-మెదక్ జిల్లా మల్కాపూర్‌లో కంటివెలుగును ప్రారంభించిన సీఎం
-సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు
-3.70 కోట్ల మందికి కంటి పరీక్షలు
-అందరూ సద్వినియోగం చేసుకోవాలి
-ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు
-మెదక్ జిల్లా మల్కాపూర్‌లో కంటివెలుగు కార్యక్రమం ప్రారంభం
ప్రతి కుటుంబంలో వెలుగులు నింపే లక్ష్యంతో కంటివెలుగు పథకాన్ని తీసుకువచ్చినట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. తాను దత్తత తీసుకున్న ఎర్రవల్లి గ్రామంలో కంటి వైద్యశిబిరం నిర్వహించగా 217 మందికి నేత్ర సమస్యలున్నట్టు వైద్యులు గుర్తించారని తెలిపారు. ఒక్క గ్రామంలోనే ఇంతమంది ఉంటే రాష్ట్రంలో ఎంతమంది ఉంటారనే ఆలోచనతో కంటివెలుగు పథకం తీసుకువచ్చామన్నారు. దీనిని అంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బుధవారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్‌లో కంటివెలుగు పథకాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. పరీక్షలు చేయించుకున్నవారికి కండ్లద్దాలు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని 3.70 కోట్లమందికి 825 బృందాలు కంటి పరీక్షలు నిర్వహిస్తాయని చెప్పారు. క్యాటరాక్ట్ ఆపరేషన్లకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తన రెండు కండ్లకు ఆపరేషన్ జరిగిందని, 40 నిమిషాల్లోనే వైద్యులు ఇంటికి పంపించారని తెలిపారు. తెలంగాణకు వెలుగులు ఇచ్చే కంటివెలుగు కార్యక్రమాన్ని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని ఆదర్శ మల్కాపూర్ నుంచి మొదలుపెట్టడం స్థానిక ఎమ్మెల్యేగా సంతోషంగా, గర్వంగా ఉన్నదని చెప్పారు. 15 టీఎంసీల సామర్థ్యంగల ప్రాజెక్టు నిర్మాణం ఒక్క ఏడాదిలో పూర్తయిన సందర్భం ప్రపంచంలోనే ఎక్కడా లేదని, ఆ ఘనతను గజ్వేల్ నియోజకవర్గం పాములపర్తి వద్ద 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న కొండపోచమ్మ సాధించబోతున్నదన్నారు. రానున్న ఐదేండ్లలో రాష్ట్రమంతటా హైదరాబాద్ తరహాలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని సీఎం ప్రకటించారు.
సూరత్ స్ఫూర్తితో స్వచ్ఛ మల్కాపూర్
గ్రామంలో స్వచ్ఛత విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న మల్కాపూర్ గ్రామస్థులను సీఎం అభినందించారు. ఈ సందర్భంగా గతంలో సూరత్‌లో ప్లేగువ్యాధి ప్రబలిన విషయాన్ని గుర్తుచేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లు సూరత్ మున్సిపల్ కమిషనర్‌గా విస్తృత ప్రచారంచేసినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఫలితంగా పరిసరాలు చెత్తమయమై, ప్లేగు వచ్చిందని, వందలమంది చనిపోయారని తెలిపారు. సూరత్‌లో వందలు, వేల కోట్ల ఆస్తులున్న బంగారు, వజ్రాల వ్యాపారులుండేవారని, ప్లేగు విస్తరించడంతో విమానాలు అద్దెకు తీసుకుని పారిపోయారని చెప్పారు. ఊరు శుభ్రంగా ఉంటే దోమలుండవని సీఎం అన్నారు. దోమలకు కోటీశ్వరుడు, పేదవాడు అని తేడా ఉండదని, అందరినీ కుడుతాయని చెప్పారు. ఇదే అంశాన్ని వ్యాధి తగ్గిన తర్వాత సూరత్‌కు వచ్చిన వ్యాపారులకు వెంకటేశ్వర్లు చెప్పి జ్ఞానోదయం కలిగించారని పేర్కొన్నారు. ఆ చైతన్యంతోనే ఇప్పుడు సూరత్ పరిశుభ్రంగా మారిపోయిందని, ఆ స్ఫూర్తి మల్కాపూర్‌లో కనిపిస్తున్నదని చెప్పారు.
