Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వెంకటయ్యా..పంటెట్లుంది!

-డిమాండ్‌ ఉన్న పంటలు వేయాలి: సీఎం
-గద్వాల జిల్లా పర్యటనలో రైతులతో కేసీఆర్‌
-వేరుశనగ చేను మంచిగ కాయ పట్టిందా?
-ఇత్తనం ఏం పెట్టినవ్‌? ధర మంచిగున్నదా?
-రోడ్డు పక్కన పొలాల్లోకి వెళ్లి పంట పరిశీలన
-మినుము, వేరుశనగ పంటలపై సీఎం వాకబు
-ఆరుతడి పంటలతో భూసారం పెరుగుతుంది
-వరి కొనేదే లేదని కేంద్రం అంటున్నది
-ఏం చేద్దాం అంటూ రైతులతో మాటామంతీ

యాసంగిలో వరి కాకుండా మారెట్లో మంచి డిమాండ్‌ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు వంటి ఇతర పంటల సాగుచేసుకోవాలని రైతులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. పంట మార్పిడి, ఆరుతడి పంటల సాగువల్ల భూమిలో సారం కూడా పెరుగుతుందని తెలిపారు. సీఎం గురువారం జోగులాంబ గద్వాల జిల్లాకు వెళ్లారు. ఇటీవల మరణించిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగివెళ్తూ మార్గమధ్యంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్‌, కొత్తకోట మండలం విలియంకొండ తండా పరిధిలో రైతులు సాగుచేసిన మినుము, వేరుశనగ పంటలను పరిశీలించారు. మొదట రంగాపూర్‌ వద్ద ఆగి, మహేశ్వర్‌రెడ్డి అనే రైతు సాగుచేస్తున్న మినుము పంటను, రాములు అనే మరో రైతు సాగుచేస్తున్న వేరుశనగ పంటను పరిశీలించారు. రైతులతో కాసేపు ముచ్చటించారు. మినుములు, వేరుశనగ దిగుబడి ఎంత వస్తున్నది? మారెట్‌లో ధర ఎంత ఉన్నది? పంట చేతికొచ్చేవరకు ఎన్ని తడులు నీళ్లు పెడుతున్నరు? అని అడిగి తెలుసుకొన్నారు. ఆ తర్వాత కొత్తకోట మండలం విలియంకొండ తండా వద్ద కల్లంలో ఆరబోసిన వరి ధాన్యాన్ని సీఎం పరిశీలించారు. గోకరి వెంకటయ్య అనే రైతు వేసిన వేరుశనగ చేలోకి వెళ్లి పంటను పరిశీలించారు. వేరుశనగ దుబ్బును తెంపి కాయలను చిట్లించి చూశారు. నీళ్లు, కరెంటు పుషలంగా ఉండటంతో దిగుబడి పెరిగిందని రైతు వెంకటయ్య సీఎంకు వివరించారు. సీఎం కేసీఆర్‌ అకస్మాత్తుగా తమ పంట చేలల్లోకి రావడంతో రైతులు, గిరిజనులు ఆయనతో ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా మారెట్లో డిమాండ్‌ ఉన్న పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని సీఎం ఆదేశించారు. సీఎం వెంట మం త్రులు శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి , ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌ యాదవ్‌, పట్నం నరేందర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథం, జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా, వ్యవసాయశాఖ అధికారులు ఉన్నారు.

విలియంకొండ తండావద్ద..
కేసీఆర్‌: ఏయే పంటలు పండిస్తరు? పంటలు ఎట్ల వస్తున్నయి?
రైతు వెంకటయ్య: సార్‌ ఇక్కడ ప్రధానంగా వరి, పల్లి పండిస్తం. గతంలో ఎకరానికి 25-30 బస్తాల వడ్లు వచ్చేవి. ఈసారి కాలం బాగయింది. ఎకరానికి 50 బస్తాల వరకు వచ్చాయి. పల్లి కూడాఎకరానికి 7 నుంచి 10 క్వింటాళ్ల వరకు పండింది.
కేసీఆర్‌: పల్లికి ధర ఎట్లున్నది?
రైతు: మద్దతు ధర 6 వేల నుంచి 7 వేల వరకు వచ్చింది సార్‌. బాగనే గిట్టుబాటు అవుతున్నది.
కేసీఆర్‌: కేంద్రం వడ్లు కొనబోమంటున్నది.ఏం చేద్దాం వెంకటయ్యా?
రైతు: మా వ్యవసాయ మంత్రి చూసుకుంటడు సార్‌.
కేసీఆర్‌: కేంద్రం తీసుకొనేది లేదంటేమీ మంత్రి ఏం చేస్తడు? వాళ్లు ససేమిరాధాన్యం కొనమంటున్నరు?

సీఎం మా చేన్లకు వస్తడనుకోలే..
ముఖ్యమంత్రే మా చేన్లకు వచ్చి మాట్లాడుతడని అనుకోలేదు. ఆయనా రైతు బిడ్డే కాబట్టి మాతో మాట్లాడి, మా కష్టాలు తెలుసుకున్నరు. మీ తండాకు సీఎం వచ్చిండ్రంట కదా! అని అందరూ ఫోన్‌ చేసి అడుగుతున్నరు. సీఎం వచ్చుడేకాదు.. మా బాగోగులుఅడిగి తెలుసుకున్నరని చెప్తున్నం.

