Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వేగం పెంచండి

-నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తికావాల్సిందే
-యంత్రాలు పెరగాలి.. వర్కర్స్‌ను పెంచండి
-ప్రాజెక్టుల యాత్ర రెండోరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
-కన్నెపల్లి- అన్నారం గ్రావిటీ కెనాల్ పనుల పరిశీలన
-మార్చి నెలాఖరుకల్లా అన్ని పనులు పూర్తికావాల్సిందే
-ఫిబ్రవరిలో అన్నారం పంపుహౌస్ పూర్తికావాలి
-అన్నారం బరాజ్ పనులను ప్రశంసించిన సీఎం
-సుందిళ్ల పనులపై అసంతృప్తి

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో వేగంపెంచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తికావాల్సిందేనని స్పష్టంచేశారు. ఇందుకోసం అవసరమైన మేర యంత్రాలు పెరగాలని, కార్మికులను పెంచాలని చెప్పారు. ప్రాజెక్టుల యాత్ర రెండోరోజయిన బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పలు ప్రాంతాలను సందర్శించి పనులను సునిశితంగా పరిశీలించారు. అధికారులకు అవసరమైన ఆదేశాలిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో కొన్నిచోట్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్తూ.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్లేమీ లేవని, కానీ ముందుగా చెప్పిన ప్రకారం పనులను కొనసాగించి పూర్తిచేయాల్సిందేనన్నారు.

పనుల తీరుపై అధికారులను, వర్క్ ఏజెన్సీలను నిలదీశారు. లక్ష్యసాధనకోసం అన్ని వనరులతో శ్రద్ధతో సకాలంలో పనులు పూర్తిచేయాలని నిర్దేశించారు. కన్నెపల్లి- అన్నారం మధ్యలో నాలుగుచోట్ల ఆగి పనులను సునిశితంగా పరిశీలించిన ఆయన గ్రావిటీ కెనాల్ పక్కన బీటీ రోడ్డు వేయాలని ఆదేశించారు. మార్చి నెలాఖరుకల్లా అన్ని పనులు పూర్తికావాల్సిందేనని సీఎం స్పష్టీకరించగా.. కచ్చితంగా పూర్తిచేస్తామని ఇంజినీర్లు, వర్క్ ఏజెన్సీల ప్రతినిధులు చెప్పారు. అన్నారం బరాజ్ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి అధికారులను ప్రశంసించారు. సుందిళ్ల పనులు కమిట్‌మెంట్ ప్రకారం కావడంలేదని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్లక్ష్యాన్ని సహించేదిలేదని హెచ్చరించారు. మూడు షిఫ్టుల్లో పనులు నడుపాలని, మార్చిలోగా పూర్తికావాలని, అవసరాన్ని బట్టి మళ్ళీ వస్తానని చెప్పారు. ఫిబ్రవరిలో అన్నారం పంపుహౌస్ పూర్తికావాలన్నారు. మార్చి 31 నాటికి కాళేశ్వరం, ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పంపుహౌస్ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.రెండురోజుల విస్తృత పర్యటన ముగించుకుని బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.

