-ఇక్కడి పనులు సొంతరాష్ట్రంలో చేసుకొనే ఏర్పాటుచేస్తాం -త్వరలో సమగ్ర కార్యాచరణ: కేటీఆర్ -దుబాయ్‌లో సోనాపూర్ క్యాంప్‌ను సందర్శించిన మంత్రి

రాష్ట్రంలో వలసలు పూర్తిస్థాయిలో నివారించి స్థానికంగానే ఉపాధి కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకొంటామని పంచాయతీరాజ్, ఐటీశాఖమంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీనికోసం త్వరలోనే సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. దుబాయ్ పర్యటనలోభాగంగా సోమవారం సోనాపూర్ క్యాంప్‌ను ఆయన సందర్శించారు. అక్కడ నివాసముంటున్న తెలంగాణ కార్మికుల కష్టసుఖాలను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉపాధికల్పనకు చేపడుతున్న చర్యలు, పథకాలను వారికి వివరించారు.
త్వరలోనే వారు చేయగలిగే పనులన్నీ రాష్ట్రంలోనే చేయొచ్చునని భరోసా ఇచ్చారు. వారు నివాసముంటున్న ఇరుకైన గదులు, కనీస మౌలికసదుపాయాలు లేక వాళ్లు పడుతున్న ఇబ్బందులును చూసి చలించిపోయారు. ఉపాధి కోసం దుబాయ్‌కి వచ్చేందుకు దారితీసిన పరిస్థితులు, ఏజెంట్లు పెట్టిన ఇబ్బందులు, ఆర్థిక సమస్యలను చెప్పుకొన్నారు. దుబాయిలో కనీస వేతనాలకు కూడా నోచుకోవడం లేదని బాధపడ్డారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్‌మెంట్‌పై చేపట్టే కార్యక్రమాలు, కార్మికుల రిజిస్ట్రేషన్, ఏజెంట్ల క్రమబద్ధీకరణ, కార్మికుల హక్కుల గురించి ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించేందుకు ప్రచారం వంటి ప్రక్రియలను చేపడుతామన్నారు. దుబాయిలో తెలుగు మాట్లాడే వారికోసం భారత రాయబార కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటుచేయిస్తామని, న్యాయపరమైన సాయాన్ని అందిస్తామని హామీఇచ్చారు.
వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా బీమా పథకాలు, తిరిగి రాష్ర్టానికి తీసుకువచ్చి వాళ్లు చేసే పనినే కల్పించేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక్క సోనాపూర్ క్యాంపులోనే రాష్ర్టానికి చెందిన 20 వేల మంది కార్మికులు ఉండటం గమనార్హం. మొత్తంగా దుబాయిలో లక్ష మంది వరకు రాష్ట్రవాసులు ఉన్నారని అంచనావేశారు.
త్వరలో ఖైదీల విడుదల!: దుబాయి సెంట్రల్‌జైలులో శిక్ష అనుభవిస్తున్న రాష్ర్టానికి చెందిన ఐదుగురిని విడిపించేందుకు మంత్రి కేటీఆర్ రెండేండ్లుగా ప్రయత్నిస్తున్నారు. సురక్షితంగా వారిని స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు చర్చలు జరిపారు. అక్కడి శిక్షలు, కేసుల గురించి తెలుసుకున్నారు. భారత రాయబార కార్యాలయం సాయంతో ఖైదీల విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే వారు విడుదలవుతారన్న విశ్వాసం మంత్రి కేటీఆర్ దుబాయి పర్యటనతో కలిగింది.