-సోషల్ మీడియాను విస్తృతంగా వాడి.. ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి -గడపగడపకూ ప్రభుత్వ పథకాలు తెలియాలి -సోషల్ మీడియా.. ప్రచారంలో బలమైన సాధనం -సీఎం కేసీఆర్ రోజూ సోషల్ మీడియా చూస్తారు -అభ్యర్థులు కూడా లేనివారికి భయపడుతారా? -ఆసరా పింఛన్లపై బీజేపీ తప్పుడు ప్రచారం -కాంగ్రెస్, బీజేపీకి ఢిల్లీలో బాస్‌లున్నారు.. మాకు గల్లీలో బాస్‌లు ఉన్నారు -టీఆర్ఎస్ సోషల్ మీడియా సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు

మకర సంక్రాంతి తర్వాత తెలంగాణలో విపక్షాలకున్న భ్రాంతి తొలిగిపోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయానికి కృషిచేయాలని, వినూత్న ప్రచారం నిర్వహించడం ద్వారా సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో టీఆర్ఎస్కు 11 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారని చెప్పారు. వారందరికీ చేరువకావడంద్వారా ప్రతి గడపకూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేరేలా చూసుకోవాలని సూచించారు. సోమవారం తెలంగాణభవన్‌లో పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మున్సిపాలిటీలకు కాంగ్రెస్ హయాంలో కంటే పదిరెట్లు ఎక్కువగా నిధులు కేటాయించామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలకు కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదలచేయాలన్నారు. అభ్యర్థులు కూడా లేనివారిని చూసి భయపడుతామా? అంటూ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ను ఉద్దేశించి వ్యంగ్యోక్తులు విసిరారు. పచ్చదనం, పారిశుద్ధ్యం, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పారదర్శకంగా పౌరసేవలే లక్ష్యంగా రాష్ట్రంలో మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చామని పేర్కొన్నారు. పరిపాలన అంటే వందలు, వేల కోట్లు మంజూరుచేయడం మాత్ర మే కాదని.. మంచి విధానాలు తీసుకొచ్చి అమలుచేయడమని సీఎం కేసీఆర్ చెప్తుంటారని తెలి పారు. టీఆర్ఎస్ పార్టీకి సామాజిక మాధ్యమం బలమని, ఉద్యమ సమయంలోనూ వాస్తవాలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడంలో సోషల్ మీడియా కార్యకర్తలు ఎక్కడివారక్కడే తీవ్రంగా కృషిచేశారని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రతిరోజూ ఎంతోకొంత సమయాన్ని సోషల్ మీడియాను చూడటానికి కేటాయిస్తారని, తద్వారా ప్రభుత్వం, పార్టీపై ప్రజల నాడి ఏమిటి.. వారి ఆలోచనలు, అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి? అనేది తెలుసుకొంటారని పేర్కొన్నారు. ఇప్పుడు ఒక టీవీని చూసి.. పత్రికను చదివి.. అవే వార్తలు అనుకుంటే కావని.. అవన్నీ ఏదో ఒకవైపు ఉంటున్నాయని చెప్పారు. పది పన్నెండు పేపర్లు చదివితే తప్ప వాస్తవం ఏమిటో అర్థంకాని పరిస్థితి నెలకొన్నదని వివరించారు. తాను ప్రెస్‌మీట్ పెట్టి.. ఆ మర్నాడు కొన్ని పత్రికలను చూస్తే.. నేనే మాట్లాడానా అన్నట్లుగా రాస్తారని వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాలు వచ్చాక నేరుగా ప్రజలతో అనుకున్నది అనుకున్నట్లుగా చెప్పడానికి తనలాంటివారికి అడ్వాంటేజి లభించిందని చెప్పారు.
వినూత్నమైన వ్యూహంతో ప్రచారం ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 130 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టీఆర్ఎస్కు 16 లక్షల మంది కార్యకర్తలున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. వారందరికీ ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించిన సమాచారం చేరవేసి.. క్రియాశీలకంగా తయారుచేయాలని సూచించారు. సంక్రాంతి పండుగను కూడా ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలన్నారు. సంక్రాంతికి కారుగుర్తు ముగ్గులువేసి కేసీఆర్‌కు ఓటువేయాలంటూ కొందరు ప్రచారం చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. యువకులు పతంగుల మీద కారుగుర్తు, కేసీఆర్ బొమ్మపెట్టి ఎగురవేయాలని తెలిపారు. వినూత్నమైన వ్యూహాలతో ప్రచారాన్ని కొత్తగా చేయాలని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవడంద్వారా గడపగడపకూ పార్టీ సమాచారం చేరేవిధంగా చూడాలన్నారు.

దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి కొన్ని ప్రతిపక్ష పార్టీలకు పెయిడ్ వర్కర్లు తప్ప అభిమానులు లేరని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజల్లో అత్యంత ఆదరణ ఉండే రాజకీయపార్టీకి సామాజిక మాధ్యమం అదనపు బలాన్ని చేకూరుస్తుందని తెలిపారు. పార్టీకి దాదాపు 11 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారని.. మిగతా ఏ పార్టీ కూడా టీఆర్ఎస్కు దరిదాపుల్లో కూడా లేదని తెలిపారు. పార్టీపై అభిమానంతో సోషల్ మీడియా కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తున్నారంటూ అభినందించారు. కొన్ని పార్టీలు ప్రజలమధ్య చిచ్చు పెట్టడానికి సోషల్‌మీడియాను వాడుకొంటున్నాయని.. టీఆర్ఎస్ ఎన్నడూ ఉద్రిక్తతలను పెంచడానికి సామాజిక మాధ్యమాన్ని వాడలేదని చెప్పారు. సోషల్ మీడియాద్వారా ప్రజలకు వాస్తవాలను మాత్రమే వివరించాలని.. దూషణల పర్వం వద్దని సూచించారు. దూషణలను టీఆర్ఎస్ ఎన్నడూ ప్రోత్సహించదని స్పష్టంచేశారు. ప్రత్యర్థులు ఇప్పటికే తట్టపారేశారని మంత్రి కేటీఆర్ ఎద్దేవాచేశారు.
ఉత్తమ్.. శ్వేతపత్రం ప్రకటించు కాంగ్రెస్ హయాంలో మున్సిపాలిటీలకు నిధులు ఎక్కువ విడుదల అయ్యాయని ప్రచారంచేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి దమ్ముంటే.. 2004 నుంచి 2014 వరకు ఎన్ని నిధులు విడుదలచేశారో శ్వేతపత్రం విడుదలచేయాలని సవాలుచేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని నిధుల విడుదలచేశామో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన దానికంటే పదిరెట్లు ఎక్కువగా నిధులు విడుదలచేశామని తెలిపారు. రూ.2500 కోట్లను మున్సిపాలిటీలకు విడుదల చేస్తున్నామని చెప్పారు. గతంలో 68గా ఉన్న మున్సిపాలిటీల సంఖ్యను 73కు పెంచుకొన్నామని.. 300 పైగా గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనంచేశామని తెలిపారు. గతంలో వేసవి వచ్చిందంటే చాలు కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు ఖాళీ కుండలతో మహిళలను వెంటేసుకొని జలమండలి ముందట ధర్నాలుచేసేవారని కేటీఆర్ గుర్తుచేశారు. గత ఐదేండ్లలో అలాంటి ధర్నాలు చూశారా? అంటూ కార్యకర్తలను ప్రశ్నించారు.
మన మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శం 3.70 లక్షల వీధిదీపాలను ఎల్ఈడీ బల్బులుగా మార్చడం ద్వారా మున్సిపాలిటీల్లో రూ.178 కోట్లు ఆదాచేయగలిగామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. మిషన్ భగీరథ ఆగిపోయిందంటూ ఒక పత్రిక రాసిందని.. ఇలాంటి ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గతంలో మహబూబ్‌నగర్, నిజాంపేట లాంటి ప్రాంతాల్లో తాగునీటి పరిస్థితిని ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. ఒకప్పుడు మున్సిపాలిటిల్లో రెండువారాలకు ఒకసారి కూడా తాగునీళ్లు కూడా వచ్చేవికావని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. మున్సిపాలిటీలతోపాటు కార్పొరేషన్లకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు.
