-మౌలిక సదుపాయాలపై అధ్యయనం పూర్తి.. సీఎం ఆమోదం -150 చోట్ల మార్కెట్లు, 80 చోట్ల మల్టీ లెవల్ పార్కింగ్ -136 చోట్ల బస్‌బేలు, 50 ప్రాంతాల్లో మల్టీపర్పస్ హాల్స్ -250 చోట్ల పబ్లిక్ టాయ్‌లెట్స్.. 36 శ్మశానవాటికల ఆధునీకరణ -ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ హైదరాబాద్ -మే 16న గవర్నర్ చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభం -400 విభాగాలుగా విభజన.. మే 20 వరకూ నిర్వహణ -స్థానిక ప్రజలు, ఎమ్మెల్యేలల భాగస్వామ్యం -ఇన్‌చార్జీలు, కమిటీలకు మే 6న అవగాహన సదస్సు -మీడియా ముఖ్యలతోనూ భేటీకానున్న ముఖ్యమంత్రి -విశ్వనగరం.. స్వచ్ఛ హైదరాబాద్‌పై సమీక్షల్లో సీఎం కేసీఆర్
హైదరాబాద్‌ను పరిశుభ్రమైన.. సకల మౌలిక వసతులతోకూడిన విశ్వనగరంగా రూపొందించేందుకు తొలి అడుగులు పడుతున్నాయి. మే నెల నుంచే ఇందుకు సంబంధించిన కార్యాచరణ అమల్లోకి రానుంది. ఒకవైపు మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే.. మరోవైపు వెయ్యి కోట్ల రూపాయలతో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దానికి ముందు రాష్ట్రంలోని న్యూస్ చానళ్లు, పత్రికా ప్రముఖులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమావేశంకానున్నారు. ఈ సమావేశాన్ని మే 6వ తేదీ తరువాత నిర్వహిస్తారు. మీడియా సంస్థల బాధ్యులతో నేరుగా చర్చించనున్న సీఎం.. హైదరాబాద్ నగరాభివృద్ధికి, స్వచ్ఛ హైదరాబాద్ నిర్వహణకు సూచనలు, సలహాలు వారినుంచి స్వీకరిస్తారు.
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో అన్ని వర్గాలను భాగస్వాములను చేసేందుకు మీడియా ముఖ్యమైన పాత్రను పోషించాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారు. మే 16వ తేదీన ప్రారంభమయ్యే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్‌తోపాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు. ఆయా ప్రాంతాల్లో జరిగే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యేలను భాగస్వాములను చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
మౌలిక సదుపాయాల కల్పనపై పూర్తయిన అధ్యయనం హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్న సీఎం కేసీఆర్.. నగరంలో మౌలిక వసతుల కల్పనపై అధ్యయనం చేయించారు. ఈ మేరకు అధికారులు రూపొందించిన నివేదికను జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌కు అందజేశారు. నగరంలో 365 కి.మీ. మేరకుగల రోడ్లకు ఇరువైపుల ప్రాంతాలను అధికారులు సందర్శించి, చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రతిపాదనలను ఆ నివేదికలో పొందుపర్చారు.
కూరగాయల మార్కెట్ల నిర్మాణానికి, మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్సులు, బస్‌బేల ఏర్పాటుకు అనుకూలమైన స్థలాలను ఎంపికచేశారు. మార్కెట్లకోసం 150 ప్రాంతాలను, మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్సులకోసం 80ప్రాంతాలను గుర్తించారు. 136చోట్ల బస్‌బేలు ఏర్పాటు చేయనున్నారు. వీటికి ఆమోదముద్ర వేసిన సీఎం.. నిర్మాణాలను త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు. నగరంలో 50చోట్ల మల్టీపర్పస్ హాల్స్ నిర్మించాలని, 250చోట్ల పబ్లిక్ టాయ్‌లెట్స్ ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న 36 శ్మశానవాటికలను ఆధునీకరించాలని, అవసరమైన దోభీఘాట్లు నిర్మించాలని ఆదేశించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేక్రమంలో ప్రజల కనీసావసరాలు తీర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు.