మార్పులేదు.. మార్చిలోగా చేయాల్సిందే
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సుందిళ్ల బరాజ్, సుందిళ్ల, అన్నారం పంపుహౌస్‌ల అన్ని పను లు మార్చి నెలాఖరులోగా పూర్తిచేయాల్సిందేనని అధికారులకు, ఏజెన్సీలకు ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. సుందిళ్ల పనులు వేగవంతంగా లేవని నవయుగ కాంట్రాక్టర్లపై ఆగ్రహించారు. పద్ధతి మార్చుకోవాలని, వేగం పెంచాలని హెచ్చరించారు. బుధవారం మధ్యా హ్నం సుందిళ్ల బరాజ్ వ్యూ పాయింట్ వద్ద ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన సందర్భంలో.. దీనికి సంబంధించిన పనుల్లో అనుకున్నంత వేగం ఎందుకు కనిపించడం లేదని కంపెనీ కాంట్రాక్టర్లు, అధికారులను నిలదీశారు. అన్నారం బరాజ్‌తో పోలిస్తే సుందిళ్ల వెనుకబడిందని, ఇలా చేస్తే రైతులకు నీరెలా ఇస్తామని, పద్ధతి మార్చుకొని వేగం పెంచాలని హెచ్చరించారు. పేరు గొప్ప..ఊరు దిబ్బలా మీ కంపెనీ పనులున్నాయని మందలించారు. సుందిళ్ల బరాజ్ పనులను మార్చి 31 నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. సుందిళ్ల బరాజ్ పరిధిలో 74 గేట్ల అమరిక పూర్తయిందని, 17 కిలోమీటర్ల మేర ఉన్న ఫ్లడ్‌బ్యాంకు పనులు సాగుతున్నాయని, 89.64 శాతం ఎక్స్‌కవేషన్, 76.39 శాతం ఎర్త్ పనులు జరిగాయని, మిగిలినవి జనవరి చివరినాటికి పూర్తవుతాయని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంలో రివిట్‌మెంట్ పనుల పురోగతిపై సీఎం ప్రశ్నించారు. 46 శాతమే జరగడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. మార్చి చివరికల్లా కాళేశ్వరం వద్ద కాఫర్‌డ్యాం నిర్మించి పనులు పూర్తిచేస్తామన్న సీఎం.. వందశాతం నీరు అందించేలా పనుల్లో వేగం పెంచాలని ఏజెన్సీలను ఆదేశించారు. అన్నారం పంప్‌హౌస్ పనులకు సంబంధించిన సమాచారాన్ని సైతం సుందిళ్ల వ్యూ పాయింట్ వద్దే అడిగి తెలుసుకున్నారు. అన్నారం పంపుహౌస్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా చూశామని చెప్పిన సీఎం.. పంపుహౌస్ పనులను సైతం సమాంతరంగా వేగంగా చేస్తూ, ఫిబ్రవరి చివరినాటికి పూర్తిచేయాలని ఆఫ్‌స్కాన్ కంపెనీ ప్రతినిధులకు సూచించారు. పంప్‌హౌస్ పరిధిలోని 8 పంపుల్లో భాగంగా ఆరింటికి మోటర్లు వచ్చాయని, వాటి పనులు చివరిదశలో ఉన్నాయని, మిగిలిన రెండు మోటర్లు చెన్నైకి చేరాయని అధికారులు తెలిపారు. నిత్యం రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా పనులు నిర్వహించాలని, ఈ వానకాలం రైతులకు ఎట్టి పరిస్థితుల్లో సాగునీరందించాలన్నారు. తర్వాత సుందిళ్ల పంపుహౌస్ పనుల పరిశీలనకు వెళ్లారు.

మార్చినాటికి 9 పంపులు రన్ చేయాలి
మధ్యాహ్నం 2.25 గంటలకు సుందిళ్ల పంపుహౌస్‌కు చేరుకున్న కేసీఆర్.. క్యాంపు కార్యాలయంలో భోజనం చేశారు. అనంతరం పనులను పరిశీలించారు. మార్చి వరకు 9 పంపుల డ్రైరన్ నిర్వహించాలని ఆదేశించారు. సుందిళ్ల పంప్‌హౌస్‌లో ప్రతి రోజు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యమున్న 9 మోటర్లను బిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మూడు టీఎంసీలకు నీటిని ఎత్తిపోయడానికి సివిల్ పనులు నిర్వహిస్తున్నామన్నారు. గోలివాడ పంప్‌హౌస్‌లలో 5.6లక్షల క్యూబిక్ మీటర్ల పని జరగాల్సి ఉండగా, ఇప్పటివరకు 5లక్షల క్యూబిక్ మీటర్ల మేర పని పూర్తయినట్లు అధికారులు సీఎంకు వివరించారు. పంప్‌హౌస్‌లో నాలుగు పంపుల ఎరక్షన్ పూర్తిచేశామని, మోటర్ల బిగింపు పనులు వేగంగా జరుగుతున్నాయని, ఐదు మోటర్ల స్పెరల్ కేసింగ్ పనులు పూర్తిచేశామని తెలిపారు. రూ.1547.65కోట్ల పనులు పూర్తిచేసినట్లు చెప్పారు. మార్చి చివరినాటికి తొమ్మిది మోటర్ల బిగింపు పనులు పూర్తయ్యే విధంగా ప్రణాళికలు పూర్తిచేసుకొని అమలుపరచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మార్చి చివరినాటికి తొమ్మిది మోటర్ల డ్రైరన్ నిర్వహించాలని, జనవరి చివరినాటికి నాలుగు మోటర్ల డ్రైరన్ పూర్తిచేయాలని కేసీఆర్ నిర్మాణసంస్థలను ఆదేశించారు. పనుల్లో వచ్చే ఆటంకాలను అధిగమిస్తూ సకాలంలో పూర్తయ్యేవిధంగా చూడాలని. ఎట్టి పరిస్థితుల్లో వానకాలం వ్యవసాయానికి సాగునీటిని అందించే విధంగా పనులు పూర్తవ్వాలన్నారు.

