-రాష్ట్ర ఏర్పాటు నాటికి సామర్థ్యం 7,778 మెగావాట్లు మాత్రమే
-గత ఎనిమిదేండ్ల కాలంలో 17,305 మెగావాట్లకు చేరిక
-విద్యుత్తు ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామి
-సోలార్ విద్యుత్తు రంగంలోనూమన రాష్ట్రం అద్భుత ప్రగతి
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కష్టాలు మనకు తెలియని కావు. వ్యవసాయానికి 3-4 గంటలు విద్యుత్తు ఉంటే ఎక్కువ. ఇండ్లకు ఆరేడు గంటలపాటు కోత. పరిశ్రమలకు పవర్హాలిడే. విద్యుత్తు కోసం రోడ్లెక్కి ధర్నాలు చేసిన రోజులు ఇప్పటికీ కండ్లముందు కదలాడుతూనే ఉంటాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమించి పటిష్ఠ చర్యలు చేపట్టడంతో రాష్ట్రమంతటా నిరంతరం నాణ్యమైన విద్యుత్తు సరఫరా జరుగుతున్నది.
రాష్ట్ర ఆవిర్భావం నాటికి మన విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు. 8 ఏండ్లలో ఇప్పుడది 17,305 మెగావాట్లకు చేరుకున్నది. సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కూడా 74 మెగావాట్ల నుంచి రికార్డుస్థాయిలో 4,478 మెగావాట్లకు పెరిగింది. అంతేకాదు, తలసరి విద్యుత్తు వినియోగంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవడం మనకు గర్వకారణం. ఈ మేరకు విద్యుత్తు శాఖ ఆదివారం వివరాలు వెల్లడించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత వల్లే ఇదంతా సాధ్యమైందనడంలో అతిశయోక్తి లేదు.
పెరిగిన తలసరి విద్యుత్తు వినియోగం
తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం 2014లో 1,110 యూనిట్లు కాగా, ప్రస్తుతం 2,012 యూనిట్లకు పెరిగింది. జాతీయ తలసరి కరెంటు వినియోగంతో పోల్చితే ఇది 73 శాతం అధికం. తలసరి విద్యుత్తు వినియోగం ఒక సమగ్ర పురోగతిని తెలిపే సూచిక. పర్యావరణ భద్రతలో భాగంగా తీసుకొచ్చిన తెలంగాణ సోలార్ పవర్ పాలసీ దేశంలోనే అత్యుత్తమ సోలార్ పాలసీల్లో ఒకటిగా పరిగణించబడింది. ప్రస్తుతం రాష్ట్రంలో సోలార్ విద్యుత్తు సామర్థ్యం 4,950 మెగావాట్లు కాగా, వచ్చే ఏడాది నాటికి 8 వేల మెగావాట్లు దాటుతుందని అంచనా. విద్యుత్తు రంగంలో ఇదొక అద్భుత విజయంగా చెప్పవచ్చు.
అన్ని రంగాలకు నిరంతర విద్యుత్తు
అనేక కష్టాలకు ఎదురొడ్డి నేడు రాష్ట్రంలో అన్ని రంగాలకు నిరంతరాయంగా, వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. నిండు వేసవిలో కూడా 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందిస్తుండడం మనకే సాధ్యమవుతున్నది. దేశ రాజధానిలో కోతలు, పరిశ్రమలకు పవర్ హాలిడేలు విధిస్తుండగా, మన రాష్ట్రంలో కరెంటు కోతలు విధించిన దాఖలాలు లేవు.