వరంగల్ సమీపంలోని దేవనూరులో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. లక్ష మరమగ్గాలతో ఏర్పాటుకానున్న ఈ పరిశ్రమకు కావలిసిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాజధాని తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్‌ను హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి పరుస్తామని అన్నారు. రాష్ర్టానికి మంజూరయ్యే యూనివర్సిటీలు, సంస్థలు వరంగల్‌కు కూడా తరలిస్తామని చెప్పారు.

-హైదరాబాద్‌కు దీటుగా వరంగల్ అభివృద్ధి -కొత్త వర్సిటీలు, సంస్థలు ఇక్కడే -ఔటర్ రింగ్‌రోడ్డు, జంక్షన్లు, మల్టీలెవల్ ఫ్లైఓవర్లు -దేశం మెచ్చేలా కాకతీయ ఉత్సవాలు -వరంగల్ జిల్లా సమీక్షలో సీఎం కేసీఆర్ -నగర పరిసరాల్లో ఏరియల్ సర్వే -అధికారుల తీరుపై సీఎం అసహనం -పద్ధతి మార్చుకోవాలని మందలింపు -హౌసింగ్‌పై త్వరలో అఖిలపక్షం నగరంలో రహదారులు, జంక్షన్లను అభివృద్ధి చేయాలని, ఔటర్ రింగురోడ్డు పనులు సత్వరం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. త్వరలో జరగనున్న కాకతీయ ఉత్సవాలు దేశం దృష్టిని ఆకర్షించేలా ఘనంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సోమవారం వరంగల్‌లో పర్యటించిన సీఎం, జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో టెక్స్టైల్ పరిశ్రమ, వరంగల్ నగరాభివృద్ధి, ఔటర్ రింగ్‌రోడ్డు, కాకతీయ ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ వస్త్ర పరిశ్రమ అంతా ఒకేచోట కేంద్రీకృతమయ్యేలా దేశంలోని అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన టెక్స్టైల్ పార్కును వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఈ పరిశ్రమ రాకతో వరంగల్ రూపురేఖలు మారుతాయన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండవ అతిపెద్ద నగరమని, దీనిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుత ట్రాఫిక్ రద్దీని తట్టుకోవడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రహదారులు, జంక్షన్లను అభివృద్ధి చేయాలని అన్నారు.
వస్త్రపరిశ్రమకు వరంగల్ కేరాఫ్ కావాలి వస్త్ర పరిశ్రమకు వరంగల్ కేరాఫ్ అనేవిధంగా అత్యాధునిక సౌకర్యాలతో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. వస్త్ర పరిశ్రమకు పేరెన్నికగన్న తమిళనాడులోని తిర్పూర్, గుజరాత్‌లోని సూరత్‌కు తీసిపోకుండా ఇందులో లక్ష పవర్‌లూమ్స్ ప్రారంభిస్తామన్నారు. సూరత్‌లో దొరికే చీరలు, షర్ట్లు, సల్వార్ మెటీరియల్, తిర్పూర్‌లో దొరికే రెడీమేడ్ దుస్తులు, షోలాపూర్‌లో లభ్యమయ్యే చద్దర్లు ఇలా అన్నీ ఇక్కడ కొలువు తీరాలని, వీటికి సంబంధించిన మార్కెటింగ్ కూడా ఇక్కడి నుంచే జరగాలని సీఎం తన ప్రణాళికను వివరించారు. ఒకసారి టెక్స్‌టైల్‌పార్కు ఏర్పాటైతే జిల్లాలో 10 లక్షల జనాభా పెరుగుతుందని, దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం అన్నారు. ప్రపంచంలో నంబర్ వన్‌గా గుర్తింపు పొందిన సూరత్ వంటి టెక్స్టైల్ సిటీగా వరంగల్‌ను తీర్చిదిద్దాలన్నది తన లక్ష్యమని సీఎం చెప్పారు. టెక్స్టైల్ సిటీని అభివృద్ధి చేసి కేంద్రప్రభుత్వ సహకారంతో రూ.300 కోట్ల వ్యయం తో లక్ష పవర్‌లూమ్స్‌తో ప్రపంచంలోనే నాణ్యమైన పరిశ్రమగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. వరంగల్ జిల్లా నుంచి మూడు నుంచి ఐదు లక్షల మంది చేనేత కార్మికులు జీవనోపాధికి సూరత్‌కు వెళ్లారని వారికి, వారితోపాటు వరంగల్ జిల్లా నిరుద్యోగులకు ఇక్కడ ఉపాధి కల్పిస్తామని అన్నారు.
ఈ పరిశ్రమ ఏర్పాటుకు భూమి ఎంపిక విషయమై జరిగిన చర్చలో ఓ దశలో అధికారుల జవాబులపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. హన్మకొండ, హసన్‌పర్తి, గీసుగొండ మండలాల్లో ప్రతిపాదించిన 1900 ఎకరాలు ఒకే పాకెట్‌గా కాకుండా అక్కడక్కడా ఉండడంపై పెదవి విరిచారు. లక్ష పవర్‌లూమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం వస్త్ర పరిశ్రమ అంతా ఒకే పాకెట్లా ఉండాలి.