ప్రతి ఎకరాకూ నీరివ్వాలి
సుందిళ్ల పంప్‌హౌస్ పనుల పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి అక్కడి నుంచి జగిత్యాల జిల్లాలో ఎస్సారెస్సీ పునర్జీవ పథకం పనులను పరిశీలించారు. ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేట పంపుహౌస్ వద్దకు సాయంత్రం 4.10కి చేరుకున్న ఆయన నిర్మాణపనులతోపాటు ఫొటో ఎగ్జిబిషన్‌ను చూశారు. ఈ సందర్భంగా పనుల వివరాలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి మార్చి 31లోపు రాజేశ్వర్‌రావుపేటతోపాటుగా మల్యాల మండలం రాంపూర్ వద్ద నిర్మిస్తున్న రెండు పంపులను పూర్తిచేయాలని ఆదేశించారు. ఏప్రిల్, మే నెలల్లో డ్రై ట్రయల్ రన్ చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పంపుహౌస్‌లు నిర్దిష్ట గడువులోపు పూర్తికావాలని ఆదేశించారు. వచ్చే వర్షాకాలం నాటికి ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా యాభై టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎత్తిపోసే విధంగా పనులు జరగాలని సూచించారు. వరద కాలువ వెంట ఉన్న ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు అవసరమైనచోట లిఫ్టులు ఏర్పాటుచేస్తామన్న సీఎం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జగిత్యాల, కోరుట్ల, చొప్పదండి తదితర నియోజకవర్గాల పరిధిలో వరద కాలువను వినియోగించి ప్రతి ఎకరాకు సాగునీరు అందేవిధంగా కావాల్సిన ఏర్పాట్లు, ప్రణాళికలు తయారుచేయాలని, ఇందుకోసం ఎంత డబ్బునైనా వెచ్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంతం టూరిజానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పర్యాటకుల సంఖ్య బాగా పెరుగుతుందని, 5 నుంచి 10 ఎకరాల్లో హోటళ్లు నిర్మాణం జరిగేలా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. మల్టీ నేషనల్ కంపెనీలను టూరిజం అభివృద్ధిలో భాగస్వాములను చేసేందుకు ఆలోచిస్తున్నామని చెప్పారు. రామగుండం నుంచి రైల్వేమార్గాన్ని సైతం పొడిగిస్తామని, భవిష్యత్‌లో ఈ ప్రాంతం చాలా బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇకనుంచి ఎప్పటికప్పుడు తాను కూడా ప్రాజెక్టు పనులను సమీక్షిస్తానని స్పష్టంచేశారు. రాజేశ్వర్‌రావుపేట వద్దే ఆలస్యం కావడంతో ముఖ్యమంత్రి రాంపూర్ పంప్‌హౌస్‌కు వెళ్లలేకపోయారు. పర్యటనలో ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు, కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ఎన్ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, డీజీపీ మహేందర్‌రెడ్డి, నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి, టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, మాజీ ఎమ్మెల్సీ సీహెచ్ సుధాకర్‌రావు తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి, సిరిసిల్ల ఎస్పీలు ఆర్ భాస్కరన్, రాహుల్‌హెగ్డే, ఏటూరునాగారం ఏఎస్పీ శరత్‌చంద్ర, అదనపు ఎస్పీ రాజమహేంద్రనాయక్ బందోబస్తు నిర్వహించారు.

సీఎం పర్యటన తీరిదీ..
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రెండురోజుల ప్రాజెక్టుల యాత్రలో తొలిరోజు మంగళవారం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంపుహౌస్ పనులను పరిశీలించారు. రాత్రి కరీంనగర్ తీగలగుట్టపల్లిలో బసచేసిన ఆయన బుధవారం ఉదయం మళ్లీ మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి పంపుహౌజ్ వద్దకు చేరుకున్నారు. రెండోరోజు సీఎం.. మేడిగడ్డ బరాజ్ నుంచి అన్నారం బరాజ్‌లోకి తరలించడానికి కన్నెపల్లి నుంచి అన్నారం వరకు అడవిలో 13.4 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న గ్రావిటీ కెనాల్ పనులను పరిశీలించారు. అక్కడినుంచి నేరుగా అన్నారం బరాజ్‌కు చేరుకొని, వ్యూ పాయింట్ నుంచి పనులను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం 1.35 గంటలకు సుందిళ్ల వెళ్లారు. సుందిళ్ల బరాజ్‌ని, అన్నారం పంప్‌హౌస్‌ను గగనతలం నుంచి వీక్షించారు. సుందిళ్ల వద్ద హెలిప్యాడ్‌లో దిగి, వ్యూపాయింట్ వద్ద ఫొటో ఎగ్జిబిషన్‌చూశారు. మధ్యాహ్నం 2.25 గంటలకు సుందిళ్ల పంపుహౌస్‌కు చేరుకున్నారు. క్యాంపు కార్యాలయంలో భోజనం చేసిన అనంతరం పనులను పరిశీలించారు. అక్కడి నుంచి జగిత్యాల జిల్లాకు వెళ్లి ఎస్సారెస్సీ పునర్జీవ పథకంలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేట వద్ద జరుగుతున్న పంపుహౌస్ వద్దకు సాయంత్రం 4.10గంటలకు చేరుకున్న సీఎం నిర్మాణ పనులను పరిశీలించారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను చూశారు. సాయంత్రం 4.58 గంటలకు నేరుగా హెలికాప్టర్‌లో హైదరాబాద్ వెళ్లిపోయారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.