Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వందకుపైగా సీట్లు మావే

-రాజకీయ ప్రేలాపనలకు చెక్ పెట్టేందుకే ముందస్తు
-మెజార్టీ ఉన్నా, సమయం ఉన్నా త్యాగం చేశాం
-రాహుల్ గాంధీ ప్రచారం చేస్తే మాకే లాభం
-సీఎంగా ఉండి పార్టీ సభలో వరాలు ప్రకటించడం అనైతికత
-బీజేపీతో పొత్తు కలువదు.. ఎంఐఎం మాకు ఫ్రెండ్లీ పార్టీ
-విలేకరుల ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానాలు

ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి వచ్చినా టీఆర్‌ఎస్ తప్పకుండా వంద కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి ఫుల్ మెజార్టీ ఉన్నా, సమయం ఉన్నా రాజకీయ ప్రేలాపనలకు చరమగీతం పాడేందుకే ప్రజల వద్దకు వెళ్లడానికి నిర్ణయించుకున్నామన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దేశంలోనే అతిపెద్ద బఫూన్ అని అభివర్ణించారు. ఆయన చేష్టలను ప్రజలు గమనిస్తున్నారని, ఆయన ఎంత ఎక్కువగా ప్రచారం చేస్తే టీఆర్‌ఎస్ అన్ని సీట్లు ఎక్కువ గెలుస్తుందని చెప్పారు. సీఎంగా ఉండి పార్టీ సభలో వరాలు ప్రకటించడం అనైతికత కాబట్టే ప్రగతి నివేదన సభలో ప్రజలకు చేసిన పనులనే చెప్పామన్నారు. గురువారం అసెంబ్లీ రద్దుచేస్తూ మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని గవర్నర్‌కు అందజేసిన అనంతరం తెలంగాణభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వివరాలు ఇవి..

100 సీట్లు గెలుస్తం
రాష్ట్రంలో 2.60 లక్షల డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామన్నాం. వాటి పనులు జరుగుతున్నాయి. నేను కేసీఆర్‌ను.. ఎవరికీ భయపడను. మాకొచ్చిన సర్వేను బట్టి చూస్తే.. ప్రతిపక్షాలు అనేక అంశాల్లో మాకసలు దగ్గరగా కూడా లేవు. మా సర్వేలో 82 నియోజకవర్గాల్లో 60 శాతం పైబడి ఉన్నాం. 100 నియోజికవర్గాల్లో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువే ఉన్నాం. అన్ని పార్టీలు కలిసొచ్చినా టీఆర్‌ఎస్ తప్పకుండా వంద కంటే అదనంగా సీట్లు గెలుస్తుంది. ప్రజల మీద మాకున్న విశ్వాసం ఇది. మేమట్ల మెదిలినం. వాళ్లని ముందుకొచ్చి నిరూపించుకోమనండి. మంచికైనా.. చెడుకైనా ప్రజలే నిర్ణయం తీసుకుంటారు.

ప్రతిపక్షాలకు సవాల్
ఏప్రిల్‌లో అయితే మేం ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అప్పుడు ప్రజలు ఎలాగూ మమ్మల్ని గెలిపిస్తరు. ప్రస్తుతం రాష్ట్రంలో పెరుగుతున్న రాజకీయ అనిశ్చితికి చరమగీతం పెట్టాలనుకున్నా. మా మీద చేసిన ఆరోపణలను నిరూపించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరుతున్నా. మా మీద చేసిన ఆరోపణలన్నీ మైండ్‌లెస్, మీనింగ్ లెస్, అండ్ టోటల్లీ బేస్‌లెస్.. ఆల్ ఆర్ ఫాల్స్ అలిగేషన్స్ అని కచ్చితంగా చెబుతాను. ప్రతిపక్షాలది అన్‌లిమిటెడ్ ఈడియసీ. ఇంతవరకూ వారు చేసిన ఆరోపణల్లో ఒక్కటైనా నిరూపించగలిగారా? ప్రజాస్వామ్యం అనుమతిస్తుందని ఏదిపడితే అది మాట్లాడేస్తారా? వాటిస్ దిస్ నాన్సెన్స్.

