Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

విశ్వనగరికి కొత్తబాట

-ప్రజలతో ముఖాముఖిలో ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ -సాంస్కృతిక, సామాజిక రాజధానిగా హైదరాబాద్ -ఒలింపిక్స్ నిర్వహించే స్థాయికి చేర్చటమే లక్ష్యం -పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెట్రో విస్తరణ -సిటిజన్ ఫ్రెండ్లీ సిటీగా తీర్చిదిద్దుతాం -పద్దెనిమిది నెలల మా పనితీరే గీటురాయి -బంగారు తెలంగాణకు సీఎం కేసీఆర్ క్రియాశీల అడుగులు -బ్రాండ్ హైదరాబాద్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్

KTR-conversation-with-public

హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. సిటిజన్ ఫ్రెండ్లీ నగరంగా, సాంస్కృతిక-సామాజిక రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు. బాధ్యతాయుత పాలనను అందించేందుకు సిటిజన్ చార్టర్ అమలులోకి తెస్తామని చెప్పారు. నగరంలోని శిల్పారామం రాక్‌హైట్స్‌లో మంగళవారం నిర్వహించిన బ్రాండ్ హైదరాబాద్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. మూడున్నర గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఏకబిగిన 40 నిమిషాలపాటు నగరాభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌తో తమ విజన్‌ను ఆవిష్కరించిన కేటీఆర్, ఆ తర్వాత కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల సందేహాలు, సమస్యలపై అదే ఊపుతో జవాబులిచ్చారు. గత 18 నెలల కాలంలో తమ ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేసిందని, కోతలులేని నిరంతర విద్యుత్ అందించి తన పనితీరు ఏమిటో చాటి చెప్పిందని కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. ఇదే దారిలో నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు 100 కిలోమీటర్ల మేర స్కైవేలతోపాటు గ్రేడ్ సెపరేటర్లు, మల్టీలెవల్ ైఫ్లెఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించి సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సంకల్పించామని చెప్పారు.

నగరంలో అతి పొడవైన ఆకాశ రహదారి మూసీ నది పొడవునా రాబోతున్నదని చెప్పారు. ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు 72 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ మార్గాన్ని మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకురావటంతో పాటు మెట్రోమార్గాలను మరింత విస్తరిస్తున్నామన్నారు. మంచినీటి సరఫరా మెరుగుపరిచేందుకు గోదావరి జలాలు తరలించామని, 30 టీఎంసీల సామర్థ్యంతో కొత్త రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి నగరానికి ధీమా కల్పిస్తున్నామని చెప్పారు. చరిత్రాత్మక హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన ప్రారంభమైందని, నగరంలోని 169 చెరువులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఒక విజన్‌తో అభివృద్ధికి బాటలు పరిచి ఒలింపిక్స్ నిర్వహించే స్థాయికి నగరాన్ని తీర్చి దిద్దుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. విద్యావంతులైన వారు దురదృష్టవశాత్తూ రాజకీయ నాయకులను విమర్శించేందుకు మాత్రమే పరిమితమై పోతున్నారని, ఓటింగ్ అంటే కేవలం హాలిడేగా పరిగణిస్తున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. కీబోర్డు కామెంట్లకు తమను తాము పరిమితం చేసుకోకుండా ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణం చేయాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ వివరించిన అంశాలు ఆయన మాటల్లోనే..

ఇది ట్రాఫిక్ విజన్.. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం(ఎస్‌ఆర్‌డీపీ)కు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో సిగ్నల్ ఫ్రీ కారిడార్ల నిర్మాణం, దాదాపు 100కిలోమీటర్ల స్కైవేలు, 54కిలోమీటర్ల గ్రేడ్ సెపరేటర్లు, మల్టీ లెవల్ ైఫ్లెవోవర్లను నిర్మించాలని నిర్ణయించింది. వీటితోపాటు రూ.21వేల కోట్ల అంచనా వ్యయంతో 2వేల కిలోమీటర్లకుపైగా ప్రధాన రోడ్లన్నింటినీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నాం. ముందుగా 18జంక్షన్లలో రూ. 4051కోట్లతో అంచనాతో టెండర్ల ప్రక్రియ ప్రారంభించాం. స్కైవేల్లో మూసీ కారిడార్ 42కి.మీ.ల పొడవుతో అన్నింటికన్నా పొడవైన ఆకాశమార్గం కాగా, తూముకుంట-జేబీఎస్ ైఫ్లెఓవర్ 19కి.మీ.లతో ఆ తరువాతి స్థానంలో ఉంటుంది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ వద్ద ఏర్పాటయ్యే మూడు కిలోమీటర్ల గ్రేడ్ సెపరేటర్ అన్నిటికన్నా పొడవైనది. మొత్తం ఆరు జంక్షన్లలో అండర్‌పాస్‌లకు ప్రతిపాదనలు రూపొందించాం. ఇందులో బయోడైవర్శిటీ పార్క్-సైబర్‌టవర్ (మైండ్‌స్పేస్ జంక్షన్), కొత్తగూడ వైపునుంచి అయ్యప్ప సొసైటీ వైపు(అయ్యప్ప సొసైటీ జంక్షన్), సంతోష్‌నగర్ -చాంద్రాయణగుట్ట (ఒవైసీ హాస్పిటల్ జంక్షన్), సాగర్ బైపాస్‌రోడ్డు నుంచి హయాత్‌నగర్ వైపు(చింతలకుంట చెక్‌పోస్టు), స్నేహపురి కాలనీ వైపు నుంచి బండ్లగూడ వైపు(కామినేని జంక్షన్), బైరామల్‌గూడ జంక్షన్ నుంచి కామినేని జంక్షన్(ఎల్బీనగర్ జంక్షన్) తదితర జంక్షన్లున్నయి. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో మొదటి ఫేజ్ మెట్రో అందుబాటులోకి వస్తున్నది.మరింత విస్తరించేందుకు అధ్యయనాలు చేస్తున్నాం. భవిష్యత్తులో నగరంలో తారు రోడ్ల స్థానంలో 400 కిలోమీటర్ల మేర వైట్‌టాపింగ్ రోడ్లు వేస్తాం.

