-మోదీ మోసాన్ని మర్చిపోం
-కేంద్ర క్యాబినెట్ తొలి భేటీలోనే తెలంగాణకు అన్యాయం
-పోలవరం కోసం ఏడు మండలాలను ఏపీలో కలిపారు..
-వాటిని తిరిగి తెలంగాణలో కలుపాల్సిందే
-24వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫారసు చేసింది..
-అయినా ప్రధాని మోదీ పట్టించుకోలేదు
-గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏవి?..
– హైకోర్టు విభజనపై స్పందనలేని కేంద్రం
-ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే అభ్యంతరం లేదు..
-అంతకుముందు తెలంగాణకిచ్చిన హామీలు నెరవేర్చాలి
-కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి..
-అవిశ్వాసంపై చర్చలో టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్
తెలంగాణకు ప్రధాని నరేంద్రమోదీ చేసిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని లోక్‌సభలో టీఆర్‌ఎస్‌పక్ష ఉపనేత బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. మోదీపై ప్రజలు పెట్టుకున్న ఒక్క ఆశను కూడా ఈ నాలుగేండ్లలో నెరవేర్చలేదని చెప్పారు. మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో జరిగిన చర్చలో టీఆర్ఎస్ తరఫున ఎంపీ వినోద్ మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడగానే మొదటి మంత్రివర్గ సమావేశంలోనే తెలంగాణకు అన్యాయం చేశారని, ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న ఏడు మండలాలను పోలవరం ప్రాజెక్టు పేరుతో అన్యాయంగా ఏపీలో విలీనంచేస్తూ ఆర్డినెన్స్ తెచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఆర్డినెన్స్‌ను తాము వ్యతిరేకించినా, అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదన్నారు. ఈ ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపకుంటే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోనని చంద్రబాబునాయుడు ప్రధాని మోదీని బెదిరించారని, ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా చొరవ తీసుకుని ఏపీలో ఏడు మండలాలను విలీనం చేశారని చెప్పారు.
ఆ ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని, ఇందుకోసం లోక్‌సభలో పునర్విభజన చట్టం సవరణ బిల్లు పెట్టాలని ఎంపీ వినోద్ డిమాండ్‌చేశారు. తెలంగాణలో ఉన్న సీలేరు హైడల్ ప్రాజెక్టును అన్యాయంగా ఏపీలో కలిపారని కేంద్రాన్ని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్తును ఇవ్వకున్నా.. ఛత్తీస్‌గఢ్, తమిళనాడు నుంచి విద్యుత్ కొనుగోలు చేసుకున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ విద్యుత్ అంశంలో పట్టుమీదున్నారని, దేశంలో ఎక్క డా లేనివిధంగా.. వ్యవసాయంతోపాటు అన్ని రంగాలకు 24 గంటలు విద్యుత్‌ను సరఫరాచేస్తున్నామని చెప్పారు. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్‌ను నిరంతరాయంగా ఇస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నామని చెప్తూ.. కేంద్రం నుంచి ఒక్కపైసా సహకారం లేకున్నా ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నదని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు కోర్టులో కేసులు వేస్తున్నారని విమర్శించారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ప్రకటించి వేల కోట్ల నిధులు ఇస్తున్నదని, కానీ.. తెలంగాణ ప్రభుత్వం 37 లక్షల ఎకరాల బీడు భూములను సాగులోకి తీసుకువచ్చేందుకు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపాయి ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటికైనా జాతీయ హోదా ప్రకటించాలని వినోద్ డిమాండ్‌చేశారు. పోలవరం కోసం ఇంకా నిధులు కావాలని ఎంపీ గల్లా జయదేవ్ కోరిన విషయాన్ని ప్రస్తావి స్తూ.. వారు అడిగిన నిధులు కేంద్రం ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. పోలవరం విషయంలో తాము అడుగుతున్నది నీటిపంపకం గురించి మాత్రమేనని మరోసారి స్పష్టంచేశారు. తుమ్మిడిహట్టి దగ్గర డ్యాం కట్టుకోవడానికి మహారాష్ట్ర అడ్డు చెప్తున్నదని, ఈ విషయంపై ఇప్పటికే కేంద్రానికి చెప్పామని, అయినా సమాధానం ఇవ్వలేదని ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రారంభమైనదే నీటి పంపకాల్లో వివక్షకు వ్యతిరేకంగానని ఎంపీ గుర్తుచేశారు.