నేనే త్యాగం చేశాను
ప్రగతి నివేదన సభ కోసం గ్రౌండ్ సరిపోలేదు. వాహనాలు చాలలేదు. నేను స్వయంగా చూశా. 30 వేల వాహనాలు ఓఆర్‌ఆర్ బయట ఉన్నాయి. అయినా.. ఆ సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యిందని పిచ్చివాళ్లంతా మొరుగుతున్నారు. వాళ్ల మైండే అట్టర్‌ఫ్లాప్. మాట్లాడే దాంట్లో కొంతయినా అర్థంపర్థం ఉండాలి. ఇలాంటి రాజకీయ ప్రేలాపనలకు చరమగీతం పెట్టడానికే ప్రజల వద్దకు వెళ్లడానికి నిర్ణయించుకున్నాను. నేను నా పదవిని త్యాగం చేశాను. మా ఎమ్మెల్యేలు త్యాగం చేశారు. మాకు ఫుల్ మెజార్టీ ఉన్నది. నా అధికారాలకు నేనెందుకు కోత కోసుకోవాలి? అయినా, నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కేవలం తెలంగాణ ఆర్థిక అభివృద్ధి కోసమే పదవిని వదులుకున్నాను. ఈ రాష్ర్టాన్ని కుహనా రాజకీయ నాయకుల నుంచి రక్షించడానికే నిర్ణయం తీసుకున్నాను.

వందశాతం ఆవాసాలకు నల్లానీళ్లు
రాష్ట్రంలోని వందశాతం ఆవాసాలకు నల్లా నీళ్లు వస్తాయి. 22,600 గ్రామాలకు నీళ్లు వచ్చేశాయి. మరో 1,100 గ్రామాలకు నాలుగైదు రోజుల్లో బల్క్ నీరు వస్తుంది. 46 శాతం ఇండ్లకు నీళ్లు వచ్చేశాయి. ఇంటింటికీ నల్లాలు పెట్టేశాం. రాబోయే నెలా, నెల పదిహేను రోజుల్లో అది పూర్తవుతుంది. ఒకవేళ మేం నల్లా నీళ్లు ఇవ్వకపోతే ప్రజలు ఓట్లేయరు కదా.. మీకేంది బాధ?

కాంగ్రెస్ భ్రాంతిలో ఉంది
ఉద్యోగ నియమాకాలు వాళ్లు పదేండ్లలో చేసిన దానికంటే మేం ఎక్కువ చేశాం. దే షుడ్ కీప్ క్వయిట్. వాళ్లవన్నీ బేస్‌లైస్, మైండ్ లెస్, మీనింగ్ ఎస్ అలిగేషన్స్. కాంగ్రెస్ ఎక్కడ పుంజుకుంటున్నది? నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను కదా.. ఫలానా రాష్ట్రంలో 20 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతుందా? ఏ మగాయన చెప్తాడో చెప్పమనండి. ఆ పార్టీ భ్రాంతిలో ఉంది. నారాయణఖేడ్‌లో 53 వేల మెజార్టీతో గెలిచాం. పాలేరులో 40 వేలకు పైగా మెజార్టీతో గెలిచాం. చాలా క్రిటికల్ అని భావించిన కాంగ్రెస్‌కు జీహెచ్‌ఎంసీలో ఐదు సీట్లు రాలేదు. నారాయణ అని ఒకాయన ఉన్నాడు.. చెవి కోసుకుంటానని అన్నడు. ఒంటి చెవి నారాయణను చూడలేనన్నాను. పుంజుకునుడు.. గుంజుకునుడు ఎందుకు? రా ప్రజల వద్దకు వెళ్దాం.. నేను ఎక్కడకి తీసుకెళ్తున్నాను? ఎన్నికలకు వెళ్లాం కాబట్టి.. కాంగ్రెస్‌వాళ్లు సంతోషపడాలి. వెల్‌కం చెప్పాలి. తెలంగాణలో అంతా వెల్‌పెయిడ్ ఉద్యోగులే. గత ప్రభుత్వాలు బానిస చాకిరీ చేయించారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, ఐకేపీలు.. ఇలా అనేకమందిని ఆదుకున్నం. ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం అదనపు రిస్క్ అలవెన్స్ ఇచ్చే ప్రభుత్వం మాదే. చిన్నతరహా ఉద్యోగులకు పెంచాలని ఉన్నది. ఈ పార్టీని గెలిపించుకోండి. చల్లగా జీవించండి.

ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీ
ఎంఐఎం మా మిత్రపక్షం. కలిసి పని చేస్తాం. స్నేహపూర్వక పోటీ కూడా ఉండొచ్చు. మేం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాన్ని అనిశ్చితిలోకి నెట్టెయ్యడానికి ప్రయత్నించారు. ఆ విషయం తెలిసి అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీ నుంచి స్వయంగా నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను అడుగకముందే మాకు మద్ధతు ప్రకటించారు. ఆ రోజు నుంచే మజ్లిస్‌తో స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగిస్తున్నాం. ఇందులో తప్పేముంది? వందశాతం సెక్యులర్‌గా ఉంటాం. కొంతమంది పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. నేను సీఎంని, మోడీ ప్రధానమంత్రి. నాకు అరవైఆరు అవసరాలుంటాయి. గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషన్. పీఎం మీటింగుకు పిలిస్తే ఢిల్లీకి పోవాల్సిందే. మొన్ననే బీజేపీ పార్టీ అధ్యక్షుడు వచ్చి చెప్పిండు కదా.. మజ్లిస్‌తో ఫ్రెండ్లీగా ఉంటే టీఆర్‌ఎస్‌తో మనమెట్ల కలుస్తమయ్యా? మన గోత్రం.. వాళ్ల గోత్రం కలువనే కలువదు, మనం కిలాఫ్ ఉంటం అని. అయినా మా మీద కొందరు రాస్తుండ్రు.

మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశాం
దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరే అనేక పనులు స్టార్ట్ చేశాం. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశాం. రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. సంక్షేమ పథకాలున్నాయి. మిషన్ భగీరథ చేశాం. 7000 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయి. సంక్షేమం ఉంది, శాశ్వత ప్రాతిపదికన ఉన్నాయి. కరెంటులో మిగులు రాష్ట్రమని ప్రజల కండ్ల ముందు ఉంది.

జర్నలిస్టులకు అండగా ఉన్నాం
జర్నలిస్టులకు రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్లు ఇచ్చాం. వారి సంక్షేమం కోసం దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా తెలంగాణ ఇచ్చింది. ఇండ్ల జాగాలపై సుప్రీం కోర్టులో లిటిగేషన్ పెండింగులో ఉన్నది. అందుకే చేయలేదు. ఇప్పుడు తప్పకుండా చేస్తాను. రాసే జర్నలిస్టులే కాదు.. ఫొటో జర్నలిస్టులు, కెమెరా జర్నలిస్టులు.. ఇలా అందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తాం. కాలనీ కట్టడానికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తాం. కొంతమంది జర్నలిస్టులకు మా మినిస్టర్లు కొన్ని చోట్ల స్థలాలు ఇప్పించారు. మరికొంతమందికీ ఇస్తాం. ఓడిపోయినోల్లు ఈవీఎంల మీద బదనాం పెడుతున్నారు. ఈవీఎంలు లంగా పని చేస్తే అధికారంలో ఉన్నవారు పోనే పోరు.