వేయి కోట్లతో స్వచ్ఛ హైదరాబాద్ హైదరాబాద్‌ను పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రూపకల్పన చేశారు. హైదరాబాద్‌ను క్లీన్‌సిటీగా మార్చేందుకు వెయ్యి కోట్లు వెచ్చించనున్నారు. స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రజలందరి విస్తృత భాగస్వామ్యంతో నిర్వహించాలని నిర్ణయించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ఒక ప్రజా ఉద్యమం కావాలని సీఎం ఆకాంక్షించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, ఆనంద్ తోపాటు జీహెచ్‌ఎంసీ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని మే 16నుంచి 20వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని గవర్నర్ నరసింహన్ మే 16న లాంఛనంగా ప్రారంభిస్తారు. స్వచ్ఛ హైదరాబాద్‌ను విజయవంతం చేయడానికి ముందుగా ఇన్‌చార్జీలు, కమిటీ సభ్యులకు మే 6న అవగాహన సదస్సు నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్ర నగరం హైదరాబాద్‌ను పరిశుభ్రంగా ఉంచడం కేవలం ప్రభుత్వ యంత్రాంగంవల్ల మాత్రమే సాధ్యంకాదని, నగరవాసులందరి విస్తృత భాగస్వామ్యం అవసరమని సీఎం అన్నారు. ఈ విషయంలో ప్రజలను చైతన్యపరచడానికి, వారిలో స్ఫూర్తి నింపడానికి సినీ నటులు, క్రీడాకారులు, ఇతర ప్రముఖులను రంగంలోకి దించుతామన్నారు. సాంస్కృతిక సారథి కళా బృందాలు నగరమంతా ప్రదర్శనలు నిర్వహిస్తాయన్నారు. ఇందుకు అవసరమైన పాటలు, ఇతర కళారూపాలను తయారు చేయాల్సిందిగా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడాల హరికృష్ణను సీఎం ఆదేశించారు.
స్వచ్ఛ హైదరాబాద్‌పై విస్తృత ప్రచారం కల్పించడానికి పత్రికలు, టీవీలు, థియేటర్లు, రేడియో, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, హోర్డింగ్స్, కరపత్రాలు, వాల్‌పోస్టర్లలాంటి సాధనాలన్నింటిని ఉపయోగించుకోవాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ మినహా అన్ని విభాగాల పోలీసులూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని అన్నారు. సైనికులు, రైల్వే ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. వివిధ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు, మల్టీప్లెక్స్‌లు, హాస్పటల్స్, ఐటీ కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు.
స్వచ్ఛ హైదరాబాద్ అమలు ఇలా.. స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని నగరంలో పకడ్బందీగా అమలు చేయడానికి హైదరాబాద్ నగరాన్ని మొత్తం 400 భాగాలుగా విభజిస్తారు. ఒక్కో భాగానికి ఒక్కో బాధ్యుడిని నియమిస్తారు. గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, ముఖ్యమైన ప్రజాప్రతినిధులు, ముఖ్యమైన అధికారులు ఆయా భాగాలకు ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తారు. అంటే.. ఒక్కొక్కరు 1.5 కి.మీ. వ్యాసార్థంలో బాధ్యతలు నిర్వహిస్తారు.
సామాజిక బాధ్యత కలిగిన 15మంది స్థానికులతో కమిటీని వేసుకుంటారు. ఇలా 400 విభాగాలు కలిపి మొత్తం 6,000 మంది స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమ నిర్వహణను భుజానికెత్తుకుంటారు. ఇన్‌చార్జిగా వ్యవహరించే ముఖ్యుడు స్థానిక ప్రజలను చైతన్యపరిచి ఆయా బస్తీలు, కాలనీలు, వీధుల్లో, వివిధ ప్రాంగణాల్లో పరిశుభ్రతకోసం చేపట్టాల్సిన చర్యలను రూపొందిస్తారు. భవిష్యత్‌లో వారు నిర్వహించుకునే పద్ధతులపై కార్యాచరణ రూపొందిస్తారు. ప్రభుత్వంనుంచి ఏం కావాలో కూడా నివేదిస్తారు. జీహెచ్‌ఎంసీ వారికి కావలసిన సదుపాయాలు సమకూరుస్తుంది.
ఇన్‌చార్జి, కమిటీ సభ్యులు తమ పరిధిలోని ప్రాంతమంతా కలియతిరుగుతారు. ఆ ప్రాంతంలో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడానికి ఏ చర్యలు తీసుకోవాలి? మురికి కాలువల నిర్వహణ, మరుగుదొడ్ల నిర్మాణం, మూత్రశాలల ఏర్పాట్లు, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం, వీధుల నిర్వహణ, పార్కుల నిర్వహణ, డంపింగ్ యార్డుల పరిస్థితి, మెరుగైన చెత్త సేకరణ పద్ధతులు తదితర విషయాలపై దృష్టిపెడుతారు. పరిస్థితిని పూర్తిగా అధ్యయనంచేసి ప్రభుత్వం ఏం చేయాలి? ప్రజలు ఏం చేయాలి? అనే విషయాలను నిర్థారిస్తారు. అవసరమైన పనులు చేయడానికి జీహెచ్‌ఎంసీ ద్వారా ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. ఆయా ప్రాంతాల్లోని కమిటీలు సంబంధిత పనులు చేయించుకోవాలి.