Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

విద్యాక్షేత్రంగా తెలంగాణ

-ఒకటో తరగతి నుంచే ఉచిత నిర్బంధ విద్య -వచ్చే ఏడాది నుంచే అమలులోకి తెస్తాం -సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలు వెలకట్టలేనివి -ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను త్వరలో పరిష్కరిస్తాం -గురుపూజోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్

KCR 02

బంగారు తెలంగాణ నిర్మాణానికి ఇంగ్లీష్ విద్య కూడా అవసరమే.. తద్వారా ప్రపంచంతో పోటీపడే విధంగా తెలంగాణను తయారుచేసుకుందాం. తెలంగాణ విద్యార్థులను వజ్రాలుగా తయారు చేసుకుందాం.. అమ్మ జన్మనిస్తే.. గురువు జీవితాన్ని ఇస్తాడు. గురువులు చదువు చెప్పడంలో న్యాయం చేసినట్లయితే బృహస్పతిలాంటి వారు. కానీ అదే గురువులు విద్యాబోధనకు దూరంగా ఉన్నట్లయితే శనిగ్రహంలాంటి వారు. -కే చంద్రశేఖర్‌రావు, ముఖ్యమంత్రి

రాష్ట్రంలో ఉచిత నిర్భంధ విద్య అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఉచిత నిర్బంధ విద్యను 1వ తరగతి నుంచి అమలు చేస్తామని తెలిపారు. దశలవారీగా 12 ఏండ్లలో పూర్తిస్థాయిలో ఉచిత విద్య అందించడానికి ప్రయత్నిస్తామన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి ఇంగ్లీష్ విద్య కూడా అవసరమేనన్న సీఎం.. మన ఉపాధ్యాయులు ఆరు నెలల్లో ఇంగ్లీష్‌లో పాఠాలు చెప్పే విధంగా తయారు కావాలని అన్నారు. తద్వారా ప్రపంచంతో పోటీపడే విధంగా తెలంగాణను తయారు చేసుకుందామని చెప్పారు.

తెలంగాణ విద్యార్థులను వజ్రాలుగా తయారు చేసుకుందామని, రాబోయే రోజుల్లో తెలంగాణను విద్యాక్షేత్రంగా మల్చుదామని పిలుపునిచ్చారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురుపూజోత్సవం శుక్రవారం రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. సర్వేపల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఏకసంధాగ్రహి అని చెప్పారు. భగవద్గీతను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్పవాడని కీర్తించారు. దేశంలో రాష్ట్రపతికంటే గురువులదే ప్రథమ స్థానమని అన్నారు. అమ్మ జన్మనిస్తే.. గురువు జీవితాన్ని ఇస్తాడన్నారు. ఈ క్రమంలో తన చిన్నతనంలో చదువు చెప్పిన తన గురువు మృత్యుంజయశర్మను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

మృత్యుంజయశర్మను పొగడలేకుండా ఉండలేనన్నారు. తాను 8, 9 10 తరగతులు వచ్చేసరికే ప్రబంధ సాహిత్యాన్ని అవలోకనం చేసుకోగలిగానని చెప్పారు. పోతన భాగవతాన్ని, కవిత్రయం మహాభారతాన్ని, కావ్యాలను, సాహిత్యాలను గొప్ప గ్రంథాలను ఆ చిన్న వయస్సులో గురువులు తనకు పరిచయం చేశారంటూ సభాముఖంగా ముఖ్యమంత్రి గురువందనం చేశారు. గురువులు శ్రద్ధగా బోధించడం వల్లనే తనకు సాహిత్యంలో ప్రవేశం లభించిందని పేర్కొన్నారు. పాఠశాల స్థాయిలోనే ఉపన్యాస, వ్యాసరచన పోటీలలో పాల్గొన్నానని చెప్పారు. దుబ్బాక పాఠశాలల విద్యార్థులు పాల్గొంటున్నారంటే మిగతా పాఠశాలల విద్యార్థులు భయపడేవారన్నారు.

చిన్న తనంలో తన గురువు మృత్యుంజయశర్మ నుంచి నేర్చుకున్న ఉత్తర గోగ్రహణం పాఠాన్ని మననం చేసుకున్నారు. అందులోని.. భీష్మ ద్రోణ కృపాది ధన్వికరా బీలంబు, దుర్యోధన.. గ్రీష్మాధిత్య పటు ప్రతాప విసరా కీర్ణంబు, శస్తాస్త్రజా.. లోష్మాస్పార చతుర్విధో జ్వల బలాత్యుగ్ర బుధగ్ర.. ర్చిష్మత్యా కలితంబు సైన్యమిదియే చేరంగ శక్తుండనే అనే పద్యాన్ని వినిపించారు. పద్యాలు, సమాసాలు నేను నేర్వడం చిన్నప్పుడు నా గురువులు పెట్టిన భిక్ష. తొమ్మిదో తరగతిలోనే గ్రంథాలు, భాగవతం, రామాయణం గురించి నేర్చుకున్నాను. ఇదంతా నా గురువుల దయ అన్నా రు. గురువులు చదువు చెప్పడంలో న్యాయం చేసినట్లయితే బృహస్పతిలాంటి వారు. కానీ అదే గురువులు విద్యాబోధనకు దూరంగా ఉన్నట్లయితే శనిగ్రహంలాంటి వారు అని సీఎం అభివర్ణించారు.

ఆంగ్లేయులూ ఆశ్చర్యపోవాలి తెలంగాణలో ఇంగ్లీష్ మీడియంలో జరిగే బోధన చూసి ఆంగ్లేయులు సైతం ఆశ్చర్యపోయేలా ఉండాలని సీఎం అభిలషించారు. తెలుగు భాషను కాపాడుకొంటూనే.. ఇంగ్లీష్ మీడియంలో ఉచిత విద్య అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఉచిత విద్యా విధానం కోసం ఏర్పాటు చేయనున్న మోడల్ స్కూళ్ళ ను నియోజకవర్గం వారీగా ఏర్పాటు చేయాలా లేక మండలంవారీగా ఏర్పాటు చేయాలా అన్న అంశంపై చర్చ కొనసాగాల్సి ఉందన్నారు. ఆ మేరకు రాష్ట్రంలో ఉన్న ప్రొఫెసర్లు, అధ్యాపకులు, లెక్చరర్లు, టీచర్లు, మేధావులు అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. దీనిపై ప్రస్తుతం రాష్ట్రంలో విభజన పనులలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, శాఖల మార్పిడి తర్వాత పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఏకీకృత సర్వీసు రూల్స్‌కు త్వరలో పరిష్కారం ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల ఏకీకృత సర్వీసు రూల్స్ అంశానికి త్వరలోనే పరిష్కారం చూపిస్తామని సీఏం హామీ ఇచ్చారు. ఈ మేరకు అన్ని సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తానన్నారు. టీచర్ల నుంచే డీఈవోలు, డిప్యూటీ ఈవోలు వస్తేనే ధర్మం, న్యాయమని అభిప్రాయపడ్డారు.

ఇంగ్లీష్‌లో బోధనకు సిద్ధం కావాలి ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు బోధించడానికి టీచర్లు తయారు కావాల్సి ఉందని సీఎం అన్నారు. చైనాలో ఒకప్పుడు ఇంగ్లీష్‌ను నిషేధించారు. కానీ ఇప్పుడు ప్రపంచమే ఆశ్చర్యపడేలా వారు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. చైనా నుంచి వచ్చిన ప్రతినిధులు పరిశ్రమలు పెడతామంటూ నన్ను కలిశారు. వారు ఇంగ్లీష్‌లో ఎంతో చక్కగా, అనర్గళంగా మాట్లాడారు. తెలంగాణ ఉపాధ్యాయులు ఎం తక్కువ? వారు ఇంగ్లీష్‌లో పాఠాలు ఎందుకు చెప్పరు? ఇదేమన్న బ్రహ్మ విద్యా? అని సీఎం కేసీఆర్ అన్నారు. ఉపాధ్యాయు లు ఆరు నెలల్లో ఇంగ్లీష్‌లో పాఠాలు చెప్పే విధంగా తయారు కావాలని కోరారు. విద్యను అందించడంలో గత ప్రభుత్వాలు పిచ్చి పనులు చేశాయని సీఎం విమర్శించారు. ఉచిత విద్య అందించేందుకు ఒక ప్రణాళిక తయారు చేసుకుందామన్నారు. టీచర్ ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్నారని, వారితో చర్చిద్దామని, విశ్లేషణ చేసుకుందామని చెప్పారు. ఉచిత విద్యను ఇంగ్లీష్ మీడియంలో అందించి తెలంగాణ విద్యార్థులను వజ్రాలుగా తయారు చేసుకుందామని టీచర్లకు పిలుపునిచ్చారు. రాబోయే రోజులలో తెలంగాణ విద్యాక్షేత్రంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు.

ఇది పునరంకిత సభ: జగదీశ్‌రెడ్డి ఈ వేడుకలు దేశవ్యాప్తంగా జరుపుకొంటున్నప్పటికీ తెలంగాణ జరుపుకోవడంలో ప్రత్యేకత ఉందని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఇది తెలంగాణలో టీచర్ అవార్డుల కోసం నిర్వహించిన వేడుక కాదని, తెలంగాణ రాష్ర్టానికి పునరంకితం కావడానికి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమమని అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ టీచర్లకే మార్గదర్శకం అని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు.ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు తయారు కావడానికి టీచర్లే కారణమని హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. కాగా, ట్యాంక్‌బండ్‌పై గల సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం వద్ద సీఎం నివాళులర్పించారు.

ఉద్యమంలో పాల్గొన్న టీచర్లకు అభినందనలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న టీచర్లు అనన్య సామాన్యులు కేసీఆర్ ప్రశంసించారు. ఉద్యమంలో పాల్గొన్న టీచర్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. ఉద్యమంలో టీచర్ల పాత్ర చాలా గొప్పదన్నారు. ఉద్యమంలో విద్యార్థులు చదువులు నష్ట పోకుండా.. సెలవు దినాలలో సిలబస్ పూర్తి చేసిన ఘనత కూడా తెలంగాణ టీచర్లకే దక్కిందని కొనియాడారు.

ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలు, ఇంటర్, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీ అధ్యాపకులకు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను ప్రభుత్వం ప్రదానం చేసింది. శుక్రవారం రవీంద్ర భారతిలో నిర్వహించిన గురుపూజోత్సవంలో విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నరసింహరెడ్డి అవార్డులను ప్రదానం చేశారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 39 మంది, కాలేజీలు, యూనివర్సిటీ నుంచి 46 మందితో పాటు సాంస్కృతిక విభాగం నుంచి ఇద్దరికి కలిపి మొత్తం 87 మందికి అవార్డులు అందించారు. అంతకు ముందు తెలంగాణ సంప్రదాయాలతో ఆటలు, పాటల కార్యక్రమం కొనసాగింది. తెలంగాణ గీతం, బతుకమ్మ, పోతురాజుల వీరంగంవంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను రంజింపజేశాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.