-కాళేశ్వరం సహా అన్నీ పాతవే.. మళ్లీ అనుమతులెందుకు?
-ఆ పదకొండూ సీడబ్ల్యూసీ ఆమోదించినవే
-అయినా అనుమతుల్లేని జాబితాలో చేర్చారు
-వెంటనే తొలగించి గెజిట్ జారీచేయండి
-కేంద్ర జల్‌శక్తి మంత్రికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులన్నింటికీ గతంలోనే సీడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చిందని, వాటికి న్యాయమైన నీటి కేటాయింపులు ఉన్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఇటీవల జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్లో తెలంగాణకు సంబంధించి 11 ప్రాజెక్టులను అనుమతుల్లేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చారని.. వాటిని వెంటనే ఆ జాబితా నుంచి తొలగించాలని కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ సోమవారం కేంద్ర జల్‌శక్తి మంత్రిని కలిసి తెలంగాణ సర్కారు నిర్మిస్తున్న ప్రాజెక్టుల పూర్తి వివరాలను, వాటికి ఉన్న నీటి కేటాయింపులను కూలంకషంగా వివరించారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ర్టానికి ఉన్న న్యాయమైన వాటాకు సంబంధించి అన్ని నివేదికలను ఈ సందర్భంగా అందజేశారు.
గతంలోనే సీడబ్ల్యూసీ అనుమతులు
రాష్ట్రానికి గోదావరి జలాల్లో 967.94 టీఎంసీల కేటాయింపులున్నాయని, అందులో ఇప్పటికే 758.76 టీఎంసీలను వినియోగించుకొనేందుకు చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతులున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. 148.82 టీఎంసీలకు హైడ్రాలజీ విభాగం క్లియరెన్సులు ఇచ్చిందని స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాల కోసం 60.26 టీఎంసీల జలాలను రిజర్వులో పెట్టుకున్నామని వెల్లడించారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు 85 టీఎంసీలను కేటాయింపులు ఉన్నాయని, అందుకు సంబంధించి ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మధ్య అంతరాష్ట్ర ఒప్పందం కూడా ఉన్నదని గుర్తుచేశారు. ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్‌కు 16 టీఎంసీల చొప్పున కేటాయిస్తూ ప్రిన్సిపుల్ అప్రూవల్స్కూడా ఇచ్చారని వివరించారు. దేవాదుల ఎత్తిపోతల పథకానికి 38 టీఎంసీలను కేటాయించడంతోపాటు, ఆ ప్రాజెక్టుకు ఇప్పటికే అనుతులన్నీ పొందామని తెలిపారు. మొత్తంగా ఈ నాలుగు ప్రాజెక్టులకు 155 టీఎంసీలను కేటాయిస్తూ సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతులకు సంబంధించిన పత్రాలను కేంద్రమంత్రికి అందజేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం 70 టీఎంసీలతో సీతారామ ప్రాజెక్టు, తుపాకులగూడెం బరాజ్సహా దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని 60 టీఎంసీలతో, ముక్తీశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టును (చిన్న కాళేశ్వరం) 4.5 టీఎంసీలు, రామప్ప-పాకాల లింక్‌ను 3 టీఎంసీలు, మోడికుంటవాగు ప్రాజెక్టును 2.14 టీఎంసీలు, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతలను 0.8 టీఎంసీలతో చేపట్టామని వెల్లడించారు. సీడబ్ల్యూసీ కేటాయించిన మొత్తం 155 టీఎంసీలలో 140.44 టీఎంసీలు వినియోగించుకుని, మిగిలిన 14.56 టీఎంసీలను రిజర్వ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
వాటికి అనుమమతులే అక్కర్లేదు
కాళేశ్వరం ప్రాజెక్టుకు 240 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని, అందుకు సీడబ్ల్యూసీ నుంచి అన్ని అనుమతులు పొందామని సీఎం కేసీఆర్.. కేంద్రమంత్రి షెకావత్‌కు వివరించారు. కేటాయించిన నీటిని తక్కువ సమయంలో వినియోగించుకునేందుకే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా రాష్ట్ర నిధులతో ప్రాజెక్టును చేపట్టిందని తెలిపారు. అయినప్పటికీ అదనపు టీఎంసీ తరలింపునకు కొత్తగా ప్రాజెక్టును చేపట్టినట్టు పేర్కొనడమేగాక.. గెజిట్‌లో అనుమతిలేని ప్రాజెక్టుల జాబితాలో కాళేశ్వరాన్ని చేర్చారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కాళ్వేశ్వరం