విభజన హామీలపై ప్రధాని సమాధానం ఇవ్వాలి విభజన చట్టంలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలు అమలుచేయలేదని ఎంపీ వినోద్ విమర్శించారు. దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. సీఎం కేసీఆర్ గుండె నిబ్బరంతో.. దేశానికి ఆదర్శంగా నిలిచేలా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను చేపట్టారన్నారు. ఇవి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయని చెప్పారు. మిషన్ కాకతీయతో ఏండ్ల నాటి గొలుసుకట్టు చెరువులు, గ్రామాల చెరువులు మరమ్మతులకు నోచుకున్నాయని, ఇప్పుడు కొన్ని టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం లభించిందన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీటిని అందించే బృహత్తర కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారని తెలిపారు. మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ.19వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫారసు చేసినా ఇంతవరకూ ప్రధాని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజన యూనివర్సిటీ ఇస్తామని, బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, మాట మా ర్చారని ఎంపీ వినోద్ విమర్శించారు.
తెలంగాణ ప్రజలు బయ్యారం ఉక్కు పరిశ్రమకోసం ఎదురుచూస్తున్నారన్నారు. జాతీయ రహదారుల అంశంలో కూడా కేంద్రం తీరు సంతృప్తిగా లేదని చెప్పారు. ప్రధానంగా హైకోర్టు విభజన వెంటనే చేయాలని ఎంపీ వినోద్ డిమాండ్‌చేశారు. 2016లోనే మంత్రి సదానందగౌడ్ హైకోర్టు విభజనపై హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు అడుగు పడటం లేదన్నారు. అమరావతిలో సచివాలయం, అసెంబ్లీని రికార్డు సమయంలో నిర్మిస్తున్నామని చెప్తున్న ఏపీ ప్రభుత్వం.. హైకోర్టును ఎందుకు నిర్మించుకోవడం లేదని ప్రశ్నించారు. కేంద్రం కూడా హైకోర్టు ఏర్పాటుకు చర్య తీసుకోవడం లేదని ఆక్షేపించారు. మెజార్టీ జడ్జీలు తెలంగాణ ప్రభుత్వానికి సహకరించడం లేదని తెలిపారు. ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ ప్రాంతానికి చెందిన న్యాయమూర్తులు పెద్దగా లేరన్నారు.
ప్రత్యేక హోదా అంటే ఏమిటి..? ఏపీ డిమాండ్చేస్తున్న ప్రత్యేక హోదా అంటే ఏమిటని ఎంపీ వినోద్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ అంటున్నారని, ప్రత్యేక హోదా అంటే ఏమిటో రాహుల్ వివరించాలని డిమాండ్ చేశారు. హోదా ఇచ్చినప్పుడు పన్ను మినహాయింపులు ఇస్తారా? లేదా? అని రాహుల్‌ను ప్రశ్నించారు. ఇంకా మోసపోవాలని తమకు లేదని వినోద్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాకు ఓ చట్టం కూడా లేదని పేర్కొన్నారు. వారంటున్న ప్రత్యేక హోదా ఇచ్చి నిధులిస్తే తమకేం అభ్యంతరం లేదని, కానీ విభజన హామీల్లో భాగంగా తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, వాటిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఓటింగ్‌కు దూరం అవిశ్వాసతీర్మానంపై ఓటింగ్‌కు టీఆర్ఎస్ ఎంపీలు దూరంగా ఉన్నారు. తీర్మానం చర్చలో పాల్గొన్న అనంతరం టీఆర్ఎస్ పక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి.. పార్లమెంట్ ఆవరణలో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఓటింగ్‌లో పాల్గొనే అంశంపై చర్చించారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌తో ఎప్పటికప్పుడు ఫోన్లో సంప్రదించారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించారు.