-రాష్ర్టాల అధికారాలను హరిస్తున్న బిల్లు -ఇది సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం -రైతులు, పేదలకు తీవ్రమైన నష్టం -ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ -అంశాల వారీగా అనర్థాలపై వివరణ -తూతూ మంత్రపు సంప్రదింపులు సరికావు

విద్యుత్ చట్టానికి సవరణలను ప్రతిపాదిస్తూ కేంద్రం రూపొందించిన బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రతిపాదిత బిల్లు రైతులకు, పేదలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని, విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని స్పష్టంచేశారు. రాష్ర్టాల అధికారాలను హరించే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు-2020పై రాష్ర్టాల అభిప్రాయాలు తెలుపాలని కేంద్రం కోరిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ప్రభుత్వం తరఫున తమ ఆందోళనను, బిల్లు వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ.. బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. బిల్లులో పేర్కొన్నట్టుగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిని కేంద్రం నియమించే సెలెక్షన్ కమిటీ ఎంపికచేయడం సరైనది కాదు. ఈ రకమైన చర్య రాష్ర్టాలకు విద్యుత్ రంగంలో ఉన్న అధికారాలను హరించడమే అవుతుంది. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం.. అందులోనూ రాష్ర్టాల యంత్రాంగం పనితీరును నేరుగా ప్రభావితంచేసే విద్యుత్ లాంటి అంశంపై కేంద్రం పార్లమెంట్ చట్టం తీసుకురావడం సమంజసంకాదు. ఇది రా జ్యాంగ స్ఫూర్తికి, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతమే అవుతుంది. ఈ వైఖరిని మేము వ్యతిరేకిస్తున్నాం. నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీలాంటి పాలసీని రాష్ట్ర ప్రభుత్వాల స్పష్టమైన ఆమోదంతో తీసుకొనిరావాలి. తూతూ మంత్రంగా సంప్రదించడం సరైనది కాదు. దేశంలోని ప్రతి రాష్ర్టానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కొన్ని రాష్ర్టాల్లో జల విద్యుత్‌కు అవకాశం ఉన్నది. మరి కొన్నింటిలో పవన విద్యుత్.. ఇంకొన్నింటిలో సౌరవిద్యుత్‌తోపాటు భూమి అందుబాటులో ఉన్నాయి. రాష్ర్టాలు తమకు ఉన్న వనరులు, అవసరాల నేపథ్యంలో పాలసీని రూపొందించాలి. ఇలాంటి విభిన్న పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా.. విధానాల రూపకల్పనలో రాష్ర్టాలకు స్వేచ్ఛ ఉండాలి.
నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ) దేశవ్యాప్తంగా విద్యుత్ షెడ్యూలింగ్ చేసే శక్తిమంతమైన సంస్థగా బిల్లులో పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో మెరిట్ ఆర్డర్ పద్ధతిలో విద్యుత్‌ను ఎస్ఎల్డీసీ పూర్తి సంతృప్తికరంగా సరఫరా, పంపిణీచేస్తున్నది. గ్రిడ్ భద్రత అనేది ముఖ్యమే.. కానీ రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ యూనిట్లు బ్యాక్‌డౌన్ చేసుకొనేలా ఎస్ఎల్డీసీకి మరిన్ని అధికారాలు కట్టబెట్టడం సరైనది కాదు. కేంద్ర సంస్థలైన ఎన్టీపీసీ, ఎన్హెచ్పీసీల విద్యుత్ ఉత్పత్తి ఖర్చు తక్కువ ఉంటుంది. ఇలాంటివి మెరిట్ ఆర్డర్లో ముందువరుసలో ఉంటాయి. దానివల్ల రాష్ట్ర ఆధ్వర్యంలోని విద్యుత్ జనరేషన్ కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందుకే రాష్ట్రం పరిధిలో విద్యుత్‌కు సంబంధించి నిర్ణయాధికారాన్ని ఎస్ఎల్డీసీలకే వదిలేయాలి.ఎస్ఎల్డీసీకి విద్యుత్ కొనుగోలు బకాయిలకు సంబంధించిన అధికారాలు కట్టబెట్టడం సరైనది కాదు. ప్రస్తుతం ఉన్నట్టే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి, సివిల్ కోర్టులకు వదిలేయాలి. విద్యుత్ షెడ్యూలింగ్, గ్రిడ్ భద్రత వంటి సాంకేతిక అంశాలను ఎస్ఎల్డీసీ చూస్తే మంచిది.
