Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

విశ్వనగరానికి త్వరలో కార్యాచరణ

ఫలవంతమైన విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చి దిద్దుకుందామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. గత పాలకుల హయాంలో నగరాన్ని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కా ప్రణాళికలతో ఊహించని రీతిలో నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని సీఎం భరోసా ఇచ్చారు. శుక్రవారం నెక్లెస్ రోడ్డులో డ్రైవర్ కమ్ ఓనర్ పేరుతో నిర్వహించిన క్యాబ్ ట్యాక్సీల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 303 మందికి వాహనాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హైదరాబాద్ గత పాలనలో నాశనమైంది. సరైన రీతిలో అభివృద్ధి చెందలేదు. మౌలిక వసతులు, రోడ్లు సరిగా లేవు. జంక్షన్లు ఎలా ఉండాలో ఆ పద్ధతిలో లేవు. వర్షం నీళ్లు ఎట్ల పోవాల్నో అట్ల పోతలేవు. ల్యాండ్ మాఫియా, గుండాలు, రౌడీలు, పైరవీకారులు, కబ్జాదారులు ఇష్టమొచ్చినట్లు రోడ్లు, చెరువులు, నాలాలను ఆక్రమించుకున్నరు. హైదరాబాద్ ఇట్లనే ఉంటె మనం బతకలేము. ఇక్కడికి ఎవరూ రారు కూడా.

KCR-addressing-in-Hyderabad-meeting -ప్రణాళికల రూపకల్పన పూర్తయింది -ఊహించని రీతిలో నగరాభివృద్ధి తథ్యం -ప్రపంచం మెచ్చేలా వరల్డ్ ఐటీ కాంగ్రెస్ నిర్వహిస్తాం -నైపుణ్య శిక్షణ విశ్వవిద్యాలయానికి భూమి కేటాయిస్తాం -ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టీకరణ

ఇదేం నగరం అని తిట్టిపోస్తరు… అని అన్నారు. ఈ దుస్థితి తప్పించి నగరాన్ని తీర్చిదిద్దాలని సంకల్పం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఈ దిశగా ఊహించనిరీతిలో నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.. షార్ట్ పీరియడ్‌లోనే అవి మీ ముందుకొస్తాయి.. అని సీఎం చెప్పారు. ఇందుకోసమే పురపాలక శాఖను తన వద్దే ఉంచుకున్నానని చెప్పారు. పక్కారీతిలో ప్రణాళికలు అమలు చేసి హైదరాబాద్‌ను ఫ్రూట్‌ఫుల్ గ్లోబల్ సిటీగా మార్చుకుందామని సీఎం అన్నారు.

అద్భుత రీతిలో ఐటీ సదస్సు నిర్వహిద్దాం.. 2018లో నగరంలో నిర్వహించతల పెట్టిన వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాంగ్రెస్ సదస్సును అద్భుతంగా నిర్వహిస్తామని సీఎం చెప్పారు. ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న ఐటీ రంగాన్ని నగరంలో మరింత గొప్పగా అభివృద్ధి పరుచుకునేందుకు ఈ సదస్సును వినియోగించుకుందామన్నారు. వాస్తవానికి ఈ సదస్సు నిర్వహించేందుకు గుజరాత్ సహా అనేక రాష్ర్టాలు పోటీ పడ్డా నాలుగైదు నెలలు శ్రమించి ఒప్పించి హైదరాబాద్‌ను ఎంపిక చేయించామన్నారు. హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాశస్త్యం ఉందని ఆయన వివరించారు. నగరంలో ఐటీ రంగాన్ని ఇంకా గొప్పగా అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం లభించిందని చెప్పారు.

జీహెచ్‌ఎంసీకి అభినందనలు.. డ్రైవర్ కం ఓనర్ పథకం కింద జీహెచ్‌ఎంసీ చేపట్టిన కార్యక్రమం ద్వారా 303 మంది డ్రైవర్లు యజమానులుగా మారడం సంతోషకరమని సీఎం అన్నారు. ఈ కార్యక్రమం చేపట్టిన జీహెచ్‌ఎంసీని అభినందించారు. మరో 600 వాహనాలకు సంబంధించిన ప్రక్రియను ఆలస్యం చేయకుండా ప్రారంభించాలని సూచించారు. హైదరాబాద్ నగరం ఇంకా ఇంకా విస్తరించే అవకాశముందన్న సీఎం, భవిష్యత్తు అవసరాలకు ఈ ఆరు వందలు కాదు… ఆరు వేల వాహనాలు కూడా సరిపోవన్నారు. హైదరాబాద్‌లో నైపుణ్యాభివృద్ధి శిక్షణా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. దత్తాత్రేయ ఈ తెలంగాణ బిడ్డ. సహజంగా ఈ నగరం మీద ఆయనకు ప్రేమ ఉంటుంది. విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఎంత స్థలమైనా సరే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

