Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వలసలు సహజం

– అన్ని పార్టీల్లోనూ అదే పరిస్థితి – పోలవరాన్ని మేం అక్రమమంటున్నాం.. నువ్వు అనగలవా? – పొన్నాలకు ఈటెల సవాల్ – దళితుల బతుకులు మారకపోవడానికి కాంగ్రెస్సే కారణం – గడీల పాలన, దొరల రాజ్యం చేస్తే మమ్మల్నే తిరస్కరిస్తారు – తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఈటెల, నాయిని

Etela rajender Press Meet 1-4-14

ఎన్నికల సమయంలో ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి వలసలు సహజమేనని టీఆర్‌ఎస్‌ఎల్‌పీ నేత ఈటెల రాజేందర్ అన్నారు.

కాంగ్రెస్ నుండి టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని, అలాగే ఇతర పార్టీల నుండి కాంగ్రెస్‌లోకి వలసలు వెళ్తున్నారని, అయితే వీటి ప్రభావం టీఆర్‌ఎస్‌పై పెద్దగా ఉండబోదని ఈటెల చెప్పారు. సోమవారం తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది తామేనని, కేసీఆర్‌వల్ల తెలంగాణ రాలేదని పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ అంటున్నారని, టీఆర్‌ఎస్‌కు పాలించే సత్తా లేదని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీ గొప్పతనం ఏదైనా ఉంటే ప్రజలకు చెప్పకుని ఓట్లు అడుక్కోవాలి కానీ ఇతర పార్టీలపై మాట్లాడటం సరైంది కాదన్నారు. టీఆర్‌ఎస్‌ని చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. వైఎస్ హయాంలో పులిచింతల, పోలవరం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల నిర్మాణానికి నిరసనగా తాము మంత్రి పదవులకు రాజీనామాలు చేశామని, ఆ సందర్భంగా కేసీఆర్ బహిరంగ చర్చకు పిలిస్తే పొన్నాల మొహం చాటేశాడని విమర్శించారు. జలయజ్ఞం.. ధనయజ్ఞమైందని జాతీయ మీడియా అంతా కోడైకూసిందని, ఇందుకు కారకుడైన పొన్నాల.. కేసీఆర్‌ను విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ పోలవరం అక్రమ ప్రాజెక్టని అంటోందని, ఇదే మాట పొన్నాల లక్ష్మయ్య అనగలడా? అని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడుపై ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నాడని, ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిందే పొన్నాల అని మండిపడ్డారు. తెలంగాణ ఎలా వచ్చిందో దేశం మొత్తానికి, తెలంగాణ ప్రజలకూ తెలుసునని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలో దాడులు చేయించినవాళ్లు, సాగరహారానికి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి, తరువాత బాష్పవాయుగోళాలు ప్రయోగించినవాళ్లు కేసీఆర్‌పై, టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

వరంగల్ జిల్లాలోని తన ఆఫీసు వద్ద పోస్టర్లు చింపినందుకు యాకూబ్‌రెడ్డి తదితరులను పొన్నాల పనికిరాకుండా కొట్టించాడని, ఆయనో దద్దమ్మ అని మండిపడ్డారు. ఇప్పటికీ యాకూబ్‌రెడ్డిపై జరిగిన దాడిపై జాతీయస్థాయిలో విచారణ జరుగుతోందన్నారు. దామోదర రాజనర్సింహ టీఆర్‌ఎస్‌ను దళితవ్యతిరేక పార్టీ అంటూ విమర్శిస్తున్నారని, కానీ కాంగ్రెస్ వల్లే ఇంకా దళితులు అభివద్ధి కాలేకపోయారన్న విషయాన్ని ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు. దళితులను కేవలం ఓట్లకోసమే వాడుకున్నారని, 66 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దళితులకేం చేసిందో చెప్పాలని అన్నారు. అంబేద్కర్ ఆనాడు 20 ఏళ్లలో అంతరాలు లేని సమాజం వస్తుందని నమ్మి రిజర్వేషన్లు పెట్టాడని, కానీ నేటికీ ఆ సమాజం రాకపోవడానికి సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్సే కారణమని అన్నారు. దళితులకు కేటాయించిన డబ్బులను హుస్సేన్‌సాగర్ ఆధునీకరణకు, రోడ్ల విస్తరణకు కేటాయించారని మండిపడ్డారు. తెలంగాణ కోసం అసెంబ్లీలో మాట్లాడుతుంటే.. వైఎస్ ఆనాడు నన్ను తలకాయ ఎక్కడ పెట్టుకుంటావని అన్నాడు. అప్పుడు మీరెవరూ ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు. తెలంగాణలో 85శాతం పేదలు, బడుగుబలహీన వర్గాల ప్రజలున్నారని, ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు, పేదలకు రూ.3లక్షలతో ఇల్లు, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడం టీఆర్‌ఎస్‌కే సాధ్యమని అన్నారు. ఇప్పటివరకు టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని, వీటినుండి పారిపోయేదే లేదని అన్నారు. బీజేపీతో పొత్తులపై ఇంకా పార్టీలో చర్చ జరగడంలేదని, అయితే ఆ ఆలోచన ఉన్నమాట మాత్రం వాస్తవమేనని ఈటెల అన్నారు. జేఏసీలోని టీఆర్‌ఎస్, సీపీఐ, బీజేపీ, న్యూడెమోక్రసీ పార్టీల మధ్య పొత్తులుండాలని ఒక ఆలోచన జేఏసీ సంఘాల నుండి వస్తోందని చెప్పారు. అయితే బీజేపీతో పొత్తుపై ఇంకా ఏ నిర్ణయం జరగలేదని అన్నారు.

బీజేపీ మద్దతుతోనే బిల్లుకు ఆమోదం: నాయిని టీఆర్‌ఎస్ వస్తే గడీల పాలనఅని, దొరల రాష్ట్రం అవుతుందని పనికిమాలిన, చవకబారు ఆరోపణలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహారెడ్డి మండిపడ్డారు. ఒకవేళ అధికారంలోకి వచ్చాక మేము అలా చేస్తే ప్రజలు మమ్మల్నే తిరస్కరిస్తారు. మీరు మంచోళ్లు అయితే మిమ్మల్నే గెలిపిస్తారు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తిరస్కరణకు గురైన పార్టీ అని మండిపడ్డారు. ఒక్కనాడు కూడా జై తెలంగాణ అననివారు ఇవాళ ఎన్నో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉద్యమకారులను జైళ్లలో పెట్టి కొట్టించిన వాళ్లకు తెలంగాణ ప్రజలు ఓట్లెలా వేస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీ పార్లమెంట్‌లో మద్దతు ఇచ్చినందు వల్లే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని, కేవలం కాంగ్రెస్‌తోనే తెలంగాణ రాలేదని అన్నారు. వివేక్‌ను, వినోద్‌ను కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చేందుకు రాహుల్‌గాంధీ కాకాకు ఫోన్ చేసి మాట్లాడారని నాయిని చెప్పారు. పోతిరెడ్డిపాడు, పులిచింతల, పోలవరం అక్రమ ప్రాజెక్టులకు పొన్నాలనే కారణమని అన్నారు. టీఆర్‌ఎస్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా పొన్నాల అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. త్వరలోనే టీఆర్‌ఎస్ అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.