Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వారికి మహా ఓటమే

-టీఆర్‌ఎస్‌ గెలుపు ఇప్పటికే ఖాయం -2014 కంటే ఎక్కువ అభిమానం -కేసీఆర్‌కు సీఎం పోస్టు చాలా చిన్నది -ఆయన తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక -కొత్త రాష్ట్రానికి కేంద్రం ప్రోత్సాహమేదీ ? -బీజేపీతో మైత్రి లేదు.. అది మా ప్రత్యర్థే -రాష్ట్ర సాధనలో టీఆర్‌ఎస్‌ పాత్ర లేదంటే స్వాతంత్య్రంలో కాంగ్రెస్‌ పాత్రా లేనట్టే -ఈసారి ధూం ధాంగా బతుకమ్మ -టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ప్రచార సారథి, ఎంపీ కవిత

రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఏర్పాటయ్యేది మహా కూటమి కాదని, మహా జీరో అని ఆ పార్టీ సోషల్‌ మీడియా ప్రచార సారథి, ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. కూటమిలో భాగస్వామ్య పక్షాలవుతున్న కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌కు ప్రజల్లో ఆదరణ లేదన్నారు. అనైతిక పొత్తుకు సిద్ధపడ్డ కాంగ్రెస్‌, టీడీపీపై తెలంగాణ ప్రజలది ధర్మాగ్రహమని, ఆ రెండు పార్టీలు దశాబ్దాలుగా తెలంగాణకు చేసిన అన్యాయాన్ని అనుభవించిన జనం గుండెల్లో ఇంకా ఆగ్రహ జ్వాలలు చల్లారలేదని తెలిపారు. మరోసారి ఆ పార్టీలకు బుద్ధి చెప్పడం కోసం ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? అని ఎదురు చూస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మహా కూటమికి ఓటమి తప్పదని, టీఆర్‌ఎస్‌ గెలు పు ఇప్పటికే ఖాయమైందని అన్నారు. టీఆర్‌ఎస్‌పైౖ 2014లో కంటే ప్రజలు ఇప్పుడు ఎక్కువ అభిమానం చూపిస్తున్నారని, పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ పరిపాలనా దక్షత, ఆయన అమల్లోకి తెచ్చిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైందంటున్న ఎంపీ కవిత ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు..

ఆంధ్రజ్యోతి: విపక్షాల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించారు? ప్రచారం ఎలా సాగుతోంది? కవిత: మా పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ఒక దఫా ప్రచారాన్ని పూర్తి చేశారు. మండలాల వారీగా కార్యకర్తలతో అంతర్గత సమీక్షలు నిర్వహించుకుంటున్నారు. పార్టీ ఎంపీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్ర కమిటీ బాధ్యులు, సానుభూతిపరులు సమావేశాలు పెట్టుకుంటున్నారు. ప్రచారం సాగుతున్న తీరును పరిశీలించుకుంటూ, ఎప్పటికప్పుడు చేసుకోవాల్సిన మార్పులపై చర్చించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మేం ప్రజాక్షేత్రంలో ముందుంటే, విపక్షాలు ఇంకా అభ్యర్థులను వెతుక్కునే పనిలోనే ఉన్నాయి. కనీసం ప్రచారం చేసుకునే పరిస్థితి కూడా వాటికి లేదు. ఇది మాకు బాగా అనుకూలాంశం.

ఆంధ్రజ్యోతి: టీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు నేతలు పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తుండటంపై మీ స్పందన? కవిత: ఇంత పెద్ద పార్టీలో 105 సీట్లు ఒకేసారి ప్రకటిస్తే ఇలాంటి సమస్యలు రావడం సహజం. ప్రజలతోపాటు అన్ని పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని నమ్ముతుండటం, టికెట్ల కోసం పోటీ ఎక్కువైన సందర్భంలో అభ్యర్థులపై పార్టీలో కొంత వ్యతిరేకత ఊహించిందే. దీనిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. అభ్యర్థులకు వ్యతిరేకంగా ఎక్కడైనా పార్టీ నేతలు ఆరోపణలు చేస్తుంటే, వాళ్లతో ఆయన స్వయంగా మాట్లాడుతున్నారు. ఆటంకాలు తొందర్లోనే సమసిపోతాయి. 100 సీట్లను గెలిచి అధికారం సాధిస్తాం.