మల్లయ్య నన్ను డబ్బులు అడుగుతలేడు
ప్రతి ఇంటికి బర్రెలు ఎంత ఆధారంగా ఉంటాయో చెప్పిన సీఎం.. ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రం పక్కన ఉండే రైతు మల్లయ్య తనను డబ్బులు అడగడంలేదని తెలిపారు. మోటరు కాలిపోయిందంటూ డబ్బులు అడిగేవాడు. నేను ఇచ్చేవాడిని. ఎర్రవల్లిని దత్తత తీసుకున్న తరువాత ప్రతి ఇంటికి రెండు బర్రెలు ఇచ్చాం. ఈ మధ్య పొలం వద్ద మల్లయ్య కలిసినప్పుడు డబ్బులు వద్దా? అని అడిగితే వద్దన్నడు. పాలు అమ్మితే ప్రతి వారం రూ.3 నుంచి 4వేల వస్తున్నాయి. డబ్బులకు ఇబ్బంది లేదని చెప్పిండు. కరంటు బాగా వస్తున్నది. మోటరు కూడా కాలిపోవడం లేదన్నాడు అని వివరించారు.
మల్కాపూర్‌కు మంచిరోజులు: మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే ఆదర్శంగా నిలుస్తున్న మల్కాపూర్ గ్రామానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రావడంతో మంచిరోజులొచ్చాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కంటివెలుగు కార్యక్రమం ఇక్కడనుంచి మొదలుకావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీలు కే కేశవరావు, జోగినిపల్లి సంతోష్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు శేరి సుభాష్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, భూపతిరెడ్డి, ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేత్రదానానికి 750 మంది సంసిద్ధత
కంటివెలుగు ప్రారంభోత్సవం సందర్భంగా మల్కాపూర్‌లోని 750 మంది నేత్రదానానికి సంసిద్ధత వ్యక్తంచేస్తూ సీఎం కేసీఆర్‌కు అంగీకార పత్రాలు అందించారు. వారిని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ అభినందించారు.
యోగక్షేమాలు తెలుసుకుంటూ..
కంటివెలుగు కార్యక్రమం ప్రారంభానికి వచ్చిన సీఎం కేసీఆర్.. మల్కాపూర్‌లో పర్యటించారు. గ్రామంలో పచ్చదనాన్ని పరిరక్షిస్తున్న తీరును పరిశీలించారు. గ్రామ సమీపంలోని రాక్‌గార్డెన్‌లో మొక్క నాటారు. గ్రామంలో తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. మంచినీళ్లు వస్తున్నయా? అని గుల్లపల్లి లక్ష్మిని ప్రశ్నించగా, నీళ్లు బాగానే వస్తున్నయని ఆమె సమాధానం చెప్పారు. గ్రామంలోని దుర్గామాత ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కంటివెలుగు శిబిరాన్ని సందర్శించారు. నలుగురు మహిళలు, ఓ యువకుడికి సీఎం కండ్లద్దాలు అందించారు.
చాలా రోజులుగా కండ్లు మస్కగ కనిపిస్తున్నయ్. మా ఊరికే డాక్టర్లు వచ్చిండ్రు. పరీక్షలు చేసి అద్దాలు పెట్టుకోవాలన్నరు. సీఎం కేసీఆరే నాకు అద్దాలు ఇచ్చిండ్రు. అంత పెద్ద మనిషి ఊరికి వచ్చి నాకు అద్దాలు ఇస్తుంటే సంతోషం అనిపించింది. సీఎంలంటె గిట్లుండాలె. నాకు కండ్ల సమస్య పోయింది. – పంజాల రేణుక, మల్కాపూర్
కొంతకాలంగా తలనొప్పి, కంటి సమస్యలతో బాధపడుతున్న. దవాఖానల్లో కూడా చూపించుకున్న. అయినా తగ్గలేదు. ఊర్లోనే డాక్టర్లు బాగా చూసిండ్రు. సీఎం కేసీఆర్ దగ్గరుండి మాకు పరీక్ష చేయించారు. కేసీఆరే కండ్ల అద్దాలు ఇచ్చిండు. అన్ని ఫ్రీగానే. ఇలాంటి పరీక్షలు చేస్తారనుకోలేదు. సీఎంకు మల్కాపూర్ అంతా రుణపడి ఉంటది.
– బేగం, మల్కాపూర్