రైతు కృష్ణమ్మ, విలియంకొండ తండా

రైతులతో సీఎం సంభాషణ సాగిందిలా..
సీఎం: మినుము పంట ఎలా ఉన్నది? ఎంత దిగుబడి వస్తది?
రైతు మహేశ్వరరెడ్డి: చాలా బాగుంది సార్‌.. పంట దిగుబడి కూడా బాగుంది. ఎకరానికి రూ.20 వేల నుంచి 25 వేలు ఖర్చు వస్తున్నది సార్‌.
సీఎం: మరి మినుములు బెస్టా? పెసర్లు బెస్టా?
రైతు: మినుము పంటే ఎక్కువ లా భం. కష్టం తక్కువ సార్‌. పెసర పంట చిట్లిపోతది. మినుములు బాగుంటది.
సీఎం: మినుము పంటతో ఎంత ఆదాయం వస్తది?
రైతు: ఎకరం మినుము పంటకు రూ.25 వేలవరకు లాభం వస్తది సార్‌.
సీఎం : వేరుశనగ పంట పరిస్థితి ఏంది?
రైతు: దిగుబడి ఎక్కువ వస్తున్నది. మద్దతు ధర కూడా బాగుంది. గతేడాదితో పోలిస్తే వేరుశనగకు మద్దతు ధర ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది సర్‌.
మంత్రి నిరంజన్‌రెడ్డి: (సీఎంనుద్దేశించి..) సార్‌.. అచ్చంపేటలో మరో యాభై వేల ఎకరాల్లో వేరుశనగ వేశారు. ఆరుతడి పంటలవైపు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.

సీఎం: వ్యవసాయాధికారి ఎవరు ఇక్కడ?
ఏఈవో పుష్పలత: నేనే సార్‌.
సీఎం: మినుము దిగుబడి ఎకరానికి ఎంత?
పుష్పలత: ఎకరానికి 8 నుంచి 12 క్వింటాళ్ల వరకు వస్తుంది సార్‌.
సీఎం: ఎన్ని రోజులకు పంట చేతికొస్తది? ధర ఎంత పలుకుతున్నది?
పుష్పలత: 90 రోజులకొస్తుంది సార్‌. క్వింటా 7 వేల నుంచి రూ.7,500 వరకు వస్తున్నది.
సీఎం: విత్తన రకం ఏంటి?
ఏఈవో: టీ-9 సార్‌.
సీఎం: వేరుశనగలో ఏ రకం వాడుతున్నరు?
ఏఈవో: కే-6 రకం సార్‌.
సీఎం: వేరుశనగ ఎంత దిగుబడి వస్తది?
ఏవో చంద్రమౌళి: ఎకరాకు 15 క్వింటాళ్లు వస్తున్నది సార్‌.
మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా: పాలమూరులో జిల్లావ్యాప్తంగా రైతులు ఆరుతడి పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. ఒక్క పెబ్బేరు మండలంలోనే 3,200 ఎకరాల్లో మినుముల పంట వేశారు.
పెబ్బేరు మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ కర్రెస్వామి: వనపర్తి జిల్లాలో వేరుశనగ పరిశోధన కేంద్రాన్ని మంజూరు చేసినందుకు జిల్లా రైతులం రుణపడి ఉంటాం సార్‌. చరిత్రలో రైతులకు ఎవరూ ఇన్ని పథకాలు అమలుచేయలేదు.

ఇతర రైతులతో..
సీఎం కేసీఆర్‌: మీది ఏ ఊరు? ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? ఏం పంట సాగు చేసినవ్‌?
రైతు కీమ్యానాయక్‌: నమస్తే సార్‌. పక్కన్నే కనిపించే విలియంకొండ తండా మాది. నాకు ఎకరం పొలం ఉన్నది. వడ్లు పండించిన.
సీఎం కేసీఆర్‌: మీదెక్కడమ్మ? ఏం పంట వేసిండ్రు?
రైతు కృష్ణమ్మ: సార్‌ నాపేరు కృష్ణమ్మ. మాది పక్కనున్న తండానే. మూడు ఎకరాల పొలం ఉన్నది. నీళ్లు బాగా వస్తున్నయి. వరి, పల్లి వేసినం.

ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి సీఎం పరామర్శ
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. కృష్ణమోహన్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి గత నెల 11న మృతిచెందిన సంగతి తెలిసిందే. గురువారం సీఎం కేసీఆర్‌ ప్రత్యేక బస్సులో జోగుళాంబ గద్వాలకు వెళ్లి ఎమ్మెల్యే నివాసంలో వెంకట్‌రామిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వెంకట్రామిరెడ్డి భార్య రేవతమ్మతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కృష్ణమోహన్‌రెడ్డికి ధైర్యం చెప్పారు. సీఎం వెంట మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, వీఎం అబ్రహం, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, మున్సిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ తదితరులు ఉన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.