– అంతర్జాతీయ సంస్థల ఆసక్తి – ఏప్రిల్ మొదటి వారంలో రుణ సహాయంపై భేటీ – మంత్రి కే తారకరామారావు వెల్లడి – భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయండి – కేటాయించిన నిధులు వినియోగించండి – పైపుల నాణ్యతపై అధ్యయనం చేయండి – అధికారులతో సమీక్షలో మంత్రి కేటీఆర్ – రెండు రోజుల్లో ఇంటేక్వెల్స్ పనులు ప్రారంభిస్తామన్న అధికారులు
తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సైప్లె ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. రైల్వేలు, అటవీ భూములు, ప్రైవేటు భూముల సేకరణమీద దృష్టి పెట్టాలని సూచించారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ ప్రక్రియల్లో టెండర్ల పనులు వేగిరం పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టులో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఉపయోగించనున్న పైపులైన్లు నాణ్యత కలిగి ఉండేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అవసరమైతే క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి అధ్యయనం చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న ఈ పథకానికి సహాయం అందించేందుకు అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చాయని కేటీఆర్ చెప్పారు. ఏప్రిల్ మొదటివారంలో ఆయా సంస్థలతో చర్చలు జరుపబోతున్నామని వివరించారు. సోమవారం సచివాలయంలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనులు సాఫీగా సాగాలంటే ఎంతమేర భూసేకరణ జరుపాల్సి ఉంది, ప్రస్తుత పరిస్థితి.. తదితర అంశాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా అటవీ, ప్రైవేటు, రైల్వే భూముల సేకరణ ముందుగా పూర్తి చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసిందని, ఆ నిధులను ఎప్పటికపుడు వినియోగించాలని ఆయన పేర్కొన్నారు. భూ సేకరణ, సెగ్మెంట్ల వారీగా డీపీఆర్లు, నిధుల సేకరణ , ఇంటేక్ వెల్స్ టెండర్ల ప్రక్రియ, వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై సవివరంగా చర్చించారు. ఒకటి,రెండు రోజుల్లో ఇంటేక్వెల్స్ పనులను ప్రారంభించనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.
లైన్సర్వే పూర్తయినందున సాధ్యమైనంత త్వరగా సెగ్మెంట్ల వారీగా డీపీఆర్లను పూర్తి చేయాలని కేటీఆర్ ఆదేశించారు. ప్రాజెక్టుకు ఉపయోగించాల్సిన పైపులైన్ల ప్రమాణాల అధ్యయనం చేసి అత్యుత్తమ ప్రమాణాలున్న పైపులనే ఎంపికచేయాలని అధికారులను కోరారు. ఇందుకోసం వివిధ ప్రాంతాలను సందర్శించి అక్కడ వినియోగిస్తున్న పైపులపై క్షేత్రస్థాయి సమాచారం తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కోసం ఆర్థిక సహాయం చేసేందుకు దేశంలోని రుణ సంస్థలతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు సైతం ముందుకు వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో చర్చించనున్నట్లు తెలిపారు. జైకా, ఏల్, ఎల్ఐసీ, నాబార్డు, హడ్కో వంటి సంస్థలు, వాటి విధి విధానాలు, మంజూరు చేసే నిధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి జే రేమండ్ పీటర్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్-ఇన్-చీఫ్ సీ సురేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు ఉమాకాంత్రావు, పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.