ్ పాలు తాగి బతుకుతారు. మరి మిగిలిన వాళ్ల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎవరైనా ఏ నగరంలో బతుకుతున్నామో, ఆ నగరం బాగుండాలని కోరుకుంటారు. కానీ ఈ భూభాగం మీద జన్మించిన వారిలో తాను ఉంటున్న నగరం బాగుండకూడదని ఆలోచించే వారు ఎవరైనా ఉన్నారంటే, అది ఒక్క చంద్రబాబు మాత్రమే అని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు కుట్రలు తెలుసుకుని ఇక్కడున్న ఆంధ్రులే అతన్ని తరిమికొడతారని అన్నారు.

మాకు లిప్ సింపతీ మాత్రమే.. తెలంగాణ విషయంలో మొదటి నుంచి ఆంధ్రా పాలకులు కేవలం లిప్ సింపతీ మాత్రమే చూపించారని, జీవోలు, శిలాఫలకాల ద్వారా మభ్యపెడుతూ వచ్చారని మంత్రి ఆరోపించారు. వైఎస్, కిరణ్ జీవోలు ఇచ్చినపుడు ఓట్ల కోసం నోరు మెదపని చంద్రబాబు, ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నడని విమర్శించారు.వలస కార్మికులకు కడుపు నిండా అన్నం పెట్టాలని, ఫ్లోరైడ్ బాధితులకు తాగునీరు అందించాలని, హైదరాబాద్ ప్రజలకు మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటి సారిగా ఫ్లోరైడ్ ప్రాంతంలో చేపట్టిన పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే… వలస ప్రజల ఆగ్రహానికి మాడి, మసైపోతారని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.