Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

విశాఖ ఉక్కుపై ప్రశ్నిస్తే నువ్వెవరు అంటరా?

-విశాఖ దేశంలో లేదా?.. మేం దేశ వాసులం కాదా?
-ముందు భారతీయులం..తర్వాత తెలంగాణ పౌరులం
-దేశంలో ఎక్కడ తప్పు జరిగినా నిలదీయాలి
-రేపు సింగరేణి, ఈసీఐఎల్‌పైనా పడతరు
-మాకేమని ఊకుంటే.. రేపు కష్టాలు తప్పవు
-బీజేపీకి ఓటేస్తే ప్రైవేటీకరణకు మద్దతిచ్చినట్టే
-కేంద్రం పదేండ్లకు 14శాతం పీఆర్సీ ఇస్తే.. రాష్ట్రం రాగానే ఉద్యోగులకు 43% ఫిట్‌మెంట్
‌ -పెద్ద ఎన్నికలకు సరిహద్దుల్లో, చిన్నవైతే భైంసాలో అల్లర్లు
-తెలంగాణ వికాస సమితి సదస్సులో మంత్రి కేటీఆర్

‌ ఉక్కు ఫ్యాక్టరీని ఎందుకు అమ్ముతున్నరని అడిగితే విశాఖలో మీకేం పని అంటరా? ఏం విశాఖ భారత్‌లో లేదా.. మేం భారతీయులం కాదా? మాట్లాడొద్దా? అని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. బీజేపీకి ఓటేస్తే ప్రైవేటీకరణకు మద్దతిచ్చినట్టేనని, ధరల పెరుగుదలను ప్రోత్సహించినట్టేనని హెచ్చరించారు. పెద్ద ఎన్నికలైతే సరిహద్దులో యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పడం.. చిన్న ఎన్నికలైతే భైంసా అల్లర్లను సృష్టించడమే బీజేపీ ఎజెండా అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదేండ్లకు కేవలం 14 శాతం పీఆర్సీ ఇస్తే.. తెలంగాణ ఆవిర్భవించిన తొలినాళ్లల్లోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించిందని గుర్తుచేశారు. ఉద్యోగులు సంతృప్తిపడేలా మరోసారి ఫిట్‌మెంట్‌ ఇచ్చే ఆలోచనలో రాష్ట్రప్రభుత్వం ఉన్నదని స్పష్టంచేశారు. శుక్రవారం ‘తెలంగాణ జీవితం-సామరస్య విలువలు’ అనే అంశంపై హరితప్లాజాలో తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు.

దేశంలో మాకు హిస్సా లేదా?
బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీ పెడతామంటూ విభజనచట్టంలో హామీ ఇచ్చిన కేంద్రం మోసం చేసిందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ‘బయ్యారం దేవుడెరుగు. ఇప్పుడు విశాఖ ఉక్కుఫ్యాక్టరీని అమ్ముతున్నరు. ఎందుకు అమ్ముతున్నరంటే విశాఖల నీకేం పని అంటరు. విశాఖ దేశంలో లేదా.. మాట్లాడొద్దా? ఈ దేశంలో మాకు హిస్సా లేదా? ఇయ్యాల నువ్వు అక్కడ అమ్ముతున్నవు. రేపు మా సింగరేణి మీద పడతరు. ఈసీఐఎల్‌ మీద పడతరు. ఇవాళ ఇతరులకు కష్టం వచ్చిందని మనం ఊరుకుంటే రేపు మనం కూడా ఇబ్బంది పడతం. ఎవరికి కష్టమొచ్చినా అందరం కలిసికట్టుగా ఉండాలి’ అని తెలిపారు. మనమంతా ముందు భారతీయులం అని, తర్వాతే తెలంగాణ పౌరులమని చెప్పారు. దేశంలో ఎక్కడ తప్పుజరిగినా నిలదీయాలని సూచించారు. కేంద్రప్రభుత్వం వంద ప్రభుత్వరంగ సంస్థలను ఎలా అమ్మాలని ఆలోచిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మేము అమ్ముతున్నాం.. మీరు కూడా అమ్మండి’ అంటూ కేంద్రం సిగ్గులేకుండా రాష్ర్టాలకు సూచిస్తున్నదని ఆరోపించారు. ఐడీపీఎల్‌ను ఖతం పట్టించారని విమర్శించారు. ఇప్పుడు ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను కొనుక్కోండంటూ రాష్ర్టానికే సలహాలిస్తున్నదన్నారు. ‘మా భూములను మీరు అమ్ముడేంది’ అని ప్రశ్నించారు.

అందరి ఆకాంక్షల ప్రభుత్వమిది
‘నేను తెలంగాణ ఉద్యమాన్ని పక్కనపెట్టినా.. ఎత్తిన గులాబీ జెండా దించినా నన్ను రాళ్లతో కొట్టండి’ అంటూ ప్రకటించిన దమ్మున్న ఉద్యమనేత కేసీఆర్‌ ఒక్కరేనని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు, విద్యావంతులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, డాక్టర్లు, సింగరేణి కార్మికులు.. అన్నివర్గాలను ఏకంచేసి తెలంగాణను సాధించారని గుర్తుచేశారు. నేడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమంటే కేవలం ఒక రాజకీయపార్టీకి చెందిన ప్రభుత్వం కాదని.. వందకు వందశాతం మనందరి ప్రభుత్వమని చెప్పారు. ఒక రాజకీయ ముఖచిత్రంగా టీఆర్‌ఎస్‌ ఉండవచ్చు కానీ.. అందరి ఆశల.. ఆకాంక్షల ప్రతిరూపంగా నడుస్తున్నదని ఉద్ఘాటించారు. ఆరున్నరేండ్లలో మనం అన్నిరంగాల్లో పురోగమిస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. 13 ఏండ్ల క్రితమే ఏర్పాటైన జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాలు ఇప్పటికీ విభజన సమస్యలను ఎదుర్కొంటున్నాయని.. తెలంగాణ మాత్రం వాటిని ఒక్కొక్కటిగా అధిగమించి అభివృద్ధి, సంక్షేమరంగాల్లో దూసుకుపోతున్నదని చెప్పారు. రాష్ట్రం ప్రారంభించిన రైతుబంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టి ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన తెచ్చిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