మాది ప్రజల ఫ్రంట్
ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకే, నేను నా సొంత నిర్ణయం తీసుకున్నాను. ఈసీ చాలా స్పష్టంగా తెలియజేసింది. రాజ్యాంగపరమైన సవరణ లేకుండా చేయలేమని తేల్చిచెప్పింది. నేను ఈసీని కలిశాను. ఇతర రాష్ట్రాలతో కలిసి తెలంగాణ ఎన్నికలు జరుగుతాయి. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. డీఎస్.. గతంలో కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు. అనతికాలంలోనే మంచి పోస్టు ఇచ్చాం. రాజ్యసభ సీటు ఇచ్చినాం. ఇక ఆయన ఇష్టం. మాది చక్రాలు తిప్పే ఫ్రంట్ కాదు. ప్రజల ప్రయోజనాలను నెరవేర్చే ఫ్రంట్.. అద్భుతంగా నిలబడుతుంది. రాబోయే రోజుల్లో ఆ విషయాన్ని మీరే చూస్తారు. ఎంఐఎంతో మేం విడిపోం. బీజేపీతో మేం కలువం. మా గోత్రాలు, జాతకాలు కలువవు. ఉప్పల్ అభ్యర్థిని ప్రకటించాం కదా?. మొన్న నితీశ్‌కుమార్ పార్టీకి రాజ్యసభ ఉపాధ్యక్షుడి పదవికి అవకాశం వచ్చిందని నాకు ఉత్తరం రాసిండు. దేశప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మేం సపోర్టు చేసినం. సిద్ధాంతపరంగా టీఆర్‌ఎస్ సెక్యూలర్ పార్టీ. అమిత్ షా మాతో ఒప్పందాన్ని రిజెక్ట్ చేసిండు. యాంటీ మోడీ ఉంటదా? లేదా? అనేది ఎన్నికలు జరిగితేనే తెలుస్తుంది. బీజేపీ వాళ్లు గెలవరు. ఉన్న సీట్లు కాపాడుకుంటే పెద్ద గొప్ప. కలలు ఎన్నో ఉంటాయి. కానీ, అవి సాధ్యమయ్యే పనేనా? అయినా, ప్రజా ధనాన్ని ఎలా ఖర్చు చేయాలో? ఎలా చేయకూడదో? నాకు తెలుసు. ప్రజాధనాన్ని వృథా చేశానని ఎవరైనా చెప్పగలరా?. హండ్రెడ్ పర్సెంట్ టీఆర్‌ఎస్ గెలుస్తుంది.

రాహుల్.. దేశంలోనే అతిపెద్ద బఫూన్!
ఎన్నికలకు వెళ్లడానికి కాంగ్రెస్ భయపడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. రాహుల్‌గాంధీ గురించి దేశంలో అందరికీ తెలుసు. అతను దేశంలోనే అతిపెద్ద బఫూన్. లోక్‌సభలో మోడీని కౌగలించుకోవడం, కన్నుకొట్టడం ప్రజలంతా చూశారు. అతను కేవలం ప్రాపర్టీ లాంటి వాడు. ఆయన తెలంగాణలో ఎంత ఎక్కువగా పర్యటిస్తే అన్ని ఎక్కువ సీట్లను మేం గెలుచుకుంటాం. రాహుల్‌గాంధీ కాంగ్రెస్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తి. ఢిల్లీ రాజవంశం నుంచి వచ్చినవాడు. మనం ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీకి బానిసలు కాకూడదు. తెలంగాణ నిర్ణయం తెలంగాణలోనే జరుగాలి. కాంగ్రెసోళ్లు నాలుగైదు గంటలు ఢిల్లీలో ఎదురు చూడాలి. వాళ్లు టికెట్ల కోసం కూడా అక్కడికి వెళ్లి అడుక్కుంటారు. మేం అలాంటి వాతావరణాన్ని కోరుకోవడం లేదు. తెలంగాణ ప్రజలు ఆత్మాభిమానాన్ని చంపుకోకూడదు.

నేను ఎవరికీ భయపడను
కేసీఆర్ అంటే ఏమిటో మీకు తెలియదు. నేను ఎవరికీ భయపడను. కేవలం ప్రజలకే భయపడతాను. రాహుల్ గాంధీ మోడీని ప్రేమించాడు.. కౌగిలించుకున్నాడు.. దానికి నేనేం చేయాలి? నేను ఎంతో స్పష్టంగా ఉన్నాను. చాలా ఓపెన్‌గా ప్రధానమంత్రి, కేంద్ర మంత్రివర్గం, 29 మంది రాష్ట్రాల సీఎంలు కలిసిన నీతిఅయోగ్ సమావేశంలో చెప్పాను. కేంద్రం వద్ద అనేక అధికారాలున్నాయి. రాజ్యాంగంలో చాలా అంశాలు పొందుపరిచారు. సెంట్రలైజేషన్ ఉండకూడదు. మనదేశంలో అది పెరుగుతున్నది. ఇదే విషయాన్ని పీఎంకు చెప్పాను. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి వంటివి కేంద్రం వద్ద ఎందుకు ఉండాలి? ఎందుకు రాష్ట్రాలకు అటానమస్ అధికారం ఇవ్వరు? ఇలాంటి విషయాలపై భవిష్యత్తులో మిగతా రాష్ట్రాలను కలుపుకుని ముందుకు వెళ్తాం. కొన్ని సబ్జెక్టులను రాష్ర్టాలకిచ్చే విషయంలో పోరాడుతాను.