ఆంధ్రజ్యోతి: కొందరు అభ్యర్థులను మారుస్తారన్న ప్రచారంపై..? కవిత: టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రకటించిన అభ్యర్థులను మార్చాలని పార్టీ వర్గాలు కాదు.. ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. రాజకీయంగా లబ్ధి పొందాలనే దురుద్దేశంతో విపక్షాలే మా అభ్యర్థులను మార్చుతారనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అంతేతప్ప మా పార్టీ నుంచి, మా పార్టీ నేతల నుంచి అభ్యర్థులను మారుస్తారనే సంకేతాలు లేవు.

ఆంధ్రజ్యోతి: టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల కంటే కేసీఆర్‌కు క్షేత్రస్థాయిలో ఎక్కువ సానుకూలత ఉండటానికి కారణాలేంటి? కవిత: కేసీఆర్‌ ఉద్యమ నాయకుడు. మొదటి నుంచి తెలంగాణ కోసం పోరాడిన నేత. రాష్ట్రంపై ఆయనకు ఎంతో ప్రేమ ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్‌ చేసినట్లుగా వినూత్నమైన ఆలోచనలు ఎవరూ చేయలేదు. అభ్యర్థుల కంటే కేసీఆర్‌పై ఎక్కువ సానుకూలతకు ఇదే ప్రధాన కారణం.

ఆంధ్రజ్యోతి: కేసీఆర్‌ ప్రచార సభలు పూర్తిస్థాయిలో ఎప్పటినుంచి ? కవిత: వీలైనంత వేగంగా నిర్వహించాలని మేము కూడా కోరుతున్నాం. ఎందుకంటే జిల్లాల్లో ప్రజలు.. పార్టీ కార్యకర్తల కంటే ఉత్సాహంగా ఉన్నారు. కేసీఆర్‌ ఎప్పుడు వస్తారో చూడాలన్న ఆతృత వారిలో కనిపిస్తోంది. ఇలాంటి ఉత్సాహం ప్రతి చోటా కనిపిస్తోంది. దీనిని నేను స్వయంగా గమనించాను. నేను కూడా నిజామాబాద్‌, జగిత్యాల తదితర ప్రాంతాల్లో జరిగే సభలకు వీలైనంత త్వరగా రావాలని కోరుతున్నాను.

ఆంధ్రజ్యోతి: టీఆర్‌ఎస్‌ ప్రచార ప్రక్రియలో మీ పాత్ర ఏమిటి ? కవిత: ప్రాథమికంగా నేను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచార బాధ్యతను స్వీకరించాను. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 9 ఎమ్మెల్యే సీట్లను గెలిచే లక్ష్యంతో పనిచేస్తున్నా. అలాగే జగిత్యాల జిల్లాలో కొప్పుల ఈశ్వరన్న సారథ్యంలో ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి, వేములవాడ తదితర ప్రాంతాల్లో కలిసి పనిచేస్తున్నాం. పార్టీ ఏది చెబితే అది చేస్తా.