దత్తాత్రేయ ఆశీస్సులతో ఆ విద్యాలయాన్ని ఏర్పాటు చేసుకుందాం. దీనికి సంబంధించి కేంద్ర మంత్రితో మాట్లాడతాను అన్నారు. అంతకుముందు కేంద్ర మంత్రి దత్తాత్రేయ ప్రసంగంలో ఒక కారున్న వారు భవిష్యత్తులో రెండు కార్లకు యజమానులు కావాలని… రెండున్న వారు నాలుగు కార్ల యజమానులు కావాలని ఆకాంక్షించిన విషయాన్ని సీఎం ప్రస్తావిస్తూ.. దత్తాత్రేయ బాగానే అన్నారు. కానీ అక్కడ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మంత్రి మహేందర్‌రెడ్డి గుసగుసలు పెడుతున్నరు… కార్లు పెరిగితే రోడ్లు ఏడికెళ్లి వస్తయి, దత్తాత్రేయ ఢిల్లీ నుంచి కూడా రోడ్లు పంపిస్తరా? అని అనుకుంటున్నరు అని చమత్కరించడంతో సభలోనవ్వులు విరబూశాయి.

తాళం చెవులను అందజేసిన ముఖ్యమంత్రి… జీహెచ్‌ఎంసీ గతంలోనే డ్రైవర్ కమ్ ఓనర్ కార్యక్రమం కింద తొలి విడతగా 105 మందికి క్యాబ్‌లను పంపిణీ చేసింది. రెండో విడతగా శుక్రవారం మరో 303 వాహనాలను పంపిణీ చేసింది. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు డ్రైవర్లకు తాళం చెవులను ఇచ్చి వాహనాలను అప్పగించారు. రూ.7.04 లక్షల విలువైన వాహనానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ రుణం అందించగా , మారుతీ సుజుకీ రూ.76వేల రాయితీని ఇచ్చింది. ఐఐపీపీ (ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ పాలసీ) కింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.1.91 లక్షలు (35 శాతం) సబ్సిడీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, తాటికొండ రాజయ్య, మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ శాసనసభా పక్ష నేత డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు కనకారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు భానుప్రసాద్‌రావు, సలీం, జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నైపుణ్య శిక్షణ వర్సిటీ ఏర్పాటు చేస్తా.. అంతకుముందు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ రాబోయే కాలంలో యువతకు నైపుణ్యత పెరిగేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరముందన్నారు. భవిష్యత్తులో ఇంకా లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశమున్నందున, హైదరాబాద్‌లో నైపుణ్యత పెంచేందుకు పూర్తి సహకారాన్ని అందిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో భూమి ఇస్తే ఇక్కడ నైపుణ్య శిక్షణ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ పథకాన్ని వినియోగించుకున్నవారు రేపు రెండు కార్లు… రెండు కార్లున్న వారు నాలుగు… ఇలా దినదిన ప్రవర్తమానం కావాలని ఆకాంక్షించారు. జీహెచ్‌ఎంసీ ప్రత్యేక అధికారి, కమిషనర్ సోమేష్‌కుమార్ మాట్లాడుతూ డ్రైవర్ కమ్ ఓనర్ పథకం రెండో విడత కార్యక్రమాన్ని రూ.21 కోట్లతో అమలు చేసినట్లు చెప్పారు. అందించిన 303 వాహనాల్లో 105 వాహనాలకు జీహెచ్‌ఎంసీ నెలకు రూ.25వేల అద్దె ఇస్తుందని, మిగిలిన 198 వాహనాలను వివిధ ప్రైవేటు కంపెనీలతో అనుసంధానం చేసినందుకు వారికి నెలకు రూ.45-60వేల వరకు వస్తుందన్నారు. మరో మూడు కంపెనీలు కూడా ఇంకా 600 వాహనాలు తీసుకురావాలని కోరుతున్నట్లు చెప్పారు. వచ్చే రెండు నెలల్లో 1005 వాహనాలను పంపిణీ చేసి డ్రైవర్లను యజమానులుగా మారుస్తామన్నారు. మారుతీ కంపెనీ వారు వీరికి రూ.50వేల చొప్పున ఆరోగ్య బీమా కూడా కల్పించినట్లు తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.