ప్రాజెక్టు కొత్తదేమీ కాదని, అదనపు టీఎంసీ తరలింపునకు ఎలాంటి అనుమతులూ అవసరం లేదని కేంద్రమంత్రికి సీఎం స్పష్టం చేశారు. కందకుర్తి లిఫ్ట్ చిన్నతరహా ప్రాజెక్టు అని, కేవలం 3,300 ఎకరాల ఆయకట్టుకే నీటిని అందిస్తున్నదని, దానికి ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రామప్ప-పాకాల లింక్, తుపాకులగూడెం బరాజ్.. దేవాదుల ఎత్తిపోతల పథకంలో ఒక భాగమని, వాటికి కొత్తగా అనుమతులు అక్కర్లేదని వివరించారు. కడెం ప్రాజెక్టులో గూడెం లిఫ్ట్ ఒక భాగమని, అదికూడా చివరి ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకేనని స్పష్టంచేశారు. కంతనపల్లి ప్రాజెక్టు సైతం కొత్తదేమీ కాదని, దానిని కూడా అనుమతుల్లేని జాబితా నుంచి తొలగించాలని కేంద్రమంత్రిని కోరారు. ఈ మేరకు గోదావరి నదీ యాజమాన్యబోర్డు (జీఆర్ఎంబీ), సీడబ్ల్యూసీకి మార్గదర్శకాలను జారీ చేయాలని విజ్ఞప్తిచేశారు. సమావేశంలో సీఎం కేసీఆర్‌తోపాటు సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్, గణపతిరెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎస్ఈ కోటేశ్వర్రావు, కేంద్రమంత్రి సలహాదారు వెదిరె శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ హైవేను 6 లేన్లు చేయండి
-జాతీయ రహదారులు అభివృద్ధి పర్చండి
-రోడ్ల అభివృద్ధికి సీఆర్ఐఎఫ్ నిధులివ్వండి
-దక్షిణ ఆర్ఆర్ఆర్ను ఆమోదించండి
-కృష్ణానదిపై సోమశిల వద్ద వంతెన కట్టండి
-కేంద్రమంత్రి గడ్కరీకి సీఎం కేసీఆర్ వినతి
-పలు రోడ్లకు నిధులు కోరుతూ 5 లేఖలు

రాష్ట్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోరారు. రెండు తెలుగు రాష్ర్టాల రాజధానులను కలిపే 65వ నంబరు జాతీయ రహదారిని ఆరు లేన్లకు విస్తరించాలని విజ్ఞప్తిచేశారు. సోమవారం ఢిల్లీలో గడ్కరీతో భేటీ అయిన కేసీఆర్.. రాష్ట్రంలో రహదారులకు సంబంధించి 5 లేఖలు అందజేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత 2,168 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మొత్తం 3,306 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా గుర్తిస్తామని అంగీకరించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. మిగిలిన 1,139 కిలోమీటర్ల రహదారుల గుర్తింపును కూడా పూర్తిచేయాలని కోరారు. వీటిలో 442 కిలోమీటర్ల నాలుగు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అత్యంత ప్రాముఖ్యం ఇచ్చి అభివృద్ధిచేయాలని విజ్ఞప్తిచేశారు. దక్షిణ ఆర్ఆర్ఆర్లో భాగంగా చౌటుప్పల్-ఆమనగల్-షాద్‌నగర్ (182 కి.మీ), కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం (165 కి.మీ.), కొత్తకోట, గూడూరు నుంచి మంత్రాలయం దాకా 70 కిలోమీటర్లు, జహీరాబాద్-బీదర్-దెగ్లూర్ మధ్య 25 కిలోమీటర్ల మేర నేషనల్ హైవేలుగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపించినట్టు చెప్పారు. దీనివల్ల పర్యాటకంతోపాటు.. ఇతర రాష్ర్టాలతో కనెక్టివిటీ పెరుగుతుందని తెలిపారు.
6 లేన్లకు విజయవాడ-హైదరాబాద్ హైవే
రెండు రాష్ర్టాల రాజధానులను అనుసంధానించే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని 2024 నాటికి ఆరు లేన్లకు విస్తరించాలనే ఒప్పందం ఉన్నదని గడ్కరీకి సీఎం కేసీఆర్ వివరించారు. ఇందుకు సంబంధించి ఎన్‌హెచ్ 65ని 2012లో బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (బీవోటీ) ఒప్పందం కింద జీఎంఆర్ ఎక్స్‌ప్రెస్ వే సంస్థ నాలుగు లేన్ల హైవేను నిర్మించి నిర్వహిస్తున్నదని, నాటి ఒప్పందం మేరకు 2024 ఏప్రిల్ నాటికి ఆరు లేన్లకు విస్తరించాల్సి ఉన్నదని గుర్తుచేశారు. కానీ.. ఇందుకోసం ఏవో అటంకాలున్నాయంటూ సాకులు చెప్తున్నారని గడ్కరీకి వివరించారు. ఈ విషయంలో ఎలాంటి వివాదాలు కానీ, అభ్యంతరాలు కానీ లేవని తెలిపారు. ఈ రహదారిలో ప్రతిరోజూ సగటున 40 వేల వ్యక్తిగత వాహనాలు తిరుగుతున్నాయని టోల్ రికార్డులు చెప్తున్నాయని, ఈ ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ కోరారు.