ఉద్యోగులపై ప్రత్యర్థులది కపట ప్రేమ
ఉద్యోగుల మీద ప్రత్యర్థి పార్టీలు కపట ప్రేమ చూపుతున్నాయని మంత్రి మండిపడ్డారు. ఉద్యోగులకు 43% ఫిట్‌మెంట్‌ ఇస్తే తాము పోటీలోనే నిలబడమని కాంగ్రెస్‌ పేర్కొనటాన్ని ప్రస్తావిస్తూ.. అసలు ఆ పార్టీ పోటీలోలేదని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చినట్టు ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిందా? అని నిలదీశారు. ఉద్యమంలో భాగస్వామైన ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్‌ ఇచ్చామని తెలిపారు. ఉద్యోగులకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి 30 వేలమందికి నెలరోజుల్లో పదోన్నతులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఉద్యోగులకు కడుపునిండా పీఆర్సీ ఇస్తానని సీఎం మాట ఇచ్చారని పేర్కొన్నారు. ఫిట్‌మెంట్‌ విషయంలో బీజేపీ నాయకులు అడ్డూఅదుపూ లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యోగాల కల్పనలో ఫస్ట్
‌ ఆరేండ్లలో ప్రభుత్వం 1,32,899 మందికి ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. త్వరలో 50వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. ప్రైవేట్‌ రంగంలో టీఎస్‌-ఐపాస్‌ద్వారా 15 వేల పరిశ్రమలకు అనుమతులిస్తే, అందులో 11 వేలు ప్రారంభమయ్యాయని, వీటిల్లో 15 లక్షల మందికి ఉపాధి లభిస్తున్నదని పేర్కొన్నారు. దేశంలో తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ నెంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు.

ధరలను నియంత్రించలేని మోదీ
2013లో మన్మోన్‌సింగ్‌ చేతగానితనం వల్ల ధరలు పెరుగుతున్నాయని విమర్శించిన నేటి ప్రధాని మోదీ ఇప్పుడు చేస్తున్నదేమిటి? అని కేటీఆర్‌ నిలదీశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే పెంచిన పెట్రోల్‌, డీజీల్‌, గ్యాస్‌ ధరలకు మద్దతిచ్చినట్టే అవుతుందని చెప్పారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల అమ్మాకాన్ని కూడా ప్రోత్సాహించినట్టేనని హెచ్చరించారు.

విద్యావేత్తల్ని ఆశీర్వదించండి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు ఇద్దరూ విద్యావేత్తలేనని ఆయన పేర్కొన్నారు. వారికి మొదటి ఏకైక ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మంత్రి కేటీఆర్‌ అభ్యర్థించారు. కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకుడు నర్సింహారెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌, నమస్తే తెలంగాణ అసిస్టెంట్‌ ఎడిటర్‌ పరాంకుశం వేణుగోపాలస్వామి, వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు భిక్షపతి నాయక్‌, జయంతి, శ్రీధర్‌, తెలంగాణ వెంకన్న, దర్శకుడు శంకర్‌, కథకుడు కేవీ నరేందర్‌, ప్రముఖ కవి వఝల శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ దేశంలో భాగం కాదా?
తెలంగాణ జాతి జాతి కాదా? తెలంగాణ దేశంలో భాగం కాదా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. జాతీయవాదంలో తెలంగాణ ప్రయోజనాలు లేవా? అని నిలదీశారు. ఎన్నిసార్లు విన్నవించినా. కేంద్రప్రభుత్వం తెలంగాణకు మొం డిచేయి చూపుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం కొత్తగా మంజూరు చేసిన ఉన్నత విద్యాసంస్థల్లో తెలంగాణకు ఒక్కటంటే ఒక్కసంస్థను ఇవ్వలేదని దుయ్యబట్టారు. కేంద్రం నిర్లక్ష్యం చేసినా రాష్ట్రంలో వందల సంఖ్యలో గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

విశాఖకు రండి..!
కేటీఆర్‌కు విశాఖ ఉక్కు కార్మిక సంఘాల ఆహ్వానం
పోరాటానికి మద్దతు ఇవ్వడంపై హర్షం
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ రక్షణ పోరాటానికి మద్దతు తెలిపిన మంత్రి కేటీఆర్‌ను ఆంధ్రప్రాంత ప్రజలు కృతజ్ఞతలు చెప్తున్నారు. విశాఖకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. శుక్రవారం హరితప్లాజాలో విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌, కో కన్వీనర్‌ గంధం వెంకటాద్రి.. కేటీఆర్‌ను కలిసి ధన్యవాదాలు చెప్పారు. ఆయనను విశాఖకు రావాల్సిందిగా తెలుగుశక్తి అధ్యక్షుడు బీవీ రామ్‌ ఆహ్వానించారు. రాష్ట్రాలు, ప్రాంతాలు వేరైనా తెలుగు ప్రజల ఐక్యత ఒకటిగానే ఉంటుందని కేటీఆర్‌ నిరూపించారని తెలిపారు. తమ పోరాటానికి మద్దతిస్తున్నట్టు చెప్పడం విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యోగులు, కార్మికుల్లో నూతనోత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.