అలా ఒకే దగ్గర కనీసం వేయి ఎకరాల భూమి నగరం చుట్టుపక్కల లేదా? అని ప్రశ్నించారు. అధికారులు కొంత తటపటాయిచడంతో ఒకింత అసహనం వ్యక్తం చేశారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో 1518 హెక్టార్ల అటవీభూమి ఉందని అధికారులు చెప్పారు. అందులో వరంగల్ జిల్లా పరిధిలో ఇనుపరాతిగుట్ట బ్లాక్‌లో 718 హెక్టార్ల భూమి అందుబాటులో ఉందని, ఇది నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని అధికారులు చెప్పారు.
అక్కడ ఈ పరిశ్రమ ఏర్పాటుకు కావలిసిన వసతులు ఇతర విషయాలు పరిశీలించి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నగర పరిసర ప్రాంతాలతోపాటు దేవనూర్, జాకారం అటవీ భూములను కూడా అవసరమైతే టెక్స్టైల్ పార్కు నెలకొల్పేందుకు పరిశీలించాలని సీఎం సూచించారు. ఇప్పటికే గుర్తించిన భూములతోపాటు తాజాగా తెరపైకి వచ్చిన దేవనూర్ భూముల వివరాలు తెప్పించుకొని ఏరియల్ సర్వే నిర్వహించారు.
ఓరుగల్లు నగరికి రాచఠీవి.. హైదరాబాద్ ఇప్పటికే కిక్కిరిసిపోయింది. కొత్తగా వచ్చే యూనివర్సిటీలు, సంస్థలు, ఐటీ కంపెనీలను వరంగల్‌కు తరలిస్తాం. దీనివల్ల వరంగల్ నగర జనాభా కొద్ది సంవత్సరాల్లోనే రెట్టింపు అవుతుంది. 20 లక్షల జనాభా నివసించడానికి అనువుగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దాలి. రాంపూర్ నుంచి హన్మకొండ చౌరస్తా, పోచమ్మమైదాన్ ద్వారా ధర్మారం వరకు ఉన్న ప్రధాన రహదారిని 150 ఫీట్ల మేరకు విస్తరించాలి. హంటర్‌రోడ్, ఆర్ఈసీ-కేయూసీ-పెద్దమ్మగడ్డ రహదారిని 150ఫీట్ల మేర వెడల్పు చేయాలి. ఆ రోడ్ల వెంట వాకింగ్, బైసైకిల్ పాత్లను నిర్మించాలి.
అదేవిధంగా కడిపికొండ రహదారిని, కాజీపేట రైల్వేస్టేషన్ పక్కన నుండి వరంగల్ హంటర్‌రోడ్ ఆర్ఓబీ రహదారిని, కరీంనగర్ రహదారిని బాగా విస్తరించాలి అని సీఎం ఆదేశించారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్, ములుగురోడ్, పోచమ్మమైదాన్ లాంటి జంక్షన్ల వద్ద మల్టీలెవల్ సపరేటర్స్ నిర్మించాలని సూచించారు. మొత్తం రహదారుల అభివృద్ధిని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని, వీటికి సంబంధించిన డీపీఆర్‌ను త్వరలో పూర్తిచేయాలని ఆర్అండ్బీ అధికారులను సీఎం ఆదేశించారు.
నగరం చుట్టూ కరుణాపురం నుంచి ములుగురోడ్, దామెర చౌరస్తా వరకు 29 కిలోమీటర్ల జాతీయ రహదారి, అదేవిధంగా దామెర చౌరస్తా నుంచి ఖమ్మం రోడ్డు మీదుగా కరుణాపురం వరకు 44 కిలోమీటర్లు మొత్తం 73 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రణాళిక ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. దీంతో పాటు మామునూర్ ఎయిర్‌పోర్టులో ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు.
హౌసింగ్‌పై త్వరలో అఖిలపక్షం రాష్ట్రంలో గృహనిర్మాణం విషయంలో కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్ఠంభన, కొత్తగా ప్రవేశపెట్టే ప్రతిష్ఠాత్మక డబుల్ బెడ్రూం ఫ్లాట్ నిర్మాణంవంటి అంశాలపై సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. గతంలో నిర్మించిన ఇండ్ల బిల్లుల విషయంలో, కోట్ల రూపాయల హౌసింగ్ కుంభకోణం, సీఐడీ దర్యాప్తు తదితర అంశాల్లో ప్రతిష్ఠంభన నెలకొన్నదని, దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. అన్ని విషయాలను పరిశీలించేందుకు కొత్త పథకం విధి విధానాలు మొదలైన అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు త్వరలో అఖిలపక్షం వేసి అందులో నిర్ణయం తీసుకుంటామని సీఎం అన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ సమావేశంలో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, మంత్రులు అజ్మీరా చందూలాల్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి రామచంద్రు నాయక్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, ఎంపీలు కడియం శ్రీహరి, అజ్మీరా సీతారాంనాయక్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్ జీ కిషన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సీఎం ఏరియల్ సర్వే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరంగల్ నగరం, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. రింగ్‌రోడ్డు, రహదారుల నిర్మాణం, టెక్స్టైల్ పార్క్‌కు అనువైన స్థలం కోసం వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ధర్మసాగర్ మండలం దేవునూర్ సమీపంలోని అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అంతకు ముందు కలెక్టరేట్లో సీఎంకు పై స్థలాలపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.