ఇంటింటికీ ఎల్‌ఈడీ బల్బులు.. హైదరాబాద్‌లో దశాబ్దాలుగా కొనసాగిన కరెంటు కోతలను లేకుండా చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. తీవ్రమైన ఎండాకాలంలోనూ కరెంటు కోతలు లేకుండా విద్యుత్ అందించాం. ఇదెవరూ ఊహించని విజయం. ఇపుడు నగరంలోని జనావాసాలకు రూ. 445.90కోట్ల వ్యయంతో ఎల్‌ఈడీ బల్బులు అందించబోతున్నాం. ఈ పథకం కింద నగరంలోని ఇంటికి నాలుగు బల్బులు ఇస్తాం. 3,40,941 వీధి దీపాలన్నింటినీ ఎల్‌ఈడీలుగా మార్చుతున్నాం.

మహాప్రస్థానంలా శ్మశానాలు నగరంలోని శ్మశానవాటికలను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నాం. ఒక్కో సర్కిల్‌లో హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల వారికి ఒక్కో శ్మశానవాటికను ఏర్పాటు చేస్తాం. 34శ్మశానాలను రూ. 85కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించగా ఇప్పటికే సగానికిపైగా శ్మశానాల అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇందులో మంచినీరు, స్నానాల గదులు, లాకర్లు తదితర మౌలిక సదుపాయలు ఏర్పాటు చేస్తున్నాం.

సాగర్‌లకు కొత్త శోభ హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన మా ప్రాథమ్యాల్లో ముఖ్యమైంది. ముందుగా మురుగునీటిని బయటకు పంపేందుకు నాలా డైవర్షన్ పనులు చేపట్టాం. ప్రక్షాళనలో భాగంగా పూర్తిగా నీటిని ఖాళీచేసి మళ్లీ స్వచ్ఛమైన నీటితో నింపాలని అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు. వరదలు వచ్చిన సందర్భాల్లో సాగర్‌కు ప్రమాదం లేకుండా, లోతట్టు ప్రాంతాలు సురక్షితంగా ఉండేలా గేట్లను ఏర్పాటుచేస్తున్నాం. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌కి కూడా పూర్వవైభవం తెచ్చేందుకు చర్యలు చేపట్టాం. నగరంలోని 169 చెరువులను కబ్జాలనుంచి కాపాడడంతోపాటు అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. చాలావరకు ఎఫ్‌టీఎల్‌లను నిర్థారించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశాం. ముందుగా సర్కిల్‌కి కనీసం రెండు చొప్పున 34చెరువుల అభివృద్ధికి రూ.54.29కోట్లు కేటాయించాం. కలుషిత చెరువులను ప్రక్షాళనచేసి విహార ప్రాంతాలుగా తీర్చిదిద్దడంతో పాటు బోటింగ్ వసతి కల్పించి వాటి రక్షణకు వాకింగ్ ట్రాక్‌లు, పార్కులు నిర్మించాలని నిశ్చయించాం. ముందుగా సర్కిల్‌కు రెండు చొప్పున చెరువుల పనులు చేపట్టనున్నారు.