కాంగ్రెస్, టీడీపీ పొత్తు.. జుగుప్సా కరం
మాకు సమీపంలో ఏ పార్టీ లేదు. ఎన్నికల తర్వాత వాళ్ల తల పగులుతుంది. టీడీపీ ఎక్కడా లేదు. 17 సర్వేలు చేయించాం. కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాదు. పొద్దున లేస్తే ఉత్తరాలు రాసే చంద్రబాబు, గోదావరి, కృష్ణానది గురించి కేసులు వేస్తారు. ఇది రాజకీయమా? ఎంత అసహ్యం? ఎంత జుగుప్సాకరం? ఇదే గులాంగిరి? లేచినోడో.. లేవనోడో..తెలంగాణ వాడే ఉండాలి. ఎన్టీఆర్ కంటే మగోడు కేసీఆర్.. అంటే నేను కావొద్దా? చెన్నారెడ్డి ఫెయిల్ అయ్యిండు నేను సక్సెస్ కాలేదా? ఆపద్ధర్మ ప్రభుత్వం అనేది రాజ్యాంగంలో లేదు. ఏం చేయాలి? ఏం చేయకూడదనేది నైతికపరమైన విషయం. నా లిమిట్స్ ప్రకారం నడుచుకుంటాను.

చేసేదే చెప్తాం
చాలామంది ప్రగతి నివేదన సభలో నేనేదో వరాలు ప్రకటిస్తానని అనుకున్నారు. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నా. ఒకవేళ ప్రకటిస్తే తెల్లారి జీవో విడుదల చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలి. లేకపోతే అది అనైతికం అవుతుంది. అసెంబ్లీ రద్దును నేను ప్రకటించకూడదు. అది మంత్రివర్గ హక్కు తప్ప.. సీఎంగా నేను చెప్పలేను. నిన్నటిదాకా చెప్పినవి, మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నవి మేం వంద శాతం అమలు చేస్తాం. ఇక్కడి నుంచి రోజువారీ పరిపాలన ఉంటుంది. టీఆర్‌ఎస్ పార్టీగా మా మ్యానిఫెస్టోను ప్రకటించే అధికారం మాకు ఉంటుంది. ఎంపీ కేశవరావు అధ్యక్షతన 15 మందితో మ్యానిఫెస్టో కమిటీని ప్రకటించాం. టీఆర్‌ఎస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి ఏమేం చేస్తామనే విషయాలను వారు అధ్యయనం చేస్తారు. కమిటీలో అన్ని వర్గాల వారు ఉన్నారు. ఇప్పటివరకు ఏం చేసినం? ఇంకా ఏం చేయాలి? పెంచాల్సినవి ఏంటి? వచ్చే ఐదేండ్లలో ఎంత ఆదాయం వస్తుంది? ఇలా ప్రతి అంశాన్ని బేరీజు వేసుకుని చెబుతాం. అంతేతప్ప ఎట్ల పడితే అట్ల గుడ్డిగా చెప్పం. ప్రభుత్వ ఆదాయం ఎంత? ఖర్చు ఎంత? ఏం జరుగుతది? ఏం జరుగదు? ఇలా ప్రతీది మాకు అవగాహన ఉన్నది. భవిష్యత్తులో తిరిగి టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే.. మేము చేయబోయే కార్యక్రమాలను మ్యానిఫెస్టోలో స్పష్టంగా చెబుతాం. ప్రతిపక్షాలు ఎన్ని అలయెన్స్‌లు పెట్టుకున్నా మేం పెద్దగా పట్టించుకోం. మేం 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాం. మిగిలినవి జస్ట్ ఫోర్టీన్. ఇందులో ఎలాంటి తప్పడు నిర్ణయం కాదని అనుకుంటాం. వాళ్లతో నేను కానీ మా డిప్యూటీ సీఎం కానీ ఇంకొక్కరు కానీ మాట్లాడుతారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.