సీఆర్ఐఎఫ్ నిధులు ఇవ్వండి
రాష్ట్ర రహదారుల అభివృద్ధికోసం సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) నుంచి రూ.744 కోట్ల నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం కేసీఆర్ కోరారు. తమ పార్లమెంట్ సభ్యులు వారివారి నియోజకవర్గాల్లోని రోడ్ల అభివృద్ధి కోసం సవివరంగా ప్రతిపాదనలు చేశారని గుర్తుచేశారు. కానీ, కేంద్ర ఉపరితల రవాణాశాఖ రూ.250 కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పిందని.. పెండింగ్‌లో ఉన్న తమ ప్రతిపాదనలను అంగీకరించి, 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు పూర్తిగా నిధులు విడుదలచేయాలని కోరారు.
సోమశిల వద్ద బ్రిడ్జి నిర్మించండి
కల్వకుర్తి నుంచి ఏపీలోని నంద్యాల దాకా (167 కి.మీ.).. కొల్హాపూర్, సోమశిల, కరివెన మీదుగా జాతీయ రహదారిని నోటిపై చేసినందుకు గడ్కరీకి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపాశారు. ఈ హైవే వల్ల తెలంగాణలో వెనుకబడిన నాగర్‌కర్నూల్, ఏపీలో ఆత్మకూరు ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్నారు. కృష్ణానదిపై సోమశిల వద్ద కొత్త వంతెన నిర్మిస్తే హైదరాబాద్-తిరుపతి-చెన్నైల మధ్య దాదాపు 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని.. కాబట్టి ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని తెలిపారు. కొత్తగా ప్రకటించిన 167 జాతీయ రహదారి కల్వకుర్తి వద్ద ప్రారంభం అవుతుందని, దీనికి అనుబంధంగా ఉన్న జాతీయ రహదారి 765 హైదరాబాద్‌ను ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం వద్ద ఉన్న జ్యోతిర్లింగాన్ని కలుపుతుందని తెలిపారు. ప్రస్తుతం టోల్రికార్డుల ప్రకారం రోజుకు 14 వేల వ్యక్తిగత వాహనాలు కల్వకుర్తి వరకు తిరుగుతున్నాయని తెలిపారు. కల్వకుర్తి- కరివెన రహదారి అభివృద్ధి కాగానే ట్రాఫిక్ ఇంకా పెరుగుతుందని, దీనిని గుర్తించి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌నుంచి కల్వకుర్తి వరకు నాలుగులేన్ల రహదారిని నిర్మించాలని సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రిని కోరారు. సీఎంతోపాటు కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీని కలిసిన వారిలో రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఖమ్మం మాజీ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు. అనంతరం కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం కేసీఆర్ జరిపిన భేటీలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దక్షిణ ఆర్ఆర్ఆర్ను మంజూరు చేయండి
హైదరాబాద్ నగరానికి దక్షిణ భాగంలో 182 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు మంజూరుచేయాలని గడ్కరీని సీఎం కేసీఆర్ కోరారు. 2018 ఆగస్టు 27న న్యూఢిల్లీలో కలిసి హైదరాబాద్ చుట్టూ 340 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ను పూర్తి ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించాలని చర్చించి, నివేదించామని గుర్తుచేశారు. ఉత్తర విభాగంలో సంగారెడ్డి- గజ్వేల్- చౌటుప్పల్ వరకు 158 కిలోమీటర్ల రీజనల్ రింగ్‌రోడ్డును మంజూరు చేశారని పేర్కొన్నారు. 2018లో ఈ రోడ్డుకు అలైన్మెంట్ ప్రతిపాదనలు రూపొందించామని, ఆ తర్వాత ఈ ప్రాంతంలో గజ్వేల్ రింగ్‌రోడ్డు, బస్వాపూర్ రిజర్వాయర్లు వచ్చాయని వివరించారు. వీటి కారణంగా గజ్వేల్ నుంచి యాదాద్రి వరకు కొన్నిమార్పులు చేశామని, వీటికి అంగీకారం తెలిపారని వెల్లడించారు. దక్షిణభాగం రీజినల్ రింగ్‌రోడ్డుకు రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వశాఖ అడిగిన ప్రతిపాదనలు, వివరణలు ఇచ్చామని పేర్కొన్నారు. దక్షిణభాగం రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే తెలంగాణ సహా మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీకి ప్రయోజనం కలుగుతుందన్నారు. వీలైనంత త్వరగా దక్షిణ ఆర్ఆర్ఆర్ను మంజూరుచేయాలని కోరారు.