Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

వివక్షలేని పాలన

-ఇది లౌకిక తెలంగాణ.. హైదరాబాద్ అందరిది..
-అన్నిప్రాంతాలవారు సంతోషంగా ఉంటున్నారు
-వ్యాపారులకు నిరంతర విద్యుత్, నీటి సరఫరా
-గుజరాత్‌ను మించిన పాలసీ.. టీఎస్‌ఐపాస్
-మంత్రి కే తారకరామారావు స్పష్టీకరణ
-భారీసంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరిన గుజరాతీ సమాజ్ సభ్యులు

తెలంగాణలో లౌకికతత్వం వెల్లివిరుస్తున్నదని, ప్రాంతాలు, వర్గాలు అనే భేదం లేకుండా వివక్ష లేని పాలన అందిస్తున్నామని మంత్రి కే తారకరామారావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆదర్శవంతమైన పాలన కొనసాగుతున్నదని చెప్పారు. నాలుగున్నరేండ్లలో రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో తీసుకున్న చర్యలతో నాలుగొందల ఏండ్ల చరిత్ర గల భాగ్యనగరంలో తెలుగు, మరాఠాలు, పార్సీలు, గుజరాతీలు, మలయాళీలు, పంజాబీలు ఇలా అనేక ప్రాంతాలకు చెందినవారు సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారు. మైనార్టీలు, ఆర్థికాభివృద్ధి కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. పేదల సంక్షేమానికి ప్రతి రూపాయిలో 43 శాతం నిధులు కేటాయిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. ఆదివారం తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో గుజరాత్ సమాజ్ సభ్యులు భారీసంఖ్యలో టీఆర్‌ఎస్ చేరారు. శేరిలింగంపల్లిలో టీఆర్‌ఎస్‌కు మద్దతుగా మైనార్టీలు ఆశీర్వాద సమ్మేళనం నిర్వహించారు.

లలిత కళాతోరణంలో తెలంగాణ మరాఠా మండల్, ఛత్రపతి శివాజీ మరా ఠా సాంస్కృతిక ట్రస్ట్ ఆధ్వర్యంలో దసరా, దీపావళి మిలన్ సమ్మేళనం, కీర్తనల ఉత్సవం జరిగింది. ఆయాచోట్ల జరిగిన కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి వివక్ష చూపకుండా అర్హులైన ప్రతిఒక్కరికీ ఫలాలు అందిస్తున్నట్టు తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉండే గుజరాత్ సమాజ్ సభ్యులు టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపడం హర్షణీయమని, సీఎం కేసీఆర్ పాలనకు జనామోదం ఉంది కాబట్టే నేడు వేలసంఖ్యలో గుజరాతీలు సైతం తమకు మద్దతు తెలిపేందుకు ముందుకొచ్చారన్నారు. హైదరాబాద్, భారత్ మనందరివీ అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడితే ఏదో జరుగుతుందంటూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారిలో భయాందోళనలు సృష్టించారని, కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అందుకు భిన్నమైన వాతావరణాన్ని కల్పించి వాటన్నింటినీ పటాపంచలు చేసిందని మంత్రి తెలిపారు.

నాలుగు నిమిషాల కర్ఫ్యూ కూడా లేదు..
అబిడ్స్ గ్రామర్ స్కూల్‌లో చదువుకున్న తనకు ఆ రోజుల్లో అనేకసార్లు కర్ఫ్యూ విధించిన సంఘటనలు గుర్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. నాలుగైదు రోజులపాటు కొనసాగిన కర్ఫ్యూతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వారన్నారు. టీఆర్‌ఎస్ నాలుగున్నరేండ్ల పాలనలో తెలంగాణలో నాలుగ్గంటలు కాదుకదా.. నాలుగు నిమిషాలు కూడా కర్ఫ్యూ విధించిన దాఖలాలు లేవని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో నంబర్‌వన్ రాష్ట్రంగా నిలిచామని చెప్పారు. పరిశ్రమలకు అనుమతిచ్చే విషయంలో దేశంలోనే నంబర్‌వన్ విధానాన్ని ప్రారంభించామని అన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చామని, ఈ విషయంలో గుజరాత్ కంటే మెరుగ్గా ఉన్నామని చెప్పారు.

