Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వాళ్ల ఆటలు ఇంకా సాగాలా?

– రాజకీయ అవినీతినిబొంద పెట్టాలి – తెలంగాణ సాధించిన కీర్తి నాకు చాలు -టీఆర్‌ఎస్‌ను గెలిపించండి.బహ్మాండంగా పనిచేయిస్తా – సీఎంలే వేల కోట్లు సంపాదిస్తున్నారు..ఇక దేశాన్ని ఎవరు కాపాడాలి? – పొన్నాల సన్నాసే.. డౌటే లేదు -టీఆర్‌ఎస్ అధినేత వ్యాఖ్యలు -టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ, ఐఎన్‌టీయూసీ నేతలు -ఇంటిపార్టీ అస్తిత్వం రావొద్దనే వారి కుట్ర..వారిద్దరూ ఆంధ్రకు కొమ్ముకాస్తారు -చంద్రబాబు, వెంకయ్యపై కేసీఆర్ ఫైర్ – పోలవరంపై వారి వైఖరేమిటని ప్రశ్న

KCR 08-04-14

ఇంటి పార్టీకి రాజకీయ అస్తిత్వం ప్రబలంగా రావొద్దనే టీడీపీ, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని, అందుకే తెలంగాణ బీజేపీ నాయకులు వద్దంటున్నా ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు కలిసి తెలంగాణను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వీళ్లిద్దరూ ఆంధ్రకు కొమ్ముకాసేవారేనని స్పష్టం చేశారు.

తెలంగాణ బీజేపీ నేతలు వద్దన్నా జబర్దస్తీగా ఇద్దరు నాయుళ్లు కలిసి పొత్తులు పెట్టుకుంటున్నారని విమర్శించారు. వీరి ఆలోచన ఏందంటే.. తెలంగాణ ఇంటిపార్టీకి రాజకీయ అస్తిత్వం ప్రబలంగా రావొద్దనే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయినా వారి ఆటలు ఇంకా సాగాలనే ఇలా చేస్తున్నారు అని చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్‌లో నిజామాబాద్ టీడీపీ, ఐఎన్‌టీయూసీ నేతలు కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలనే టీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోందని, దీనిపై వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు మాట్లాడగలరా? అని ప్రశ్నించారు.

గిరిజనులను ముంచైనా ప్రాజెక్టు కడతామని అంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని, మన ఈ విధానం ముక్కుమీద గుద్దినట్లుగా ఉంటుందని చెప్పారు. మాదేందో మాకు రావాలి. ఇంకా వాళ్లమాటే వినెటందుకైతే ఇంకెందుకు తెలంగాణ? కడుక్కతాగెతందుకా? జరిగిందేదో జరిగింది. ఇప్పటికైనా మేధావులు ఆలోచించాలి. తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వంలో పనిచేయాలి. ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రప్రభుత్వంలో పనిచేయాలి. ఈ మాట అంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులే గట్లెట్ల అంటవు అంటున్నారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడిదీ అదే పాట. 60 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో ఇంకా సమస్యలు ఎందుకు ఉన్నాయి? కారణం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలే. నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, చేనేత ఆకలిచావులు, గల్ఫ్‌బాధలు ఎన్నో ఉన్నాయి. అన్నింటికీ ఈ రెండు పార్టీల ప్రభుత్వాలే కారణం.

మళ్లీ మేమే సిపాయిలం అన్నట్లుగా మాట్లాడుతున్నారు అని అన్నారు. తెలంగాణ ప్రజలకు మంచి జరగాలంటే అవినీతిని అంతా బయటపెడితేనే అంతా సీదాగా ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వంద శాతం రాజకీయ అవినీతిని బొందబెట్టాలని చెప్పారు. ముఖ్యమంత్రులే వందలవేల కోట్లు సంపాదిస్తుంటే ఈ దేశాన్ని ఇంకెవరు కాపాడాలని ప్రశ్నించారు. మొన్ననే మ్యానిఫెస్టో విడుదల చేసినం. పొన్నాల లక్ష్మయ్య ఏం మాట్లాడుతున్నాడు.. కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడు అంటున్నాడు. ఈ సన్నాసి నన్ను సన్నాసి అంటున్నాడంటున్నాడు. నువ్వు సన్నాసివే. డౌటే లేదు. మీకు తెలంగాణకు ఏం చేయాలో కల్పన లేదు. ప్రజలకు మంచి చేసే మొండితనం, నిజాయితీ, చిత్తశుద్ధి మీకు లేదు.

2001నాడు తెలంగాణ ఉద్యమంలోకి బయలుదేరిన నాడు ఎంత మంది అన్నరు? అయ్యేదికాదు పోయ్యేది కాదన్నారు. చంద్రబాబు అయితే పుబ్బలో పుట్టి మఖలో పోతుందన్నారు. అయితదా అని అనుమాన పడ్డరు. కాలేదా! తెలంగాణ సాధించి చూపలేదా? పదివేల కిలోమీటర్ల పరుగైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. తెలంగాణలో వనరులున్నాయి, మనుషులున్నారు, విలువైన భూములున్నాయి. అయినా రాజకీయ అవినీతిని అంతమొందిస్తే అధికారులు కూడా సరిగ్గా పనిచేస్తారు. బంగారి తెలంగాణను తయారు చేసుకుందాం. తెలంగాణలో 85శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులున్నారు. వారి ముఖాల్లో వెలుగులు చూడాలి, వాళ్ల పెదవులపై చిరునవ్వులు చూడాలి. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందాలి. ప్రజలు పైకి రావాలి. ఈ విధంగా బ్రహ్మాండంగా చేసి చూపిస్తా అని కేసీఆర్ చెప్పారు.

తెలంగాణ తెచ్చి చూపిస్తానని చెప్పి.. సాధించానని, ఇవాళ టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ప్రజలు ఆశ్చర్యపోయేలా ప్రభుత్వాలు ఇలా కూడా పనిచేస్తాయా? అనేలా చేసి చూపిస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనతో తనకొచ్చిన కీర్తి ఈ జన్మకు చాలని, తన జన్మ ధన్యమైందని అన్నారు. ఈ కీర్తి ముందు ఏ పదవి కూడా పనికిరాదని చెప్పారు.కాంగ్రెస్ వారు ఒక్కరూం కట్టించి బలహీన వర్గాల గహనిర్మాణం అంటున్నారని, కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే మూడు లక్షలతో రెండు బెడ్‌రూంలు, హాలు, కిచెన్, లాట్రిన్, బాత్‌రూంతో ఇల్లు కట్టించి ఇస్తానని అన్నారు. బలహీనవర్గాలంతా ఆత్మగౌరవంతో బతికేలా ఈ ఇల్లు కట్టించి ఇస్తామన్నారు. ప్రతి సంవత్సరం లక్ష ఇళ్లు కట్టిస్తామని, దీనికి మూడువేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని తెలిపారు. కొందరు ఇది దేశంలోనే లేదన్నారని, రేపు తెలంగాణను చూసి దేశం మొత్తం నేర్చుకుంటుదని అన్నానని తెలిపారు. ప్రభుత్వాలు ఎప్పుడూ ఇలా ప్రజల కోణంలోనుంచే ఆలోచించాలని అన్నారు. ప్రజలే కేంద్రబిందువుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఉంటుందని చెప్పారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో నిజామాబాద్ ఆర్బన్ ఇన్‌చార్జి ఎస్‌ఏ ఆలీమ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రం, ఐఎన్‌టీయూసీ మాజీ నాయకుడు ఎల్లయ్య తదితరులు ఉన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.