Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వెయ్‌.. చిందెయ్‌.. దరువెయ్‌

-తెలంగాణ నలుదిశలా దళితబంధు జోష్‌

-4 ఎస్సీ నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో దళితబంధు
-నూటికి నూరు శాతం అమలు.. ముఖ్యమంత్రి నిర్ణయం
-వేర్వేరు చోట్ల్ల దళితుల పరిస్థితులు తెలుసుకోవడమే లక్ష్యం
-ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి రాగానే హైదరాబాద్‌లో వర్క్‌షాప్‌
-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరలోనూ దళితబంధు అమలు

దళితబంధు అమలు చేసే మరో 4 మండలాలు ఇవే

తూర్పున చింతకాని నియోజకవర్గం: మధిర
జిల్లా: ఖమ్మం
దళిత జనాభా: 11,532
దళిత కుటుంబాలు: 4,312
నిధులు : 431.2 కోట్లు

పడమర నిజాంసాగర్‌ నియోజకవర్గం: జుక్కల్‌
జిల్లా: కామారెడ్డి
దళిత జనాభా: 5,600
దళిత కుటుంబాలు: 1,646
నిధులు : 164.6 కోట్లు

దక్షిణాన చారకొండ నియోజకవర్గం: అచ్చంపేట
జిల్లా: నాగర్‌కర్నూల్‌
దళిత జనాభా: 3,743
దళిత కుటుంబాలు: 1,200
నిధులు : 120 కోట్లు

ఆగ్నేయాన తిరుమలగిరి నియోజకవర్గం: తుంగతుర్తి
జిల్లా: సూర్యాపేట
దళిత జనాభా: 9,850
దళిత కుటుంబాలు: 2,500
నిధులు : 250 కోట్లు

లబ్ధి పొందనున్న దళిత కుటుంబాలు 9,658
చేసే సాయం 965.8కోట్లు (అంచనా)

నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి మేధస్సునుంచి పుట్టిన రైతుబంధు.. దేశ రైతాంగం గతినే మార్చివేసింది. ఈరోజు శతాబ్దాల పీడననుంచి దళితులకు ముక్తి కలిగించేందుకు సంకల్పించిన దళితబంధు.. దేశంలోని యావత్‌ దళితసమాజానికి చుక్కానిలా మారుతున్నది. ఆశలు కోల్పోయి, అన్నిరకాలుగా ఆగమైపోయిన దళితుల కష్టాలను కడతేర్చడం కోసం సీఎం కేసీఆర్‌ ఆలోచనకు రూపం ఈ పథకం. ప్రతి ఘడియ.. ప్రజల కోసమే జీవిస్తున్న నేత.. అనేక సంక్షేమ పథకాల రూపశిల్పి కేసీఆర్‌ దేశంలోనే ఒక నూతన విప్లవానికి నాంది పలికారు.

ఒక గ్రామంతో చిన్నగా మొదలైన పథకం.. పైలట్‌ ప్రాజెక్టుగా ఒక నియోజకవర్గానికి చేరింది. ఇప్పుడు రాష్ట్రం నలువైపులా నాలుగు జిల్లాలోని.. నాలుగు నియోజకవర్గాల్లోని.. నాలుగు మండలాల్లో ఈ పథకం అమలుకు కార్యాచరణ మొదలైంది. క్రమంగా రాష్ట్రమంత టికీ విస్తరించబోతున్నది. పార్టీల రాజకీయాలకు, ఎన్నికల ప్రయోజనాలకు అతీతంగా.. దళితులందరి సముద్ధరణే ధ్యేయంగా ఈ పథకం అమలుకు సీఎం కేసీఆర్‌ సంకల్పించారు. ఈ పథకం దళితుల జీవితాల్లో ఆర్తిని తొలగించి చైతన్య మార్గం పట్టిస్తున్నది.

