Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

విద్యుత్‌కు నాలుగేండ్లలో 91,500 కోట్లు

-2019 చివరి నాటికి 24,272 మెగావాట్ల ఉత్పత్తి -మిగులు విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా అడుగులు -తెలంగాణ పవర్ రూట్‌మ్యాప్ సిద్ధం -శాసనసభలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి -ఉమ్మడి పాలకులు వనరులు దోచుకొని కష్టాలు మిగిల్చారని విమర్శ

Jagadish-reddy-addressing-on-Power-issue

రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికోసం వచ్చే నాలుగేండ్లలో రూ.91,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 24,272 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు. మిగులు విద్యుత్‌ను సాధించటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై అసెంబ్లీలో సోమవారం జరిగిన స్వల్పకాలిక చర్చకు మంత్రి జగదీశ్‌రెడ్డి సమాధానమిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు విద్యుత్ చార్జీలు పెంచితే దానివల్ల తెలంగాణ రైతులపై మోయలేని భారం పడుతుందని నిరసన తెలుపుతూ డిప్యూటీ స్పీకర్ పదవిని తృణపాయంగా వదులుకున్న ఘనత టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుది. అధికారంలో ఉన్నప్పటికీ పదవిని వదలుకున్న నాయకుడు కేసీఆర్. నేడు తెలంగాణ పాలకుడిగా ప్రతి నిర్ణయం రైతులు, ప్రజల కోణంలో తీసుకుంటున్నారు అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణపై ఎన్నెన్ని కుట్రలో..గత 60 ఏండ్ల నుంచి ఉమ్మడి రాష్ట్ర పాలకులు తెలంగాణలో విద్యుత్ లేకుండా అనేక ఇబ్బందులకు గురిచేశారని జగదీశ్‌రెడ్డి విమర్శించారు.

తెలంగాణలో అపార వనరుల ఉన్నప్పటికీ వాటిని సీమాంధ్ర పాలకులు వారి ప్రాంతానికి తరలించుకుని పోయారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మనకు రావాల్సిన 53.82 శాతం వాటా ఇవ్వకుండా అనేక కుట్రలు చేశారు. విభజన చట్టాన్ని అగౌరవపరిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిర్వహించిన మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే కరెంట్ లేదని ఆందోళన చేయడం అంటే ప్రతిపక్షాల తీరేంటో తెలుస్తున్నది. రాష్ట్రం ఏర్పాటు కాగానే పురిట్లోనే తెలంగాణ గొంతు నొక్కాలని కుట్రలు చేశారు.

ఏపీ పాలకులు తెలంగాణలో ఉత్పత్తి అయిన బొగ్గును తీసుకెళ్లి అక్కడ కరెంటు తయారు చేసుకున్నారు. అయితే, సీఎం కేసీఆర్ ఆకాంక్షతో ప్రస్తుతం రాష్ట్రంలో కోతలులేని విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. గుంట భూమి కూడా ఎండిపోనిచ్చేది లేదు అని స్పష్టం చేశారు. తెలంగాణ వనరులు దోచుకెళ్లిన పొరుగు రాష్ట్ర పాలకులు న్యాయంగా రావాల్సిన విద్యుత్ వాటా ఇవ్వటంలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలుపుకున్నారని, సీలేరు ప్రాజెక్టు నుంచి తెలంగాణకు కరెంట్ రాకుండా చేసేందుకే ఈ కుట్రకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. కృష్టపట్నం కరెంటు ఇవ్వకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు.

ఎన్ని కుట్రలు, ఎన్ని అటంకాలు ఎదురైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఆగలేదని మంత్రి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ కష్టాలతో తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పరీక్షల సమయంలో విద్యుత్ లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నెలకు 10-15 రోజులపాటు పరిశ్రమలకు కరెంటు ఇచ్చేవారుకాదు. కానీ ఇవాళ పరిస్థితి ఎలా ఉందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ ప్రజల పట్ల కక్షతో రాష్ట్రం ఏర్పడితే కరెంటు కష్టాలు తప్పవని ప్రచారం చేశారు. మాట్లాడితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన ఆనాటి సీఎంలు, పవర్‌ను మాత్రం ప్రెజెంట్ చేయలేకపోయారు. తెలంగాణ ప్రకటక వెలువడగానే అప్పుడున్న సీఎం 3 గంటలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి తెలంగాణ వస్తే చీకట్లు కమ్ముకుంటాయని తన దుర్బుద్ధిని చాటుకున్నారు. ఇంకొక సీఎం కరెంటు తీగలమీద బట్టలు ఆరేసుకుంటారని కామెంట్ చేశారు. కానీ ఏడాదిలోనే సీఎం కేసీఆర్ దాన్ని అధిగమించారు. పొరుగు రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకొని రైతులు, గృహ, పరిశ్రమల వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అయ్యేలా చూశాం. ఇవన్నీ లెక్కలతో సహా ఉన్నాయి.

