Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వేగం పెంచండి..

-విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకోవాలి -కృష్ణా, గోదావరి నిల్వలతో నగరానికి తగినంతగా నీరు -కొత్త భవనాలకు ఇంకుడు గుంతలు తప్పనిసరి -అక్రమ నల్లా కనెక్షన్లపై ఉక్కుపాదం మోపాలి -వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలవొద్దు.. -ముందస్తు ప్రణాళికలు రూపొందించండి -పురపాలక శాఖ సమీక్షలో మంత్రి కేటీఆర్ ఆదేశం -నిర్దేశిత సమయంలోగా 100 రోజుల ప్రణాళికను పూర్తి చేయాలి

KTR-review-the-progress-of-GHMC-hundred-days-plan

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వంద రోజుల ప్రణాళికను విజయవంతంగా పూర్తిచేయాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పురపాలకశాఖ పరిధిలోని అన్ని శాఖాధిపతులతో కేటీఆర్ బుధవారం మెట్రో రైలుభవన్‌లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వంద రోజుల ప్రణాళిక పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రణాళిక ఆచరణలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటికి పరిష్కారాలను సూచించారు. ముందుగా హైదరాబాద్ జలమండలి ప్రణాళికపై సమీక్షించిన మంత్రి.. నగరానికి అవసరమైన నీరు, అందుబాటులో ఉన్న నీటి నిల్వలపై ఆరా తీశారు. కృష్ణ, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులలో ఉన్న నీటి నిల్వలతో నగరానికి నీళ్లను అందించే అవకాశముందని మంత్రి కేటీ రామారావు చెప్పారు.

ప్రస్తుతం తీవ్ర కరవు పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు నీటిని జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఇంకుడుగుంతలు లేకుంటే కొత్త భవనాలకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతులను మంజూరు చేయకూడదని ఆదేశించారు. కొత్త నల్లా కనెక్షన్లపై కట్టుదిట్టంగా వ్యవహరించాలన్నారు. వర్షపు నీటి సంరక్షణకు నగరంలోని ఐటీ పార్కులు, పారిశ్రామికవాడల్లో తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతల ఏర్పాటు తప్పనిసరి చేయాలన్నారు.

అక్రమ నీటి కనెక్షన్లపై ఉక్కుపాదం అక్రమ నీటి కనెక్షన్లపై ఉక్కుపాదం మోపాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వాణిజ్య కనెక్షన్లను క్రమబద్ధీకరించాలని సూచించారు. రోడ్ల మీద నీళ్లు నిలిచేందుకు అవకాశమున్న ప్రాంతాలను గుర్తించి ట్రాఫిక్, పోలీసు, జీహెచ్‌ఎంసీలతో కలిసి ఉమ్మడి ప్రణాళికను తయారు చేయాలన్నారు. వర్షాకాలంలో అవసరమైన పనుల కోసం నిధుల్ని మంజూరు చేస్తామన్నారు. వాటర్ వర్క్స్ పనుల వల్ల ధ్వంసమైన రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు.

శివారు గ్రామ పంచాయతీలతోపాటు ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న గ్రామ పంచాయతీలకు తాగునీటిని అందించేందుకు స్పష్టమైన ప్రణాళికలను రూపొందించాలన్నారు. మంచినీటి సరఫరాలో ఉన్న నాన్ రెవెన్యూ నీటి శాతాన్ని పదిహేను శాతానికి తగ్గించే విధంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు. మున్సిపాలిటీల్లోని మంచినీటి సరఫరా, మిషన్ భగీరథ అమలు, పట్టణాల్లో ఎల్‌ఈడీ బల్పుల ఏర్పాటు ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా పెట్టుకున్న బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణాలు అతిత్వరలో సాధ్యం కానున్నాయని, పట్టణాల్లో ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ఉద్దేశించిన జియోట్యాగింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి తెలిపారు.

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల పనులపై ఆరా వందరోజుల ప్రణాళిక కింద జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో జరుగుతున్న పనులపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచి పాడవకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాలాల పూడికతీత పనులకు ఇప్పటికే రూ.22 కోట్ల నిధులు విడుదల చేశామని, త్వరలో మరో రూ. 10 కోట్లు విడుదల చేస్తామన్నారు. అతిత్వరలో హెచ్‌ఎండీఏ కార్యాలయాన్ని సందర్శిస్తానని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా నానక్‌రాంగూడ నుంచి తెల్లాపూర్ వరకు హెచ్‌ఎండీఏ ప్రతిపాదించిన సైకిల్ ట్రాక్ గురించి చర్చించారు. దీనికి రూ.50 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశమున్నందున కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంపై దీనిని నిర్మించాలని యోచించారు.

కాగా, నాలాల్లో పూడికతీత పనులు మే 31లోగా పూర్తవుతాయని, పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు పరిష్కారం చూపుతామని, జీహెచ్‌ఎంసీ వార్డు కమిటీల ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. హరితహారం ప్రారంభం రోజున 25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం గురించి ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం. సమీక్షలో హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎంజీ గోపాల్, కమిషనర్లు జనార్దన్‌రెడ్డి, చిరంజీవులు, జలమండలి ఎండీ దాన కిశోర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.