ఓపెన్ యాక్సెస్ అనేది ఎలాంటి నియంత్రణ లేకుండా ఈ బిల్లులో ప్రతిపాదించారు. దీనివల్ల డిస్కంల ఆదాయం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఒక మెగావాట్ కంటే ఎక్కువ ఉన్న వినియోగదారులు ఓపెన్ యాక్సెస్‌కు వెళుతారు. అలాగే సబ్ లైసెన్సీలు ఓపెన్ యాక్సెస్‌లో విద్యుత్‌ను కొనుగోలుచేసి.. రిటైల్ మార్కెట్లో అమ్ముకొంటాయి. ఇది డిస్కంల ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పద్ధతిలో వ్యవసాయం, గృహ వినియోగదారులకు సబ్సిడీ చెల్లించాలని ఈ బిల్లులో పేర్కొన్నారు. ఇది రైతాంగానికి, నిరుపేదల సంక్షేమానికి పూర్తి వ్యతిరేకమైనది. రైతులకు 24 గంటలపాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్‌ను అందించాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలసీ. సబ్సిడీ చెల్లింపు ఎలా చేయాలనేది రాష్ర్టాలకే వదిలేయాలి. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో ఎలాంటి సవరణ చేయాలని చూసినా.. మా ప్రభుత్వం తప్పకుండా అభ్యంతరం తెలియజేస్తుంది.క్రాస్ సబ్సిడీని ఎత్తివేసేలా ప్రస్తుత బిల్లులో ప్రతిపాదనలు చేశారు. వ్యవసాయంతో సహా అన్నివర్గాలకు, వినియోగదారులకు వాస్తవ ధరకే విద్యుత్‌ను అందించడం సరైంది కాదు. క్రాస్ సబ్సిడీ వల్ల కొన్నివర్గాలపై భారాన్ని తగ్గించేలా టారిఫ్‌ను నిర్ణయిస్తున్నాం. ఈ సవరణను వ్యతిరేకిస్తున్నాం. కొన్ని క్యాటగిరీల వినియోగదారులకు క్రాస్ సబ్సిడీ అందించే నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంచడం అభిలషణీయం.రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నియామకంపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాలను తొలిగించడం సమాఖ్యస్ఫూర్తికి విఘాతమే. కేంద్రం ప్రతిపాదించిన ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ ఏర్పాటుతో న్యాయవివాదాలు మరింత పెరుగుతాయి. కాం ట్రాక్టులనేవి సివిల్ కోర్టుల పరిధిలో ఉండటమే మేలు. విద్యుత్ సవరణ బిల్లు-2020లో పేర్కొ న్న అంశాలన్నీ ప్రజాభీష్టానికి, రాష్ర్టాల విద్యుత్ సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని బలంగా విశ్వసిస్తున్నాం. పైన పేర్కొన్న అంశాల కారణంగా.. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన ఈ సవరణ బిల్లును కేంద్ర విద్యుత్ శాఖ ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం.
లేఖలోని అంశాలు -రాష్ర్టాల అధికారాలను హరిస్తుంది.. -ఉమ్మడి జాబితాలోని అంశంపై కేంద్రం చట్టం.. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం -నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీకి రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం అవసరం -రాష్ర్టాల్లోని థర్మల్ యూనిట్లను బ్యాక్‌డౌన్ చేసేలా ఎన్ఎల్డీసీకి అధికారాలు -ఓపెన్ యాక్సెస్.. డిస్కంల ఆదాయానికి పెద్ద దెబ్బ -నగదు బదిలీ (డీబీటీ) విధానం రైతాంగం, నిరుపేదల సంక్షేమానికి విఘాతం -క్రాస్ సబ్సిడీపై రాష్ర్టాలకే అధికారాలు ఉండాలి -ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీతో న్యాయ వివాదాలు పెరుగుతాయి -ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పద్ధతిలో వ్యవసాయం, గృహ వినియోగదారులకు సబ్సిడీ చెల్లించాలని కేంద్రం ఈ బిల్లులో పేర్కొన్నది. ఇది రైతాంగానికి, నిరుపేదల సంక్షేమానికి పూర్తి వ్యతిరేకమైనది. రైతులకు 24 గంటలపాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్‌ను అందించాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలసీ. సబ్సిడీ చెల్లింపు ఎలా చేయాలనేది రాష్ర్టాలకే వదిలేయాలి. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో ఎలాంటి సవరణ చేయాలని చూసినా.. మా ప్రభుత్వం తప్పకుండా అభ్యంతరం తెలియజేస్తుంది.
– ప్రధానికి రాసిన లేఖలో సీఎం కేసీఆర్