దుర్బుద్ధితోనే విపక్షాల విమర్శలు ఏపీ కుట్రలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థించాల్సింది పోయి కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నాయని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. గత పాలకుల హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో(పీపీఏ) పవర్ రాకున్నా అవినీతి మాత్రం వచ్చేది. అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ విద్యుత్ ఒప్పందాల బాధ్యతను ప్రభుత్వరంగ సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించారు. పంట వేయవద్దని ప్రభుత్వం కోరడం వల్లే మిగులు విద్యుత్ ఉందనే దుష్ప్రచారాన్ని కూడా ప్రతిపక్షాలు చేశాయి. కానీ విద్యుత్ సరఫరాకు సంబంధించిన లెక్కలు చూస్తే వాస్తవాలు బోధపడ్తాయి. వచ్చే మార్చి నుంచి పగటిపూట విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం క్రియాశీలంగా ముందడుగు వేస్తున్నది అని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం మొదటి ఆరు నెలల్లోనే టీఎస్ జెన్‌కో పీఎల్‌ఎఫ్‌ను 74 శాతం నుంచి 80శాతానికి మెరుగుపర్చామని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా కోసం పవర్ రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

ట్రాన్స్‌ఫార్మర్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలు16.83 శాతం నుంచి 15.98శాతానికి తగ్గాయి. 24 గంటల దశలవారీ లోడ్ రిలీఫ్ వల్ల ఇది సాధ్యమైంది. గతంలో పర్యావరణ, అటవీ అనుమతులు తీసుకోవడంలో ఏండ్లు గడిచిపోయేవి. కానీ సీఎం కేసీఆర్ రికార్డు సమయంలోనే అనుమతుల ప్రక్రియను పూర్తి చేశారు. అలాగే గత సీఎంలు పట్టించుకోని గ్రిడ్ అనుసంధాన ప్రక్రియపై సైతం దృష్టి సారించారు. కాళేశ్వరం ఎత్తిపోతల, పాలమూరు ఎత్తిపోతల వంటివాటికే 7500 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉందని అంచనా వేసి అందుకు తగిన ఉత్పత్తి, సరఫరా ఏర్పాట్లు చేస్తున్నాం. రైతన్నల కష్టాలు తొలగించడంలో వెనక్కుపోయేది లేదు. మేం చేసిన దాంతో సంతృప్తి ఉంది. అయితే చేయాల్సింది ఎంతో ఉంది. 24 గంటల కరెంటు, తెలంగాణ రాష్ర్టాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలపడం ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో దాన్ని సాధిస్తాం అని మంత్రి చెప్పారు. పాతబస్తీలో మరమ్మతులతో సరఫరాలో అంతరాయం ఉందేమో కానీ అక్కడ విద్యుత్ కోతలు లేవని చెప్పారు.