ఆంధ్రజ్యోతి: పార్టీ తరఫున సోషల్‌ మీడియా ప్రచార సారథిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కదా! కవిత: అవును.. పార్టీ సందేశాన్ని సోషల్‌ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోవాలన్న ఆదేశాలు వచ్చాయి. సెల్‌ఫోన్‌, వాట్సాప్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌.. ఇలా అన్నింటి ద్వారా కోటి మందిని కనెక్ట్‌ అయ్యే పనిలో ఉన్నాం. జిల్లాల్లోనూ ఎక్కడికక్కడ సోషల్‌ మీడియా కార్యవర్గాలు ఏర్పాటు చేస్తున్నాం. ఉదాహరణకు నిజామాబాద్‌ జిల్లాకు దాదాపు 50 మందితో ఒక బృందాన్ని, జగిత్యాల జిల్లాకు మరో 50 మందితో సోషల్‌ మీడియా విభాగం ఏర్పాటు చేశాం.

ఆంధ్రజ్యోతి: టీఆర్‌ఎస్‌తో పొత్తుకు టీడీపీ ఆసక్తిగా ఉన్నా.. ప్రధాని మోదీ పొసగనీయలేదని చంద్రబాబు వాఖ్యలపై? కవిత: (నవ్వుతూ) ఇది వాస్తవానికి నా పరిధిలో లేని అంశం. టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం వారు (చంద్రబాబు-టీడీపీ) ఎప్పుడు ప్రయత్నించారో తెలియదు. కానీ, టీఆర్‌ఎ్‌సతో టీడీపీ పొత్తును ఎవరో ఆపితే.. వద్దంటే.. అమాయకంగా చంద్రబాబు వెళ్లి కాంగ్రె్‌సతో పొత్తు పెట్టుకుంటున్నారని నేను అనుకోవడం లేదు. కాంగ్రె్‌సతో పొత్తు పెట్టుకున్నారంటే, ఏదో పొలిటికల్‌ గేమ్‌ ఉందని అర్థం. కాకపోతే క్షేత్రస్థాయిలో ప్రజలు మాత్రం.. ఆంధ్రా పార్టీ (టీడీపీ)తో కాంగ్రెస్‌ పార్టీ పొత్తు పెట్టుకోవడం సరికాదని అనుకుంటున్నారు.

ఆంధ్రజ్యోతి: కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు విఫలమయ్యారనే కాంగ్రెస్‌ ఆరోపణలపై.. ? కవిత: ఇది వారి అజ్ఞానానికి పరాకాష్ఠ. నా నిజామాబాద్‌ నియోజకవర్గం గురించే చెబుతా. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. అయినప్పటికీ, అప్పటి కాంగ్రెస్‌ ఎంపీ.. పెండింగ్‌లో ఉన్న రైల్వే లైను కోసం పదేళ్లలో రూ.100 కోట్ల నిధులు కూడా తీసుకురాలేదు. నేను వందకు 100ు నిధులు తీసుకొచ్చి.. రైల్వేలైన్‌ పూర్తి చేయించాను. మరిన్ని రైళ్లు ఈ లైన్‌లో నడిచేలా చేశాను. ఇది ఒక ఎంపీగా నేను సాధించినవే. టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఎన్నో విధాలుగా నిధులు సాధించే ప్రయత్నం చేశారు.

ఆంధ్రజ్యోతి: కేంద్రంనుంచి ఏదైనా సాధించలేదన్న అసంతృప్తి ఉందా? కవిత: ఒక్కటి మాత్రం నిజం.. ఓ కొత్త రాష్ట్రానికి ఇవ్వాల్సినంత స్థాయిలో ప్రోత్సాహాన్ని కేంద్రం ఇవ్వలేదు. విభజన చట్టంలోని హామీలను త్వరగా తేల్చకుండా తాత్సారం చేస్తూ వచ్చింది. ఇందులో ప్రధాన పాత్ర ఏపీ సీఎం చంద్రబాబుకు ఉంది. ఉదాహరణకు హైకోర్టు విభజనను మొన్నటి వరకు కూడా తేల్చని ఘనత చంద్రబాబుదే.