పారిశుద్ధ్యం పచ్చదనం.. హరితహారం కార్యక్రమంలో భాగంగా 10కోట్ల మొక్కలు నాటాం. బహిరంగ మూత్ర విసర్జన నిర్మూలకు ప్రతి ఒక కిలోమీటర్‌కు ఒకటి చొప్పున వెయ్యి ప్రాంతాల్లో గ్రీన్ టాయ్‌లెట్ల ఏర్పాటు ప్రతిపాదించాం. ఇప్పటికే 50కిపైగా టాయ్‌లెట్ల ఏర్పాటు జరిగింది. వీటిని 100వరకు విస్తరించి మహిళలకోసం మరో 100టాయ్‌లెట్లు నిర్మిస్తాం. వృద్ధులు, మహిళలు, పిల్లల సౌకర్యంకోసం నగరంలోని 50రద్దీ ప్రాంతాల్లో అత్యాధునిక పాదచారుల వంతెన(ఎఫ్‌ఓబీ)లు నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు సిద్ధంచేసింది.

సంక్షేమమే సంతోషానికి తొలిమెట్టు నగరంలో ఆసరా పథకంతో పాటు గర్భిణీ, బాలింతలకు ఆరోగ్యలక్ష్మి, బీసీ,మైనార్టీల యువతుల వివాహాలకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌లు అమలు చేస్తున్నాం. ఐదు రూపాయలకు భోజనం అమలు జరుగుతున్నది. శాంతిభద్రతలకు భరోసా ఇచ్చే దిశగా బంజారాహిల్స్‌లో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ శంకుస్థాపన జరిగింది. పోలీసులకు అత్యాధునిక మౌలిక వసతులు కల్పించి, షీటీమ్‌ల ఏర్పాటు, హాక్‌ఐ మొబైల్ యాప్ అందుబాటులోకి తెచ్చాం. నగరంలో 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం.158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు పై ట్రాన్సిట్ ఓరియంటెడ్ గ్రోత్ సెంటర్లు (టీవోజీసీ) నిర్మాణానికి ఒక కమిటీని ప్రభుత్వం ఇటీవలే ఏర్పాటు చేసింది. ఔటర్ సమీపంలోనే ఐదు వేల ఎకరాల్లో గ్రీన్‌ఫిల్డ్ సిటీ, రేడియల్ రోడ్లు, గ్రోత్ కారిడార్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

ఐటీ పరిశ్రమల రంగంలో వేగంగా.. ఆసియాలోనే రెండో అతిపెద్ద క్యాంపస్‌ను నగరంలో ఏర్పాటు చేయడానికి గూగూల్ ముందుకువచ్చింది. వెయ్యి కోట్లతో కంపెనీని విస్తరిస్తున్నది. ఇందుకోసం 7.2 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. అమెజాన్ కంపెనీ 1.6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు ప్రభుత్వం హైదరాబాద్‌ను ఉచిత వై – ఫై నగరంగా తీర్చి దిద్దుతున్నది. ఇప్పటికే ఐటీ కారిడార్‌లోని 17 ప్రాంతాల్లో ఉచిత వై- ఫై ఏర్పాటు చేశాం. ట్యాంక్‌బండ్.. నెక్లెస్‌రోడ్ చుట్టూ 10 ప్రాంతాలు, చార్మినార్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ఎంజీబీఎస్, జేబీఎస్‌లలో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం. టీ హబ్ పేరుతో దేశంలోనే అతిపెద్ద ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది. రెండోదశలో 3 లక్షల చదరపు ఫీట్లతో ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. బయో టెక్నాలజీ పార్కును, ఆర్‌అండ్‌డీ సెంటర్‌తోపాటు, ఇంక్యూబేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందు కోసం 2.1 కోట్లను కేటాయించింది. దీనిని శామీర్‌పేట సమీపంలోని కార్కపట్లలోని జినోమ్‌వ్యాలీలో ఏర్పాటు చేయనున్నారు. జినోమ్ వ్యాలీలో రూ.340కోట్ల వ్యయంతో జీవవైద్య పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ ప్రాజెక్ట్ గ్రేటర్‌సిగలో మరో కలికితురాయిగా నిలవనుంది. అపాచీ సంస్థ హెలికాప్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నది. దేశంలో మొదటి సెల్‌ఫోన్ల తయారీ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించింది. మైక్రోమ్యాక్స్ సెల్ కంపెనీ 18 ఎకరాల్లో 200 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను పెట్టబోతున్నది. ఎల్‌ఈడీ విద్యుత్ బల్బుల పరిశ్రమను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు థామ్సన్ పరిశ్రమ ముందుకువచ్చింది. వ్యాక్యుమ్ క్లీనర్ల ఉత్పత్తి పరిశ్రను రూ. 400 కోట్ల పెట్టుబడితో ఆదిబట్లలో స్థాపించేందుకు సిస్టమ్ ఎయిర్‌గ్రూపు, బిన్‌డిన్ గ్రూపులు ముందుకువచ్చాయి. నగర శివారులోని పాలమూరు జిల్లా కొత్తూరులో జాన్సన్ అండ్ జాన్సన్, పీ అండ్‌జీ, కోజెంట్ సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.