వెయ్‌.. చిందెయ్‌.. దరువెయ్‌
అణగారిన సమాజంలో వెలుగు పూవులు పూయించి.. దళితుల జీవితాల్లో పేదరికాన్ని శాశ్వతంగా పోగొట్టేందుకు ముఖ్యమంత్రి ప్రారంభించిన దళితబంధు పథకం రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే సామాజిక విప్లవంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంతో మొదలై.. పైలట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ప్రారంభమైన ఈ పథకం రాష్ట్రం నలుదిక్కుల్లో దళితజ్యోతులు వెలిగించబోతున్నది. అత్యంత వెనుకబడిన నాలుగు ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలను ఎంపికచేసి దళితబంధును అమలుచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇందులో మధిర నియోజకవర్గం చింతకాని మండలం, అచ్చంపేట నియోజకవర్గం చారగొండ, తుంగతుర్తి నియోజకవర్గం తిర్మలగిరి, జుక్కల్‌ నియోజకవర్గం నిజాంసాగర్‌ మండలాలు ఉన్నాయి. ఈ నాలుగు మండలాల్లో పథకాన్ని నూరుశాతం అమలుచేయనున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 30,403 దళితకుటుంబాలకు దళితబంధు పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా సర్కార్‌ స్వీకరించినట్టయింది. సంకల్పించి నాటి నుంచి నిరాటంకంగా, స్థిరంగా అమలవుతున్న ఈ దార్శనిక పథకంపై దళిత వర్గాల్లో, ఇతర సామాజిక వర్గాల్లో విస్తారంగా చర్చ జరుగుతున్నది. ఆర్థిక సామాజిక వివక్షకు గురైన దళిత కుటుంబాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ఈ పథకం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉపయోగపడుతున్నదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దళితబంధు పథకాన్ని సమగ్రంగా అమలుచేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎటువంటి కార్యాచరణను చేపట్టాలన్న అంశంపై ముఖ్యమంత్రి దళిత మేధావులతోటి, ఇతర సామాజిక రంగాల నిపుణులతోటి నిరంతరాయంగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఎందుకంటే.. దళితులు ఈ పథకాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. ఈ పథకాన్ని వినియోగించుకోవడంపై వారికి ఒక స్పష్టమైన దృక్పథం ఏర్పడాలి. అప్పుడే ఈ పథకం నూటికి నూరుశాతం విజయవంతమవుతుందన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన. ఈ ఆలోచనలో భాగంగానే సీఎం కేసీఆర్‌ వివిధ రంగాల మేధావులతో విస్తృత ప్రాతిపదికన చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో అనేక సూచనలు, సలహాలు అందాయి. రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న దళితుల స్థితిగతులపై సూచనలు వచ్చాయి.

రాష్ట్రమంతటా విస్తరణ
రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో దళితుల స్థితిగతులు వేర్వేరుగా ఉన్నాయి. వారి అవసరాలు కూడా వేర్వేరుగా ఉన్నాయి. వారి మధ్య స్థాయీభేదాలున్నాయి. జీవనోపాధి మీద వారికి వేర్వేరు ఆలోచనలు, యోచనలు ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరొక చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకొన్నారు. రాష్ట్రంలోని నాలుగు దిక్కుల్లోని అత్యంత వెనుకబడిన నాలుగు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో.. ఒక్కో మండలాన్ని ఎంపికచేసి ఆ నాలుగు మండలాల్లో నూటికి నూరుశాతం దళితబంధు అమలుచేయాలని నిర్ణయించారు. ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంతో పాటు పైలట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అమలుచేస్తున్న దళితబంధు పథకాన్ని.. మరింత విస్తరించాలని నిర్ణయం తీసుకొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దళితబంధును అమలుచేయడం ద్వారా దళిత ప్రజల మనోభావాలు, ఆలోచనలు, వారి అవసరాలపై అవగాహన చేసుకోవాలని నిశ్చయించారు. ఈ నాలుగు మండలాల్లో పథకం అమలులో ఎదురయ్యే అనుభవాలను విశ్లేషణ చేసుకొని.. పక్కా ప్రణాళికలు రూపొందించి ఈ పథకాన్ని మరింత విజయవంతంగా ముందుకు తీసుకుపోవటానికి ఆస్కారం ఉంటుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో దళిత శాసనసభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ఇందుకు ఎంపికచేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలం, నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లా జుకల్‌ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌ మండలాలను దళితబంధు పథకం అమలుకోసం సీఎం కేసీఆర్‌ ఎంపికచేశారు. ఈ నాలుగు మండలాల్లో ఉన్న అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళితబంధు పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు. ఆయా మండలాల్లో అమలుచేయడంపై రోడ్‌మ్యాప్‌ రూపొందించడంపై ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన అనంతరం హైదరాబాద్‌లో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ సమావేశంలో నాలుగు నియోజకవర్గాలున్న జిల్లాల మంత్రులు, వాటి ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, దళితమేధావులు పాల్గొంటారు. ఈ సమావేశంలో తీసుకొన్న నిర్ణయాల ఆధారంగా నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలుచేస్తారు. ఈ నాలుగు మండలాల్లో అమలుచేసే దళితబంధు .. రాష్ట్రమంతా అమలుకు భూమిక అవుతుంది.