మైనార్టీ గురుకులాల్లో 60వేల మంది విద్యార్థులు
తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాలను సమాన దృష్టితో ఆదరిస్తున్నదని, షాదీముబారక్, కల్యాణలక్ష్మి, ఆసరా, వితంతు పింఛన్లు వంటి అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. పేద ముస్ల్లింలను అన్నివిధాలా ఆదుకుంటున్నదని చెప్పారు. అప్పుడే పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ప్రభుత్వం అందించే ఏదో సంక్షేమ పథకంతో లబ్ధిపొందుతూనే ఉంటున్నారని చెప్పారు. మైనార్టీ గురుకులాల్లో 60 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, ఒక్కొక్కరి కోసం ప్రభుత్వం రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నదన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతోపాటు శుద్ధమైన మంచినీటిని అందిస్తున్నామని చెప్పారు.

త్వరలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు: డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ
టీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అందుతాయని డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో మైనార్టీలకు తీరని అన్యాయం జరిగిందని, రిజర్వేషన్ల కల్పనలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. శేరిలింగంపల్లిలో మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ముందుకొచ్చిందని, దీనిపై సీఎం కేసీఆర్ ఇప్పటికే కేంద్రం, ప్రధాని మోదీతో రెండుసార్లు చర్చించారని తెలిపారు. అతిత్వరలోనే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయన్నారు. సమ్మేళనంలో శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ, పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ బాబాఫసియుద్దీన్, సెట్విన్ అసోసియేషన్ చైర్మన్ మీర్ ఇనాయత్ అలీభాక్రీ, సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్‌పర్సన్ రాగం సుజాత యాదవ్, కార్పొరేటర్లు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణభవన్‌లో జరిగిన గుజరాత్ సమాజ సభ్యుల చేరిక కార్యక్రమంలో పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్, ఎంపీ ప్రకాశ్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్రకార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, గుజరాతీ సమితి అధ్యక్షుడు గణ్‌శ్యాంభాయ్ పటేల్, ఉపాధ్యక్షుడు జయంతి భాయ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

మరాఠాలతో మంచి అనుబంధం

లలితకళాతోరణంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కే తారక రామారావు మరాఠాలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మహారాష్ట్రలోని ఫుణె నగరంలో రెండేండ్లు ఉన్నత విద్యనభ్యసించానని, తనకు అక్కడ చాలామంది మిత్రులున్నారని చెప్పారు. నాకు మరాఠీ రాదు.. కానీ మరాఠీలతో మంచి అనుబంధం ఉన్నది అని పేర్కొన్నారు. వీరత్వానికి, సాహసానికి ప్రతీకైన ఛత్రపతి శివాజీ, అంబేద్కర్ మహారాష్ట్రకే కాకుండా దేశానికే గర్వకారణమని తెలిపారు. కొన్నేండ్ల కిందటే వైద్యం కోసం ఔరంగాబాద్‌కు వెళ్లామని, పేరొందిన డాక్టర్లు మరాఠీలు ఉన్నారని చెప్పారు. అన్నివర్గాల ప్రజలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని, మరాఠీ భవన్ నిర్మాణానికి స్థలం, రూ.2కోట్లు మంజూరు చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. తెల్లరేషన్ కార్డులున్న మరాఠీలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపచేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరాఠీల కోరిక మేరకు పండరీపురం వస్తానని కేటీఆర్ హామీఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ వినోద్, మరాఠీ మండల్ అధ్యక్షుడు ప్రకాష్ పాటిల్, ఉపాధ్యక్షుడు నివాస్ నిఖాం, పండరీపుర గురువు జైవంత్ బోదలే తదితరులు పాల్గొన్నారు.

1969 ఉద్యమకారునికి సన్మానం
మరాఠీ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ 1969 ఉద్యమకారున్ని సన్మానించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చార్మినార్‌పై తెలంగాణ జెండా ఎగురవేసిన చంద్రశేఖర్ థాకరేను మంత్రి సన్మానించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.