ఆంధ్రజ్యోతి: టీఆర్‌ఎస్‌ బీజేపీకి..ప్రత్యేకించి ప్రధాని మోదీకి సన్నిహితమనే వార్తల్లో నిజమెంత ? కవిత: మేం సన్నిహితంగా ఉంటే హైకోర్టు విభజన ఎప్పుడో జరిగేది. టీఆర్‌ఎస్‌కు, బీజేపీకి ఎలాంటి సాన్నిహిత్యం లేదు. బీజేపీ మాకు ప్రత్యర్థి పార్టీ.

ఆంధ్రజ్యోతి: తెలంగాణ సాధనలో టీఆర్‌ఎస్‌ పాత్ర లేదని గులాంనబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన ? కవిత: భారత స్వాతంత్రోద్యమంలో కాంగ్రెస్‌ పాత్ర లేదని ఆజాద్‌ అనుకుంటే, తెలంగాణ సాధనలో టీఆర్‌ఎస్‌ పాత్ర లేదని భావించొచ్చు. టీఆర్‌ఎస్‌ ఉద్యమిస్తేనే, కాంగ్రెస్‌ చచ్చినట్టు పార్లమెంటులో బిల్లు పెట్టింది. ఆజాద్‌ వ్యాఖ్యలు విని ప్రజలు నవ్వుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డే. ఆయనకు ఉద్యమాలు, ప్రజల ఆకాంక్షలు తెలియవు. తెలంగాణ సాధనలో కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పాత్ర లేదనటం కన్నా పెద్ద అవమానం లేదు.

ఆంధ్రజ్యోతి: తండ్రి సీఎం.. సోదరుడు మంత్రి.. వీరిద్దరిలో మీరు ఎవరి దగ్గర ఎక్కువగా రాజకీయాలు చర్చిస్తారు ? కవిత: (నవ్వుతూ).. ఉద్యమ సమయం నుంచి కుటుంబమంతా ప్రజా జీవితంలో ఉండటంతో మేం ఎప్పుడు కలిసినా ప్రజల సమస్యలపైనే చర్చ. వేరే ఏదీ ఉండదు. ఎప్పుడో ఒకసారి పిల్లల అంశం చర్చకు వస్తుంది. రెగ్యులర్‌గా అన్నయ్యతోనే ఎక్కువగా రోజువారీ చర్చలు ఉంటాయి. నాన్న కూడా రెగ్యులర్‌గా సలహాలు, సూచనలు డైరెక్షన్‌ ఇస్తారు. రోజూ న్యూస్‌ పేపర్లను పైనుంచి కిందవరకు చదువుతారు. ఎక్కడ చిన్నమాట మాకు వ్యతిరేకంగా వచ్చినా.. ఇదేంటని అడుగుతారు.

ఆంధ్రజ్యోతి: కేసీఆర్‌ ఎక్కువగా ఎవరినీ కలవరనే విమర్శ ఉంది ? కవిత: రాజకీయాల్లో ఒక్కొక్కరికి ఒక్కో శైలి. సీఎం కేసీఆర్‌ ఎక్కువగా ఎవరినీ కలవరన్న విషయం ఆయన (కేసీఆర్‌)తో 25 ఏళ్లకుపైగా స్నేహం ఉన్న ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ గారికి కూడా తెలుసు. వ్యక్తి, వ్యక్తిత్వం అంటే, సీఎం అయిపోగానే మారిపోయేవి కావు. మార్పు వచ్చే పర్సనాలిటీ కేసీఆర్‌ది కాదు. సింప్లిసిటీలో, మాట్లాడే స్టైయిల్‌లో, పనితీరులో.. కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి మార్పు రాలేదు. ఆయన ఎప్పుడైనా ఒకేలా ఉన్నారు. కేసీఆర్‌ ఎవరినీ కలవరు అనేవి అనవసర ఆరోపణలు తప్పితే ఇంకోటి కావు.

