Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

విజయం మనదే

-అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఎజెండాగా మున్సిపల్‌ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌
-ఐదేండ్లలో ఎక్కడా నేలవిడిచి సాము చేయలేదు
-పల్లెలు, పట్టణాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
-ఆడలేక మద్దెలఓడు అన్నట్టు కాంగ్రెస్‌ తీరు
-సీఏఏపై చెప్పిన వైఖరికే కట్టుబడిఉన్నాం
-టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
-మున్సిపల్‌ ఎన్నికలపై పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దిశానిర్దేశం

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమపథకాలే ఎజెండాగా మున్సిపల్‌ ఎన్నికలకు వెళ్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. మున్సిపోల్స్‌లో టీఆర్‌ఎస్‌దే విజయమని ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రకార్యవర్గ సమావేశం జరిగింది. మున్సిపల్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితర విషయాలపై పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నేతలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పార్టీ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు, ప్రధాన కార్యదర్శి, రైతు సమన్వయసమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సత్యవతిరాథోడ్‌, ఎంపీలు బండా ప్రకాశ్‌, పీ రాములు, మాలోతు కవిత, లింగయ్యయాదవ్‌తో కలిసి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తున్నదని, మున్సిపల్‌ ఎన్నికల్లో వారిని మద్దతివ్వాలని కోరుతామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటైన నాటినుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ తెలంగాణ సమాజం టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటిస్తూ వస్తున్నదని తెలిపారు. 2014లో 63 సీట్లు గెలిస్తే 2018లో 88 సీట్లతో టీఆర్‌ఎస్‌కు ప్రజలు సంపూర్ణ మెజార్టీని కట్టబెట్టారన్నారు. ఇటీవలి హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలోనూ బ్రహ్మాండమైన విజయం సాధించామని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతోనే కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ తిరుగులేని రాజకీయశక్తిగా ఎదిగిందని తెలిపారు. గడిచిన ఐదేండ్లలో ఎక్కడా కూడా నేల విడిచి సాము చేయలేదని కేటీఆర్‌ పేర్కొన్నారు.

కేసీఆర్‌ కార్యదక్షతపై విశ్వాసం
ప్రభుత్వ పనితీరు, సీఎం కేసీఆర్‌ కార్యదక్షత , ఆయన నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసం మున్సిపల్‌ ఎన్నికల్లో తమకు పెద్ద అస్త్రమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని, గతంలో రూ.200 ఉన్న పింఛన్‌ను రూ. 2016కు పెంచామని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా ఇలా అనేక పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు ఆరు లక్షల మందికి కేసీఆర్‌ కిట్లు అందజేసినట్టు తెలిపారు. మున్సిపాలిటీల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని, పైసా లంచం లేకుండా 21 రోజుల్లోనే భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్నామన్నారు. టీఎస్‌ఐపాస్‌ లాగా టీఎస్‌ బీపాస్‌ (తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌) అనుమతి ఇవ్వడం, లేకపోతే డీమ్డ్‌ అప్రూవల్‌ విధానాన్ని తీసుకొచ్చినట్టు కేటీఆర్‌ చెప్పారు.

బెంబేలెత్తుతున్న ప్రతిపక్షాలు
ఎన్నికల్లో కొట్లాడే సత్తాలేకనే కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని కేటీఆర్‌ విమర్శించారు. అడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఆ పార్టీ తీరు ఉన్నదని, ఎన్నికలంటేనే ప్రతిపక్షపార్టీకి భయం పట్టుకున్నదని ఎద్దేవాచేశారు. ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే ధైర్యం లేకనే రిజర్వేషన్లు అంశాన్ని సాకుగా చూపుతూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఆరునెలలుగా కోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నాయని.. ఇది అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు. చట్టప్రకారం ఎన్నికలు జరగాలి.. జరుగుతాయని అన్నారు. ఇందుకోసం కాంగ్రెస్‌ ఎందుకు బేంబెలెత్తుతుందో అర్థం కావడంలేదని ఎద్దేవాచేశారు. సొంతసీటులో ఉత్తమ్‌ ఓడిపోయారని.. ఇప్పుడు దానిపై మాట్లాడే పరిస్థితిలేక ఆయన నిరాశా, నిస్పృహల్లో ఉన్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరికిపోయి ఓట్లు అడిగే ధైర్యం లేకపోవడం ఏమిటని కేటీఆర్‌ ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

