-మాఫీ హామీపై వెనుకకు తగ్గేది లేదు – విధివిధానాల రూపకల్పనకు ఉపసంఘం – బ్యాంకర్లతో సమావేశంలో ముఖ్యమంత్రి వెల్లడి – తక్షణమే కొత్త రుణాలివ్వాలని కోరిన కేసీఆర్ – పరిశీలనలో రైతులకు బాండ్లు ఇచ్చే అంశం – బడ్జెట్‌లో రుణమాఫీకి నిధులు : ఈటెల – వారంలోగా రుణమాఫీ అంశం కొలిక్కి..!?
లక్షలోపు రైతు రుణాల మాఫీ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు నూటికి నూరుశాతం రైతు రుణమాఫీ అమలుచేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రుణమాఫీ మొత్తాలను విడతల వారీగా బ్యాంకులకు చెల్లిస్తామని ఆయన ప్రకటించారు. మాఫీ విధివిధానాల ఖరారుకు ఉపసంఘం కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ముందుకు పోతాం తప్ప వెనకడుగు వేయబోమని చెప్పారు.
రుణమాఫీకి బ్యాంకులనుంచి కొన్ని అడ్డంకులు ఎదురవుతున్న నేపథ్యంలో మంగళవారం సచివాలయంలో బ్యాంకర్లతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రతిపాదనలను వారికి వివరించారు. రుణమాఫీకి సంబంధించిన సొమ్మును విడతలవారీగా చెల్లిస్తామని, ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అందువల్ల తక్షణమే రైతులకు కొత్త రుణాలివ్వాలని ఆయన కోరారు. పంట రుణాలకు సంబంధించిన విధివిధానాలపై వారితో సుదీర్ఘంగాచర్చించారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల వరకు పంట రుణ మాఫీ చేసి తీరుతామన్నారు. అయితే ఏ పద్ధతిలో అమలు చేయాలనే దానిపై స్పష్టత కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని ఈ కమిటీ బుధవారం సమావేశమవుతుందని చెప్పారు. వాస్తవానికి ఈ ఉపసంఘం సంబంధిత అధికారులతో మంగళవారం సమావేశం కావాల్సి ఉండగా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఢిల్లీలో ఉన్నందున ఆ సమావేశం జరుగలేదు. దీనితో మంత్రి టీ హరీశ్‌రావు నేతృత్వంలో బుధవారం కమిటీ సమావేశం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. వీలైనంత వేగంగా కమిటీ విధి విధానాలు రూపొందించి నివేదిక అందజేయాలని కోరారు.
ప్రభుత్వ అధికారులతో పాటు బ్యాంకర్లను కూడా సమావేశాలకు పిలిచి చర్చించాలన్నారు. మాఫీ అమలులో రైతులను ఎలాంటి గందరగోళానికి గురిచేయకుండా, ఇబ్బందులు రానీయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రుణమాఫీ చేసే విషయంలో బ్యాంకర్లు అనేక షరతులు విధిస్తున్నాయని, వాటన్నింటిపై కూడా తాను ఆర్‌బీఐ గవర్నర్ రఘునాథ్‌రామన్‌తో చర్చలు జరిపానని వివరించారు. మాఫీకి సంబంధించి ప్రభుత్వం వద్ద ప్రాథమికంగా రెండు ప్రతిపాదనలున్నాయని పేర్కొన్నారు. రైతులకు బాండ్లు ఇచ్చే అంశాన్ని కూడా తాము పరిశీలిస్తున్నామన్నారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి టీ రాజయ్య, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్‌రావు, లీడ్ బ్యాంక్ ఛైర్మన్ శంతన్ ముఖర్జీ, ఆంధ్రా బ్యాంక్ సీఎండీ సీవీఆర్ రాజేంద్రన్, ఎస్‌బీఐ సీజీఎం సీఆర్ శశికుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు నాగిరెడ్డి, రామకృష్ణారావు, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులున్నారు.
వారంరోజుల్లో విధివిధానాలు.. రుణమాఫీపై నియమించిన మంత్రివర్గ సమావేశం వారం రోజుల్లో దీనిపై స్పష్టత ఇస్తుందని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. రుణమాఫీపై బ్యాంకర్లతో సమావేశం అనంతరం మంత్రి హరీష్‌రావుతో కలిసి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ అమలుచేసి కొత్త రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను ప్రభుత్వం కోరిందని..వారు పరిశీలిస్తామని చెప్పారని వెల్లడించారు. ఒకవేళ బ్యాంకులు కాదంటే తామే అక్టోబర్‌లో మొదటి విడత మొత్తాన్ని చెల్లిస్తామన్నారు.
మిగతా రుణాన్ని మూడు విడతల్లో వడ్డీతో సహా చెల్లించేందుకు కూడాప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మూడు విడతల కోసం ప్రభుత్వం చెక్కులను లేదా బాండ్లను అందచేస్తుందని చెప్పారు. రుణమాఫీ కోసం అవసరమైన మొత్తాన్ని బడ్జెట్‌లో కేటాయిస్తున్నామని ఆయన ప్రకటించారు.