ఆంధ్రజ్యోతి: ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 50% పైగా ఓట్లు వస్తాయిని కేసీఆర్‌ ధీమాగా చెబుతుండటానికి కారణాలేంటి ? కవిత: దాదాపు 570కి పైగా పథకాలు చేపడుతున్నాం. ప్రతి ఇంట్లో ఏదో ఒకరకంగా ప్రభుత్వంతో లబ్ధి పొందుతున్నారు. రెండు, మూడు పథకాలతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాలూ ఉన్నాయి. వారికి ప్రభుత్వంపై, ప్రత్యేకించి కేసీఆర్‌పై సానుకూల దృక్పథం ఉంది. మేము 100% ప్రజలను చేరుకున్నందున, 50% ప్రజలైనా ఓటు వేస్తారని విశ్వసిస్తున్నాం. 2014లో కంటే కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌పై ప్రజలు చాలా బలంగా అభిమానాన్ని చాటుతున్నారు.

ఆంధ్రజ్యోతి: మహాకూటమి ప్రభావం టీఆర్‌ఎస్‌పై ఉంటుందా? కవిత: మహాకూటమి ప్రభావం ఉండదు. పూర్తిగా జీరో. ఎందుకంటే, తెలంగాణలో టీడీపీ లేదు. ఇద్దరు ముగ్గురు నేతలు తప్ప.. మిగతా నేతలు, కార్యకర్తలంతా టీఆర్‌ఎ్‌సలో చేరారు. కాంగ్రె్‌సలో అవుట్‌ డేటెడ్‌ నేతలు తప్ప.. ప్రజాభిమానం ఉన్న వారు లేరు. ఇక సీపీఐ, సీపీఎంకు ఉన్న ఓట్ల శాతం చాలా తక్కువ. అవి గెలిపించే ఓట్లు కాదు, ఓడించే ఓట్లూ కాదు. ఇక టీజేఎ్‌సకైతే.. కార్యకర్తలు లేరు, నేతలు లేరు. వారి గురించి ప్రజలు కనీసం కూడా ఆలోచించడంలేదు.

ఆంధ్రజ్యోతి: ఈ ఎన్నికల సందడిలో బతుకమ్మ సందడి మాటేంటి? కవిత: ఈసారి బతుకమ్మ పండుగను ధూమ్‌ ధామ్‌గా చేసుకుంటాం. ప్రజల్లో చాలా జోష్‌ ఉంది. దానికి తగ్గట్టుగానే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ నిర్వహించుకుంటాం.

కేసీఆర్‌కు సీఎం పోస్టు చాలా చిన్నది కేసీఆర్‌ గొప్ప వ్యక్తి. ఆయన వ్యక్తిత్వానికి, రాజనీతిజ్ఞతకు, మంచితనానికి సీఎం పోస్టు చాలా చిన్నది. ఎవరైనా రాష్ట్రానికి సీఎంగా ఉంటే ఆయన అధికారాలు, పాలన గురించి మాట్లాడుకుంటారు. కానీ, కేసీఆర్‌ ఆలోచన, ఆచరణ అందుకు భిన్నం. ఆయన రాజకీయాల కోసమే కాకుండా.. భవిష్యత్తు తరాల కోసం తపిస్తారు. సీఎం పదవిలో ఉంటేనే సీఎంగా గుర్తుపెట్టుకుంటారు. కానీ, కేసీఆర్‌ను వందేళ్ల తర్వాత కూడా ప్రజలు గుర్తుపెట్టుకునే స్థాయిలో పనిచేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా సీనియర్‌ సిటిజన్లు నేను గమనించిన ఆసక్తికర అంశం.. సీనియర్‌ సిటిజన్లు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండటం. వారు ఫేస్‌బుక్‌, ఇంటర్నెట్‌, వాట్సా్‌పను ఎక్కువగా వాడుతున్నారు. వారికి తీరిక సమయం అధికంగా ఉండటమే ఇందుకు కారణం. ఇలాంటి వారిపైనా పెద్ద ఎత్తున ఫోకస్‌ పెడుతున్నాం.

తొమ్మిది గజాల చీర పంపించమన్నది ఈ మధ్య నేను ఆర్మూరుకు వెళ్లినపుడు ఒక ముసలవ్వ నా దగ్గరికి వచ్చి ఎంతో ఆప్యాయంగా పలకరించింది. ‘ఈసారి బతుకమ్మ పండుగకు నాకు తొమ్మిది గజాల చీర పంపించు’ అని ఆమె నిండు మనస్సుతో అడిగింది. ఆర్మూరు మహిళలు తొమ్మిది గజాల చీరలు కట్టుకుంటారు.

కేసీఆర్‌తోనే తెలంగాణ నంబర్‌వన్‌ కేసీఆర్‌ శ్రమ ఫలితంగానే రాష్ట్రం దేశంలో నంబర్‌వన్‌ స్థానంలో ఉంది. దీని వెనుక కేసీఆర్‌ 13 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, నాలుగేళ్లలో పడిన కష్టం, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం రుషిలా చేసిన తపస్సు ఉన్నాయి. ప్రతి పథకం, ప్రాజెక్టు, ప్రతి మంత్రిత్వశాఖ పథకాల వెనుక కేసీఆర్‌ పడిన మేథో శ్రమ ఉంది. తన ఆలోచనతో తెలంగాణను దాదాపు 25 రంగాల్లో ఇతర రాష్ట్రాలేవీ అధిగమించలేని స్థితికి తీసుకొచ్చారు.

నాడు ఎన్టీఆర్‌.. నేడు కేసీఆర్‌.. నాడు ఎన్టీఆర్‌ను ఎలాగైతే ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అనుకునేవారో.. ఇవాళ కేసీఆర్‌ను కూడా ఢిల్లీలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా చూస్తున్నారు. తెలంగాణకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందంటే.. దానికి కేసీఆరే కారణం. దక్షిణాదిలో మదరాసీలే కాదు, తెలుగువారు కూడా ఉంటారని ఆ రోజు ఎన్టీఆర్‌ కారణంగా దేశానికి ఎలా తెలిసిందో, ఇవాళ తెలుగువారే కాదు.. తెలంగాణ వారు కూడా ఉంటారన్న భావన కేసీఆర్‌ వల్లే కలిగింది. తెలంగాణ ఇంత గొప్ప రాష్ట్రమని తెలిసిందంటే అది కేసీఆర్‌తోనే.

టీఆర్‌ఎస్‌ దగ్గర కేసీఆర్‌ ఉన్నారు ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు ఓటు వేయాలా? వద్దా? అని ప్రజలు ఆలోచించేటప్పుడు, టీఆర్‌ఎస్‌ వద్ద కేసీఆర్‌ ఉన్నారనే విషయం తప్పక స్ఫురణకు వస్తుంది. సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ బ్రహ్మాస్త్రం. దాంతోనే మేం ప్రజల్లోకి వెళ్తున్నాం. ఆయన ఆలోచనలతోపాటు తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది ప్రజలకు వివరిస్తాం. అంతిమంగా కేసీఆర్‌ పాలనా తీరును వివరించడం ద్వారానే విజయం సాధిస్తామని నమ్ముతున్నా.

ప్రజలు ఎన్నికలు ఎప్పుడొస్తాయంటున్నారు చెబితే నమ్మరు. చాలా చోట్ల మాకు ఈసారి గతంలో కంటే భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. గతంలో మేం ఉప ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు ప్రజలు..‘ఎన్నికలు ఎందుకు వచ్చాయి?’ అని ప్రశ్నించే వారు. ఇప్పుడేమో ‘ఇంకెప్పుడు ఎన్నికలు వస్తాయి?’ అని అడుగుతున్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నట్లుగానే భావించి, ప్రజలు పనులు చేసి పెట్టాలని కోరుతున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.