బడ్జెట్లో వాటికి ప్రత్యేకంగా నిధులు కేటాయించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో తాగు, సాగునీటి సమస్య, కరంట్ సమస్యతను పూర్తిగా తొలిగించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దని చెప్పారు. పల్లెప్రగతి చేపట్టినట్లే.. పట్టణప్రగతి కార్యక్రమం కూడా చేపడతామని అన్నారు. రాష్ట్రమంతటా పచ్చదనం, పారిశుద్ధ్యం, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని సాధించేదిశగా ముందుకు వెళ్తామని తెలిపారు. పురపాలికల్లో కొత్త పాలకవర్గాలు ఏర్పడిన తర్వాత వారికి శిక్షణ ఇస్తామని.. కొత్త మున్సిపల్ చట్టంపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈ చట్టాన్ని కఠినంగా, సమర్థంగా అమలుచేయడమే తనముందున్న సవాలు అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కొత్తగా రెవెన్యూచట్టం తీసుకొస్తే ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండే శాఖలతో అవినీతి చీడలేకుండా చేసి మంచి పాలన అందించవచ్చని తెలిపారు.
నలుగురు కోఆర్డినేటర్లు… సోషల్ మీడియా కార్యకర్తలకు, పార్టీకి మధ్య సమన్వయం పెరుగాల్సి ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలను అకారణంగా దూషిస్తే వారికి పార్టీ అండగా ఉంటుందన్నారు. సోషల్‌మీడియాలో సంస్కారవంతంగా ప్రచారం చేయాలని సూచించారు. సోషల్ మీడియా గులాబీ సైనికులకు గుర్తింపు, గౌరవం ఇస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికలకు టీఆర్ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్లుగా క్రిశాంక్, పీ జగన్మోహన్రావు, బీ దినేశ్‌కుమార్ చౌదరి, సతీశ్‌రెడ్డిని కేటీఆర్ నియమించా రు. వీరు ఎప్పటికప్పుడు సామాజిక మీడియా కార్యకర్తలను కోఆర్డినేట్ చేస్తారని తెలిపారు. ఈ నలుగురు పార్టీకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇతర కార్యకర్తలకు అందిస్తారని చెప్పారు. సమావేశంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, కే నవీన్‌కుమార్, యెగ్గె మల్లేశం, టీఎస్టీఎస్సీ మాజీ చైర్మన్ రాకేశ్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.

తిమ్మిని బమ్మి చేయగలరు తిమ్మిని బమ్మి చేయడంలో ప్రత్యర్థులు సిద్ధహస్తులని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆసరా పింఛన్లలో రూ.1800 ఢిల్లీ నుంచి వస్తున్నాయని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారంచేస్తున్నారని.. ఆధారం మాత్రం చూపెట్టరని ఎద్దేవాచేశారు. ఎంత ఎక్కువ లొల్లిపెడితే.. అరిచి గీ పెడితే అది నిజమైతదని అనుకొంటున్నరన్నారు. విపక్షాల నేతలది వితండవాదమని.. తాపట్టిన కుందేటికి మూడే కాళ్లు అనేరకమని చెప్పారు. హుజూర్నగర్ ఎన్నికల సమయంలో ఎంతగా దుష్ప్రచారం చేసినప్పటికీ.. అక్కడి ప్రజలు బీజేపీని నాలుగోస్థానానికి పరిమితంచేశారని.. కారుగుర్తును పోలిన అభ్యర్థికి వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదని గుర్తుచేశారు. బీజేపీ వారి డైలాగులు వింటుంటే ఆశ్చర్యమేస్తుందన్నారు.
బీజేపీని చూసి కేటీఆర్ భయపడుతున్నారంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తున్నాయని చెప్పారు. ప్రజలు ఏమనుకొంటారనే ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాహుల్‌గాంధీకి కూడా తాను భయపడబోనని స్పష్టంచేశారు. తెలంగాణలో బీజేపీకి ఏమున్నదని భయపడాలని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,148 వార్డులు, డివిజన్లు ఉంటే.. బీజేపీకి ఆరేడు వందల వార్డుల్లో అభ్యర్థులు కూడా లేరని తేలిందని వెల్లడించారు. కనీసం అభ్యర్థులు కూడా లేనివారి గురించి భయపడుతారా? అని మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. తమ నేతలపై ఆగ్రహం వ్యక్తంచేశారని గుర్తుచేశారు. టీఆర్ఎస్కు బాస్‌లు ఢిల్లీలో లేరని, గల్లీల్లో ఉన్నారని తెలిపారు. గల్లీలో ఉన్న బాస్‌ల గురించి భయపడాలే తప్ప.. ఢిల్లీలో ఉన్నవారిని గురించి కాదని చెప్పారు.