మంత్రి ప్రసంగంలోని కీలకాంశాలు.. -ఒక సంవత్సర రికార్డు సమయంలోనే ప్రభుత్వం నుంచి ఈక్విటీ మద్దతుతో ప్రభుత్వరంగంలో 5,880 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులు రానున్నాయి. -మణుగూరులో 1,080 మెగావాట్ల విద్యుత్ 2016 డిసెంబర్‌నాటికి అందుబాటులోకి వస్తుంది. -కొత్తగూడెంలో 800 మెగావాట్లు 2017 డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుంది. -2017 డిసెంబర్ నాటికి దామెరచర్లలో 4000 మెగావాట్లు అందుబాటులోకి వస్తుంది. -పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీల ద్వారా రూ.30,232 కోట్ల రుణం మంజూరుతో ప్రాజెక్టులు ఆర్థికముగింపు సాధించాయి. -మధ్యకాలిక, స్వల్పకాలిక కొనుగోళ్ల ద్వారా సుమారు 3,300 మెగావాట్ల విద్యుత్ సేకరణ కోసం ఆర్డర్లు ఇచ్చాం. -2015 సెప్టెంబర్‌వరకు సమీకరించిన గ్యాస్‌ను వినియోగిస్తూ ఐపీఈ నుంచి 435 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చాం. -2015 అక్టోబర్ నుంచి 2016 మార్చివరకు సుమారు 550 మెగావాట్ల విద్యుత్ కోసం ఆర్డర్లు ఇచ్చాం. -2015 సెప్టెంబర్ వరకు ఇంధనశాఖ 222 మెగావాట్లు కేటాయించింది. -ఎన్టీపీసీ జజ్జర్ విద్యుత్ కేంద్రం నుంచి 2016 మార్చివరకు 374 మెగావాట్లు కేటాయించింది. -రామగుండం వద్ద 4000 మెగావాట్లు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎన్టీపీసీ పని ప్రారంభించింది. -భూపాలపల్లి వద్ద టీఎస్‌జెన్‌కో రెండో దశ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు వచ్చే నెలలో ప్రారంభిస్తాం. – ఆరునెలల్లో సింగరేణి కాలరీస్ 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ఉత్పత్తి ప్రారంభిస్తాం. మరో 600 మెగావాట్ల ప్లాంటు ఏర్పాటు ప్రణాళిక సిద్ధమయింది. -1,000 మెగావాట్ల విద్యుత్ కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాం. -వార్దా- మహేశ్వరం మధ్య 765 కేవీ డీసీ లైన్ 2016 కల్లా ప్రారంభిస్తే ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌ను పొందవచ్చు. -ఇప్పటికే 215 మెగావాట్లు సౌరవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాం. 2016 డిసెంబర్‌నాటికి 3,300, రెండేండ్లలో మరో 2,000 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభిస్తాం. -2018-19 ఆర్థిక సంవత్సరంకల్లా మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 24,272 మెగావాట్లు ఉంటుంది. -రాష్ట్రంలో అందరికీ విద్యుత్ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,116 కోట్లు మంజూరు చేసింది. -రాబోయే 3-4 ఏండ్లలో పద్దెనిమిది 400 కేవీ సబ్‌స్టేషన్లు, ముప్పైనాలుగు 220 కేవీ సబ్‌స్టేషన్లు, 132 కేవీ సబ్‌స్టేషన్లు 90 ఏర్పాటుచేస్తాం. -రాబోయే 4 ఏండ్లలో ఇంధనరంగంలో ఉత్పత్తి, సరఫరా ప్రాజెక్టుల కోసం మొత్తం పెట్టుబడి రూ.91,500. -వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్ అందించేందుకు 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.4,257 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం సమకూర్చింది.

కళాశాలల్లో మౌలిక వసతులు పెంచుతాం -డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డీ రాజ్వేర్‌రావులు అడిగిన ప్రశ్నకు కడియం సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ఇంటర్ విద్య బలోపేతానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను సరఫరా చేస్తున్నదని చెప్పారు. కళాశాలల్లో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

మండల కేంద్రాల్లో జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. కేజీ టు పీజీ విద్యా అమలులో భాగంగా జూనియర్ కాలేజీలను గురుకుల కాలేజీలుగా మార్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల నియామకానికి సంబంధించి సర్వీస్ రూల్స్ రూపొందించిన అనంతరం నియామకాలు చేపడతామన్నారు.సుప్రీంకోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాత.. దానిని పరిశీలించి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను అమలు చేస్తామన్నారు. డిప్యూటీ ఈవో, ఎంఈవో పోస్టుల నియామకానికి సంబంధించి కోర్టు కేసు పరిష్కారమైన తర్వాత పదోన్నతుల ద్వారా చేపడతామని కడియం వెల్లడించారు.

150 మండలాల్లో వందశాతం మరుగుదొడ్లు -టీఆర్‌ఐజీపీ పథకం కింద నిర్మాణం చేపడుతాం -శాసనమండలిలో మంత్రి కేటీఆర్ వెల్లడి హైదరాబాద్, నమస్తేతెలంగాణ: తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన 150 మండలాల్లో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం కల్పించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రపంచ బ్యాంకు రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉండి, అత్యంత వెనుకబడిన 150 మండలాల్లోని 2879 గ్రామాలను ఈ పథకం కింద ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు దత్తత తీసుకున్న గ్రామాల్లో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టేలా కృషి చేయాలని సూచించారు. టీఆర్‌ఐజీపీ పథకం కింద ఎంపిక చేసిన మండలాల్లోని సుమారు 38 లక్షల మంది ప్రజల జీవనోపాధులు పెంచడం, నిరుపేద రైతులకు ఉత్పాదక సంస్థల ఏర్పాటుతోపాటు,ఉత్పత్తి పెరుగుదల, మెరుగైన మార్కెట్ ప్రవేశ సౌలభ్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఆయా మండలాల్లో ఆరోగ్యం, పౌష్ఠికాహారం, భద్రత, పారిశుద్ధ్యం ద్వారా మానవ వికాసానికి ప్రభుత్వం మద్దతు ప్రకటిస్తుందని మంత్రి తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.