ఆ 4 మండలాలు
-అదనంగా పదివేల మందికి పథకం వర్తింపు
-నాలుగు ఎస్సీ నియోజకవర్గాల్లోని మండలాలే
దళితబంధు పథకంలో మరో నాలుగు మండలాలు చేరాయి. పైలట్‌ ప్రాజెక్టుగా ఇప్పటికే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అమలవుతుండగా, తాజాగా వేర్వేరు జిల్లాల్లోని నాలుగు ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో ఒక్కొక్క మండలాన్ని ఎంపిక చేశారు. దాంతో దాదాపు 10 వేల దళిత కుటుంబాలు అదనంగా ఈ పథకంలో చేరబోతున్నాయి. హుజూరాబాద్‌తో కలుపుకొంటే పథకంలో లబ్ధిదారుల కుటుంబాల సంఖ్య 30,402 చేరనున్నది. ఖమ్మం, సూర్యాపేట, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లోని చింతకాని, తిరుమలగిరి, నిజాంసాగర్‌, చారకొండ మండలాల్లో ఈ పథకాన్ని అమలుచేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. చింతకాని మండలం మధిర నియోజకవర్గంలో, తిరుమలగిరి తుంగతుర్తిలో, నిజాంసాగర్‌ జుక్కల్‌లో, చారకొండ అచ్చంపేట నియోజవర్గాల్లో ఉన్నాయి.

ఆ మండలాలే ఎందుకు?
హుజూరాబాద్‌ తర్వాత దళితబంధు పథకాన్ని విస్తరించేందుకు ఎంపికచేసిన నాలుగు మండలాల్లో దళితుల పరిస్థితులు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఎస్సీ రిజర్వ్‌డ్‌ అసెంబ్లీ స్థానాల్లోని ఈ మండలాలు అభివృద్ధిలో బాగా వెనుకబడి ఉన్నాయి. ఆయా మండలాల్లోని దళితులు పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. దాంతో ఇక్కడి దళితులను దళితబంధు ద్వారా అభివృద్ధిపథకంలోకి తీసుకొస్తే ఇతర ప్రాంతాలకు దిక్సూచిగా, ప్రేరణగా నిలుస్తాయని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం.

నిజాంసాగర్‌
రాష్ట్రంలోని మారుమూల నియోజకవర్గాల్లో కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌ ఒకటి. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లోని ఈ నియోజకవర్గంలో పేదలు అధికంగా ఉన్నారు. అందులోనూ అత్యధికులు దళితులే. వ్యవసాయం తప్ప మరో ఉపాధిమార్గం లేదు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు కారణంగా మండలం కొంత అభివృద్ధి చెందింది. ఈ మండలంలో దళితబంధును అమలు చేయడం నారాయణఖేడ్‌-బాన్సువాడ-ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పథకంపై ప్రజలకు అవగాహన కల్పించవచ్చు.