నిధులు- విధులు ట్యాగ్‌లైన్‌తో పట్టణాల అభివృద్ధి
పల్లెలు, పట్టణాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలను తీసుకొచ్చామని తెలిపారు. పంచాయతీరాజ్‌చట్టం ఫలితాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. పల్లె ప్రగతి తర్వాత గ్రామాల్లో అద్భుతమైన మార్పులు వస్తున్నాయని.. పంచాయతీలకు నెలకు రూ. 339 కోట్లు ఠంచన్‌గా ఇస్తున్నామని చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికీ రాని ఆలోచనను సీఎం కేసీఆర్‌ అమలుచేసి చూపించారని అన్నారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలను 73 నుంచి 141కి పెంచామని చెప్పిన కేటీఆర్‌.. నిధులు- విధులు ట్యాగ్‌లైన్‌తో పట్టణాల్లో అభివృద్ధి చేపట్టబోతున్నామని తెలిపారు. పల్లె ప్రగతిని పట్టణాల్లోనూ అమలుచేస్తామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధులిచ్చామని చెప్పారు. కరంటు, నీరు, అభివృద్ధి ఫలాలు అందరికీ కనబడుతున్నాయని.. వాటిద్వారానే మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలని ప్రజలను కోరతామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరో నాలుగేండ్లు అధికారంలో ఉంటుందని.. పట్టణాల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన తర్వాత చట్టప్రకారం వాటికి రావాల్సిన నిధులను కేటాయిస్తామని చెప్పారు. అయితే, విధుల విషయంలో బాధ్యతారాహిత్యాన్ని సహించబోమని అన్నారు. పల్లెలు ఇప్పటికే ప్రగతి బాటపట్టాయని, పట్టణాలనూ అదేదారిలో నడుపుతామని విశ్వాసం వ్యక్తంచేశారు.

పార్లమెంట్‌లో అంశాలవారీగానే మద్దతు
సీఏఏపై పార్లమెంట్‌ సమావేశాల్లో ఏ విధమైన వైఖరితో ఉన్నామో ఇప్పుడు కూడా అదేవైఖరితో ఉన్నామని మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీనాయకుడు కే కేశవరావు, లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర్‌రావు ఉభయసభల్లో మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నామన్నారు. అధికారంలో ఉన్న పార్టీగా, బాధ్యతగల పార్టీగా పార్లమెంట్‌లో అంశాలవారీగా నిర్ణయం తీసుకున్నామని, సీఏఏపై కూడా అదేవిధంగా వ్యవహరించామని చెప్పారు. సీఏఏలో ముస్లింలను చేర్చితే మద్దతిస్తామని పార్లమెంట్‌లో చెప్పామని ఆయన గుర్తుచేశారు. ఎన్పీఆర్‌, ఎన్నార్సీపై రాష్ట్ర క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పార్టీ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్‌ నాయకత్వం, కార్యకర్తల అంకిత భావమే ఇందుకు ప్రధానకారణమని తెలిపారు.

పంచాయతీ, పరిషత్‌ ఫలితాలే పునరావృతం
-మున్సిపోల్స్‌లో అందరం కష్టించి పనిచేయాలి.. స్థానికంగానే అభ్యర్థుల ఎంపిక
-బహిరంగ సభలు, ర్యాలీలు ఉండవు.. ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యం
-బీజేపీ, టీడీపీ నామమాత్రం.. కాంగ్రెస్‌ అక్కడక్కడా పోటీకి యత్నం
-టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

  • పరిషత్‌, పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. పార్టీ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు, గిరిజన సంక్షేమశాఖమంత్రి సత్యవతి రాథోడ్‌, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎం శ్రీనివాస్‌రెడ్డి, బండా ప్రకాశ్‌, పీ రాములు, బడుగుల లింగయ్యయాదవ్‌, బీ వెంకటేశ్వర్లు, కార్యదర్శి, ఎంపీ మాలోతు కవిత పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఓటూ విలువైనదేనని.. మున్సిపల్‌ ఎన్నికల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారంచేయాలని సూచించారు. బహిరంగ సభ లు, ర్యాలీలు ఉండవని.. ఎక్కడివారక్కడ ప్రచారం చేసుకోవాలని అన్నారు. ఎన్నికలులేని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు సేవలు ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై త్వరలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అభ్యర్థులను ఎమ్మెల్యేలు ఎంపికచేస్తారని.. అందుకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు రాష్ట్రపార్టీకి పంపించాలని సూచించారు. మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్లను ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్‌ నిర్ణయిస్తారని పేర్కొన్నారు.

    జనవరి మొదటివారంలో సీఎం కేసీఆర్‌.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించి ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. ఆలోగా ఇంచార్జీలుగా ఉన్నవారు ఆయా నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కష్టపడి చేయాలని, ఎన్నికలు పూర్తయ్యే వరకు నాయకులు క్షేత్రస్థాయిలో ఉండాల్సిందేనని ఆదేశించారు. స్థానికంగా ఓటర్ల జాబితా సవరణలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ నామమాత్రమేనని, కాంగ్రెస్‌ పార్టీ అక్కడక్కడా పోటీఇచ్చే ప్రయత్నం చేస్తున్నదన్నారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక తర్వాత ప్రతిపక్షాలు నామమాత్రంగా మారాయని కేటీఆర్‌ తెలిపారు.

  • MAKE A DONATION NOW

    Every contribution you make can make a difference.

    Please contribute generously to the TRS Party.