తిరుమలగిరి
ఈ మండలం దశాబ్దాలుగా కరువు కాటకాలతో అల్లాడుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడి దళితుల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. 85 శాతం మంది దళితులు కూలీనాలీ చేసుకొని జీవిస్తున్నారు. మార్కెట్‌లో హమాలీలుగా, ఆటో డ్రైవర్లుగా, తోపుడు బండ్లపై పండ్లు అమ్ముతూ కొందరు ఉపాధి పొందుతుండగా, మరికొందరు దూర ప్రాంతాలకు వలస వెళ్లారు. దళితబంధు పథకంతో తామే ఓనర్లుగా మారి ఇతరులకు ఉపాధి కల్పించేలా ప్రణాళికలు వేసుకుంటామని పలువురు దళిత యువకులు చెప్తున్నారు.

మధిర
మధిర నియోజకవర్గంలోని ఐదు మండలాలుండగా చింతకాని మండలంలో దళితులు బాగా వెనుబడి ఉన్నారు. గతంలో ఇక్కడివారు ఉపాధి కోసం వలస వెళ్లేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొద్దిగా మార్పు వచ్చినా, ఇప్పటికీ చాలామంది ఉపాధికోసం హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు వలస పోతూనే ఉన్నారు. చాలామంది తమ సొంత గ్రామాల్లోనే వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నారు.

చారకొండ
ఈ మండలం నూతన జిల్లాల ఆవిర్భావంతో పాటుగా.. వంగూరు-వెల్దండ మండలాల్లోని 7 రెవెన్యూ గ్రామాలతో కొత్తగా ఏర్పాటైంది. ఆ తర్వాత తండాలను పంచాయతీలుగా మార్చడంతో ప్రస్తుతం 17 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. చారకొండ మండలం ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చివరి గ్రామంగా 90 కిలోమీటర్ల నల్లగొండ జిల్లా సరిహద్దుల్లో ఉండేది. ప్రస్తుతం కూడా జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో, అచ్చంపేటకు నియోజకవర్గ కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ మండలానికి డిండి లిఫ్ట్‌ ద్వారా సాగునీరు అందించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ మండలంలోని అత్యధికులు వ్యవసాయ కూలీలే. కొందరు యువకులు ఇప్పుడిప్పుడే ఉపాధికోసం హైదరాబాద్‌కు వలసపోవటం మొదలైంది.

ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం
దళితబంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినట్టుగానే చేస్తున్నది. కొత్తగా పథకంలో చేర్చిన నాలుగు మండలాలు మారుమూల ప్రాంతాలు. అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు. దళితబంధు పథకంపై వస్తున్న విమర్శలకు ప్రభుత్వం తన ఆచరణతో సరైన సమాధానం చెప్పింది. పథకం కేవలం హుజూరాబాద్‌ ప్రాంతానికే పరిమితమైనది కాదని తేలిపోయింది.
-మల్లేపల్లి లక్ష్మయ్య, చైర్మన్‌, సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌

కుట్రదారులకు చెంపపెట్టు
దళితబంధు పథకాన్ని ఎన్నికల కుట్రతో చూసినవారికి సీఎం కేసీఆర్‌ చెంప పెట్టులాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పథకం కాదని ఈ నిర్ణయంతో తేలిపోయింది. దళితజాతి గురించి మాట్లాడే హక్కును కాంగ్రెస్‌ పార్టీ కోల్పోయింది. గాంధీభవన్‌లో సురేందర్‌మాదిగను కాంగ్రెస్‌ పొట్టనపెట్టుకున్న రోజే ఆ పార్టీకి సమాధి కట్టినట్టు అయింది. ఇక బీజేపీ ఏనాడూ దళితజాతిని పట్టించుకోలేదు. దేశంలో ఇంతకాలం ఓట్ల కోసమే దళితుల్ని వాడుకున్నారు. చరిత్రలో మొదటిసారి సీఎం కేసీఆర్‌ దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న తపనతో పనిచేస్తున్నారు.
-వంగపల్లి శ్రీనివాస్‌, టీఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు

లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి
చింతకాని మండలానికి దళిత బంధును వర్తింపజేయడాన్ని స్వాగతిస్తున్నా. దళితులకు ఈ పథకం ద్వారా మేలు చేకూర్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. మండల స్థాయిలో ఉపాధి అవకాశాలను పరిగణలోకి తీసుకొని దళితులకు స్వయం ఉపాధి పూర్తిస్థాయిలో లభించేలా ప్రభుత్వం కృషిచేయాలి. స్వయం ఉపాధి యూనిట్‌ను దళిత లబ్ధిదారులకు అందజేయడంపై అవగాహన కల్పించాలి.
-అంబటి వెంకటేశ్వర్లు, చింతకాని మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు

దళితులను అక్కున చేర్చుకున్నడు
ఇప్పటి వరకు ఏ ఒక్క సీఎం దళితుల బాగోగులు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్‌ ఒక్కరే దళితులను అక్కున చేర్చుకొన్నారు. దళితబంధుతో దళితులు బాగుపడే రోజులు వచ్చినాయి. మేము మా కాళ్లపై నిలబడి ఆర్థికంగా బలోపేతం అవుతాం.

-సాలమ్మ, చారకొండ

కేసీఆర్‌ది గొప్ప సంకల్పం..
సీఎం కేసీఆర్‌ది గొప్ప మనసు. ఆయన సంకల్పం గొప్పది. వెనుకబడిన దళితులకు అండగా నిలుస్తున్నారు. రూ.10 లక్షలతో జీవనోపాధి చూపిస్తున్నారు. దళితవాడలు, దళిత గ్రామాలు ఎవరికీ తక్కువ కాదని నిరూపిస్తాం. టీఆర్‌ఎస్‌కు, ప్రభుత్వానికి ఎప్పుడూ రుణపడి ఉంటాం.

-రామస్వామి, చారకొండ

అభినవ అంబేద్కర్‌ సీఎం కేసీఆర్‌
సీఎం కేసీఆర్‌ అభినవ అంబేద్కర్‌. నిరుపేద దళిత కుటుంబాలకు దళితబంధు పథకం అమలు చేయడం అభినందనీయం. అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగిస్తున్న కేసీఆర్‌ సార్‌ సల్లంగుండాలె. ఈ పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. సీఎం కేసీఆర్‌ సార్‌ రుణం తీర్చుకోలేనిది.
-కాళంగి లలిత, గాంధీనగర్‌, చింతకాని మండలం

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..
దళితబంధు పథకానికి చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం సంతోషంగా ఉన్నది. రూ.10 లక్షలతో దళిత కుటుంబాలు ఉపాధి పొందడంతోపాటు ఆర్థికంగా నిలదొక్కుకుంటాయి. సీఎం కేసీఆర్‌ దళితులతోపాటు సబ్బండవర్గాలకు న్యాయం చేస్తున్నారు. దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. మరో 30 ఏండ్లు సీఎం కేసీఆర్‌ అధికారంలో ఉండాలి.

-తుడుం రాజేశ్‌, ప్రొద్దుటూరు, చింతకాని మండలం

దళితబంధుతో మా కష్టాలు తీరుతయి..
మాది రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబం. కష్టం చేస్తేనే జీవితం సాగుతది. ఎనకముందు ఆస్తిపాస్తులు లేవు. సీఎం సారు మా ఊరికి కూడా దళితబంధు ఇస్తరంట. కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తే మా బతుకులు మారుతయి. కష్టాలు తీరుతయి. ఏదైనా వ్యాపారం పెట్టుకొని బాగుపడుతం. ఇంతటి మేలు ఎవ్వరూ చేయరు. కేసీఆర్‌ సారుకు ఎప్పటికీ రుణపడి ఉంటం.

-కడమంచి ఉమ, తిరుమలగిరి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.